అస్తిత్వ చేతనం తెలంగాణ భాష

  • 1530 Views
  • 4Likes
  • Like
  • Article Share

    సంగిశెట్టి శ్రీ‌నివాస్‌

  • స‌హాయ ఆచార్యులు, తెలుగు విశ్వ‌విద్యాల‌యం
  • హైద‌రాబాదు
  • 9849220321
సంగిశెట్టి శ్రీ‌నివాస్‌

‘‘నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్యం జేయి’’ - కాళోజీ
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక పథకాన్ని ప్రారంభించారు. దాని పేరు ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’. భిన్న భాషలు, ప్రాంతాలు గల భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, సాహిత్యం, చరిత్రను మరొక రాష్ట్రంతో పంచుకోవడం, విస్తృత పరచుకోవడం (ఇచ్చి పుచ్చుకోవడం) దీని ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా తెలంగాణ హర్యానాతో, ఆంధ్రప్రదేశ్‌ పంజాబ్‌తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇట్లాంటి ముందుచూపు లేకపోవడంతో సీమాంధ్ర భాషా, సాంస్కృతిక, ఆధిపత్యం భరించలేని స్థాయికి చేరుకోవడం, ఆ వివక్ష, విస్మరణ కారణంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజాలు పడ్డాయి. ఉద్యమాలు ఎగిశాయి. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాళోజీ జన్మదినం (సెప్టెంబరు 9) ‘తెలంగాణ భాషా’ దినోత్సవమైంది. 
      ఈ భాషా దినోత్సవం సందర్భంగా కొత్త దారులకు పునాదులు వేసుకోవాలి. ఇప్పటి వరకు ‘తెలంగాణ భాష’కు జరిగిన అన్యాయానికి తెరదించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ప్రామాణికత పేరిట పత్రికా భాషనే వాడుతున్నారు. పాఠ్యపుస్తకాల్లోనూ, ప్రభుత్వ రాత కోతల్లోనూ, ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు ప్రచురించే పుస్తకాల్లోనూ ‘ప్రామాణిక తెలుగు’ భాషే రాజ్యమేలుతోంది. విద్యార్థులు ‘తెలంగాణ తెలుగు’ను వాడుక భాషగా ఉపయోగించడానికి ‘మానసికంగా’ సిద్ధంగా లేరనే సంశయంతో ఆ భాషను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లోకి తీసుకురాలేదు. ఆ అభిప్రాయాల్ని అధిగమించి, తెలంగాణ భాషను పాఠ్యపుస్తకాల్లోకి తీసుకొస్తే.. వాటిని బోధించే అధ్యాపకులు, తద్వారా విద్యార్థులు ‘తెలంగాణ తెలుగు భాష’ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, ప్రచారం చేయడానికి వీలవుతుంది. గొప్పతనమే గాకుండా, సరళంగా, సుందరంగా, అందరూ ఆదరించే, ఆమోదించే, మెచ్చే వాడుక భాషగా రూపొందడానికి వీలవుతుంది.
      ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు ప్రాంతాల్లోని ప్రజలకు అలవాటైన భాషలో మాత్రమే పాత్రికేయులు రాస్తున్నారు. పత్రికల్లో వీళ్లు రాసేదే ‘ప్రామాణిక’ భాషగా ప్రచారంలో ఉంది. దీనివల్ల తెలంగాణ తెలుగుభాష ప్రజల్లోకి చొచ్చుకుపోవట్లేదు. ఆదరణకు నోచుకోవట్లేదు. ఈ పరిస్థితి మారాలంటే తెలంగాణ ప్రాంతంలో సర్క్యులేట్‌ అయ్యే పత్రికల్లో ఇక్కడి భాషను వినియోగించాలి. దశలవారీగానైనా దాన్ని పాఠ్యపుస్తకాల్లోనూ జోడించాలి. 
ఇది తెలంగాణ తెలుగు
ఇక్కడ రెండు విషయాలకు వివరణ ఇవ్వాలి. ఒకటి ‘ప్రామాణిక తెలుగు’ భాష అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ అర్థమయ్యే విధంగా రాస్తున్న పత్రికా భాష. పాఠ్యపుస్తకాలు, టీవీ, రేడియో ప్రయోక్తల మాటలు, సినిమా ‘సంభాషణలు’ అన్నీ కూడా ఇదే భాషలో వస్తున్నాయి. ఇక ‘తెలంగాణ (తెలుగు) భాష’ అంటే తెలంగాణలోని 31 జిల్లాల ప్రజల భాష. ఇది అందరి భాష. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలవారు తమదిగా భావించే భాష. అందరికీ అర్థమై, ఆమోదించే భాష. దీనినే కొంతమంది ‘పండితులు’ ‘తెలంగాణ మాండలికం’ అంటున్నారు. నిజానికి ఒక ప్రాంతం వారికి పరాయి ప్రాంతంది ‘మాండలికం’గానే కనబడుతుంది. ఇది ఆధిపత్య భావజాలానికి రుజువు. ‘తెలంగాణ తెలుగు’ మాండలిక భాష కాదు. దీన్ని అందరికీ ఆమోదనీయంగా, అర్థమయ్యే విధంగా మాట్లాడే సరళ, సుందర ‘తెలంగాణ తెలుగు భాష’గా గుర్తించాలి. అందుకు అనుగుణంగా ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
      నిజానికి ‘తెలంగాణ తెలుగు’ ఒక భాషగా రూపొందుతున్న సమయంలోనే హైదరాబాదు రాజ్యంలోని ‘తెలంగాణ’ ప్రాంతం ‘ఆంధ్రప్రదేశ్‌’లో విలీనం కావడంతో ఈ ప్రాంతీయుల భాషకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లేకుండా పోయాయి. 1948కి ముందు ఉర్దూ, 1884కు ముందు పర్షియన్‌ భాషలు తెలంగాణలో రాజ్యమేలాయి. 400 ఏళ్లు తెలుగుకు అంతగా గుర్తింపు లేదు.
      ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత హైదరాబాదు కేంద్రంగా వెలువడ్డ పత్రికలు, వాటి సంపాదకులు అందరూ ‘ప్రామాణిక భాష’ పేరిట కాళోజీ అన్నట్టు ‘రెండున్నర జిల్లాల’, ‘రెండున్నర కులాల’ భాషను ‘అధికార భాష’గా నిలబెట్టిండ్రు. ప్రచారం చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ముందూ ఆ తర్వాత ‘తెలంగాణ తెలుగు భాష’లో ఎలాంటి రచనలు వచ్చినాయో, వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే ఇప్పుడేమి చేయాలో నిర్ణయించవచ్చు. ఇదే విషయాన్ని బిరుదురాజు రామరాజు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేళ ఇలా అన్నారు. ‘‘... తెలంగాణమునందలి రచయితలు కూడా (దాశరథి, నారాయణరెడ్డి వంటివారు) తమ తమ ఇండ్లలో మాటలాడెడు భాష యొక తీరైనను, వ్రాయునప్పుడు మాత్రము, తెలంగాణము బయట పత్రికలందు ముద్రితమై అచ్చటి వారికి గూడ తెలియవలయునను ఉద్దేశముతో ప్రభ, పత్రిక మున్నగు వానిలో నుండు భాషవలె వ్రాయుటకై ప్రయత్నింతురు’’. ఇది నిజం. 1940వ దశకం నుంచీ, మరీ ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి తెలంగాణ సాహితీవేత్తలు తమ రచనలు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోని పాఠకులను దృష్టిలో పెట్టుకొని రాసినారు. అదే సమయంలో తెలంగాణ పాఠకులు అవసరమైతే నిఘంటువుల్లో చూసుకొని నేర్చుకుంటారు అనే అభిప్రాయంలో ఉండేవారు. అందుకే ఆంధ్ర, తెలంగాణలతో తేడా లేకుండా ఇరు ప్రాంతాల్లోని లబ్ధప్రతిష్టులైన రచయితలందరూ ‘రెండున్నర జిల్లాల’ ప్రామాణిక భాషలో తమ సాహిత్యాన్ని సృజించారు. అంతిమంగా అట్లా రాస్తేనే సాహిత్యం అనే అభిప్రాయాన్ని విమర్శకులు కూడా నిర్ధరించారు. వాటికే గుర్తింపు, గౌరవం దక్కినాయి.
      అయితే ‘తెలంగాణ భాష’ ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు మొదలు భల్లా పేరయకవి వరకు అనేక మంది కవులు, శతకకారులు తెలంగాణలో మాత్రమే వాడుకలో ఉన్న పదాలను మేళవించి రచనలు వెలువరించారు. ప్రఖ్యాత విమర్శకులు, చరిత్రకారులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి శాతవాహనుల కాలంలో ‘గాథాసప్తశతి’లో ఉపయోగించిన పదాలు ఇప్పటికీ తెలంగాణలో ఎలా సజీవంగా ఉన్నాయో తన పరిశోధన ద్వారా నిరూపించిండు. ఈ విషయాన్ని ఆయన ‘ముంగిలి’, ‘తెలంగాణ చరిత్ర’ గ్రంథాల్లో వివరించిండు.
సురవరం బాటలో..
ఆధునిక సాహిత్య చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ పదాలను విరివిగా వాడిన వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన తన కవిత్వంలోనూ, కథల్లోనూ, వ్యాసాల్లోనూ, సంపాదకీయాల్లోనూ తెలంగాణ భాషను వాడినాడు. ‘శబ్దజాలం, ఉర్దూ, పార్సీ పదాలు, పలుకుబళ్లు, సామెతలు, అలంకారాలు’ మొదలైన అనేక రూపాల్లో సురవరం ప్రతాపరెడ్డి ‘తెలంగాణ భాష’ ప్రతిఫలించింది. ఆయన తన కథల్లో తెలంగాణ పదాలు చాలా వాడినాడు. గేరి (వీధి, వాడ), భేదులు (విరేచనాలు), తుప్పలు (వెంట్రుకలు), దాపు (పక్కన), బోకి (పగిలిన కుండ అడుగు భాగం), చియ్య (మాంసం), కవిలె (దస్త్రాలు) ఇట్లా అనేక పదాలున్నాయి. ‘మొఘలాయి కథలు’ పేరిట 1938 నాటికే ప్రతాపరెడ్డి ఓ కథా సంపుటిని వెలువరించిండు. అందులో ఒక కథకు ‘సత్తామంటే పుర్సత్‌ లేదు’ అనే తెలంగాణ సామెతనే పేరుగా పెట్టిండు.
      కవిత్వంలో కూడా తెలంగాణ భాష వాడిన తొలి ఖ్యాతి సురవరం ప్రతాపరెడ్డికే దక్కుతుంది. 1920వ దశకంలో పాలమూరు జిల్లాలో పటేండ్లు మాట్లాడే భాషను పట్టించే విధంగా ఆయన ఈ కవిత రాసిండు... ఆది కూర్మా: జర్ర ఆడ చుట్టకు ఇంగ/ లము పెట్టుకొనిరార లంజకొడుక:/ ఆరి బాలిగ: నీవు అట్లు కుసోని కి/ స్కింత కాల్లొత్తి పోసీ: కసేపు/ పైటాల దుకునంలో పది సేర్ల నంజర/ యిప్పిచ్చరారోరి ఎల్లపోడ:/ నాత్రి అయ్యింది ఇంకా యీడిగోళ్లు యీ/ దుల్లోనే సచ్చిండ్రు దూపకెత్తె/ పోరి గిట్టింద్కొ పెట్టింది పూరలొల్లి/ దాని తుప్పలు వట్టి తన్నండ్రి బాగ/ మర్సిపోతి అమీన్సాబు మల్లి వస్త/ డంట: మాలగేర్లో కోళ్లు అడ్కరార. తెలంగాణ భాషలో రాసిన మొట్టమొదటి కవిత ఇదే. అంతకుముందు వేలూరి రంగధామ నాయుడు, బూర్గుల రామకృష్ణారావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు లాంటి వారు కొన్ని పద్యాలు వెలువరించినప్పటికీ అవేవీ కూడా తెలంగాణ భాషలో రాసినవి కావు. ప్రతాపరెడ్డి 1926 నుంచి 46 వరకు  గోలకొండ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించిండు. తను రాసిన వ్యాసాల్లోనూ, సంపాదకీయాల్లోనూ పరిమళ భరితమైన సరళ, సుందర తెలంగాణ భాషను కళ్లకు కట్టిండు. దాన్ని మాధుర్యాన్ని తన అక్షర విన్యాసాలతో అందరికీ అందుబాటులోకి తెచ్చిండు. ఉర్దూ ప్రభావం తెలుగుపై గాఢంగా ఉండటంతో పెద్దపెద్ద విషయాలను చిన్నచిన్న పదాల్లో చెప్పడానికి వీలయింది.
      ప్రతాపరెడ్డి ప్రభావంతో ఆ తర్వాత కాళోజీ, వెల్దుర్తి మాణిక్యరావు, బిరుదురాజు రామరాజు, సామల సదాశివ, సురమౌళి, గూడూరి సీతారామ్‌ తదితరులు తమ రచనల్లో తెలంగాణ భాషను వాడినారు. కేవలం రాతలోనే కాదు ప్రసంగాలు కూడా తెలంగాణ భాషలోనే ఉండేవి. అంటే స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లోనూ, సభల్లోనూ, గోష్టుల్లోనూ తెలంగాణ భాషను ఎలాంటి శషభిషలు లేకుండా వాడేవారు.
వెల్దుర్తి పంచిన వెలుగు
తెలంగాణలో కీస (జేబు), వొయ్యి (పుస్తకం), బాతాలు (అధిక ప్రసంగాలు) ఇలా అనేకమైన పదావళి ఉంది. అయితే తెలంగాణ వారికి ఇక్కడి భాషా మాధుర్యం అందుబాటులోకి రానంత వరకు దాని రమ్యత, సొబగు, పదాల గుబాళింపు ఎరుకలో లేకుండా పోతుంది. ఈ పదాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు గతంలో కొంత ప్రయత్నం జరిగింది.  సాహిత్యంలో పూర్తిస్థాయిలో తెలంగాణ తెలుగును వినియోగించిన వారున్నారు.  సురవరం ప్రతాపరెడ్డి తర్వాత 1943 ఆ ప్రాంతంలో వెల్దుర్తి మాణిక్యరావు ‘దయ్యాల పన్గడ’ పేరిట ఒక నాటకాన్ని పూర్తిగా తెలంగాణ భాషలో రాసిండు. పాత్రలు, వివరణ అంతా కూడా తెలంగాణ తెలుగు భాషలో రాసిండు. దీంట్లో ఉర్దూ, పార్సీ పదాలు కూడా మిళితమయ్యాయి. నిజానికి ఈ నాటిక పేరులోనే తెలంగాణ తనం ఉట్టిపడుతుంది. ‘పన్గడ’ అంటే పన్నాగం, కుట్ర. ఆరు అంకాలు, 80 పేజీలు గల ఈ రచన (తెలంగాణ భాషలో వచ్చిన మొట్టమొదటి పొత్తం) రష్యన్‌ రచయిత టాల్‌స్టాయ్‌ ‘ద ఫస్ట్‌ డిస్టిలర్‌’కు అనుసరణ. తాగుడుకు బానిస కావడం వల్ల జీవితం ఎలా పతనమ వుతుందో రచయిత ఇందులో చెప్పాడు.
      నాటకాలతోపాటు కథల్లో కూడా తెలంగాణ భాషను విరివిగా వాడినారు. 1956కు ముందు తెలంగాణ భాషలో కథలు రాసిన వారిలో సురవరం్డ, నందగిరి వెంకటరావు, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, జి.రాములు, సురమౌళి, గూడూరి సీతారామ్‌, పాకాల యశోదారెడ్డి తదితరులున్నారు. వీరిలో సురమౌళి, గూడూరి సీతారామ్‌, యశోదారెడ్డి, ఇరివెంటి కృష్ణమూర్తిలు పూర్తిస్థాయిలో తెలంగాణ జీవితాలను, తెలంగాణ ప్రజల వాడుక భాషలో నమోదు చేసిండ్రు. కథా శీర్షికలను సైతం తెలంగాణ భాషలోనే పెట్టినారు. కొన్నికొన్ని సార్లు కథ పూర్తయిన తర్వాత తెలంగాణ పదాలకు వివరణలు కూడా ఇచ్చినారు. అయితే 1956 తర్వాత తెలంగాణ భాషలో కథలు రాయడం దాదాపు ఆగిపోయింది. మళ్లీ 1970వ దశకం చివర్లో తెలంగాణ భాషలో కథలు రాయడం ప్రారంభమైంది. సీహెచ్‌ మధు లాంటివారు ఆ భాషలో కొన్ని కథలు రాసినారు. అయితే ప్రముఖ కథకులు అల్లం రాజయ్య ‘సృజన’ పత్రికలో తెలంగాణ పదాలు విస్తృతంగా వాడుతూ కథ రాసినందుకు ఆంధ్రా ప్రాంతం నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. గోఖలే మొదలు రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు వరకు ఎవరి భాషలో వారు కథలు రాసినా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా, నిఘంటువులు ముందర పెట్టుకొని అర్థాలు తెలుసుకొని మేము (తెలంగాణ వాళ్లు) కథలు చదివినాము. అలాంటిది తెలంగాణ తెలుగులో రాసిన పదాలు అర్థం కాకుంటే తెలుసుకొని చదివితే తప్పేమీ లేదని సాహిత్య చర్చలు జరిగినాయి. ఈ దశలో బి.ఎస్‌.రాములు, కాలువ మల్లయ్య, ఎన్‌.రాజశేఖరం, పులుగు శ్రీనివాస్‌లు తెలంగాణ భాషలో కథలు రాసినారు. దేవరాజు మహారాజు, సాహు, ఉప్పల నరసింహం, ఆడెపు లక్ష్మీపతి, పుప్పాల కృష్ణమూర్తి, పి.చంద్‌, ముదిగంటి సుజాతారెడ్డి తదితరులు తెలంగాణ ముద్రతో కథలు రాసినారు. పాతతరం వారసత్వాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే 1990ల తర్వాత నుంచి ఇప్పటి వరకు అనేక మంది తెలంగాణ భాషలో కథలు రాసినారు. అయితే ప్రత్యేకంగా తెలంగాణ భాషలో రాసిన కథలతో ‘కబ్జ’ అనే ఒక కథా సంకలనాన్ని మిత్రుడు స్కైబాబాతో కలిసి వెలువరించేందుకు నేను ప్రయత్నించినాను. ఇందులో వేముల ఎల్లయ్య, జూపాక సుభద్రతోపాటు ఒక డజన్‌మందికి పైగా కథలున్నాయి. ఇటీవలి కాలంలో పెద్దింటి అశోక్‌కుమార్‌, కె.వి.నరేందర్‌, కొట్టం రామకృష్ణారెడ్డి, డా।। వంశీచంద్‌రెడ్డి, అల్లం కృష్ణవంశీ, చెన్నూరి సుదర్శన్‌, వెల్దండి శ్రీధర్‌లు పక్కా తెలంగాణ భాషలో కథల్ని రాస్తూ మెప్పిస్తున్నారు. 
నవలలు, కవితల్లోనూ అదే సొగసు
ఆళ్వారుస్వామి ‘జైలు లోపల’ కథలను భాష విషయంలో ‘భయపడుతూనే’ ప్రచురించారు. అయితే ఈ కథలన్నీ ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. తర్వాత ‘ప్రజల మనిషి’, ‘గంగు’ నవలలను వెలువరించారు. ఈ రెండు నవలల్లో తెలంగాణ భాషను పాత్రోచితంగా వాడినారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన లోక మల్హరి దళితుల జీవితాలను చిత్రీకరిస్తూ ‘జగ్గని యిద్దె’, పద్మశాలీల జీవితాలను నవలీకరిస్తూ ‘సంఘం’ నవల రాసిండు. ఈ రెండింటిలోనూ తెలంగాణ భాష దేదీప్యమానంగా వెలిగింది. పుట్టుక రీత్యా తెలంగాణ వారు కాకపోయినప్పటికీ పోరంకి దక్షిణామూర్తి ‘ముత్యాల పందిరి’ పేరిట పద్మశాలీల జీవితాలను తెలంగాణ భాషలో నవలీకరించారు. విప్లవోద్యమ నేపథ్యంలో నవలలను సాహు, అల్లం రాజయ్య, వసంతరావు దేశ్‌పాండే తదితరులు వెలువరించినారు. బి.ఎస్‌.రాములు ‘బతుకుపోరు’ నవల, పవన్‌కుమార్‌ (తుమ్మేటి రఘోత్తమరెడ్డి) ‘నల్లవజ్రం’ నవలలు బీడీ కార్మికులు, బొగ్గుగని కార్మికుల జీవితాలు కళ్లకు కడతాయి. ముదిగంటి సుజాతారెడ్డి కూడా తెలంగాణ పదాలతో నవలలు రాసినారు. వేముల ఎల్లయ్య ‘కక్క’, ‘సిద్ధి’ నవలల్లో తెలంగాణ భాషకు, కుల మాండలికాలను జోడించి దళిత జీవితాలను తెలియజెప్పిండు. స్కైబాబ తన ‘ఆపా’ నవలలో ఉర్దూపదాలను జోడించి తెలుగు పాఠకులకందించాడు. 
      కవిత్వం విషయానికి వస్తే కాళోజీ నారాయణరావు మొదటి నుంచి తెలంగాణ భాషలోనే కవిత్వాన్ని సృజించిండు. అలాగే సుద్దాల హనుమంతు ‘పల్లెటూరి పిల్లగాడ’, బండి యాదగిరి ‘బండెనుక బండి కట్టి’ పాటలను తెలంగాణ భాషలోనే రాసినారు. తర్వాతి కాలంలో గద్దర్‌, మాస్టార్జీ, గోరటి వెంకన్న, అందెశ్రీలు ఇదే ఒరవడిని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమంలో పాటలన్నీ ‘తెలంగాణ భాష’లోనే వచ్చాయి కాబట్టే అంతగా ప్రజాదరణ పొందాయి.
      అయితే పూర్తిస్థాయి తెలంగాణ భాషలో తొలి కవితా సంపుటిని తెచ్చింది మాత్రం పంచరెడ్డి లక్ష్మణ. నిజామాబాదు వాసి అయిన ఈయన 1973లో ‘ఇసిత్రం’ పేరిట కవిత్వాన్ని వెలువరిం చారు. దేవరాజు మహారాజు ‘గుడిసె గుండె’ 1974లో, ఎన్‌.గోపి ‘తంగేడు పూలు’ 1976లో వెలువడ్డాయి. అలాగే, తెలిదేవర భానుమూర్తి ‘ఊరోల్లు’ (1986) కవిత్వాన్ని వెలువరించినారు. ఈ ముగ్గురూ భువనగిరి వాసులే! ఆ తర్వాతిŸ కాలంలో చెరబండ రాజు, వరవరరావు, అమ్మంగి వేణుగోపాల్‌, కృష్ణమూర్తి యాదవ్‌, మోతుకూరి అశోక్‌, పరమాత్మ తదితరులు బలమైన కవిత్వాన్ని సృజించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక మంది తమ అస్తిత్వాన్ని చాటుకునేం దుకు తెలంగాణ భాషనే వాహికగా ఎంచుకున్నారు. తమ కవితా సంపుటాలకు తెలంగాణ పదాలను శీర్షికలుగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పొక్కిలి’, ‘మత్తడి’, ‘మునుం’, ‘జిగర్‌’, ‘దిమ్మిస’, ‘జాగో జగావో’ సంకలనాలు వెలువడ్డాయి.  
      ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం కావడానికి ఉద్యమకారులు వాడిన భాష ప్రధాన కారణం. జయశంకర్‌ సార్‌, కె.చంద్రశేఖరరావులు భాషను భావజాల వ్యాప్తికి ఆయుధంలా వాడుకున్నారు. అది అంతిమంగా తెలంగాణ కల సాకారానికి తోడ్పడింది.
నిఘంటువులు కీలకం
ఇప్పుడు తెలంగాణ భాషకు పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ భాష ఎక్కువ మందికి చేరువ కావాలంటే అన్నిటి కన్నా ముందు నిఘంటువులు రావాలి. ఇప్పటికే మెదక్‌ జిల్లాకు సంబంధించి 1970ల్లోనే ఉమాపతి పద్మనాభశర్మ కొంత ప్రయత్నం చేశారు. రవ్వా శ్రీహరి, నలిమెల భాస్కర్‌, కాలువ మల్లయ్య, కపిలవాయి లింగమూర్తి, మునిపంతులు, భూతం ముత్యాలు తదితరులు తెలంగాణ పదకోశాలను వెలువరించారు. 
      ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా, కూడలిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ పూనిక మేరకు ‘బృహత్‌ తెలంగాణ పదకోశాన్ని’ తయారు చేస్తోంది. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో వెలువడ్డ పదాలన్నింటినీ ఒక్క దగ్గరికి తీసుకురావడమే గాకుండా, జిల్లాల నుంచి పదాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ నిఘంటు నిర్మాణంలో విషయ నిపుణులుగా ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ, ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య ఘంటా చక్రపాణి, నలిమెల భాస్కర్‌, కట్టా శేఖరరెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఈ నిఘంటువు వెలువడినట్లయితే ఏ ప్రాంతం వారైనా తెలంగాణ పదాలను సులభంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. పత్రికలు, పుస్తకాల్లో తెలంగాణ భాషను విరివిగా వినియోగిస్తే విద్యార్థులు ఇంట్లో మాట్లాడే భాషకు, పుస్తకాల్లోని భాషకు, అధ్యాపకులు బోధించే భాషకు ఎలాంటి తేడా ఉండదు. దీంతో విషయం సునాయాసంగా అర్థమవుతుంది. అయితే ఇదంతా అమల్లోకి రావాలంటే ప్రభుత్వం ‘భాష’ పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం