బాలలే ఆయన బంధువులు

  • 50 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎం.రాజ్యలక్ష్మి (ఏడిద కామేశ్వరరావుగారి అమ్మాయి)

  • హైదరాబాదు.
  • 9032100168
ఎం.రాజ్యలక్ష్మి (ఏడిద కామేశ్వరరావుగారి అమ్మాయి)

బాల ప్రపంచం
పాల ప్రపంచం
పాలవలె తియ్యనిది
పాలవలె చిక్కనిది

      అంటూ బాలప్రపంచాన్ని మనముందు నిలుపుతారు ఏడిద కామేశ్వరరావు. వయసుతో నిమిత్తం లేకుండా అందరిచేతా ప్రేమగా ‘అన్నయ్యా’ అని పిలిపించుకున్న అదృష్టవంతులు ఆయన. ఆకాశవాణిలో పనిచేస్తూ బాలలకోసం సాహితీ సృజన చేసి బాలబంధుగా ప్రసిద్ధి చెందిన ఆయన 1913 సెప్టెంబరు 12న తూర్పుగోదావరి జిల్లా ఏడిద గ్రామంలో పుట్టారు. అమ్మానాన్నలు వెంకటరాజ్యలక్ష్మి, పెద కొండలరాయుడు. ఆయన విద్యాభ్యాసం మండపేట, రాజమండ్రిల్లో కొనసాగింది. తాను రాసేది బాలసాహిత్యం అని తెలియకుండానే చిన్ననాటనే రచనలు మొదలుపెట్టారు.
      పిల్లలకు ఆటపాటలు తల్లిపాల వంటివి. ఆటపాటలతో అరవిచ్చిన వారి కళాహృదయాలు పసిడికాంతులను విరబూసే పద్మకిశోరాలై భాసిల్లుతాయి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అయినా కాకున్నా, వారి వాక్కు  అమృతవాక్కు- బాలల పలుకు పంచదార. అఖండమైన, అనంతమైన మన సంస్కృతీ స్రవంతిలో చిరుతరంగాలుగా తళుకులీనేది బాలసాహిత్యం.
‘బాలల’ అన్నయ్య
బాలల కోసం రచనలు చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన ఏడిద కామేశ్వరరావు పిల్లల కోసం అనేక సాహిత్య ప్రక్రియలు చేశారు. పిల్లల మనసుకు హత్తుకునేలా రాయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆయన రచనా వ్యాసంగం విశిష్టంగా ఉంటుంది. కథైనా, పాటైనా, నాటికైనా అవి విజ్ఞానాన్ని, వినోదాన్ని సంతరించి పిల్లలకు అర్థవంతమైనవిగా ఉంటాయి.
      ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలల కార్యక్రమాల నిర్వాహకునిగా పాటలు, నాటికలు, నాటకాలు, కథలు, నృత్యనాటికలు, బుర్రకథలు, జముకుల కథలు, హరికథలు వంటివెన్నో రాసి బాల ప్రపంచానికి అందించారు కామేశ్వరరావు. పిట్టలవలె నెగురుదుము/ జట్టుగాను తిరుగుదుము/ ఒక్కొక్కరందరము/ అందరమే యొక్కరమని అని ఆయన పాడినట్లే ఆయన రచనలన్నీ బాలల మనో, నైతిక, బుద్ధి వికాసాలను పెంపొందించేలా సాగాయి. 
అమ్మమాట ఎంతో అందము - మా
అమ్మ మనసు మంచి గంధము
అమ్మ ముద్దు చల్లన, అమ్మసుద్దు తెల్లన
అమ్మ ముద్దు సుద్దులే ఆదిగురువులు
అమ్మ మించి కానము వేరొక్కటి జగము
అమ్మ మించి లేదు కానరాదు దైవము

అనూచానంగా వస్తున్న ‘మాతృదేవోభవ’ నానుడి ఆయన రాసిన ‘అమ్మమాట’ పాటలో అలతి అలతి పదాలతో సొంపుమీరి కనిపిస్తుంది. మాతృహృదయం చలువపందిరి. అమ్మ మాట వాకలు తేరిన తేనెతేట.
అమ్మా చూడు ఈ వింతలు
    పాపలాడు పంతాలు
నీటిలోన నే తొంగి చూడగా
    నన్ను చూచి తా తొంగి చూచె
కుచ్చుజడ ఆ పాప ఎవ్వరే
    అచ్చము నను బోలి యున్నది

      పసిపాపలు పరమాత్ముని ప్రతిరూపాలు. అమాయకత్వంతో స్పందించిన ఈ ముద్దు మాటలు ప్రతి అక్షరమూ చదివేవారిలో వేయి వీణలు మీటుతాయి. నింగినీలాల జడలో చందమామ ఓ చేమంతి, వెలలేని అందం. పసిపాపల బోసినవ్వులు కురిసే ఇల్లు పగడాల ఆనందం. ఎంత సిరిసంపదలతో తులతూగుతున్నా, చిన్నారుల హొయలు, చిరునవ్వుల సింగారాలు లేని ఇల్లు దీపం పెట్టని గుడి వంటిది.
ఇంటికి పాపాయి అందము
మింట దాయిదాయి చందము
అందమా చందమా అన్ని ఉండి అవిలేక
అర్బుదాల తారలు ఆకాశము కందమా
తారలలో చందమామ తళ్కొత్తిన చందమా     
కోటి కలువ పూచినా కొలను చూడ అందమా
కలువలలో పద్మమొకటి విరిసిన అది చందమా
తోటలోన పూలలతలు విరబూసిన అందమా
లతలలోన ఒక గులాబి పూవు నవ్వ చందమా
మేలిమి బంగారముతో మలచిన నగ అందమా
నగలోన రత్నమొకటి రంగు మెరవ చందమా
ఇంటికి పిల్లలే అందమూ చందమూ అని  ఉదాత్తంగా చెప్పే ఈ పాటలోని భావం పసిపాపల బోసినవ్వులకు వెలలేదన్న అమూల్యమైన సందేశాన్ని అందిస్తుంది.
ఆడుతూ పాడుతూ చదువు
పాప పసిహృదయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. వారి మనసులోంచి పుట్టే  ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. అయినా తల్లి పిల్లలకు సమాధానాలు ఇస్తూనే ఉంటుంది. కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేయక, అర్థవంతంగా పిల్లల మనసు మరలుస్తుంది. 
అమ్మా అమ్మా రావమ్మా - ఒక్కమాట వినవమ్మా
పలకలు మరి బలపాలు - పుస్తకాలు లేని చదువు
ఉంటే బాగా ఉండునమ్మా ఉఫ్‌ అని చదివేద్దునమ్మా!

      బడికి వెళ్లే సరదాలో పలకా పుస్తకాలు మోయలేని ఆదుర్దాలో చిన్నారి పాపడు ఉఫ్‌ అని ఇట్టే చదివేసే ఉపాయం అమ్మను అలవోకగా అడుగుతాడు. అలాంటి ఉపాయం ఏదైనా దొరికితే పలకల బరువూ, పుస్తకాల మోతా లేని చదువు ఉంటే మహా పండితుడవుతాడట వాడు.
      సాహిత్య ప్రక్రియలన్నింటినీ చేపట్టిన రేడియో అన్నయ్య తేట తెలుగులో ‘బాలరామాయణం’ రాశారు. వెయ్యికిపైగా రాసిన పాటల్లో పిచ్చుక, కాకి వంటి పక్షులపైన పాటలు, పండుగ పాటలు, ఆకాశం నక్షత్రాల పాటలు, జంతువుల పాటలు, కాఫీ, టీ పైన పాటలు, ఇంట్లో ఉండే ప్రతి వస్తువుపైనా పాట రాసి దాని ఉపయోగం చెప్పారు. ఇక పర్యావరణంపై రాసిన పాటలైతే చాలానే ఉన్నాయి. అంటరానితనం లాంటి సమస్యలపై, సత్యం, అసత్యం వంటి వాటిపై పాటలు, కథలు, నాటికలు, రాశారు.
      భారతదేశంమీద రాసిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తెలుగుగడ్డ మీదున్న  విశిష్టతను తెలుపుతూ పాటలు రాశారు. కవి హృదయానికి, ఆ ప్రాంతం... ఈ ప్రాంతమని, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమని, ఈ జిల్లా ఆ జిల్లా అని భేదాభిప్రాయాలు ఉండవు. అందుకు ఆయన కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్‌ వంటి జిల్లాలపై రాసిన పాటలే తార్కాణం.
      బాలప్రపంచాన్ని తన రచనలతో అలరించిన కామేశ్వరరావు ఆధ్యాత్మికంగానూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. ‘పిలిచితే పలుకుతారట’, ‘తరిగొండ వెంగమాంబ’, ‘గోవర్ధన గిరిధారి’, ‘బాలరామాయణం’ వంటి రచనలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ సంగీత రూపకాలు. ‘పిలిచితే పలుకుతారట/ నా పలుకులో కులుకుతారట’ అనే పాట ఇప్పటికీ తిరుమల దేవాలయంలో మారుమోగుతోంది. ఈ పాటను శ్రీరంగం గోపాలరత్నం పాడారు. ఆయన రాసిన సుమారు 200 జోలపాటల్లో ఒక పాటకు మరో పాటకు పోలిక ఉండదు. అన్నీ ఏదో ఒక ఆలోచనను, విజ్ఞానాన్ని, ఆనందాన్నీ కలిగించేవే.
సద్దు చేయకండి, ఎవ్వరిటు రాకండి
బుద్ధిగా మాపాప, నిద్దరోతోంది
కాకమ్మ అరవకే, మా ఊరుపోతే
మామయ్య వచ్చేది, కబురు కొనితేవే
పిచికమ్మ పలుకవే, మా పొలముపోవే
పప్పులెన్నో తెచ్చి, మా పాపకీయవే
చిట్టి పిల్లిపోవే, వంటిల్లు విడిచి
ఉట్టిమీద పాలు, అన్నీ మా పాపలకే
కుక్క పిల్ల రావె, గుమ్మంలో కూర్చోవే
ఎవ్వరిటు రాకుండా, కాపలా కాయవే
చిట్టి పాపల్లార, అటెటో వెళ్లండి
నిదురలేచి పాప, ఆడగా వస్తుంది
బజ్జుంది మా పాప, బంగారు చిలక
బబ్బుంది హాయిగ, రతనాల మొలక

      ఇలా పాటలు పాడుతూ, జోలలూపుతూ పాలబువ్వ తినిపిస్తూ అమ్మ చెబితే పాపాయి ‘ఆం’ తింటూ కాకీ పిచ్చుకలు, కుక్కా పిల్లుల గురించి తెలుసుకుంటుంది. అమ్మ లాలనే పాపాయి తొలి చదువు. అందుకే అమ్మనే ఆది గురువుగా చెబుతారు.
      పిల్లల కోసం రేడియో అన్నయ్య చారిత్రక నాటకాలు ఎన్నో రాశారు. కృష్ణాతీరం వెంట జరిగిన కథకు అద్దం పట్టే నాటిక ‘ధనకటక మహాచైత్యం’, శాలివాహన శకం ఆరంభాన్ని వివరించే ‘శాలివాహన’ లాంటి నాటకాలు ఎన్నింటినో రాశారు. 
బాలల కోసం విద్యాలయం
రేడియో అన్నయ్యగా బొమ్మరిల్లు, పాలవెల్లి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆయా పండుగల సమయాల్లో, ప్రత్యేకమైన పాత్రలు రూపొందించి వాటి విశేషాలను పిల్లలకు పాటలుగా, నాటకాలుగా రూపొందించి వారిచేత వేయించేవారు. బొమ్మ, చిట్టి, పండు, కాంతం, పెద్దబావగారు, ఎల్లమంద, చిట్టిమరదలు, కబుర్లపోగు - ఇవే అన్నయ్య నాటకాల్లోని పాత్రలు. ముఖ్యమైన పండుగలనాడు ఆకాశవాణి పిల్లలకు రంగస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేసేది. వాటిలో పిల్లలు నాటకాలు, నృత్యాలు, కోలాటాలు ప్రదర్శించేవారు. 
      చిన్ననాటి నుంచే ఏడిద గ్రామంలోనూ, చదివిన మండపేటలోనూ, విద్యాభ్యాసం చేసిన రాజమండ్రిలోనూ ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చారు కామేశ్వరరావు. వాటిలో ముఖ్యమైంది హరిశ్చంద్ర నాటకంలోని నక్షత్రకుడి పాత్ర. ఆ రోజుల్లో జరిగిన నాటకోత్సవాల్లో బంగారు పతకం అందుకున్నారాయన.
      పిప్పరలో నిర్వహించిన సాహిత్య సభలో ఆయనకు ‘బాలభారతి’ బిరుదు ప్రదానం చేశారు. ఆ బిరుదునే ఆలంబనగా చేసుకొని సంగీత సాహిత్యాలకు నిలయంగా ‘బాలభారతి’ సంస్థను ప్రారంభించారు. విద్య, విజ్ఞాన, వినోదాల సంస్థ బాలభారతి. దీనిలో ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటుచేశారు. ఇందులో తెలుగు, సంస్కృతం, ఇంగ్లిషు భాషల్లో వచ్చిన బాలల పుస్తకాలు అందుబాటులో ఉండేవి. బడి అయిపోగానే పిల్లలు బాలభారతికి వచ్చేవాళ్లు. అందరిలో కొంచెం పెద్దవారిని నాయకుణ్ని చేసి వాళ్లతో ఆటలు ఆడించడం, పుస్తకాలు చదివించడం వంటివి చేయించేవారు. వారం వారం వచ్చే బొమ్మరిల్లు, పాలవెల్లి కార్యక్రమాలకు పిల్లల్ని తయారు చేసేవారు. అంతేకాదు పాటలు, నాటికలు, బుర్రకథలు నేర్పించి ప్రదర్శనలు ఇప్పించేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి, నవరాత్రుల్లో, ఇతర ఉత్సవాల్లో పిల్లలచేత వీటిని ప్రదర్శింపజేసేవారు. ఈ ప్రదర్శనల్లో పాటలకు రాగాలు కూర్చి పాడేవారు. తాను రాసిన ప్రతి పాటకూ రాగాలు పిల్లలకు నేర్పించి, రేడియోలో పాడించేవారు. తెలుగువారైనా ఆయన కూర్చిన పాటలు హిందూస్థానీ సంగీత కోవలో ఉండేవి.
      ‘బాలభారతి’ని ఆయన ఒక నమూనా విద్యాలయంగా తీర్చిదిద్దారు. పిల్లలకు ఇందులో పాఠశాల చదువుతోపాటు సంగీతం, నాట్యం, చిత్రలేఖనాలను నేర్పేవారు. ఎవరికి ఇష్టమైంది వారు నేర్చుకొని పదో తరగతి పూర్తయ్యేసరికి ఈ కళాప్రక్రియల్లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసేవాళ్లు. ఆయా రంగాల్లో  ప్రఖ్యాతులైన ఉపాధ్యాయులు ఇక్కడ బోధించేవారు. వివిధ పాఠశాలల్లో జరిగే ఆటపాటల పోటీలు, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీల్లో బాలభారతి విద్యార్థులు పాల్గొని బహుమతులు సాధించేవారు. 
ఆయనకూ ఉంది ఓ కల
విద్యలు, కళలు, వృత్తులు, సాంకేతిక విద్యలు వంటి సమస్తాన్ని కలిగిన ఒక నూతన విద్యావ్యవస్థను రూపకల్పన చేస్తున్న తరుణం ఇది. రేడియో అన్నయ్య ఆశయ బాటలో నడుస్తూ స్వయంప్రతిపత్తి కలిగిన ‘బాలల విశ్వవిద్యాలయం’ను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. సేవానిరతి కలిగినవాళ్ల సారథ్యంలో, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో విద్యావిధాన పాఠ్యగ్రంథ రచనలను కొనసాగించి, విద్యారంగ సముద్ధరణకు కృషి చేయాలి. 
      ఈ నేపథ్యంలో హృదయ వికాసానికి తోడ్పడే విద్యను ప్రవేశపెట్టాలి. ఈ బాలల విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన బాలలు స్వయం ప్రతిభావంతులుగా కావడంతో పాటు, జాతి ఔన్నత్యానికి దోహదంచేసే సంపూర్ణ వ్యక్తిత్వం కలవారుగా తీర్చిదిద్దాలి. 
      ఏడిద కామేశ్వరరావు గాంధేయవాది.  ప్రకాశంపంతులు శిష్యరికంలో ఆయన వితంతు వివాహం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో లాఠీ దెబ్బలు తిని జైలుజీవితమూ అనుభవించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి... భారత ప్రభుత్వం అయిదు ఎకరాల భూమిని ఇవ్వబోగా ‘భూమి కోసం నేను పోరాటం చేయలేదు’ అని తిరస్కరించారు.
పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దల్లో పెద్దవాడిగా, సాహితీవేత్తల్లో కవిగా, ఆధ్యాత్మిక చర్చల్లో తత్త్వవేత్తగా విరిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఏడిద కామేశ్వరరావు. ఆయన కలంపేరు ‘హంస’. అచ్చం హంసలాగే, ఆయన కూడా బయటి ప్రపంచంతో తాదాత్మ్యం చెందక, ఓ మునిలా తమ లోకంలో మునిగిపోయి కలం చేబూని కవితలు, గేయాలు, నాటికలు, ఆధ్యాత్మిక రచనలూ చేశారు.
      ‘బాలచంద్రిక’, ‘బాల’ పత్రికలకు సంపాదకత్వం వహించి, బాలల్ని ఉర్రూతలూగించిన కామేశ్వరరావు గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... పిల్లల పాలిట ‘జ్ఞాన భాండాగారం’. ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకొని తెలుగులో బాలసాహిత్యం మరింత వెలుగులీనాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం