గొప్పది... జీవితమంత గొప్పది

  • 156 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గోవిందు నరసింహారావు

  • దూసి, శ్రీకాకుళం.
  • 8826012617
గోవిందు నరసింహారావు

శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా అండీ? 
      డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది.

                  * * *

అగ్నిహోత్రావుధాన్లూ కుఱ్ఱవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనుకా చూస్తున్నావ్‌. బుచ్చమ్మనమ్మిన పదిహేను వందల రూపాయిలేంజేశావ్‌?
సెల్లింగ్గర్స్‌! డామిట్‌!
రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావధాన్లుగార్ని యెరుగుదువా? ఆయ్న లక్షాధికారి. పద్దెనిమిదివందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులూ పెడతారష, పెళ్లి మావైభవంగా చేస్తారష....
      బావా యీ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. 
వీళ్లమ్మా శిఖాతరగ, ప్రతీగాడిదకొడుకూ తిండిపోతుల్లాగా నాయింటజేరి నన్ననేవాళ్లే. తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకు చావండి.
      వట్టి మూర్ఖప గాడిదకొడుకు. యెదురు చెప్పిన కొద్దీ మరింత కొఱ్ఱెక్కుతాడు. 
                                  * * *
వూరు విజయనగరం. పేరు మధురవాణి. ‘ఆ వేశ్య ద్రవ్యానికి సాధ్యురాలు కాదు’.
      వూరుకోస్సి - నీ కేటెరిక! 

                                  * * *

లుబ్ధావధాన్లు పింతల్లికొడుక్కాడూ వీడూ! యీ గిరీశం గుంటవెధవ, వీడెవడో మా గొప్పవాడనుకుంటున్నా వేవిఁటి?
      నలుగురిలోనూ మర్యాద తియ్యడం ధర్మవేఁనా తమ్ముడా?

                                 * * *

కావడానికి రెండు కుటుంబాల కథే... కానీ అది సార్వజనీనం. అవడానికి ఆ కాలపు కొన్ని సమస్యల చిత్రీకరణే... కానీ అది సార్వకాలీనం. ఉత్తరాంధ్రలోని కొన్ని గ్రామాల నేపథ్యంలోంచి పురుడుపోసుకున్నదే... కానీ అది సార్వదేశీయం. అదే ‘కన్యాశుల్కం’. ఆధునిక తెలుగు నాటకానికి తొలి చిరునామా. తెలుగువాళ్లందరికీ తన సాహితీ సంపదను పంచిపెడుతూ గురజాడ రాసిన వీలునామా. 
      ఎప్పుడో 1890ల్లో రాసిన ఆ పుస్తకాన్ని 2014లో చదివినా పాతవాసనెయ్యదు. సరికదా, ‘పుస్తకం చాతపడితే వేళ్లకి అంటుకుపోతుంది. అలా చదివిస్తుంది’. ‘హాస్యం, పాత్రల చిత్రీకరణ, జటిలమైన ఒక కొత్త కథాసంవిధానం కోసం ప్రయత్నించాను. ఇందులో ఎంతవరకూ కృతకృత్యుణ్ణయానో లోకం నిర్ణయించాలి’ అని అడిగిన గురజాడ అప్పారావుకు ఈ లోకమిచ్చిన సమాధానం... అదీ ఒక్క గొంతుకతో...  ‘యీ నాటకాన్ని మించింది యింకోటి లేదు. నేడే కాదు రేపటిక్కూడా యిది ఆడదగినదే. చూడదగినదే! - నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు’.
నరమాంస విక్రయమే
డబ్బు తీసుకుంటే తప్ప మూడుముళ్లెయ్యని ఈనాటి మనుషులకు... డబ్బిచ్చి అమ్మాయిలను కొనుక్కోవడమనే నాటి పద్ధతి కాస్త వింతగా ఉంటుంది. వరకట్నాన్ని అసహ్యించుకునే వారికైతే ఆనాటి స్థితిగతులింకా రోతగా కనిపిస్తాయి. కానీ, ఆనాడు కొన్ని కుటుంబాల్లో ఈ కన్యాశుల్కం అపచారం కాదు. ఆచారం. అదేమని అడిగితే... ‘ఆహా. మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మారండి. వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మా తండ్రి మేనత్తల్ని కూడా అమ్మడవేఁ జరిగిందష’ అని సమాధానం చెప్పే పెద్దల పిదప బుద్ధులు రాజ్యం చేసిన కాలమది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల ఆడపిల్లలనే కాదు, ఆడో మగో తెలియని కడుపులోని పిండాన్ని సైతం ‘ముందస్తుగా’ బేరం పెడుతున్న వారిపై అందరికన్నా ముందు కందుకూరి వీరేశలింగం కన్నెర్రజేశారు. ‘కసాయి వాడు యెక్కడో పుట్టిన పశుమాంసము విక్రయిస్తాడు. నీవు కడుపున పుట్టిన శిశు మాంసమును విక్రయిస్తున్నావు. నీ వ్యాపారము కంటే వాడిదే మంచిద’ని హూంకంరించారు. 
      కందుకూరి ప్రభావంతో పాటు విజయనగరం సంస్థానం పరిధిలో జరిగిన కన్యాశుల్క వివాహాలపై సంస్థానాధిపతి ఆనందగజపతి రాజు జరిపించిన సర్వే కూడా ‘కన్యాశుల్కం’ రచనకు గురజాడను ఉద్యుక్తుణ్ని చేసింది. మూడేళ్లలో వెయ్యికి పైగా ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకున్న ఆయన... ‘మన స్త్రీ జాతిలోని నిస్సహాయమైన విభాగాన్ని సమాజ అవినీతిక్రిములతో నిండివున్న బాధాకరమైన దాస్యంలోకి తోసే ఈ చెడును ఒక జనరంజకమైన నాటకంలో వెల్లడిచేసి ఈ విషయంపై ప్రజాభిప్రాయాన్ని వుద్దీప్తం చేసేందుకు’ నడుంకట్టారు. దూషణభీషణల కన్నా వ్యంగ్యానికి తీవ్రతెక్కువని గుర్తించి... పెద్దవాళ్ల చిల్లరబుద్ధులను సునిశిత హాస్యంతో ఎండగట్టారు. 1897లో ‘కన్యాశుల్కం’ తొలిసారి ప్రచురితమైంది. దాదాపుగా దాన్ని మొత్తం తిరగరాసి, నాటకం పరిధిని పెంచి 1909లో రెండోసారి ప్రచురించారు గురజాడ. అయితే... మొదటిసారి ప్రదర్శితమైంది మాత్రం 1908లో. జగన్నాథ విలాసినీ నాటక సమాజం దీన్ని రంగస్థలమెక్కించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని వందల మంది కళాకారులు... ఎన్ని వేలసార్లు ప్రదర్శించారో!
అడ్డంగా తిరిగిన కథేంటి?
అగ్నిహోత్రావధాన్లు అనే పెద్దాయన తన రెండో కూతురు సుబ్బిని... వృద్ధుడైన లుబ్ధావధాన్లకు కట్టబెట్టడానికి రూ.1800లకు బేరం కుదుర్చుకుంటాడు. సుబ్బిని ఈ గండం నుంచి గట్టెక్కించడానికి ఆ పిల్ల మేనమామ కరటకశాస్త్రి రంగంలోకి దిగుతాడు. ఈలోగా అగ్నిహోత్రుడి కొడుకు వెంకటేశానికి గురువుగా గిరీశం ఊడిపడతాడు. మరోపక్క మధురవాణి... పుట్టింది వేశ్య కుటుంబంలోనైనా కొన్ని నీతినియమాలకు కట్టుబడి బతుకుతుంటుంది. సుబ్బిని రక్షించడానికి ఆమె కూడా సాయం చేస్తుంది. ఇంతలో సుబ్బి అక్క బుచ్చమ్మ (‘కన్యాశుల్కం’ బాధితురాలు, వితంతువు)ను వల్లో వేసుకుని తనతో తీసుకెళ్లిపోతాడు గిరీశం. చివరికి అతనికి సౌజన్యారావు (మంచి మనసున్న మనిషి. కన్యాశుల్క వివాహాలకు వ్యతిరేకి) బుద్ధి చెబుతాడు. దానికి ముందే  కరటకశాస్త్రి... సుబ్బిని ఒడ్డునపడేస్తాడు. 
      టూకీగా ఇదీ కథ. మొదట్లో అడిగిన ‘శ్రీకృష్ణుడి’ ప్రశ్న... మధురవాణిది. వృత్తి సంకెళ్లను చేధించుకుని మంచిగా జీవించాలన్న ఆమె ఆశలోంచి పుట్టిన సందేహమది. దాని కింద ‘అడ్డం తిరిగిన కథ’ గిరీశానిది! మాటలే పెట్టుబడిగా... మృష్టాన్నభోజనాలను లాగించాలనుకునే అతగాడి అత్యాశ మీద అంతిమ దెబ్బ పడిన క్షణంలో... అతని నోట్లోంచి వచ్చే ఆఖరి మాట ఇది. నాటకానికి అంతిమ వాక్యమూ అదే. 
      ఈ నాటకాన్ని భుజానమోసిన పాత్రలు... మధురవాణి, గిరీశం. వాటి చిత్రణ అపూర్వం. మనిషిలోని సకల అవలక్షణాలతో కూడిన మనుషులతో పాటు ఉదాత్తమైన లక్షణాలను పుణికి పుచ్చుకున్న వ్యక్తులెందరో ‘కన్యాశుల్కం’లో కనిపిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే... సమాజానికి సంక్షిప్త రూపం ఈ నాటకం. 
అచ్చ తెలుగు సంపద
‘నాకు నా మాతృభాషే, సజీవమైన తెలుగు భాషే కావాల’ని ప్రకటించిన గురజాడ... ఆనాటి గ్రాంథిక భాషా పిడివాదాలను తిరస్కరిస్తూ వ్యావహారిక భాషలో ఈ నాటకాన్ని రాశారు. అలా వ్యావహరికంలో వచ్చిన తొలి నాటకమిదే అయింది. అలాగే, వ్యావహారిక తెలుగులో తొలికథ, కథా కావ్యం రాసింది కూడా గురజాడే. 
      మరోవైపు, ‘కన్యాశుల్కం’ సంభాషణలు సామెతలయ్యాయి. ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది, తాను చేస్తే లౌక్యం - ఎదుటివాడు చేస్తే మోసం, నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్,  మనవాళ్లు ఒఠ్ఠి వెధవాయలోయ్, ఒపీనియన్సు అప్పుడప్పుడు చేంజ్‌ చేస్తుంటే గాని పొలిటీషియన్‌ కానేరడు’... లాంటివి ఇందులో కోకొల్లలు. శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే... ‘జీవితంలోని ఏ సందర్భానికైనా సరిపోయే మాటలు ఇందులో ఎక్కడో ఒకచోట దొరుకుతాయి’.
      పంచ్‌ డైలాగుల పేరిట ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న హాస్యానికి అమ్మమ్మ ‘కన్యాశుల్కం’. ‘ఆమెకు మొగుళ్లేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేద’ంటాడు గిరీశం ఒకచోట మధురవాణితో. వెంటనే ఆమె అంటుంది ఇలా... ‘మీరుండగా వెధవెలా అవుతుంది?’ 
      కారం రాసిన కత్తుల్లాంటి మాటల్లోంచి పుట్టే వ్యంగ్యం... నాటకానికి ఇతివృత్తంగా తీసుకున్న సమస్య మూలాన్నో, దాన్ని దుష్ఫలితాన్నో బలంగా వ్యక్తీకరిస్తూనే పాఠకుడి మోములో చిరునవ్వులు పూయిస్తుంది. అదే క్షణంలో ఆలోచింపజేస్తుంది కూడా. 
      ‘బ్యాంకు’, ‘డామిట్‌’ లాంటి ఆంగ్ల పదాల ఉచ్చారణకు తెలుగులో వాటి రాతకూ సంబంధం ఉండని సంగతి తెలిసిందే. నూట ఇరవై ఏళ్ల కిందటే ఈ సమస్యను గుర్తించి ఓ పరిష్కారాన్ని సూచించారు గురజాడ. ఆయా ఆంగ్ల శబ్దాలకు దగ్గర్లో ఉండే తెలుగు అక్షరాలపై అడ్డు గీత పెట్టారు.             ‘కన్యాశుల్కం’ పాత ప్రతుల్లో ఇది కనిపిస్తుంది. (ఉదా: డాన్సింగర్లులో ‘డా’ మీద అడ్డగీత) ఆ గీత ద్వారా దాని ఉచ్చారణలోని ప్రత్యేకతను చెప్పడమే గురజాడ లక్ష్యం. 
కన్యాశుల్కం సమస్యను ఎత్తిచూపినందుకే ఈ నాటకం ‘మంచి పుస్తకం’ కాలేదు. వేశ్యాలోలత్వం, మూఢనమ్మకాలు, కీర్తికాంక్ష, ధనవ్యామోహం, నయవంచకత్వం, లంచం తదితర ‘సార్వకాలీన’ దౌర్భాగ్యాలను ‘ఉన్నవి ఉన్నట్లుగా’ ఆవిష్కరించింది కాబట్టే దానికి ఆ గౌరవం దక్కింది. 
      మళ్లీ ఓసారి శ్రీశ్రీ మాటలను గుర్తు చేసుకుంటే... ‘కన్యాశుల్కం గొప్పది. జీవితమంత గొప్పది. సాహిత్యంలో వాస్తవికతను ఇంత సమగ్రంగా ప్రదర్శించిన నాటకం ఈనాటి మన దేశంలో లేనేలేదు’.


వెనక్కి ...

మీ అభిప్రాయం