చెడనిది పద్యమొక్కటే...

  • 49 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కట్టా నరసింహులు

  • కైఫియ్యత్తు కతల రచయిత
  • తిరుపతి
  • 9441337542
కట్టా నరసింహులు

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రక్రియ శతకం. వేమన, సుమతి, దాశరథిÇ లాంటి శతకాలు మనకు సుపరిచితమైనవి. ఈ కోవలోదే ‘గువ్వలచెన్న’ శతకం. ఇందులోని పద్యాలు అంతగా తెలియకున్నా, ‘పలువిద్యలెన్ని నేర్చిన కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా’ అన్న పాదం తెలుగువాళ్లంతా ఎప్పుడో ఒకప్పుడు తలచుకునేదే. 18వ శతాబ్ది నాటిదిగా భావిస్తున్న ఈ శతకంలో అప్పటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల విశేషాలు ఎన్నో తెలుస్తాయి. నీతి, వ్యంగ్య, అధిక్షేప పద్యాలతో సాగిన శతకం ఇది. పైగా ఇందులో అప్పుడు సామాజిక ధోరణులు ఎలా ఉన్నాయో, ఎలా పరివర్తన చెందుతున్నాయో తెలుస్తాయి.
      ‘శ్రీ పార్థసారథీ! నే బాపాత్ముడ... ’ అంటూ అన్ని తెలుగు కావ్యాల్లానే గువ్వలచెన్న శతకం కూడా శ్రీకారంతోనే ప్రారంభమవుతుంది. 17వ శతాబ్దంలో మన దేశానికి వ్యాపారం నిమిత్తం ఇంగ్లిష్‌వాళ్లు వచ్చారు. భారతీయుల అనైక్యతను ఆసరాగా తీసుకొని దేశాన్ని క్రమక్రమంగా ఆక్రమించి, తమ పాలనను సుస్థిరం చేసుకున్నారు. ఆంగ్లేయుల పాలన ప్రారంభమైన తొలినాళ్లలో మన సమాజంలో వచ్చిన మార్పుల్ని పద్యాల్లో బంధించాడు ఈ శతక రచయిత. తరాల నుంచి వస్తున్న సంప్రదాయ వేషధారణను విడిచి, చదువుకొన్నవాళ్లు పాశ్చాత్యుల్ని అనుకరించేవాళ్లన్న విషయాన్ని కొన్ని పద్యాలు వెల్లడిస్తాయి. ఆంగ్లేయుల పాలనలో దేశంలో పంచాయతీల స్థానంలో కోర్టులు వచ్చాయి. ఈ క్రమంలో ఆవిర్భవించిందే న్యాయవాద వృత్తి. పద్యాల్లో ప్లీడర్లు, వకీళ్లు అన్న పద ప్రయోగాలు ఇది ఆంగ్లేయుల కాలం నాటిదిగా పట్టి చూపుతాయి. ఈ శతకంలోని పద్యాల్లో న్యాయవాద వృత్తిని చేపట్టినవాళ్ల ప్రవర్తన ఎలా ఉండేదో వివరించాడు కవి.
చెన్నపట్టణంతో అనుబంధం 
గువ్వలచెన్న శతకానికి చెన్నపట్టణానికి సంబంధం ఉన్నట్లు రెండు పద్యాల ద్వారా తెలుస్తుంది. 
చెన్నయను పదము మునుగల
చెన్నగు పురమొకటి నీదు చెంతను వెలయున్‌
సన్నుతులు వేల్పునుతులును
గొన్నాతని కరుణ చేత గువ్వలచెన్నా!

      ఓ గువ్వలచెన్నా! చెన్న అన్న పదం ముందు చేరి చెన్నపురం నీ సమీపంలో వెలుస్తుందంటాడు శతకకర్త. ‘ధరనీపేర పురంబును...’ పద్యం కూడా ఇలాంటిదే. వకీళ్లను, దొరలను (ఆంగ్లేయులు) గురించి పద్యాల్లో పేర్కొనడం గువ్వలచెన్న శతకకారుడికి మద్రాసుతో పరిచయం ఉండి ఉంటుందనడానికి ఆలంబనగా నిలుస్తుంది. 
      ఆంగ్లేయులు తూర్పుతీరంలో తమ అవసరాలకు సరితూగే వర్తక స్థావరం కోసం వెతుకుతున్నారు. ఆ ప్రయత్నంలో చంద్రగిరి రాజును కలిశారు. రాజు వీరికి మదరాసపట్నం సమీపంలో స్థలాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఈ ప్రాంతానికి పాలకుడు దామెర్ల వెంకటాద్రి. ఈయన తండ్రి పేరు చెన్నప్ప. ఈయన పేరుతోనే 1639లో ఆంగ్లేయులు కోట కట్టుకున్న ప్రాంతానికి చెన్నపట్నం అని పేరుపెట్టారు. మదరాసపట్నం అంతకు ముందునుంచీ ఉన్నదే. తర్వాత రెండూ కలిసిపోయి ఏది ఏదో చెప్పటం కష్టమైంది. అందుకే రెండు పేర్లూ వాడుకలో ఉన్నాయి. అయితే ఇంగ్లిష్‌వాళ్లు మాత్రం మద్రాసు అనే పిలిచారు. ఆ పేరుతోనే మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటైంది. 1995లో మద్రాసు పేరును చెన్నైగా తమిళనాడు ప్రభుత్వం మార్చింది. ఈ సంవత్సరంతో (2014) చెన్నపట్నానికి 375 ఏళ్లు నిండాయి. ఒకప్పుడు ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవాలయం ఉండేది. ఈ దేవుని పేరుమీదే ఈ శతకం వెలువడి ఉంటుంది. 
కూటికొరకే కోటివిద్యలు
శతకాల్లో ప్రధాన లక్షణం తాత్విక దృక్పథం, ఆత్మాశ్రయ రీతి. ఈ శతకంలో కూడా...
ఎన్నగల జీవరాసుల
యన్నిటి గర్భమునఁ బుట్టి యట మనుజుండై
తన్నెఱిఁగి బ్రతుకు వలెరా
కొన్నాళ్లకు నెచట నున్న గువ్వలచెన్నా!

      అంటాడు. ఎన్నో జంతు జన్మలు ఎత్తిన, తర్వాతే ఈ మానవ జన్మ ప్రాప్తమైంది. అందుకే, మనిషి సత్తువ ఉన్న రోజుల్లో ఎలా మెలిగినా, ఎప్పటికైనా, ఎక్కడ ఉన్నా తనను తాను తెలుసుకొని బతకాల్సిందే.
ఎంతటి విద్యలఁనేర్చిన
సంతసముగ వస్తుతతులు సంపాదింపన్‌
చింతించి చూడ నన్నియు
గొంతుకఁ దడుపుకొనుకొఱకె గువ్వలచెన్నా!

      కోటి విద్యలు కూటికొరకే. అలానే ఎన్ని విద్యలు నేర్చినా, ఉత్సాహంతో ఆస్తిపాస్తులు సంపాదించినా, ఆలోచించి చూస్తే అవన్నీ గొంతు తడుపుకునేందుకే. చిన్నపద్యంలో జీవిత లక్ష్యాన్ని ఎంత చక్కగా తెలిపాడో! 
తనవారికెంత గల్గిన
దనభాగ్యమె తనకునగును దగువాజులకున్‌
దనతోక చేత వీచునే?
గుణియైన ఘోటకంబు గువ్వలచెన్నా!

      పద్యంలో పద్యంలో బంధు మిత్రులకు ఎంత ఉంటే ఏంటి, తన దగ్గరుండేదే తనకు భాగ్యం. గుర్రం ఎంత గొప్పదైనా తన తోకతో పక్క గుర్రానికి విసరదు కదా! అంటాడు. మానవ మనస్తత్వాన్ని గుర్రం బుద్ధితో పోల్చడం విశేషం. పిల్లలను డబ్బుకు, విలాసాలకు దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లకు జీవితంలో కలిమి లేముల ప్రాధాన్యత తెలిసివస్తుంది. దీని ప్రాధాన్యతను... 
బుడుతలు భోగంబులుసిరి
యడరు కొలంది ఘనకార్య మందహితులై
తొడరికడు జెడుదురిలపై
గుడియెడమలు లేకముందు గువ్వలచెన్నా!

      పిల్లలు విలాసాలకు మరిగితే, కుడి ఎడమల తేడా లేకుండా చెడిపోతారని హెచ్చ రిస్తాడు. ఇది మూడు వందల ఏళ్ల కింద రాసిన పద్యమైనా సమకాలీనతను కలిగిందే. 
గోంగూరకు వెల్లుల్లి తాలింపు
అంగీలు పచ్చడంబులు
సంగతిఁగొను శాలుజోడు సరిగంచుల మేల్‌
రంగగు దుప్పటులన్నియు
గొంగళి సరిపోలవన్న గువ్వలచెన్నా!

      ఈ పద్యంలో నాటి వస్త్రధారణ తెలుస్తుంది. అంగీలు, పచ్చడాలు, శాలువాలు, మంచి అంచుగల రంగురంగుల దుప్పట్లు ఎన్ని ఉన్నా, అవి గొంగడిని సరిపోలవు. ఇక ‘వెల్లుల్లి బెట్టి పొగచిన...’ పద్యంలో గోంగూర పచ్చడి ఎలా తినాలో చెబుతాడు. వెల్లుల్లి వేసి పోపుపెట్టిన పుల్లని గోంగూర రుచిని ఏమని పొగడుతాం. దాన్ని కొంచెం ఎక్కువగా నూనె వేసుకుని తృప్తిగా ఆరగించాల్సిందే. అంతేనా...
కంగా బుంగా కొట్టిన
పొంగిడ మిరియాల నేతి మొదటి పిడుచతో
మ్రింగిన నాకలి నడచుట
కుంగల నజ్జును హరించు గువ్వలచెన్నా!

      పొంగిన మిరియాలను కొట్టి కంగావింగా నేతిలో కలిపి ఒక్క ముద్ద అన్నం తింటే, ఆకలిమాంద్యంతో వచ్చే నంజు మాయమవుతుందంటూ ఓ చిట్కానూ చెప్పాడు. ఇవే కాక డబ్బును గురించి, బంధువులను గురించి, వివిధ వృత్తులవారి మనస్తత్వాన్ని గురించీ ఇందులో పద్యాలు ఉన్నాయి.
      ఈ శతక కర్తృత్వాన్ని గురించి పలువురు పలురకాలుగా పేర్కొన్నారు. దీనిని గువ్వలచెన్నుడే రాశాడని కొందరు అంటే, సురవరం ప్రతాపరెడ్డి దీని కాలాన్ని 1700 నాటిదిగా పేర్కొన్నారు. అయితే రచయిత ఎవరనేది తెలపలేదు. ‘తెలుగు చాటువులు- పుట్టుపూర్వోత్తరాలు’ గ్రంథకర్త బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గువ్వలచెన్న శతకం రాసింది పట్టాభి రామకవి అనీ, ఆయన నరసరావుపేట మల్రాజు సంస్థాన ఆస్థాన కవి అనీ పేర్కొన్నారు. ఈ పట్టాభిరామకవి కర్తృత్వంపైనా అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా...
గుడికూలును నుయిపూడును
వడి నీళ్లంజెఱువు తెగును వనమును ఖిలమౌ
చెడనిది పద్యంబొక్కటి
కుడిఎడమల చూడకన్న గువ్వలచెన్నా!
 
      గుడి కూలుతుంది, బావి పూడిపోతుంది, నీటివేగానికి చెరువు తెగొచ్చు, కాల గమనంలో అడవి నాశనం కావచ్చు, కానీ పద్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. చెడనిది పద్యం మాత్రమే, కుడి ఎడమల చూడకు అన్నట్లే పద్యాలు మాత్రం నేటికీ నిలిచి ఉన్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం