ప్రత్యామ్నాయంగా ప్రవహించిన బతుకు కలం

  • 33 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య జయధీర్‌ తిరుమలరావు

  • కవి, పరిశోధకుడు,
  • హైదరాబాదు.
  • 9951942242
ఆచార్య జయధీర్‌ తిరుమలరావు

బింబం రెటీనా మీద తలకిందులైతేనే గదా
వాస్తవం వాస్తవంగా గుండెల్లో అచ్చయ్యేది
ధర్మం చరిత్ర మీద విలోమమైనప్పుడే గదా
నేల నాలుగు విషాద గాథల్ని పాడగలిగేది!

విషాదంలోంచి ఉత్పన్నమయ్యే సృజనకి కొనసాగింపు ఉంటుంది. తెరేష్‌ ఈ సమాజపు మూలాల్లో ఉన్న తల్లి వేరుని సవరించాలని చూశాడు. ఆ పని సంపూర్ణం కాలేదు. అందుకే ఎక్కడ ఉన్నా తిరిగి ప్రత్యక్షమవుతాడు.
తెరేష్‌
ప్రయోగవాది. సాహసి. జీవించి మరణించాడు. మరణించి జీవితం వెలుగులను చూపిస్తున్నాడు. కలలు కనీ కనీ వాటిని సఫలం చేయలేక, ఆ బరువుని మోయలేక అభిమానాన్ని, అవమానాలని కఫన్‌లా కప్పుకుని తీరందాటాడు. బహుజన విముక్తి అతని కల. అందుకోసం సృజన స్వేచ్ఛలో తడిసి నేలని ముద్దాడాలని నిరంతర తపన. ఆ నేలనే చివరి స్థావరంగా చేసుకున్నాడు. తననితాను ఒక బీజంగా మలుచుకున్నాడు.
      అతడి సంతకాలు, అక్షరాలు, పాడిన కవాతు గీతాలు అన్నీ పాఠకుల అమ్ముల పొదిలో దాచిపోయాడు. భార్య తాహిరా, కొడుకు ప్రణయ్‌చంద్ర, కూతురు సాయిరీతికలను వదిలి ‘నిశానీ’లను, హిందూ మహాసముద్రాలని మనకోసం కానుకగా వదిలిపోయాడు. నిత్యం గగుర్పాటుతో, వ్యథతో, సంఘర్షణతో, ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఆత్మగతాలలో కన్నీళ్ల మధ్య అతని దివారాత్ర చర్యని భరించలేక అతడిని ఆవహించిన ‘కళ’ విముక్తి కోరింది. విధిలేక జాలి గుండెతో సరేనన్నాడు.
      జిల్లా ప్రకాశం. ఊరు ఒంగోలు. దాని పరిసర ప్రాంతమైన గద్దలకుంటలో నవంబరు 3, 1963లో జననం. తండ్రి వరదయ్య, తల్లి సుబ్బులమ్మల గారాబాల ముద్దుబిడ్డడు. మొదటిసారి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా చేరాడు. ఇరవై ఏళ్ల నుంచి హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగం. అలా తెలంగాణకి తనని తాను అక్షరాలా దత్తు ఇచ్చుకున్నాడు. 
      లక్షలాది మంది మనుషులలో ఒక్కడు మాత్రమే ఒక సంకేతం కాగలడు. తెరేష్‌ ఇప్పుడు కావడి బద్దకి సంకేతం అయ్యాడు. సాహిత్యం-కళ; వచనం, గజల్‌; రాత, దృశ్యం; సవర్ణం, అవర్ణం; బతుకు, మరణం వీటి మధ్య ఒక సూత్రం ఉండాలి. రెండు విరుద్ధ సమభారాలని మోయడానికి తెగువ కావాలి. స్పష్టమైన తాత్విక చింతన కావాలి. మొదట మనిషితనం పునాది కావాలి. విముక్త రాజకీయ సమగ్రతత్వం తెలియాలి. దానిని మరింత పరిపుష్టం చేయగలిగిన చేవ కలిగినవాడు తెరేష్‌. 
కవిత్వ శరాలు
నిశానీ (ఇతరులతో కలిసి) (1996), అల్పపీడనం (1990), హిందూ మహాసముద్రం మొదటి ఆడియో కేసెట్‌ (1996), ఆ తరువాత పుస్తక రూపం (2010), నేనూ నా వింతలమారి ప్రపంచమూ... (2009), నాలుగో ప్రపంచం (2010), కావడికుండలు, (సంపాదకుడు, 2009), వంటి కవితా సంపుటాలు తెరేష్‌బాబు ప్రతిభకి అద్దం పడతాయి. అవి కలాన్ని చీల్చుకుని వెలువడిన కవిత్వ శరాలు. సీరియస్‌ వచన కవిత్వానికి వ్యంగ్య, అధిక్షేపాలను జోడించి... తను చెప్పే విషయాన్ని పాఠకుల గుండెలకూ, మెదళ్లకూ ఏకకాలంలో తగిలేలా చేసిన వర్తమాన సామాజిక కవి. 
      కవిత్వాక్షరాలతో సాధించలేని దాన్ని దృశ్యాలతో సాధించడానికి ప్రయత్నం చేశాడు. ‘నేను నా వింతలమారి ప్రపంచమూ...’ అనే పుస్తకంలో ‘దృశ్యమాధ్యమాల పట్ల కాస్తంత దృష్టి సారించండి. మెజారిటీ జాతి జనులు అక్కడ పోగుబడి ఉన్నారు. వాళ్లలో డెబ్భైశాతం మందికి చదవటం, రాయడం రాదు. చెప్తే వింటారు. చూపిస్తే చూస్తారు. ఆలోచిస్తారు. కదులుతారు. కదిలిస్తారు’ అని నిస్సంకోచంగా ప్రకటించాడు. అందుకే విధి, సంఘర్షణ వంటి టీవీ సీరియళ్లు తీశాడు.
తొలిదశ దళిత కవిత్వంలో తమనితాము కవులు వెదుక్కున్నారు. తమ అస్తిత్వ వేదనని బలంగా వ్యక్తం చేశారు. కానీ మలిదశలో కవులు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను అవగాహన చేసుకుని తమ దృక్కోణంలోంచి వాటిని చూశారు. ప్రపంచీకరణ వల్ల దళితులకు ఏదో ఒరుగుతుందనే భ్రమ నుంచి తెరేష్‌ బయటపడి ఇలా అంటున్నాడు-
కులస్వామ్యపు నేరాలకు 
ఛార్జిషీట్లుండవు
విసురుగా గాల్లోకి ఎగిసే నల్లగొంతులకు అర్థం కాదు
దుష్ట సంహారం సాగించాలో
నష్టపరిహారాలకు దేబిరించాలో
కులం వేళ్లను బేఖాతర్‌ చేసి పేదరికాన్ని 
నరకనన్నాళ్లూ
పంపిణీ పథకాలు బిచ్చగాళ్లనే ఉత్పత్తి చేస్తాయి
దొంగాటకం రంజుగా సాగిపోతూ ఉంది
కావచ్చు
అభివృద్ధి పథకాల ముసుగులోని అణిచివేతల్ని
కనిపెడుతూ ఉంది. ఇది నాలుగో ప్రపంచం

      ఆర్థిక సాయం, పథకాలు, కోటాలు అన్నీ దళితులను యథాస్థానంలోనే ఉంచుతాయి. ఈ విషయం దళిత సోదరులు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాల ‘కులం’ గుర్తింపు వల్ల జరిగే అన్యాయం, దోపిడీలను గుర్తించాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అంటాడు. అభివృద్ధి చెందే దేశాలను మూడో ప్రపంచ దేశాలు అని అంటారు. కానీ దళితులు, ఆదివాసులు, మూలవాసుల ప్రపంచాన్ని నాలుగో ప్రపంచంగా తను భావిస్తాడు.
      ‘హిందూ మహాసముద్రా’న్ని హైందవ అణచివేతకు సంకేతం చేసి ఒక కావ్యం రాశాడు. పెద్ద పెద్ద కవులు ఏం రాయాలా అని ఆలోచిస్తున్న సమయంలో స్వీయ అనుభవాలను సామాజీకరించి శక్తిమంతమైన కవిత్వాన్ని రాశాడు. ఈ కావ్యాన్ని మొదట సీడీగా తీశాడు. వచన కవితా కావ్యం శబ్దంగా శ్రోతల మన్ననలను పొందింది.  ఆ తరువాత పాఠకులకు పుస్తక రూపంలో అందింది. ఈ కావ్యానికి ముగింపుగా...
ఇన్నాళ్లూ పోగొట్టుకున్న ప్రవాహాలు చాలు
ఇన్నాళ్లూ కోల్పోయిన ఆత్మగౌరవాలు చాలు
ఇన్నాళ్లూ ధారపోసిన జవసత్వాలు చాలు
ఇక ఏ నదీ సముద్రం వేపు కన్నెత్తి 
చూడనక్కరలేదు
తెగిపడ్డ కెరటాల్ని కుట్టుకుంటూపోదాం
అదే ఏరౌతుంది
ఎవరు ముట్టుకుంటే
నేల చేనై కంచంలోకి ప్రవహిస్తుందో
వేరే చెప్పాలా?
ఏ నాగేటితోనో ఏకీకరణ కుదిరినప్పుడే
నేల చేనౌతుందనీ మళ్లీ చెప్పాలా?
చెమటచుక్కకూ చెమటచుక్కకూ
అలయెన్స్‌ కుదరాలి
లేకుంటే చెమటచుక్క నది ఎట్లా అవుతుంది
పదండి ప్రవహిద్దాం
ఎక్కడికి ప్రయాణం అంటే ఏమని చెప్పను
చావు నుంచి బతుకుదాక - అబద్ధం నుంచి
 నిజందాక
చెలియలికట్ట నుంచి చేను మలుపు దాక
మాయలఫకీర్‌ వెంట కుక్కలా నడిచే చరిత్ర 
మనకక్కరలేదు
నలుగురూ ఏమనుకుంటున్నా ఇహ 
అయిదోమాటే అసల్దీ ఆఖరిదీ
పదండి పదండి
ప్రత్యామ్నాయంగా ప్రవహిద్దాం

      అంటూ ఒక మార్గాన్ని చూపి ముగించాడు. తెరేష్‌ కవిత్వానికి ‘ఆధునికత’ని ఆధునిక భాషని అందించడంలో సఫలమయ్యాడు.
‘నేనూ నా వింతలమారి ప్రపంచమూ...’ తెరేష్‌ సామాజిక ప్రతిస్పందనా కావ్యం. ఇందులో వ్యవసాయరంగం, పేదరికం, బానిస విద్యావ్యవస్థ, వస్తు నిలవశాల, నయా సామ్రాజ్యవాదం, పరాయీకరణ, ఏడోవింత అని ఏడు కవితలు రాశాడు. ఈ కవితల్లో జాతీయ, సామ్రాజ్యవాద పోకడల్ని ఎండగట్టాడు.
మీరు మీ ప్రపంచాన్ని తూర్పారబట్టి
ఏడు వింతల్ని గుర్తిస్తారు
నేను మీ వింతల్ని జల్లెడపట్టి
నా ప్రపంచాన్ని గుర్తిస్తాను

అని ఏడు వింతల బండారాన్ని బట్టబయలు చేశాడు.
నువ్వు దేవుడు పంపిన దూతవు
నిన్నామాత్రం గుర్తించలేనా!
నన్ను శకలాలుగా
విడగొట్టి శతాబ్దాలౌతోంది
నేను ఏ ముక్కలో బతికున్నానో
నాకే తెలీదు స్థాణుత్వం నుంచి స్థాణుత్వందాక
జరిపే నిశ్చలయాత్రలో
పచ్చని మజిలీవి నువ్వు
‘భవతీ భిక్షాందేహీ’
ఈ సప్తాక్షరీ మంత్రంలోనేకదా
నా ప్రపంచాన్ని బిగించి ఉంచావు
దేబిరింపును మాత్రమేకదా
నా హక్కుగా అభివర్ణిస్తుంటావు

      అని శతాబ్దాలుగా అంటరాని వారిని, అట్టడుగు ప్రజలని ఎలా మోసం చేసి అణగదొక్కారో అక్షరీకరించాడు. బాధితులు ఎవరైనా వారికి మద్దతు పలకడమే అక్షరం బాధ్యత. ఈ బాధ్యతలో తెరేష్‌ ఎప్పుడూ ముందే ఉన్నాడు. సకల జన సమ్మతంగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో చాలా కవితలు రాశాడు. అందులో ‘కుండల్లా విడిపోదాం/ కావడి బద్దలా కలిసి ఉందాం’ అంటూ చెప్పిన ‘కావడికుండలు’ కవిత రెండు ప్రాంతాల్లోనూ చాలా ప్రచారం పొందింది. డా.అంబేద్కర్‌ చిన్న రాష్ట్రాల అవగాహనని తెరేష్‌ కవిత్వీకరించాడు. 
      తెరేష్‌ బహుముఖీన ప్రతిభాశాలి. ఆధునికుల్లో అత్యంత ఆధునికుడు. తెలుగులో తెరేష్‌ అతినవీన కవి. పద్య పఠనం, గజళ్లు పాడటంలో దిట్ట. సంగీత వాద్యాల వాదనలో కూడా చేయి తిరిగిన కళాకారుడు.
      మనిషిని బలహీనపరిచే అన్ని విలువలనూ ప్రశ్నించడం నేర్పిన తెరేష్‌ తాను బలహీనపడటం విషాదం. దానివల్ల తెలుగు కళాసాహిత్య రంగాలు కూడా బలహీనపడినట్లే. ఇప్పుడు తెరేష్‌ అనంతర తెలుగు కవిత్వం మరింత బలపడాలి. అందుకు అతని రచనల బాటని అందుకోవాలి. అదే అతనికిచ్చే నివాళి.


వెనక్కి ...

మీ అభిప్రాయం