ఉగాది ఊహల్లో వసంత సమీరాలు

  • 740 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కన్నీడి మనోహర్‌

  • పేకేరు, తూర్పు గోదావరి జిల్లా
  • 9494044429
కన్నీడి మనోహర్‌

వీధి వాకిలి వైపుగా నడిచొస్తుంటే వేపచెట్టు గాలి ఈసారెందుకో.. మధువును అద్ది మరీ కదిలింది. ఉన్నట్టుండి పూసిన తంగేడు ఫక్కున నవ్వింది. ఆ నవ్వుతోపాటే తూరుపు భళ్లున తెల్లారుతుంటే ఇంతింత కళ్లు చేసుకుని... సిగలో మల్లెల్లాంటివేవో వేలాడేసుకుని... చీరకట్టి కొత్తదనంతో... తడబడుతూ వస్తున్న అమ్మాయిలా వనాల మీది వేకువ ఇంటి గుమ్మంలో తచ్చాడుతున్నట్టే అనిపిస్తోంది.
      ఎవరదీ? ఎవరా వచ్చేదీ? అని, అన్ని తలుపులూ బార్లా తెరచి చూసేసరికి లేలేత నీరెండ నా పాదాలను తడుతూ ఉంది. రాలిన వేపపూల దొంతర వాకిలి నిండా పరుచుకుని ఉంది. బరువుగా వేలాడే పూలకొమ్మలు మత్తెక్కి తూలుతున్నాయి. అల్లంత దూరాల సుమవనాల తాలూకు మధుమాసపు వీవనలు ఇటే వీస్తున్నాయి. అప్రయత్నంగానే గొంతు కృష్ణశాస్త్రి పాటను ఆలపించింది.
      ‘‘ఎవరు వారు వచ్చేది పూవుల తేరుపై/ కొత్తకారు కొత్తకారు/ శ్యామ పత్రం రథంలోన చైత్రరథంపైన/ ఎవరా వచ్చేది?/ అది ఉగాది... అది ఉగాది/ మరకతముల కుళ్లాయి/ మావిచిగురుల తురాయి/ ఏం బడాయి... ఏమా బడాయి!!’’... ఆహా! రేడియోలో ఉదయంపూట వినిపించే ఈ మాసపు పాటలాగా ఎంత బాగుందా పిలుపు. రుతువుల రాణి వసంతరాణి.. తన జడను తిప్పుకుంటూ ఇట్టే నడచి వస్తున్నట్టు లేదూ?
      తన్మయత్వం కాక మరేంటి? ఉగాది అంటే- మనసుకి ఎందుకో ఇంత సందడి! తలొంచుకునిపోయే అమ్మాయి మీద తపిస్తూ రాసుకున్న భావకవిత్వం మాదిరి ఉగాది వూసెత్తితే చాలు... ప్రకృతి మీద ప్రణయ కవిత్వమొకటి రాయాలని ఒకటే ఆరాటం. చెట్టుకైతే మాత్రం ఒక ప్రేమలేఖ రాయకూడదా? పూవులైతే మాత్రం లేలేత కిరణాలను పసిపాపలల్లే ముద్దాడాలని ఉండదా? విరబూసిన కొమ్మల్లో అణిగిమణిగిన కోయిల మాదిరి... పద్యమొకటి పాడుకోవాలని ఎవరికి మాత్రం ఉండదూ! ఎత్తిన కలాలను కదిపి, గళాలను సవరించి కవితా ప్రాసలకు ఒంపులు తిప్పుతూ... అనుభూతులను ఒలుపు కుంటూ... మహతీవీణియ నాద సుధా మాధురిలో... ఆ ప్రకృతిలో పరవశిస్తూ... పరితపిస్తూ రససిద్ధిని పొందితేనే కదా ఉగాది ఉల్లాసం ఒంటికి పట్టేది!
      ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయేదే ఉగాది అయితే మనం పొరబడినట్టే. ఒట్టి చేతులతో కాకుండా జీవన సూత్రాన్నేదో మనకు కట్టి మరీ వెళ్తుంది. ఏంటా! జీవిత సత్యం!! అదే పనిగా కూస్తూ, కాస్తో కూస్తో విసుగుపాటు కలిగించినా... ఆ కోయిల స్వరంలో కూడా మేలుకొలుపుల గాఢత ఎక్కువే మరి! అంతెందుకూ? ఇంటి వెనక బాదం చెట్టు బాధగా ఆకులను రాల్చుతుంటే, ఓ పట్టాన అన్నం ముట్టబుద్ధి కాదు. రెండ్రోజులు గడిచాయో లేదో చిగురులు తొడుగుతూ, బోసినవ్వులు రువ్వే పసిపాప మాదిరి కదులుతుంటే... ఇదేనా జీవన తాత్వికత అని అబ్బురపడిపోతాం. బీరపువ్వుల్లోనూ బెండ పాదుల్లోనూ కనిపించని అలౌకిక అనుభూతిని మోడువారిన కొమ్మన చిగురు మెరిసినప్పుడు ఆస్వాదిస్తాం. ఉగాది అంటే ప్రకృతి ఒడిలో ఓ పసిపిల్లాడి మాదిరి పవళించడం. ఆయా రుతువుల స్వాభావికతకు పులకరిస్తూ... అన్ని జీవనస్థితులను సమంగా సమన్వయించుకుంటూ స్థిరంగా నిలబడగలిగేది చెట్టు ఒక్కటే. కాలధర్మానికి శిరసొంచి, శిథిల శిల్పం మాదిరి సజీవ జీవకళను గర్భితమొనర్చి అది జీవన సాఫల్యత పొందుతుంది.
      సుఖాల పొద్దుల్లో పడకేసుకుని కునుకుతీసే వాళ్లకి ఉగాది ఓ పండగ మాత్రమే. ఉద్రేకంగా సాగిపోతూ ఉన్న పళాన చతికిలపడే ఆరాటాలు ఇక్కడ కనిపించవు. చేదును కూడా చిరునవ్వుతో మింగగలిగినప్పుడే... ఉగాది ఉత్పల పర్యంకం మీద విహరించగలుగుతాం. ‘‘ఏటికొక్క ఉగాది వూరెరుచుండె/ ఆరు రుచులను కెలబోసియందజేసి/ ఐదు రుచులతో మాకు స్నేహమ్ములేదు/ చేదు విడదీయరానట్టి చెలియమాకు...’’ అన్న కవి భావన వొట్టిదేనని అనలేం కదా! చేదును సైతం తీపిగా సేవించగలిగినప్పుడేగా బతుకులోని ప్రేమబంధం మరింతగా దృఢపడేది. షడ్రుచుల సమ్మేళనం మనలోని మనస్థితుల సారమనీ.. అనుభవించి పలవరించాలేగాని జీవితం అనుభవైక వేద్యమని ఉగాది ప్రసాదం పదే పదే ప్రబోధిస్తూ ఉంటుంది.
      మనం మాత్రం! ఏ రోజుకారోజు చిగురు తొడుగుతూ ఉండాలి. ఏ మానైనా లోలోపల ఘర్షణల నుంచి వెలుపలకి రావాలనే తపన పడుతూ ఉటుంది. తల్లి కడుపును తన్నుతూ... భూమ్మీద కాలూనేందుకు పురిటికందు పడే తపన ప్రతీ మొలకలోనూ ఉంటుంది మరి! భూమి పొరల చీకట్ల నుంచి ఆ విత్తు వెలుతురు శ్వాసించేది ఎందుకూ? ఎందుకంటే మనమూ ఈ జీవన పరిస్థితుల మీద పోరాడాల్సింది ఎంతో ఉంది గనక. అలిశెట్టి ప్రభాకర్‌ చాలా విలువైన మాటంటారొక¹చోట- ‘‘నువ్వొక విత్తనానివి/ రేపు పూసే చిగురుకి/ సరికొత్త వూపిరివి/ మొలకెత్తకముందే/ అలసిపోయి చచ్చిపోకు...’’ అని. ఇక ఎంతకాలం ఆ మట్టిలోకే ముడుచుకుపోతాం! అచేతనంలోనికి జారిపోయిన చైతన్యానికి విలువుంటుందా? చిగురైనా అంతే! చీల్చుకురావాలి. భూమి పొరలను ఛేదించుకుంటూ రావాలి. చీకటి గుబురులను తొలుచుకుంటూ పోవాలి. ఇదే కదా! బతుకుపోరాటంలో ఎదురీదుతూ పోవడమంటే!
      ఉగాది చేసే ప్రతీ సవ్వడిలోనూ ఉపదేశముంది. పంచాంగ పఠనమైనా, నినదించే ప్రణవ నాదమైనా... వినగలిగే మనసుండాలేగాని కొత్త ఉగాది ఉబలాటపడుతూ చెప్పే వూసులన్నింటికీ వూకొట్టి ఉత్సాహపడగలం. ఈ ఏడాదంతా ఉగాది పండగ కోసమే వేచి ఉందా అని అనుకోగల భావసాంద్రత మన గుండెల్ని పట్టికుదుపుతుంది.
      ఎందుకైనా మంచిది... ఒకసారి అద్దేపల్లి భావతరంగాన్ని ఆలకిద్దాం. ‘‘నవ్వే కళ్ల వెనుక మండే గుండెలా/ ఇవ్వాళ నా కళ్లముందు నిలిచిందొక కొత్త చిగురు/ ఈ కొత్త చిగురు కోసమే/ ప్రకృతి ఏడాదిపాటు తపస్సు చేస్తుంది/ ఈ కొత్త చిగురు కోసమే/ సమాజం తరాలపాటూ తపించిపోతుంది’’ అంటారాయన. అవును, ఈ తపమూ భక్తీ కేవలం మనుషులకేనా... పరమపద వైభోగం వీళ్లకేనా అని ఏ మానవాతీతశక్తీ అనుకోదు. మన పెద్దలు చెబుతూనే ఉంటారు... వృక్షాలు తపోరూపంలో ఉన్న రుషి స్వరూపాలని. వాటిని కొలవాలి. ఆప్యాయంగా తడమాలి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఎదుగుతూ ఇంతింతై పెరుగుతూ కూడా ఒదిగే గుణాన్ని వదలకుండా ఒడుపుగా నిలబడగలిగిందంటే... దానికి ఆలంబన ప్రకృతిమాత ప్రాపకమే కదా!
      అనుభవించాలేగాని, ఉగాదికి సంబంధించి ఎవరి అనుభూతి వారికుంటుంది. వెన్నెలను వడగడుతున్న కొబ్బరాకుల పందిరి కింద వెన్నెల మరకలంటిన దుప్పటి మీద ఏవేవో యుగాల నాటి జ్ఞాపకాలను నెమరేస్తూ వూహాసుందరి మీద కవితలాంటిదేదో రాసి... కవి సమ్మేళనంలో నలుగురి మధ్య, ఆ చప్పట్ల మధ్య గర్వంతో నడిచి వెళ్లిపోయిన ఆ కళాశాల రోజులు మళ్లీ కళ్ల ముందు కదులుతున్నాయంటే- అది ఉగాది ప్రభావం కాక మరేంటి? ‘‘ఆకులో ఆకునై... పూవులో పువ్వునై... నునులేత రెమ్మనై’’ అంటూ సరిగమలేవీ రాకపోయినా... సంస్కారంతో వేదిక మీద పాడినట్టుగా, అలా పాడేసుకుంటూ... కోయిలతోనూ గొంతు కలిపిన బాల్యం పొరలను ఒక్కొక్కటిగా విప్పుకుంటుంటే ఉగాది పచ్చడితోపాటూ జ్ఞాపకాలనూ నంజుకు తిన్నట్టే ఉంటుంది.
      ఎన్ని ఉగాదులు మనముందరే సాగిపోయాయి! రోజులన్నీ ఒక్కమాదిరిగానే ఉంటాయా? ఏదేదో ఒంపుకుందామనే ఆశతో ప్రకృతి నుంచి దూరంగా పారిపోయాం. వెన్నెలలూ... ఉషోదయాలూ... సాయంకాలపు ఏటవాలు నీడలూ... అసలు ఏ కాలంలో ఏ రుతువు ఏ రాగాలను వినిపిస్తుందో కనిపెట్టలేని అజ్ఞాతంలోకి జారిపోతున్నామంటే ఉగాదిని మన వాకిట్లోకి కాదు కదా! మన మదిలోకి కూడా ఎప్పటికీ ఆహ్వానించలేం. ‘‘ఎంత కోయిల పాట వృథాయయ్యెనో కదా- చిక్కు చీకటి వన సీమలందు’’ అంటూ మనం వెలివేసుకున్న వసంతాల్నీ, ఉగాదుల్నీ, ఉషస్సుల్నీ మళ్లీ రమ్మంటే ఎలా వస్తాయి? దారితప్పుతున్న వసంతాన్ని మళ్లీ మన లోగిళ్లలో నిలుపుకోగలిగినప్పుడే ఉగాది ఉల్లాసాలు ఇంటినంతా కమ్ముకుంటాయి.
      ఏదో అలా సందడి చేసి వెళ్లిపోయే పండగలా ఉగాది రాదు మరి! మనసులో వాన కురిసినట్టు... చినుకుల మాదిరి అనుభూతుల తాకిడి ఓ పట్టాన నిలువనీయకుండా చేస్తుందంటే, ఆ ఆత్మీయపు గాఢత వట్టిదే అని ఎవరికీ అనిపించదు. దాశరథిµ చూడండి ఏమంటున్నారో...
కోయిల కో అంటే ప్రాణం లేచివొస్తుంది
తీయదనం-చేదు వేపలోనూ దీపిస్తుంది
కాలాన్ని కదలకుండా ఆపేవారెవ్వరూ?
కాలం బ్రహ్మ స్వరూపమని తెలిసిన వారెందరూ?
అఖండ బ్రహ్మాండ కటాహంలో
అమృతం నింపుతోంది వసంత కన్య
అశేష ప్రజలకు కాలశక్తి
అవగతం చేయగలిగితే ఆమె ధన్య...

      అవును కదా మరి! కాలగమనంలో వచ్చి వాలే ఏ రుతువునీ అట్టే నిలుపుకుని ఆనందించే అరుదైన క్షణాలు మన స్మృతిపథంలో లేవు కదా! పండువెన్నెల్లో పడుచుదనాలను పరుగులెట్టించాలి. హేమంతాలూ... వసంతాలూ... ఆకులు రాలినా... మంచు తెరలు అట్టే ముసిరినా... ఆ ఆనందాల్లో మనసుని నిలువెల్లా తడుపుకుని అలా... అలా... ఆ జీవిత రసయాత్రలను రుతువు వెంబడి రుతువును అనుభవించి తరించినప్పుడే కాలశక్తి అంటే ఉనికిలోకి వచ్చేది!
      ఉగాదిని ఒక పూజాక్రతువుగా, వరాల కోసం దేవులాడే తంతుగా భావిస్తే... ఈ ఆధునికంలో ఇంకా వెనకపడినట్లే. మనం చేసే సందడిలోనూ... అలికిడిలోనూ... పండగంటే ఏదేదో చేసేయ్యాలనే తాపత్రయంలోనూ... ఏదో చెప్పదలచుకుంటున్న ఉగాది సందేశాన్ని మనమట్టే వినిపించుకోం కదా! ఆకులు రాల్చిన అడవికి మళ్లీ చిగురులు తొడిగే శక్తి ఉందనీ, ఏదో అలా మబ్బుల మాదిరిగా వచ్చే కష్టాల ఉక్కబోత ఒక్క గాలివాటుకే చెదిరిపోతుందనీ, దిగులు మాసిన వాకిట్లోకి వెన్నెల జల్లు కురిసే- బతుకుపండే రోజులు ఇక బాధ్యతగా రాబోతున్నాయనీ చెబుతూ పెదాల మీద నవ్వులను చిగురులుగా పూయించగలిగింది ఒక్క ఉగాది మాత్రమే.
ఉగాది సంవత్సరాల పేర్లు కొన్ని వికృతంగా ఉన్నా, జీవితానికొచ్చే లోటేమీ లేదనీ... క్రమశిక్షణ తప్పి ప్రవర్తించినపుడే జీవనం నరకప్రాయమవుతుందని కాళొజీ తన ఉగాది కవితల్లో ఉన్న మాటే చెప్పారు. ‘‘విధి వ్రాతయని/ యేడ్చు విధములను విడనాడి/ తన బాధ్యత నెరంగి/ తన విధిని నెరవేర్చు/ క్రమశిక్షణకు/ బద్ధ కంకణుడగునాడె/ లోకమున శుభము/ చేకూరు’’ అని, ఉగాదిని వ్యక్తిత్వం కలిగిన, నిబద్ధత కలిగిన స్త్రీగా మలచి ఆ పండగకు గౌరవాన్ని కలిగించారు. మనిషిని మహనీయుడిగా మలచాలనే తపనతోనే ఉగాది ఏటికేడాది సరికొత్త సందేశాన్ని అందిస్తుంది. మనిషిని ఆశాజీవిగా నిలబెడుతుంది.
      ఇప్పుడైతే కోయిల గొంతును మొబైల్‌ రింగ్‌టోన్‌గా వింటూ సంబరపడుతున్నాం. కానీ, పెరటి మామిడి చెట్టు మీద వాలి కూసే కోయిలను కిటికీలోంచి చూస్తూ... చదువుదామనుకున్న పుస్తకాన్ని ఎటో విసిరేసి పెరట్లోకొచ్చి ‘కో’ అని అరిచేసరికి అదెటో బెదిరిపోయేది. ఎక్కడ ఏ కోయిల గొంతు విన్నా ‘అదే మా ఇంటి కోయిల!’ అనుకుంటూ... కొమ్మల్లో అస్పష్టంగా వినిపించే కువకువలను అలాగే వెతుకుతూ మామిడి తోపుల వెంట తిరిగిన చిన్నతనాలు ఈ ఉగాదివే అని అప్పుడు తెలియదు. అంతేనా! వేపపూల కొమ్మలను ఒడుపుగా పట్టుకుని అందినంత పువ్వును ఏదోలా కోసేద్దామనే ఆరాటంలో పువ్వంతా నేలపాలయ్యేది. ఆ పూలవానలో మనసు తడిసిన అనుభూతి ఎంత కొత్తదో కదా! ఉగాదిని బాల్యపు లోతుల్లోకి వెళ్లి మరీ చూడాలి. గుత్తులు గుత్తులుగా వేలాడే మామిడి పిందెలూ... వగరెక్కిన చిగురులను తిని పొగరెక్కుతున్నట్టు కూసే కూజితాలూ... పున్నమిలా ఫక్కున నవ్వే నిండాపూసిన వేపచెట్లూ... తడిబారిన గుమ్మాలకు గుప్పుమనే పసుపు గంధాలను మోసుకొస్తూ ఆ మామిడి తోరణాలూ... కలివిడిగా అలికిడిగా ఇళ్లూ లోగిళ్లూ... గుడిలోంచి లీలగా వినిపించే పంచాంగ శ్రవణమూ... ఇలా ఏ గడప ముందు నిలబడినా, ఉగాది తచ్చాడిన ఆనవాళ్లే కనిపిస్తాయి.
      ప్రతి ఉగాదీ మనకు విలువల రెక్కలను కడుతూనే ఉంటుంది. ఉగాదుల వల్ల మనలో సంతోషాల మాగాణులు నిండాలి. దోసిళ్లన్నీ రంగురంగుల పూలతో నిండాలి. పరుగెడుతున్న కాలవేగాన్ని అందుకోలేక రెక్కలు కోల్పోయిన పిచ్చుకలూ... అద్దాల మేడల ముందు సమాధైన మండువా లోగిళ్లూ... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అలనాటి ఉగాది సంచికలూ... ఆ జ్ఞాపకాలూ... ఉగాది పండగ పొడసోకితేచాలు నిలువెల్లా పులకరించిపోతాయి.
      కార్పొరేట్‌ యుగంలో ఉగాది కొత్తరూపు పొందితే పొందొచ్చు. అయిదు నక్షత్రాల హోటళ్లలో ఉగాది పచ్చడి మీద కోట్ల వ్యాపారం జరిగినా జరగొచ్చు. ఇక ఏడాది పొడవునా వేపపూలను పూయించే వంగడాలు ఎప్పటికైనా రావొచ్చు. కానీ, ఉగాది వేకువను ఒక్క కూతతో మేల్కొలుపుతూ... నిదురించే తోటలోకి మధుమాసాన్ని అవతరింపజేసే శక్తి బహుశా ఏ సాంకేతికతకూ అందదు. నూరేళ్లూ బతకడానికి ఏ అమృతం తాగనక్కర్లేదు. మంచిగా బతికేందుకు ఆయుష్షు పోయమని ఏ దేవున్నీ కోరనక్కర్లేదు. ప్రకృతి ముందు దోసిలి పట్టి నిలబడితే చాలు... చేదుతో పాటూ సకలజీవన మర్మాలూ గొంతులోకి జారిపోతాయి. మనసులోకి చేరిపోతాయి. ప్రతీ పండగకీ ఎంతో కొంత చేస్తూనే ఉన్నాం. బాధ్యత నెరిగి మనకంటూ సరైన జీవనాన్ని అందించాలని వస్తున్న ఉగాది మనకేం చేస్తుందో తెలియాలంటే... దాన్ని మనలోకి, మనసు అరల్లోకి, లోలోపలికి ఆత్మీయంగా పిలవాల్సిందే!


వెనక్కి ...

మీ అభిప్రాయం