అక్ష‌ర‌నాదం

  • 42 Views
  • 2Likes
  • Like
  • Article Share

    నెమ్మాని సీతారామమూర్తి

  • ఒంగోలు
  • 8008574071
నెమ్మాని సీతారామమూర్తి

మాతృభాష రుణం తీర్చుకోవాలనుకున్న తపన తొంభై ఏళ్ల వయోవృద్ధురాలిని కార్యకారిగా మార్చింది. విద్యాధికురాలు కాకపోయినా, చదివింది ఐదో తరగతైనా అమ్మభాషపై ప్రేమతో ఆమె అక్షరనాదం చేసింది. ఆ నాదం నేడు ‘శ్రీకృష్ణుని చద్దులు’ రూపంలో తెలుగు అభిమానులను అలరిస్తోంది. తెలుగుభాష అంతరించిపోతుందన్న మాటతో కలత చెందిన ఆమె అమ్మభాష కమ్మదనాన్ని అందరికీ తెలపాలని సంకల్పించింది. అమ్మభాషపై ప్రేమతో అక్షరభేరి మోగించింది. నాటి పద్యాల పదనిసలను నేటి తరానికి అందించాలని తపించిన వృద్ధురాలి పేరు టంగుటూరి అనసూయమ్మ. ఈమె ప్రస్తుతం ఒంగోలులో నివసిస్తున్నారు. బామ్మ స్వగ్రామం ప్రకాశం జిల్లా కందుకూరు. ఎప్పుడో 1930నాటి కాలంలో తన తల్లి చెప్పిన ‘చద్దులు’ ఆమె మదిలో పదిలంగా నిక్షిప్తమయ్యాయి. వాటిని రచించింది ఎవరోకూడా ఆమెకు తెలియదు. అవి తనతోనే అంతరించపోకూడదన్న ఉద్దేశంతో అక్షరాకృతికి శ్రీకారం చుట్టింది. అమ్మ పలుకులనే అక్షరాలుగా మార్చి ‘శ్రీకృష్ణుని చద్దులు’ పద్యాల పుస్తకాన్ని ప్రచురించింది. 
వంశీధరుని బాల్యానికి
సంబంధించినవే ‘శ్రీకృష్ణుని చద్దులు’. రేపల్లెలో గొల్లబాలలతో కలసి చిన్నికృష్ణుడు ప్రతిరోజూ తెల్లవారుతుండగానే గోవులను కాసేందుకు వెళ్లేవాడు. వీళ్లంతా మళ్లీ గోధూళివేళకు ఇంటికి తరలి వచ్చేవాళ్లు. అడవిలో ఆకలేస్తే తినడానికి చద్దన్నం మూట కట్టి యశోదమ్మ గోపాలకృష్ణునికి ఇచ్చి పంపేది. శ్రీకృష్ణ బలరాములు, గోపబాలురందరూ ఇదే రీతిలో చద్దులతో గోవుల వెంట అడవులకు వెళ్లేవారు. అక్కడ వారి భావనలే శ్రీకృష్ణుని చద్దులు. అడవిలో గోపబాలురతో చద్ది స్వీకరించిన తర్వాత కృష్ణుని ఆలాపన, బాలల ఆనందోత్సాహాలు ఇందులో స్పష్టీకరించారు. దీనిలో పద్యాలు అంతర్లీనంగా కృష్ణుని గొప్పతనాన్ని తెలిపేలా, పాడుకునేందుకు వీలుగా ఉండటం మరో విశేషం.
త్రైలోక్య వల్లభుడూ। తనతల్లితో అనెనె ఇట్లూ
గోవూల గాయాపోవలె। చాలా పొద్దాయెనమ్మా।

      త్రిలోకాల సమాహారాన్ని త్రైలోక్యం అంటారు. త్రైలోక్య వల్లభుడు అంటే మూల్లోకాలకు అధిపతి అని అర్థం. సమస్త విశ్వాన్ని తన నోటిలో చూపిన చిన్నికృష్ణుడు తన తల్లి యశోదతో ఇలా అన్నాడట ‘అమ్మా ఆవులను మేపేందుకు అడవికి వెళ్లాలి. చాలా పొద్దుపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది’ అన్నాడట.
ఒప్పేటి । అందంబులనూ । ఒంటాంటిరక్షలు తొడగి ।
నందూడి సుతుడూవెడలీ మందల్లా నడుమానిలచే 

      ఆ రోజుల్లో చిన్నారులకు ఒళ్లంతా సువాసన వెదజల్లేందుకు కస్తూరి పట్టించేవారు. కృష్ణుని శిరోజాలను యశోదమ్మ ముడిగా చుట్టేది దీన్ని వళం అంటారు. అనంతరం నెత్తిన నెమలిపింఛం పెట్టేది.  పిల్లల రక్షణకు వారు బయటకు వెళ్లేప్పుడు మంత్రించిన విభూతి పెట్టేవాళ్లు. లేదా తాయెత్తు కట్టేవారు. అలా నందుని కుమారుడైన గోపీకృష్ణుడు పట్టువస్త్రాలు ధరించి ఆవుల మందల నడుమ గోపబాలలతో తరలి వెళ్లేవాడు.
చిక్కమ్మున చద్దీదించి । చొక్కమ్ము వెండీ
వలెను । అగ్రజాలలు అయినా ముద్దలు అందందివేసువారలకు ।

      గోపబాలురు ఒక కర్రకు చద్దిమూట తగిలించి భుజాన వేసుకునేవారు దీన్నే చిక్కం అంటారు. చొక్కమ్ము వెండీ అంటే స్వచ్ఛమైన వెండి అని అర్థం. పెద్దవారిని అగ్రజాలలు అనేవారు. గోవులను మేపేందుకు అడవులకు తీసుకువెళ్లేవారిలో పెద్దవారు కూడా ఉండేవారు. వీరు చిక్కానికి తగిలించి స్వచ్ఛమైన వెండిలా ఉన్న చద్దిని దించి అక్కడక్కడ తినేవారట.
పచ్చాయపోకలతోనూ, 
పండూతెలనాకులతోనూ।
పచ్చాకర్పూరపు వీడెము, 
పరమాత్ముడారాగించె।

      పచ్చి లేక ఎండిన వక్కలని పోకలని పిలిచేవారు. పసుపు పచ్చని రంగులో ఉండే లేలేత తమలపాకులను తెలనాకులు అని పిలిచేవారు. తెల్లని ఆకులే తెలనాకులు. లేలేత తమలపాకుల్లో వక్కలు తదితరాలను వేసుకుని ఆ సర్వాంతర్యామి తాంబూలాన్ని ఆరగించేవాడట.
కల్పావృక్షమ్ముల । ఘనచందువ । మళ్లీచూచెను ।
కమలనాభుడు, వేణువు పట్టెను, కాంతల్ల చిత్తామలర ।

      కోరిన కోరికలు తీర్చే వృక్షాన్ని కల్పతరువు లేదా కల్పవృక్షం అంటారు. నాభియందు కమలం ఉన్న విష్ణుమూర్తిని కమలనాభుడు అంటారు. కల్పతరువులాంటి వృక్షసమూహంలో కమలనాభుడైన మురళీకృష్ణుడు వేణుగానం చేసేవాడట. ఆ వంశీకృష్ణుని వేణుగానానికి గోపికలు మైమరిచేవారట.
గోపికాలూకూసెటిమోతా, గోవుల్లకుచ్చులమోతా
గోపికాలు తరిచెటిమోతా, గొంతుల్లుపాడెటి మోతా ।
చిలకల్లు పలికెటిమోతా । సత్తూసుడికొమ్ముల మోతా ।
నెమళ్ళు కూసెటి వినుత । లేగట్ల అరిచెటిమోతా । 

      కృష్ణుడు పాడుతుంటే గోపబాలురు వంత పాడేవారు. దీన్నే కూసేటి మోతా అంటారు. కృష్ణుని వేణుగానానికి పులకించిన గోవులు, గోపాలురు, గోపికలేకాక నెమళ్లు, చిలుకలు, లేగదూడలు సైతం వంత పాడేవట.
అనుచుండిన దేవగణంబులు, 
గగనామార్గంబుల నుండి ।
పుష్పంబులు వృష్టే గురిసేను 
పుండరీకాక్షునిపైనా ।

      అచ్యుతుని లీలను చూసిన సమస్త దేవతలు ఆకాశం నుంచి పుండరీకాక్షుని ప్రతిరూపమైన కృష్ణభగవానుడిపై పుష్పవర్షం కురిపించారట.
      ఈ పుస్తకంలో సాహిత్య విలువలతో పాటు, ఆరోగ్య విశేషాలు కూడా ప్రస్తావించారు. యశోద తన బిడ్డకు చద్ది పెట్టి పంపే విధానం అమ్మ అనురాగాన్ని ప్రతిబింబించేలా ఉంటే, చద్దిలోని పదార్థాలు ఆరోగ్య పరిరక్షణకు చేసే మేలు విశదీకరించారు. ఎండలో తిరిగేవారికి చల్ల(మజ్జిగ), దధి(పెరుగు), శొంఠి, ఉసిరికాయ, ఊరిన నిమ్మపండు, ఉచ్చింతకాయ (ఉప్పు చింతకాయ), మిరియపు పలుకులు, ఊరిన అల్లం మొదలైనవి ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తాయని వివరించారు. ఈ పుస్తకం వెలుగు చూసేందుకు ఈమెకు ఇతోధికంగా సహాయపడింది ఈమె మనుమడు ఈదుమూడి లక్ష్మీనారాయణ. ఈయన కడప ఇ.పి.ఎఫ్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అమ్మమ్మ కోరిక తీర్చేందుకు, అమ్మభాష సేవ చేసేందుకు ముందుకు వచ్చారు.
      పదేళ్లప్పుడు 1933లో కావలి రైల్వేస్టేషన్‌లో గాంధీజీని చూడటం తనకు మధురానుభూతి మిగిల్చిందంటారు ఆవిడ. గాంధీజీ 1938లో తన హరిజన పత్రికలో బాల బాలికలకు నిజమైన భావప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లనే వస్తుందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అక్షరసత్యమని అనసూయమ్మ నిరూపించారు. ‘శ్రీకృష్ణుని చద్దులు’ పుస్తకాన్ని వెయ్యి ప్రతులు ముద్రించి తోటి మహిళలకు, కొంతమంది భజన బృందాలవారికి ఆమె ఉచితంగా అందించారు. కొంతమంది ఔత్సాహికులు వీటిని కంఠస్థం చేసి ఆలపిస్తూ మరింతమందికి తెలియజేస్తున్నారు. నాటి తరానికి నేటి తరానికి మధ్య వారధిలా నిలిచి అనసూయమ్మ తన సంకల్పాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకున్నారు. అమ్మభాష సేవకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం