ఇలా తయారవ్వండి

  • 313 Views
  • 9Likes
  • Like
  • Article Share

    హర్ష

  • హైదరాబాదు.

5, 5, 9, 12, 36, 55... ఇవి గత కొన్నేళ్లలో అఖిల భారత సర్వీసుల తుది ఎంపికలో తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా కలిగినవాళ్ల ర్యాంకులు. వీటిలో తెలుగు సాహిత్యమే కాదు, పరీక్షలన్నీ తెలుగు మాధ్యమంలో రాసినవాళ్లూ ఉన్నారు.  సివిల్స్‌ ప్రధాన పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా రాసేవాళ్లు పరీక్ష దృష్ట్యా ఎలా అధ్యయనం చేయాలో,  కాలాన్ని అధ్యయనానికి ఎలా వాడుకోవచ్చో చూద్దాం. 
      తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాళ్లు సివిల్‌ సర్వీసుల్లో ప్రవేశించి, పౌరసేవ చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి... ప్రధాన పరీక్షకు ఐచ్ఛికంగా ఎంచుకునేది తెలుగు సాహిత్యాన్నే. అమ్మభాషపై పట్టుంటే కొన్ని రోజుల అధ్యయనంతోనే గరిష్ఠ మార్కులను తెచ్చిపెట్టే సాధనం ఇది. మెయిన్స్‌ పరీక్షా విధానం మార్చకముందు కొంచెం కష్టపడి, తెలివిగా చదివినవాళ్లకు 600లకు 350- 400 మార్కుల దాకా వచ్చేవి. 
      జనరల్‌ స్టడీస్‌లో మార్కులు ఇతర అభ్యర్థులతో సమానంగా వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు మౌఖిక పరీక్షకు వెళ్లడానికి మార్గం సుగమం చేయడంలోనూ... అన్ని గీటురాళ్లకు ఎదురునిలిచి అంతిమ విజేతగా అవతరించడంలోనూ... ఐచ్ఛికాంశాల్లో వచ్చే మార్కులదే కీలకపాత్ర. 
      ఇప్పుడు పరీక్ష 500 మార్కులకు నిర్వహిస్తున్నారు. మెయిన్సులో గరిష్ఠంగా మార్కులు పొందడానికి సిలబస్‌ను రోజూ రెండు పేపర్లకు కాలాన్ని విభజించుకుని అధ్యయనం చేయాలి. అందుబాటులో ఉన్న సమయంలోనే చదవడంతో పాటు ముఖ్యాంశాలు రాసుకోవాలి.
మార్కుల యంత్రం మొదటి పేపర్‌
ఇందులో భాషా సాహిత్య చరిత్రలు ఉంటాయి. వీటి అధ్యయనానికి రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు కేటాయించాలి. మారిన విధానంలో ప్రశ్నల సంఖ్య తగ్గలేదు. కానీ, ఒక ప్రశ్నను రెండు ఉపప్రశ్నలుగా అడుగుతున్నారు. అంటే రాయాల్సిన జవాబుల సంఖ్య పెరిగింది. గతంలో ఒకటి రెండు అంశాలు వదిలేసి చదువుకున్నా ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడలా కాదు. అన్నీ చదవాల్సిందే. ఆంధ్రము, తెనుగు, తెలుగు అంశాన్నే తీసుకుంటే చదివేందుకు రెండు గంటలు పడుతుంది. చదువుతున్నప్పుడే జాతివాచకంగా, దేశవాచకంగా, భాషావాచకంగా ఆంధ్ర పదప్రయోగం, దక్షిణ దిగ్వాచిగా ప్రయోగించిన తెనుగు న- ల (మునగ/ ములగ, లేదు/ నేదు)ల వినిమయంతో తెలుగు, తెనుగు అనే రెండు రూపాలుగా వాడుకలో ఉన్న విషయాన్ని క్లుప్తంగా రాసుకోవాలి. మిగిలిన అంశాలన్నీ ఒకటి రెండు గంటల్లో చదువుకొని, స్పష్టత తెచ్చుకోదగ్గవే. కొన్నిసార్లు  ప్రశ్నలు సిలబస్‌లో లేనివేమో అనిపించినా, అవి మన గమనింపులోనివే అయి ఉంటాయి. 2009లో భారతదేశ భాషల గురించి ప్రశ్న అడిగారు. సిలబస్‌లో ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అని ఉంటుంది. మనం చదివేప్పుడు అసలు భాష అంటే ఏంటి? ప్రపంచంలో భాషలెన్ని? ఎలా ఏర్పడ్డాయి? భాషా కుటుంబాలెన్ని? ప్రత్యేకించి మనదేశంలో వ్యవహారంలో ఉన్న- హింద్వార్య, ద్రావిడ, టిబెటోబర్మన్, ఆస్ట్రో ఏషియాటిక్‌ కుటుంబాల గురించి తెలుసుకోవాలి. సిలబస్‌కు సంబంధించినవి కొంత ఎక్కువ తెలుసుకుంటే జవాబులు ప్రభావవంతంగా రాయొచ్చు. మాండలికాలు, అనువాదం, వాక్యం, అర్థవిపరిణామం, ధ్వని విపరిణామం, తెలుగు మీద ఇతర భాషల ప్రభావం... ఇలా ప్రతీ పాఠాన్ని రెండు మూడు గంటల్లో చదివేలా ప్రణాళిక రాసుకోవాలి. గరిష్ఠంగా అయిదు గంటలు కేటాయించుకోవాలి. ఇలా చేస్తే ఓ పదిహేను రోజుల్లోనే ఒకభాగం అయిపోతుంది.


ఒకటో పేపర్‌ రెండోభాగం+ పాఠ్యపుస్తకాలు
మొదటి పేపర్‌ రెండో విభాగంలో ప్రశ్నలు ప్రాఙ్నన్నయ యుగం మొదలుకొని, నన్నయ, తిక్కన మొదలు వివిధ కవుల రచనా రీతుల మీద అడుగుతారు. అందుకని ప్రతీ కవి గురించి చదువుకోవాలి. దీనిని చదువుతూనే రెండో పేపర్లో ఉన్న ఆయా కవుల పాఠ్యాంశాలనూ అధ్యయనం చేయాలి. నన్నయతోపాటే ‘దుష్యంత చరిత్ర’ను చదవాలి. వీటిని చదివేప్పుడు మొదలు పాఠ్యాంశంలోని పద్యాలు, తాత్పర్యాలు, విశేషాంశాలు క్షుణ్నంగా చదవాలి. వేటినీ వదలకూడదు. ఆ తర్వాత పాత ప్రశ్నపత్రాలను తీసుకొని ఏ పద్యాలు వ్యాఖ్యానాలకు ఇస్తున్నారో, ఏ కోణంలో అడుగుతున్నారో గమనించాలి. మొత్తానికి ప్రతీ పాఠంలోనూ ఓ పదిహేను- ఇరవై పద్యాల్ని కళాసౌందర్య, సామాజిక చారిత్రక, పాత్రల మనస్తత్వం, కవి మనస్తత్వం, ఆలంకారిక దృక్పథాల్లో ఎలా వ్యాఖ్యానించవచ్చో తెలుసుకోవాలి. పాఠం మొత్తం చదివి ఉంటాం కనుక ప్రశ్నల్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది.
      శ్రీనాథుడి గురించి చదివేప్పుడు- ఆయన కాలం, రెడ్డి రాజుల కాలపు విశేషాలు- శృంగార నైషధం, హరవిలాసం, భీమఖండం, కాశీఖండం కృతుల సమీక్ష- నైషధం ఆంధ్రీకరణ విధానం- శ్రీనాథుడి రచనాశైలి లాంటి అంశాలపై దృష్టిపెట్టాలి. దీనితోపాటే ‘గుణనిధి కథ’ను చదువుకుంటే శ్రీనాథుడిమీద స్పష్టమైన అవగాహన వస్తుంది. గుణనిధి కథ చదివి అర్థం చేసుకునేందుకు రెండు గంటలకు మించి పట్టదు. మొదట అన్ని పద్యాలూ చదవాలి. తర్వాత సీసపద్యాలు, ముఖ్యమైన ఇతర పద్యాలు- ఓ నాలుగైదు ఉంటాయి- చదివితే సరి. ప్రబంధయుగం గురించి చదివేప్పుడు ‘కళాపూర్ణోదయం’, శతకాల గురించి చదువుతూ ‘ఆంధ్రనాయక శతకం’ ఇలా సాగాలి అధ్యయనం.
గత ఏడాది చేమకూర వేంకటకవి ప్రతిపద్య రచనా చమత్కారం పశ్న ఇచ్చారు. దీనికి జవాబును ‘ప్రతిపద్యమునందు చమత్కృతి గలుగం జెప్పనేర్తువు... క్షితిలో నీ మార్గమెవరికిన్‌ రాదు సుమీ’ అని రఘునాథుడు చేమకూరను ప్రశంసించిన పద్యాన్ని ఎత్తుగడగా తీసుకొని ప్రారంభించాలి. తర్వాత చేమకూర పరిచయాన్ని రాసి, కొన్ని ముఖ్యమైన పద్యాల్లో ఆయన యమకాలంకారాన్ని (అమ్మకచెల్ల నా హృదయమమ్మక చెల్లదు; నెన్నుదురు నెన్నుదురు; బల్కుదురు బల్కుదురు లాంటివి), శ్లేషల్ని ప్రయోగించిన తీరును వివరించి ముగించాలి. వీటితోపాటు పదకవులు, కవయిత్రులు, శైవ, భక్తి, జాతీయోద్యమ కవిత్వం, భావ, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళితవాద కవిత్వాలు, జానపద సాహిత్యం- తోలుబొమ్మలు, తప్పెటగుళ్లు, బుర్రకథ, కోలాటం, ఒగ్గుకథ లాంటి జానపద కళలను గురించి అధ్యయనం చేయాలి.
      ఇలాగే గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, జాషువా మొదలైనవారిని గురించి చదువుతూ రెండోభాగంలో ఉన్న పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అలా చదివినప్పుడే మొదటి పేపర్లో అడిగే ప్రశ్నలకూ, రెండో పేపర్లో అడిగే వ్యాఖ్యానాలు, ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతాం. సమాధానాలు రాసేప్పుడు ఒక్కో ప్రశ్నకు- ఉపప్రశ్నల్ని కలుపుకొని అయిదు, ఆరు పేజీలకు మించకుండా చూసుకోవాలి. రాత చదివేందుకు అనువుగా ఉండాలి. అప్పుడే అనుకున్నన్ని మార్కులు తెచ్చుకోగలం. అధ్యయనంలో తెలుగు విశ్వవిద్యాలయం ‘తెలుగు భాషాచరిత్ర’, వెలమల సిమ్మన్న ‘తెలుగు భాషాచరిత్ర’, జి.నాగయ్య ‘తెలుగు సాహిత్య సమీక్ష’, ద్వానా శాస్త్రి ‘తెలుగు సాహిత్య చరిత్ర’, ముదిగంటి సుజాతారెడ్డి ‘ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర’, తెలుగులో కవిత్వోద్యమాలు (ఇవి రెండూ తెలుగు అకాడమీ ప్రచురణలు) లాంటి పుస్తకాలు బాగా ఉపకరిస్తాయి. పరీక్షకు సమయం 45- 50 రోజులే కనుక ఇప్పటికే బాగా చదివిన పుస్తకాన్నే క్షుణ్నంగా చదువుకోవాలి. దానిలో లేని అంశాల్ని చదివేందుకు మాత్రమే ఇతర పుస్తకాలను సంప్రదించాలి. మరో ముఖ్యమైన విషయం... ప్రతీ అంశాన్ని సమగ్రంగా వీలైనంత వేగంగా చదవాలి. వీటిని ముఖ్యాంశాలు/ ఫ్లోఛార్టులు/ మైండ్‌మ్యాప్‌ల రూపంలో నోట్సు రాసుకుంటే మరిచిపోకుండా ఉంటాం. పైగా పునశ్చరణ సులభం.


వెనక్కి ...

మీ అభిప్రాయం