వర్తమానానికి ప్రతీక... కాళోజీ

  • 29 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నాగిళ్ల రామశాస్త్రి

  • కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు,
  • హన్మకొండ. (45 ఏళ్లుగా కాళోజీ సహచరులు)
  • 9704112830
నాగిళ్ల రామశాస్త్రి

అధికార దాహాన్నీ, రాజ్య కాంక్షనీ తన చేతికర్రతో అదిలిస్తూ, ప్రజల గొడవలన్నీ ‘నా గొడవ’లని చేతి సంచిలో వేసుకుని అన్యాయాన్నెదిరిస్తూ... ప్రతి ఒక్కరి గుండెల్లో స్వేచ్ఛా పతాకాన్ని ఎగరెయ్యాలని పరితపించిన ప్రజాకవి.., కాళోజీ. తన జీవన గీతం అనంత చరణాలతో నిరంతరం బడుగుల బతుకులను అభిషేకిస్తూనే ఉన్న వైతాళికుడు... కాళోజీ.
కాళోజీ అనే మూడక్షరాలు తెలుగు సాహిత్య లోకాన్నే కాదు, తెలుగు సమాజాన్నే అరవై ఏళ్లపాటు ప్రభావితం చేసినయి.. ఆయన అతి సామాన్య, నిరాడంబర జీవితం గడిపిండు. ఆయన సామాన్యుల్లో అసామాన్యుడు, అసామాన్యుల్లో మాన్యుడు. తనకో గుర్తింపు కావాలని ఏనాడూ కోరుకోనివాడు. అధికార రాజకీయాల్లో ఉంటే ఎన్నో పదవులు పొందేటోడేమో! అయితే, అది ఊహాజనితమైన విషయం. కాళోజీ ని దగ్గరి నుంచి చూసిన వారు, ఆయన తత్వం తెలిసిన వారు ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతరు. అధికారం వైపు కన్నెత్తి చూసే లక్షణం ఆయనకు లేదు. అధికారం అంటే ఒత్తిళ్లు, అధికార దర్పం, ఆ అధికారం ఇతరుల మీద ఉపయోగించడం వంటివి ఉంటవి. వాటికి పూర్తిగా విరుద్ధం కాళోజీ . అధికారంతో బాధలు పడేవాండ్ల వైపునే ఉండాలనుకునేకాళోజీ  అధికారాన్ని అంగీకరించడమనేది పూర్తిగా అసంబద్ధమైంది. కాళోజీ  ఒక ప్రవక్త, ఒక బైరాగి, ఒక సూఫీవేదాంతి, ఒక సానే గురూజీ, ఒక కబీరు, ఒక సూరదాస్, ఒక వేమన. వారిలా జనసంచారం చేస్తూ తనకు ఎదురైన ప్రజాజీవనం కష్టనష్టాలూ వాండ్ల ఈతి బాధలకూ తనదైన వ్యాఖ్యానాలు చేసుకుంటూ పోవడమే. అంతేకాదు ఆ మహనీయులకు లేని లక్షణం కాళోజీ కి ఒకటుంది. అదే ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగడం.
మనిషి కోసమే తపన
కాళోజీకి మనిషన్నా, బతుకన్నా చాలా ఇష్టం. మనిషి మనిషిలా జీవిస్తే, ఇంకో మనిషిని మనిషిలా గౌరవిస్తే ప్రపంచం బాగుపడ్తదన్న ఆలోచన ఉన్నవాడు. ఆయన తపనంతా మనిషికోసమే. శాస్త్రం, న్యాయం, ధర్మం ఇవన్ని తప్పుతయి, కాని బతుకు తప్పదు, బతక్క తప్పదు అని చెబుతూ అల్బర్ట్‌ష్విట్జర్‌ ‘రెవరెన్స్‌ టు లైఫ్‌’ సిద్ధాంతానికి ప్రతిబింబంలా నిలిచిండు. అందుకే ‘బతుకును పూజిస్తూ బతికి మానవ సేవయే మాధవ సేవగా ఎంచి ప్రపంచానికి బతుకు బాట చూపిస్తూ అమరత్వం సాధించిన మానవుడు’ అని ష్విట్జర్‌ గురించి రాసిండు. అదే తీరున జీవించిండు. 
      కాళోజీ మీద.. ‘హత్యానేరం పైబడేటపుడు సైతం బొంకెరుగడు మానాయన’ అన్న వాండ్ల తండ్రి ప్రభావం, చిన్నప్పటి నుంచే భాగవత ప్రహ్లాద చరిత్ర, వీరసావర్కార్‌ చరిత్ర పూసగుచ్చినట్లు చెప్పే తల్లి ప్రభావం, తిలక్‌ అనుయాయి అయిన మేనమామ పండిత్‌ నరదేవశాస్త్రి ప్రభావమూ బాగాపడింది. ఇందరి ప్రభావం పడ్డా, ఆయన తన మార్గాన్ని తానే నిర్దేశించుకుని ‘‘ఇచ్చయే నా ఈశ్వరుడని కచ్చితంగా నమ్ముతాను, ఇచ్చ వచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను. జరిగిందానికి వగవను, జరిగే దానిని తలవను, జరగనున్నదిదియని ఊహాగానాలు సేయను. వర్తమానంలోనే బతుకుతాను’’ అన్నాడు కాళోజీ. ప్రస్తుతమెరుగని వ్యక్తులు వ్యర్థులంటడు కాళోజీ. మనిషిలోని మంచీ చెడులు రెండింటినీ ఆయన విశదపరిచాడు. ‘‘మనిషి ఎంత చెడ్డవాడు, బతికున్నవాని మంచిని గ్రహించలేడు. కెలికి చెడునే వెతుకుతాడు. మనిషి ఎంత మంచివాడు, చనిపోయిన వాని చెడును మరుస్తాడు. కానీ మంచినే తలుస్తాడు’’ అని మనిషి లక్షణాన్ని పేర్కొన్నడు.
బతుకంతా ప్రజల పక్షానే
తన 90 ఏండ్ల జీవితంలో కాళోజీ 75-80 ఏండ్లు ప్రజాజీవితంలో ప్రజల పక్షాన నిలిచి, దాశరథి చెప్పుకున్నట్లు ప్రజావాణికి మైక్‌ అయి జీవించిండు. ప్రజల గొడవే ఆయన గొడవ. ఆయన ఈ ప్రపంచం నుంచి ఏమీ మూటగట్టుకొని పోలేదు. ‘అతిథి వోలె ఉండి అవని విడిచి వెళ్ళుతాను’ అని చెప్పుకున్నట్లే వెళ్లిపోయినాడు. ‘‘సుఖాలు చూచినాను, కష్టాలు చూచినాను, పాలరాతి మేడలలో పాయసాలు మెక్కినాను, కూటి పేద తన కబళము నోటికీయకుడిచినాను. ఎత్తులెన్నో ఎక్కినాను, లోయలెన్నో దూకినాను, నే పాకని ఎత్తు లేదు, నే జారని లోతు లేదు’’ అని చెప్పుకుంటూనే ‘‘సంతసముగ జీవింపగ సతతము యత్నింతుగాని, ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపబోను’’ అన్నడు. సామాన్య ప్రజలు కటకటలాడుతుంటే అధికారంలో ఉన్నవాడికి సౌఖ్యాలుండటం పట్ల విసుగు ప్రదర్శించిండు. ‘ఏడుగురికి అడగకుండానే 24 గంటలు నీళ్లు, ఏడువందల మందికి ఏడిస్తేనే నీళ్లు’ అని ఆయన ఎమ్మెల్సీగా ఉండగా అన్నడు.
ప్రజలను మేల్కొలిపేది కైతలే
‘‘10 వ్యాసాలు చేయలేని పని ఒక ఉపన్యాసం చేస్తది. 10 ఉపన్యాసాలు చేయలేని పని ఒక కథ చేస్తది, 10 కథలు చేయలేని పని ఒక గేయం చేస్తది, 10 గేయాలు చేయలేని పని ఒక పాట చేస్తది, పాటకు అంత శక్తి ఉన్నది. ఇటీవల జరిగిన ఉద్యమంలో పాటల ప్రభావం మనకు తెల్సిందే గద. ఉపన్యాసాల కన్న గేయాన్ని అందుకే ఎన్నుకున్నాను నేను. నా ఉపన్యాసాలల్ల కూడా నా గేయాలలోని పంక్తులు ఉదహరించేవాడిని’’ అన్నడు. కాళోజీకి జ్ఞాపకశక్తి ఎక్కువ. గతంలో ఎవరితో ఏం మాట్లాడిండో? ఏమన్నడో? అవన్నీ యాదిచేసుకుని చెప్పేటోడు. ప్రపంచ సాహిత్యంలోని ఎన్నో విషయాలు కొత్తకొత్తగా చెప్పేటోడు. రోమారోలాండ్‌ ఆయనకిష్టమైన రచయిత. ఆయన రచయితలను ప్రజాపక్షం ఉండాలే అంటూ ఒక వాక్యం చెప్తుండేవాడు.
      ఆయన కవిత్వమంతా తను జీవిస్తున్న సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలకు ఎప్పటికప్పుడు స్పందించి వేమనవలె చేసిన అభిప్రాయ ప్రకటనలే. ‘‘నేను కవిని కావాల్నని కవిత్వం రాయలేదు. ఆనందమో, విషాదమో కలిగినప్పుడు నాకు తోచిన మాటలు రాసిన. అది విన్నవాండ్లకు నచ్చింది. అందులో కవిత్వము ఉన్నదని నేననలేదు. ఉన్నదని మీరంటే సంతోషమే. లేకున్న ఫరక్‌ పడేదేంలేదు’’ అనెటోడు. మనిషిని కేంద్రంగా చేసుకుని, బతుకును ఆధారం చేసుకుని రాసినదే ఆయన కవిత్వమంతా. మనిషిని మనిషి మాదిరిగా చూడాలన్నది ఆయన తత్వం. ‘‘ఎవరైనా పౌరుడైన వాడు పౌరధర్మం నిర్వర్తించాలె. పోరని వలె వ్యవహరించవద్దు.. నువ్వు పౌరునివా, పోరనివా’’ అనేదే ఆయన ప్రశ్న. అట్లనే అంగడి బతుకు కావాల్న, సంగడి బతుకా? నిర్ణయించుకోవాలే. మార్కెట్‌ లైఫ్‌ వద్దంటూ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ, రాజ్యాంగానికీ ఆయనిచ్చే నిర్వచనాలు ఎవ్వరూ కాదనలేనివి. సామాన్యులందరికీ అర్ధమయ్యేటివి.
      ‘స్వాతంత్య్రబన సఖుడా, స్వైర విహారంబు కాదు, స్వైర విహారులకెప్పుడు స్వాతంత్య్రంబచ్చిరాదంటూ ప్రజాస్వామ్యమంటే రాజ్యాంగానికి రక్షయనీ, సౌజన్యాలకు రక్షయనీ, సామరస్యాలకు రక్షయనీ విశ్వసించిండు. రాజ్యం ఎప్పుడూ సామాన్యుని సంక్షేమం కోరాలనే ఆయన చెప్పెటోడు. ‘రైతుల క్షేమం ముఖ్యం. రైతులు పస్తు పంటె రాజ్యం బాగుపడదనీ, రైతు సుఖపడితేనే, రైతు కర్రు కదిలితేనే కావ్యగానాలు, నృత్యాలు, వాణిజ్యాలు, అన్ని నడుస్త’యని అన్నడు. తన కైతలతో ప్రజలను మేల్కొల్పే ప్రయత్నం చేసిండు. ‘కైత చేత మేల్కొల్పకున్న, కాళోజీ కాయం చాలింక’ అన్నడు. కవిత్వం ప్రజలను చైతన్య పరిచేదిగా ఉండాలన్నదే ఆయన అభిప్రాయం.
కాళోజీ జీవన రథ గమనం..
జీవితాంతం ప్రజల పక్షాన సేవకై నిలిచిన కాళోజీ 1914 సెప్టెంబర్‌ 9న ఆనాటి హైదరాబాద్‌ సంస్థానం సరిహద్దు రట్టహళ్లిల జన్మించిండు. మహారాష్ట్రులు అయిన పూర్వీకులు కొన్ని తరాల కింద వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డరు. వరంగల్‌ దగ్గరి మడికొండ వాండ్ల నివాసం. నాయిన రంగారావు గొప్ప పండితుడు. తల్లి రమాబాయి చిన్నప్పటి నుంచే ఆయనకు దేశభక్తిని, జీవనసారాన్ని బోధించింది. ప్రాథ]మిక విద్యాభ్యాసం మడికొండ, హైదరాబాద్‌లలో గడిచి, హైస్కూల్‌ విద్య వరంగల్‌ కాలేజియేట్‌ హైస్కూల్లో, ఇంటర్మీడియట్‌ వరంగల్‌ కాలేజీలో జరిగింది. అప్పుడే టీబీకి గురైన కాళోజీకి ఒక ఊపిరితిత్తి తీసివేయడంతో 70 ఏళ్లు ఒంటూపిరితోనే ఉన్నడు. ‘ఎక్కువ మాట్లాడితే ఆరునెలల్ల చస్తవు’ అని డాక్టర్లు అంటే, ‘మాట్లాడకుంటే 6రోజుల్లోనే చస్త’ అని మాట్లాడుతూనే 70 ఏండ్లు బతికిండు. బతికినంత కాలం ఆత్మగౌరవంతో బతికిండు. అన్యాయాన్ని పీడనను ఎదిరిస్తూ బతికిండు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నడు. 3సార్లు జైలుకు పోయి చివరిసారిగా 1948 సెప్టెంబర్‌ 26న విడుదలయ్యిండు. 1952లో హన్మకొండ పార్లమెంటుకు కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిండు. ఆ తరువాత ఏ పార్టీ తరపునా పోటీచేయలేదు. 1958-60 మధ్యన రెండున్నరేండ్లు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సభ్యునిగా ఉన్నడు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేసి ఓడిపోయిండు. 1977లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మీద పోటీ చేయడానికి అందరూ వెనకాడుతుంటే, ఆయన ధైర్యంగా పోటీ చేసి ఎదుర్కున్నడు. ఓడిపోయిండన్నది వేరే విషయం. ఆనాడు కేంద్రంలో ఉన్న జనతాపార్టీ తమ పార్టీ తరపున పోటీచేయాలని అడిగినా నిరాకరించిండు. తనకు పార్టీ వ్రత్యం కుదరదన్నడు. అందుకే రాజకీయాలు కాదు, ప్రజాకీయాలు కావాలన్నడు. 
      కాళోజీ అన్నగారైన కాళోజీ  రామేశ్వర్‌రావు ‘షాద్‌’ ఉర్దూలో గొప్ప కవిత్వం రాసినాడు. ఆయన వకీలు. తన తల్లి ఏడేండ్ల తన అన్న భుజం మీద ఏడు నెలలప్రాయంలో తనను వేసిందనీ, జీవితమంతా తనను అన్నగారు భుజాల నుంచి దించనేలేదని అంటాడు కాళోజీ. తమ్ముడి భారాన్నే కాదు, కుటుంబ భారాన్ని కూడా చివరి దాకా అన్న రామేశ్వర్‌రావే మోసిండు. అందుకే కాళోజీ  ‘ఎన్నేండ్లు వచ్చినను చిన్నవాడనటంచు అతి గారబముతోడ అన్ని సమకూర్చుచున్‌ ఆటలకు పాటలకు అవకాశమిచ్చిన అన్నయ్యకు’ - ‘తన గొడవ’ను అంకితం చేసిండు.
మానవత్వానికి మరో మజిలీ
వరంగల్‌ దగ్గర్లో గవిచర్ల వాసి వేలూరి మాణిక్యరావు గారి బిడ్డ రుక్మిణమ్మతో కాళోజీ కి 1940లో వివాహం అయ్యింది. కాళోజీకి ఒక్కడే కొడుకు, పేరు రవికుమార్, కోడలు వాణి. రవికుమార్‌కు ఒక్కడే కొడుకు, పేరు సంతోశ్‌కుమార్‌. 40-45 ఏండ్ల వైద్య చరిత్రలో పార్థివ శరీరాన్ని దానం చేసిన మొదటి వ్యక్తి కాళోజీ  రామేశ్వర్‌రావు. కాళోజీ  తన అన్న ప్రేరణతో తన పార్థివ శరీరాన్ని వరంగల్‌ కాకతీయ వైద్యకశాశాల విద్యార్థుల ఉపయోగార్థం దానం చేసిండు. కాళోజీ  రామేశ్వర్‌రావు గారి కూతురు సక్కుబాయి కూడా తన పార్థివ దేహాన్ని దానం చేసింది. దేహాన్ని దానం చేసిన మొదటి మహిళ సక్కుబాయి కావడం విశేషం.
      కాళోజీ  ఇల్లు వివిధ సిద్ధాంత వాదులైన- విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, యంటీఖాన్, కన్నభిరాన్, బాలగోపాల్‌ మొదలైనవాండ్లకు ఒక కూడలి. ఇందులో సిద్ధాంతాలు, కులాలు, మతాలు లేవు. ఏ కవి అయినా, కోస్తా అయినా మరో ప్రాంతం వాడైనా, కాళోజీ  అతిథ్యం స్వీకరించకుండా వెళ్లిన వాళ్లు అరుదు.
      స్వాతంత్య్ర భారతంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ కాళోజీ  జైలుకు పోయిండు. తనకు నచ్చినట్లు బతికిండు. ఎమర్జెన్సీని ప్రశ్నిస్తూ కవితలు రాసిన ఏకైక వ్యక్తి కాళోజీ యే. విశాలాంధ్ర కావాలని తొలుత కోరుకున్నా, తర్వాత తెలంగాణ సంస్కృతి, భాష, యాస వేశాకోశానికి గురైతే బాధపడి ప్రత్యేక తెలంగాణను సమర్థించి పోరాడిండు. కొన్ని జిల్లాల, కొన్ని వర్గాల పెత్తనాన్ని నిరసించిండు. మనిషికి మనిషి తనానికి పట్టం కట్టిండు. 2002 అక్టోబర్‌ 15న దసరానాడు తుంటి ఎముకవిరిగి హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరి 2002 నవంబర్‌ 13న ఉదయం 6గంటలకు కన్నుమూసిండు. కాళోజీ  ఒక మానవతావాది, ఒక వైతాళికుడు, ఒక ఓదార్పు, ఒక భరోసా, స్వచ్ఛమైన మనిషి.
      పురాణ కథలను, ఆధునిక యుగానికి అన్వయించడంలో కాళోజీ కి సాటి కాళోజీ యే. ఎమర్జెన్సీ కాలంలో భాగవతంలోని ప్రహ్లాద చరిత్రను చెబుతూ ఒక గాంధేయవాదిగా దేశమంతా తిరిగి జనాన్ని చైతన్యపరిచిండు. హిరణ్యకశిపుడు మొట్టమొదటి ఫాసిస్టు, ప్రహ్లాదుడు మొట్టమొదటి సత్యాగ్రహి, సత్యగ్రహం ఫెÆయిలైనచోట ప్రతిహింస తప్పదు. మొదటి ప్రతిహింస నృసింహస్వామి చేసిందే అని సామాన్యులకు బోధపరచే పద్ధతి సహేతుకంగా ఉండేది. హింస తప్పు, రాజ్యహింస మరీతప్పు, కాని ప్రతిహింస తప్పుకాదనేది ఆయన అభిప్రాయం. ‘పిరికిపంద బతుకుకన్న హింస వెయ్యి రెట్లు మిన్న’ అన్న గాంధీ వ్యాఖ్యను తరుచూ చెబుతుండేవాడు.
      నిత్యసత్యాలనదగ్గ వాక్యాలు ఆయన కవిత్వంలో కోకొల్లలు. అవి సర్వకాలభాష్యాలు.. ‘సాగిపోవుటే బ్రతుకు ఆగిపోవుటె చావు’, ‘అసామ్య సంఘంలో ఆర్జనయే దౌర్జన్యం’, ‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’, ‘హెచ్చుతగ్గులున్న చోట చచ్చిపోవు సమభావము, సమభావము లేనిచోట సామ్యవాదముత్తమాట’.. ఇట్ల ఎన్నో..!
యాసకి బాసటగా...
తెలంగాణ భాషన్నా, యాసన్నా ఆయనకు ఎంతో ఇష్టం. ఎవని వాడుక భాషలో వాడు రాయాలనేది ఆయన సిద్ధాంతం. ఒకరి యాస, బాసలను మరొకరు ఎగతాళి చేయడం వల్లనే సామరస్యం చెడిపోతున్నదనేవాడు. ‘బడిపలుకుల భాషకాదు, పలుకుబడుల భాష కావాల’నేవాడు. ఎగతాళి చేయకుండా ఏ యాస అయినా సహృదయంతో స్వీకరించాలనే వాడు. పండితులతో ‘సరస్వతీ భక్తులారా! మీ కవిత్వం వ్యాకరణం తప్ప మరేమికాదు, మా కవిత్వంలో వ్యాకరణం మాత్రమే లేదు కవిత్వానికి వ్యాకరణ సూత్రాలకంటే వస్తువే ప్రధాన’మని కాళోజీ  అనేటోడు... అలాగే రాసేటోడు. 
      స్నేహనికీ, బతుక్కూ అధిక ప్రాధాన్యతిచ్చిన కాళోజీ  ‘‘ప్రపంచంలో ఎక్కువ సంఘర్షణలకు కారణం స్నేహపూరిత వాతావరణం లేకనే, ఎల్లప్పుడు అవతలివాడిని మన అభిప్రాయంతో ఏకీభవింపచేయాలనేదే మన తపన. అందుకే ఘర్షణ. నీ అభిప్రాయంతో నేనిప్పుడు ఏకీభవించకపోవచ్చు, కాని నీ అభిప్రాయాన్ని ప్రకటించే నీ హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ఇస్తా’’ అన్న వాల్టేర్‌ మాటలను ఎప్పుడూ ఉదాహరించేవాడు. రిక్షావాడితోనైైనా, రాష్ట్రపతితోనైనా ఒకే రీతిలో సంభాషించగల్గినవాడు కాళోజీ . ఆయన ‘నా గొడవ’ పేరుతో రాసిన కవిత్వమంతా ప్రజల గొడవే. ‘‘నా గొడవనునది, కాళోజీ అనునది, ఎడతెగక పారునది, సమరస భావనది, నానా భావనది, నీ నా భావన లేదని, కాలమునకే కాదు మహాకాలునకు సైతం జీ అనని కలేజాతో కాళోజీ  అనునది..’’ అందుకే ఎవరికీ తలవంచని జీవితం కాళోజీది.
      అన్యాయం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎదిరించడమే ఆయన నైజం, నిజాం కాలం అయినా తర్వాత స్వతంత్య్ర భారంతంలోనైనా. ‘‘అన్యాయాన్ని ఎదురిస్తే నాగొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నాగొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్ని ఎదురించినోడే నాకు ఆరాధ్యుడు’’ అన్నడు కాళోజీ .. తన 90 ఏళ్ల జీవితంలో ఆయన చెప్పిందే చేసిండు, చేసిందే చెప్పిండు, అందుకే ఆయన విశ్వమానవుడు. వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి చరిత్రకు ప్రతీక అయితే కాళోజీ  తనున్న వర్తమానానికి ప్రతీక!

సహకారంః కంచ కృష్ణమూర్తి, వరంగల్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం