విజయనగర వైభవ దీప్తి ఒంటిమిట్ట

  • 1352 Views
  • 6Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

చుట్టూరా విస్తరించిన శేషాచలం, పాల, వెలికొండల వరసలు... నడుమ నింగిని ముద్దాడుతూ, చూసేవారిని కట్టిపడేసే ఠీవితో అంతెత్తున నిలబడ్డ మూడు గోపురాలు... ఎత్తయిన ప్రాకారం మధ్యలో అలరారుతోంది ఆ ఆలయం. విజయనగర చక్రవర్తులు, వారి సామంతుల శిల్పకళా పిపాసను ఎలుగెత్తి చాటే ఆ కోవెలది ఆరున్నర శతాబ్దాల చరిత్ర. అంతేనా, ఎంతోమంది కవులకు స్ఫూర్తిగా నిలిచి తెలుగు సాహితీ సుసంపన్నతకు తనవంతు దోహదాన్ని అందివ్వడంలోనూ దాని కీర్తి జగద్విదితమే. మరోవైపు, మతసహనానికీ ప్రతీకగా నిలిచే ఆ దేవళమే ఒంటిమిట్ట కోదండరామాలయం.
కడప- తిరుపతి మార్గంలో ఉంటుంది ఒంటిమిట్ట. పూర్వం ఇక్కడ దట్టమైన అడవులు ఉండేవి. పైగా తూర్పు కనుమల మధ్యప్రాంతం కూడా. అప్పట్లో ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవాళ్లు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర, బుక్క రాయల సోదరుడు కంపరాయలు ఓరోజు వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడు. బాగా దాహం వేయడంతో నీటికోసం వెతుకు తున్నాడు. దార్లో తారసపడ్డ ఒంటణ్ని, మిట్టణ్ని నీటి జాడ అడిగాడు. వాళ్లు స్థానిక రామతీర్థాన్ని చూపించారు. ఆ నీళ్లు తాగి ఉపశమనం పొందిన కంపరాయలు ఆ ప్రాంతాన్ని బోయ సోదరులకు ఇనాంగా ఇచ్చాడట. అప్పుడే ఒంటడు, మిట్టడు అక్కడే ఉన్న జాంబవంత ప్రతిష్ఠిత లక్ష్మణ సమేత సీతారాముల మూర్తిని చూపించి, ఆలయం నిర్మించమని కోరారట. మన్నించిన కంపరాయలు... ఆలయాన్ని నిర్మించి, పోషణ నిమిత్తం చెరువు తవ్వించి, భూములు దానంగా ఇచ్చాడట. అలా అక్కడ ఏర్పడిన పల్లె ఒంటడు, మిట్టడు పేరుమీద ఒంటిమిట్ట అయిందంటారు. ఒంటడు, మిట్టడి కథ ‘ఒంటిమిట్ట కైఫీయత్తు’లో ఉంది.
గండికోట శాసనం ప్రకారం...
బుక్కరాయలు ఓమారు కాశీయాత్ర చేశాడట. తిరిగివస్తూ గోదావరి సమీపంలో ఇసుకపల్లెలో ఆగాడట. అక్కడ ఓ ఇసుకదిబ్బలో ఆయనకు నాలుగు విగ్రహాలు దొరికాయట. వాటిని ఆయన పామిడి, గండికోట, గుత్తి, ఒంటిమిట్టల్లో ప్రతిష్ఠించాడట. గుడి ఒక మెట్ట మీద నిర్మించడం వల్ల ఒంటిమెట్ట అనే పేరు వచ్చిందనీ, అదే ఒంటిమిట్టగా మారిందంటారు.
ద్రావిడశైలి నిర్మాణం
కోదండరామాలయం ద్రావిడశైలి- ప్రత్యేకించి విజయనగర నిర్మాణశైలికి చెందింది. ఈ ఆలయ నిర్మాణం 1350 ప్రాంతంలో బుక్కరాయల కాలంలో ప్రారంభమైంది. 16వ శతాబ్ది నాటికి సిద్ధవటం కేంద్రంగా పాలించిన విజయనగర సామంతులు మట్లి రాజులు దాన్ని పూర్తిచేశారు. ప్రధానాలయం ఎత్తయిన ప్రాకారం మధ్యలో కొలువు దీరింది. ప్రాకారానికి తూర్పు, ఉత్తరం, దక్షిణదిశల్లో గాలిగోపురాలు ఉంటాయి. ప్రధాన గోపురం తూర్పుదిక్కులో అయిదు అంతస్తులతో, సుమారు 80 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. ఒకప్పుడు ఆ గోపురం మీదినుంచి కొబ్బరికాయలు విసిరే పందెం పెట్టుకొనేవారట స్థానికులు! తూర్పు ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే బలిపీఠం, దానికి ఆవల ధ్వజస్తంభం దర్శనమిస్తాయి.
      ధ్వజస్తంభం దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయా లతో ఉండే నిర్మాణమే ప్రధాన ఆలయం. రంగమండపంలోని 32 స్తంభాల్లో ప్రతీది శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేదే. బయటి స్తంభాల మీద వేణుగోపాలుడు, నరసింహ స్వామి, వెన్నముద్ద కృష్ణుడు, కోదండ రాముడు, హనుమంతుడు ఇలా వివిధ శిల్పాలు ఉంటాయి. మధ్య రంగ మండపంలో 12 స్తంభాల మీద వ్యాళాలు కనిపిస్తాయి. వ్యాళం అంటే గుర్రం శరీరం, సింహ ముఖం, ఏనుగుతొండం ఉన్న వూహా మృగం. వాటిని అధిరోహించిన వీరుల శిల్పాలు ఆకట్టుకుంటాయి.
      కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో కోదండంతో ఉన్న శ్రీరామచంద్రమూర్తి సీతా, లక్ష్మణ సమేతంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. ఆలయానికి, ప్రాకారానికి మధ్యలో ప్రదక్షిణ పథం ఉంటుంది. ఆగ్నేయంలో రాములవారి పోడు, యాగశాల; వాయువ్యంలో రాములవారి ఎదుర్కోలు మండపం, ఈశాన్యంలో సీతమ్మవారి ఎదుర్కోలు మండపం, నైరుతిలో కల్యాణ మండపాలు ఉంటాయి. మొదట కల్యాణాన్ని ఇక్కడే చేసేవాళ్లు. రద్దీ పెరగడంతో వేదికను వెలుపలికి మార్చారు. వెలుపల దక్షిణ గోపురంనుంచి పశ్చిమంగా ఉత్తర గోపురం వైపు యాత్రికుల సత్రాలు ఉంటాయి. స్థూలంగా ఇదీ ఆలయం. 1650లలో గోల్కొండను సందర్శించిన ఫ్రెంచి వజ్రాల వ్యాపారి జీన్‌ బాప్టిస్ట్‌ టావెర్నియర్‌... ‘భారతదేశపు అద్భుత ఆలయాల్లో ఒంటిమిట్ట ఆలయం ఒకటి’ అని తన యాత్రాగ్రంథంలో నమోదు చేశాడు. ‘వొంటిమిట్టలో చూడ వేడుకలయిన గుళ్ళున్నవి’ అన్నారు ఏనుగుల వీరాస్వామయ్య (పందొమ్మిదో శతాబ్దం) ‘కాశీయాత్రా చరిత్రలో’.
సాహితీ స్ఫూర్తి
భారతీయ సాహితీ చరిత్రలో భక్తి, సాహిత్యం రెండూ జంటగా సాగాయి. అందుకు ఒంటిమిట్ట కూడా మినహాయింపు కాదు. ఇక్కడి రాముణ్ని రఘునాయకుడు, రఘువీరుడు అనికూడా పిలుస్తారు. ఈ రాముడు ఎంతోమంది కవులకు సాహితీ ఆలంబనగా నిలిచాడు. ఈ వరసలో కనిపించే మొదటికవి అయ్యలరాజు తిప్పయ్య. 1440 ప్రాంతానికి చెందిన తిప్పయ్య ‘తారుణ్యోదయ యొంటిమెట్ట రఘునాథా! నీకు నే బద్యముల్‌ నూరుం జెప్పెద...’ అంటూ ‘రఘువీరా! జానకీ నాయకా!’ మకుటంతో ‘ఒంటిమిట్ట రఘువీర శతకం’ రచించాడు. ఇదే శతకంలోని ‘పరనారీ కుచకుంభ పాళికలపై, పాదాబ్జ యుగ్మంబుపై...’ పద్యానికి పోలికగా ‘ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై...’ అన్న పోతన భాగవత పద్యం కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఉదాహరణలతో కొంతమంది సాహితీవేత్తలు పోతన భాగవతాన్ని అంకితమిచ్చింది ‘ఒంటిమిట్ట రాముడికే’ అన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించిన అన్నమయ్య... ‘ఇందులోనే కానవద్దా యితడు దైవమని/ విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని’ అని ఒంటిమిట్ట రాముణ్ని కీర్తించాడు.
      అష్టదిగ్గజ కవి అయ్యలరాజు రామభద్రుడు శిశువుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అతణ్ని ఇక్కడి గర్భాలయంలో మరిచిపోయారట. పూజారులు అది గమనించకుండా తలుపులు వేసి వెళ్లారట. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తోంటే... సీతాదేవే పాలిచ్చి నిద్రపుచ్చిందట. మర్నాడు గర్భాలయంలో శిశువును చూసిన పూజారులు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట. సీతాదేవి అనుగ్రహం పొందిన ఆ బాలుడికి రామభద్రుడని పేరుపెట్టుకున్నారట. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ అన్న ప్రబంధాన్ని రచించాడు.
      తర్వాత కవుల్లో ప్రసిద్ధిచెందిన కవి ఉప్పుగొండూరు వేంకటకవి. మట్లిరాజుల ఆస్థానంలో ఉన్న వేంకటకవి కోదండరామస్వామికి అంకితంగా ‘ఒంటిమెట్ట దశరథరామ’ శతకాన్ని రచించాడు. అందులో రాముడి విగ్రహాన్ని వర్ణిస్తూ సాగే ఈ పద్యం ప్రఖ్యాతం... నిగనిగ మెరయు కిరీటము/ ధగధగమను పట్టుదట్టి తగిన కటారున్‌/ భుగభుగ వాసన నీకే/ తగుతగురా ఒంటిమెట్ట దశరథ రామా!
      16వ శతాబ్దం చివరి కాలానికి చెందిన నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముణ్ని కొలిచి ‘వరకవి’గా ప్రసిద్ధిచెందాడు. అయ్యప్ప కుమారుడు సీతాపతి 17వ శతాబ్దంలో ఈ ప్రాంతం మీద జరిగిన తురుష్కుల దాడి వివరాలతో ‘శత్రుసంహార వేంకటాచల విహార’ మకుటంతో శతకాన్ని రాశాడు. ఇక వావిలికొలను సుబ్బారావు తన యావజ్జీవితాన్నీ ఒంటిమిట్టకే అంకితం చేసిన మహనీయుడు.
మరో రామదాసు
వావిలికొలను సుబ్బారావు 1863లో కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. ఎఫ్ఫే వరకు చదివిన ఆయన కొంతకాలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేశారు. 25వ ఏటనే ‘కుమారాభ్యుదయం’ అన్న ప్రౌఢ ప్రబంధాన్ని రచించారు. నెల్లూరులో జరిగిన ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో సుబ్బారావు పాండిత్యాన్ని శంకించగా, ఆశువుగా శ్రీతల్పగిరి రంగనాయక శతకాన్ని చెప్పి విమర్శకులను మెప్పించారట. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1904లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు విభాగంలో ప్రధాన అధ్యాపకులుగా నియమించింది. ఈ సమయంలోనే ఆర్యనీతి, కుమార కుమారీ హితచర్యలు, సులభవ్యాకరణం, సుభద్రావిజయం, ద్విపద భగవద్గీత తదితర గ్రంథాలను రచించారు. ‘భక్తిసంజీవనీ’ అనే పత్రికనూ నడిపారు.
      అయితే సుబ్బారావుకు బాగా పేరు తెచ్చింది మాత్రం ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’. వాల్మీకి రామాయణంలోని 24000 శ్లోకాలకు యథాతథ అనువాదం ఈ వావిలికొలను రామాయణం. పుస్తకం అంకితసభలో ధర్మవరం రామకృష్ణమా చార్యులు, సుబ్బారావుకు ‘ఆంధ్రవాల్మీకి’ బిరుదు ప్రదానం చేశారు. తర్వాతకాలంలో సుబ్బారావు దీనికి ‘మందరం’ పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు. ఇదంతా ఒకెత్తు ఒంటిమిట్ట రామాలయం ఉద్ధరణకు ఆయన చేసిన కృషి ఒకెత్తు.
      భార్య రంగనాయకమ్మ మరణించాక సుబ్బారావు యోగసాధనకు ఘటికాచలానికి వెళ్లారు. అక్కడ ఓమారు ఇద్దరు బాటసారులు, తర్వాత ఇద్దరు బైరాగులు కలలోకి వచ్చారట. ఆ బైరాగులు ఆయన్ను ఒంటిమిట్టకు రమ్మన్నారట. అంతకుముందే తనను ఒంటిమిట్టలో అన్నం పెట్టమని ఎవరో అడిగినట్లు అనిపించడం, సిద్ధవటం తహశీల్దారు ఒంటిమిట్ట రామాలయం ధూపదీపాలకు ఏదైనా సాయం చేయమన్న సంఘటనలు గుర్తుకురావడంతో సుబ్బారావు ఘటికాచలం నుంచి ఒంటిమిట్టకు పయనమయ్యారు. ఆలయానికి తన సర్వస్వమూ ధారపోసి, చేతిలో టెంకాయచిప్ప పట్టుకొని భిక్షాటన చేశారు. అలా వచ్చిన సుమారు 2 లక్షల రూపాయలతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ భిక్షాటనకు గుర్తుగా ‘టెంకాయచిప్ప శతకం’ రాయడం విశేషం. భద్రాచలం ఆలయం విషయంలో రామదాసు పడ్డ శ్రమను తలపిస్తుంది వావిలికొలను సుబ్బారావు శ్రమ. అందుకే ఆయన వాసుదాసుగా ప్రసిద్ధిచెందారు.
భవనాశి ఓబన్న
రామ రామాయని రాముని పాదం పట్టండి, యమునికి నామం పెట్టండి... అంటూ రోజూ సాయంత్రం వేళల్లో ఒంటిమిట్ట ఆలయం తూర్పుద్వారం ముందు పాడుకునేవాడు భవనాశి మాల ఓబన్న. ఆయన రోజూ తన పనులయ్యాక సాయంకాలానికి ఆలయానికి చేరుకునేవాడు. అలా ఓరోజు తన్మయత్వంతో రామగానం చేస్తున్నాడు. అప్పుడే ఓ తహశీల్దారు గుళ్లొకి వెళ్తున్నాడు. తనకు అడ్డంగా ఉన్నందుకు ఓబన్నను తిట్టాడట. ఆ రాత్రి ఆ అధికారికి రాముడు కలలో కనిపించి ‘అసలు భక్తి నీదా? ఓబన్నదా?’ అని ప్రశ్నించాడట. మర్నాడు ఆ తహశీల్దారు ఓబన్న దగ్గరికి వచ్చి తనను క్షమించమన్నాడట. అంతేకాదు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ, గుడిముందు ఓ మండపాన్ని నిర్మించి ఇచ్చాడట. ఇప్పుడు ఓబన్న మండపంగా పిలిచే కట్టడం అదే.
రాత్రివేళ కల్యాణం
అన్ని ఆలయాల మాదిరిగానే ఒంటిమిట్ట ఆలయంలోనూ వివిధ ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర శుద్ధనవమి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. మిగిలిన చోట్ల నవమినాడు ఉదయం కల్యాణం జరిగితే... ఒంటిమిట్టలో రాత్రివేళ, అదీ చతుర్దశినాడు జరగడం విశేషం. ఇలా ఎందుకంటే? గుడిని నిర్మించి, విగ్రహాలు స్థాపించాక బుక్కరాయలు కల్యాణానికి ఓ ముహూర్తం చూడమన్నాడట. అప్పుడు పండితులు రాముని వివాహ నక్షత్రం ఉత్తర ఫల్గుణిని సూచించారట. అది ఆ సంవత్సరం చైత్ర శుద్ధచతుర్దశి రాత్రివేళ వచ్చిందట. తర్వాత్తర్వాత అదే ఆచారంగా స్థిరపడిందంటారు.       ప్రస్తుతం శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా ఒంటిమిట్ట రామాలయంలోనే నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అయితే ఈ ఆలయం భారత పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది. అందుకే ప్రభుత్వం పురావస్తు శాఖ అనుమతి తీసుకుంది. మరోవైపు ఆలయం అభివృద్ధి బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. దాంతో ఇటీవలే ఒంటిమిట్టకు ప్రత్యేకంగా రూ.100 కోట్లు కేటాయించింది తితిదే. వాటితో వివిధ పనులను చేపట్టనున్నారు. ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించి ఎన్నో శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయం చరిత్ర, శాసనాల వివరాలతో సాహితీ విమర్శకులు విద్వాన్‌ కట్టా నరసింహులు ‘ఒంటిమిట్ట రామయ్య చరిత్ర’ పేరుతో పుస్తకాన్ని రాశారు. ఒంటిమిట్ట ప్రాశస్త్యం తెలుసుకునేందుకు ఇది సాధికార కరదీపిక.
      మనదేశంలో ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలుగానే కాకుండా, శిల్ప, చేనేత, కమ్మరం, వడ్రంగి, స్వర్ణకార తదితర వృత్తి పనులవారికి ఉపాధి కల్పించి కళాకేంద్రాలుగా కూడా విలసిల్లాయి. అంతేకాదు... ఆ ఆలయాల్లో కొలువైన మూర్తులు సాహిత్యంలో నిలిచిపోయారు. అలా కవులనూ చిరంజీవులను చేశాయి ఆలయాలు. ఒంటిమిట్ట కోదండరామస్వామి కోవెల కూడా ఆ కోవలోనిదే. ఆ ఆలయ చరిత్ర చిరస్మరణీయం! కమనీయం!
వెల్లివిరిసిన సామరస్యం
సిద్ధవటం ప్రాంతం 1790 నాటికి టిప్పుసుల్తాన్‌ అధీనంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఒంటిమిట్టలో రెవెన్యూ ఉద్యోగి ఇమాం అక్బర్‌బేగ్‌. ఆయన రామునిపట్ల భక్తితో ఉండేవాడట. ఓ సంవత్సరం ఒంటిమిట్టలో నీటి ఎద్దడి ఏర్పడితే ఆలయానికి వెలుపల ఆగ్నేయ దిశలో ఓ బావిని తవ్వించాడట. అది ఇప్పటికీ దర్శనమిస్తుంది. ఇప్పటికీ ఒంటిమిట్ట రాముణ్ని ముస్లింలు సైతం దర్శించుకోవడం విశేషం. 

*  *  *

      


వెనక్కి ...

మీ అభిప్రాయం