అక్షరానికి మైమఱువు

  • 129 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.వి.ఎన్‌.వరలక్ష్మి

  • విశాఖపట్నం
  • 9440188890
వి.వి.ఎన్‌.వరలక్ష్మి

తరతరాల జాతి వారసత్వ సంపద ‘అక్షరం’. అలాంటివి మనకు యాభైఆరు ఉన్నాయి. అన్యభాషలను అనుకరిస్తూ వాటిలో కొన్నింటికి ఉరి బిగించాలను కోవడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే! 
తెలుగు
వర్ణమాలను సంస్కరించాలి... కొన్ని అక్షరాలను తీసేయాలి... ఈమధ్య తరచూ వింటున్న మాటలివి. ఆంగ్ల అక్షరమాలతో పోల్చి కొందరు, కంప్యూటర్‌ కోసమని మరికొందరు ఈ వాదనను ముందుకు తెస్తున్నారు. అనవసరమైన అక్షరాలను, ఒత్తులను వదిలించుకోవాలి అంటున్నారు. వేటిని వదిలించుకుంటారు? మనకు నోరు తిరగని, స్పష్టంగా పలకడానికి మనం అంతగా ఇష్టపడని ళ, ణ, క్ష, ఢ, ధ వంటి అక్షరాలనా? ఇలా ‘ఱ’ను బలవంతంగా తీసేసి ఎన్నో అచ్చతెలుగు పదాలను దూరం చేసుకున్నాం. ‘మైమఱువు’ అంటే బలిష్ఠమైన, పటిష్టమైన లోహపు కవచం. మై అంటే శరీరం, మఱువు అంటే మఱుగుగా (దాచి) ఉంచేది. మనం ‘ఱ’ వాడం కాబట్టి ఈ మాటనూ వినియోగించం. కాబట్టే, ‘బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌’కు సరిగ్గా సరిపోయే ఈ పదాన్ని వదిలేసి ‘తూటా రక్షణ కవచము’ అని చాంతాడంత మాటను వాడుకలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం! మరో విషయం... ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే, మేలిమి ముత్యాల్లాంటి  ఇలాంటి పదాలెన్నో కనిపిస్తాయి. కానీ, వాటిని వెతికి పట్టుకునే ఆసక్తి, తీరిక మనకున్నాయా?  
      ఆంగ్లం కన్నా మనకు 30 అక్షరాలు ఎక్కువ ఉన్నాయి... ఎవరన్నా మన భాషను నేర్చుకోవాలన్నా, మనం ఎవరికైనా నేర్పాలన్నా ఈ ‘అధిక మోతాదే’ ఆటంకమవుతోందని ఆక్షేపిస్తున్నారు కొందరు పండితులు. అలాంటి వారందరూ ఆంగ్లంలోని నిశ్శబ్ద అక్షరాలను మర్చిపోతున్నారు! ‘వేర్, వై, వాట్‌’ లాంటి పదాల్లో ‘హెచ్‌’ అనవసరం. దాన్ని తీసేసి వాడతారా? తీయమని ఆంగ్ల సమాజానికి సలహా ఇస్తారా? ‘ఫిజిక్స్‌’ను ‘పీహెచ్‌వై’తో మొదలెట్టాల్సిన పనేంటి? ‘నాలెడ్జ్‌’లో ‘కె’, ‘రైట్’లో ‘డబ్ల్యూ’లను పలకరెందుకు? క, స రెండు శబ్దాలకూ ‘సీ’నే ఎందుకు వాడతారు? వీటన్నింటిని సంస్కరించమని ఆంగ్లేయులకు చెప్పగలరా? వారు తమ భాషను ఉన్నదున్నట్లుగా వాడుతున్నప్పుడు, మనలాంటి వారందరితో వాదిస్తున్నప్పుడు... మనం మన అక్షరాలను ఎందుకు తొలగించుకోవాలి? 
      ‘కంప్యూటర్‌ కోసమైనా కొన్ని అక్షరాలను తీసేయాలి’ అనడమంటే, మంచం చిన్నదైంది కాబట్టి కాళ్లు నరుక్కోవాలని సూచించడమే. పదుల కొద్దీ గీతలు గీస్తే తప్ప ‘పదం’ అనిపించుకోని ‘కారెక్టర్ల’ భాష మాండరిన్‌ కంప్యూటర్లలో ఎలా వెలుగుతోంది? ఇతరులకు కష్టసాధ్యమనిపించే ఈ ‘కారెక్టర్ల రాత’తోనే కంప్యూటర్లను పరుగులెత్తిస్తున్నారు కదా చైనీయులు. పైపెచ్చు తమ భాషను ప్రపంచవ్యాప్తం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు, సఫలీకృతులవుతున్నారు కూడా. వాళ్ల కృషికి సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబరు, 2013 ‘తెలుగు వెలుగు’ సంచిక కళ్లకు కట్టింది. వాళ్ల ఉధృతి చూస్తే చైనా వస్తువుల్లా అన్ని దేశాలకూ భాషను అంటించేస్తారేమోనని గాభరా పెట్టింది. దాన్నిబట్టి చూస్తే, మన అక్షరమాలకు అనుగుణంగా కంప్యూటర్‌ను తీర్చిదిద్దుకోవాలి కానీ, దానికోసం అక్షరాలను ఆహుతివ్వాలనుకోవడం అసమంజసం. అవివేకం.
      భాష సరళం కావాలంటే అచ్చ తెలుగు పదాల వినియోగం పెరగాలి. ఉదాహరణకు ‘ఖాళీ స్థలం’ బదులు ‘గరువు’ వాడవచ్చు. అచ్చతెలుగు పదాలకి ఒత్తులు, దీర్ఘాల గొడవ పెద్దగా ఉండదు. వాటిని వాడుకలోకి తెస్తే, భాష నేర్చుకోవ డానికి నవతరమూ ఇబ్బంది పడదు.        అక్షరాలనూ తీసేయాల్సిన అవసరమూ రాదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం