నటరాజసేవలో తరించిన సువర్ణ నాట్యకమలం

  • 251 Views
  • 54Likes
  • Like
  • Article Share

నాట్యం జీవన వేదం. ఆధ్యాత్మిక శక్తికి, నిశ్చల భావానురక్తికి నర్తనమే ఉత్తమ సాధనమని.. జీవితమంతా నటరాజ సేవలో తరించిన శోభానాయుడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు. తల్లి సరోజినీదేవి. తండ్రి వెంకయ్య నాయుడు. పన్నెండో ఏట తల్లి ప్రోత్సాహంతో పి.లక్ష్మణరెడ్డి దగ్గర నాట్యంలో మెలకువలు నేర్చుకుని కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం శిష్యరికంలో నాట్యంలో మెరుగులు దిద్దుకున్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘చండాలిక’ నాటకంలో చండాలిక, కల్యాణ శ్రీనివాసంలో పద్మావతి, విప్రనారాయణలో దేవదేవి, మేనక విశ్వమిత్రలో మేనక, జగదానందకారకలో రాముడు, క్షీరసాగర మధనంలో మోహినీ, ఇలా పౌరాణిక పాత్రలతో వేల ప్రదర్శనలిచ్చి తన నాట్యవిలాసంతో సభికులను సమ్మోహనపరిచారు. సాయిబాబా, వివేకానంద వంటి సత్పురుషుల జీవనదశలని రూపకాలుగా మలిచారు. విజయోస్తుతే నారీ, శ్రీకృష్ణ శరణం మమ, సర్వం సాయిమయం వంటి రూపకాల ద్వారా అశేష ప్రజానీకానికి చేరువయ్యారు. శాస్త్రీయ నృత్యంలో పేరు ప్రఖ్యాతల మాటెలా ఉన్నా ఆత్మానందం ఉంటుంది. నృత్యసాధనతో భగవత్సన్నిధిని చేరుకోవచ్చు. నాట్యాన్ని పరమపథసోపానంగా మలుచుకుని తరించవచ్చు. నిత్యసాధనతో నవ్యత్వం వైపు పరుగులు పెట్టే ఈ విద్యను నలుగురికీ నేర్పి సంతృప్తిని పొందవచ్చు. అని నమ్మిన శోభనాయుడు సినిమా అవకాశాలను తిరస్కరించారు. 1980లో హైదారాబాదులో కూచిపూడి ఆర్ట్స్‌ అకాడమీ స్థాపించి ఔత్సాహిక కళాకారులను తీర్చిదిద్దారు. తమిళనాట భరతనాట్యానికి ఎంతటి ప్రఖ్యాతి ఉందో తెలుగు రాష్ట్రాల్లో కూచిపూడికి అంతటి ప్రసిద్ధి కలగాలని ఆశించారు. భారతీయ నృత్యంలో పాశ్చాత్య సంస్కృతి పొడసూపకూడదనీ, దేశ సంస్కృతిలోని ఉదాత్తతని నిలుపుతూ, కళను కాపాడుకోవాలన్న ఆరాధన ఉన్నప్పుడే భారతీయ కళలు విలసిల్లుతాయని భావించారు. 
     భారత ప్రభుత్వం ౨౦౦౧లో పద్మశ్రీ, ౧౯౮౨లో కృష్ణగానసభ వారి నిత్యచూడామణి, ౧౯౯౮లో ఎన్టీయార్, ౧౯౯౧లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం హంస అవార్డు వంటి సత్కారాలు అందుకున్నారు. యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా తదితర విదేశాల్లో ప్రదర్శనల ద్వారా భారతీయ నాట్యాన్ని విశ్వవ్యాపితం చేశారు. నాట్యాన్ని సంపాదన కోసం కాకుండా ఆత్మసంతృప్తి కోసం సాధన చెయ్యాలి, ప్రశంసలు, పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా పరమాత్మ సంయోగం కోసం అభ్యసించాలని ఆశించిన శోభానాయుడు అక్టోబరు 13న (2020) హైదరాబాదులో కన్నుమాశారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం