బొమ్మ‌ల బ్ర‌హ్మ‌

  • 22 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శ్రీధ‌ర్‌

  • కార్టూన్‌ ఎడిటర్, ఈనాడు.
  • హైదరాబాదు.
  • 9177004848
శ్రీధ‌ర్‌

కశాకారుల్ని దేశంనుంచి బహిష్కరించాలన్నారు గ్రీకువాళ్లు. ఎందుకంటే కళలు మానవుణ్ని బలహీన పరుస్తాయి, భావోద్వేగాలకు లోనుచేస్తాయి. దుఃఖితుడు వీరుడిగా మనలేడు. మనిషనేవాడు సర్వకాల సర్వావస్థల్లో వీరుడిగా, యుద్ధోన్ముఖుడిగా ఉండాలి. భావోద్వేగాలు వ్యక్తులనూ తద్వారా జాతినీ నిర్వీర్యం చేస్తాయని గ్రీకుల వాదన.
      ఆ కాలంలో కళలు రెండే రెండు. ఒకటి శిల్పకళ, రెండోది నాటకం. నాటకం చూసేప్పుడు వేదనా భరితమైన దృశ్యాలకు కంటతడి పెట్టడం మామూలే. నేటి సినిమాల్లోనూ ఈ దృగ్విషయం సర్వసాధారణమే. నిజంగా గొప్పదైన కళ ఏదైనా మనిషిని అట్టే కట్టిపడేస్తుంది. నిలువరిస్తుంది. దానికి చక్కని ఉదాహరణ బాపు బొమ్మ.

బాపూ కార్టూన్‌ చూసి నవ్వుతాం, బాపూ బొమ్మ చూసి ముగ్ధులవుతాం. బుడుగును మన సొంత పిల్లాడనుకుంటాం, లేదా వాడితో మనమే మమేకమవుతాం. ఉన్నతమైన కశారూపానికి ప్రప్రథమ లక్షణమిదే. దాన్లో మనం లీనమయ్యేదే నిజమైన కళ.
      క్రమశిక్షణా, నిరంతర కఠోర శ్రమా బాపూగారికి పుట్టుకతో అబ్బిన లక్షణాలు. సృజనశీలతా, సెన్సాఫ్‌ హ్యూమర్‌ (నవ్వే, నవ్వించే లక్షణం కలిగి ఉండటం, లేదా నవ్వుని వెదికి పట్టుకునే లక్షణం) అనితర సాధ్యమైన రేఖా విన్యాసం లాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమైన గుణాలు.
      సంజీవదేవ్‌ తన పుస్తకానికి ‘రసరేఖలు’ అని పేరుపెట్టారు. కచ్చితంగా బాపూగారివి రసరేఖలు. ఇంకో రకంగా చెప్పలేం.
      క్షుద్ర లోహాలను బంగారంగా మార్చే విద్యను ‘పరుసవేది’ అంటారు. ఆంగ్లంలో ‘ఆల్కెమీ’ అంటారు. బొమ్మల్లో ఆల్కెమీ తెలిసిన ఏకైక చిత్రకారుడు బాపు.
      ప్రతి రచయితకీ, చిత్రకారుడికీ తనకంటూ ఓ తాత్విక చింతన (ఫిలాసఫీ) ఉంటుంది.
      బాపూను శాస్త్రీయంగా విశ్లేషించటానికీ, బాపూ వెనకాల నిలబడ్డ తాత్వికత ఏమిటని అంచనా వేయటానికి చాలా విషయాలు పరిశీలించాల్సి ఉంటుంది.
బొమ్మే ప్రేరణ
మనకు బయట కనిపించే వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు. వ్యక్తిత్వం తెలియాలంటే చాలా సాన్నిహిత్యం అవసరం. బాపూగారి వ్యక్తిత్వం రమణగారికి తెలిసినంతగా మరొకరు బేరీజు వేయజాలరు. ఇన్నేళ్లు మైత్రి నెరపగలిగిన గుణం ఉండటంవల్ల అతనెంతటి మంచి మిత్రుడో మనకర్థమవుతుంది.
      సరే, బాపూగారు ఒక మంచి స్నేహశీలిగా నూటికి నూరు మార్కులూ సాధించారు.
      ఆయన ఏనాడూ వేదికలెక్కి ప్రసంగించలేదు. కనుక ఆ విషయం వదిలేద్దాం. బాపూగారు మంచి సంగీత ప్రియుడు. బొమ్మలేస్తున్నంతసేపూ పక్కన వీనులవిందైన సంగీతం వినిపించాల్సిందే.
చిత్రకళ విషయానికొస్తే అతను మాత్రమే అంత చక్కని చిక్కని బొమ్మలను ఎలా వేయగలిగాడు? వెనకాల ఉన్న ఉత్ప్రేరకం ఏమిటి? నిరంతరం అతనాపనిని చేస్తూ వెళ్లటానికి ప్రేరణ ఏమిటి? ఆ నిప్పును అలాగే మండుతూ ఉంచే సాధనమేమిటి? పేరు ప్రఖ్యాతులేనా, డబ్బేనా అని అనుకోవటం లేకితనం అవుతుంది. బొమ్మే ఆయన్ను నిలబెట్టింది. అంతే. అదాయన తత్వం.
      బాపూ మరణానంతరం వచ్చిన వ్యాసాలన్నీ ఆయన ఔన్నత్యాన్నీ, బొమ్మల అందాన్నీ తెలియజేసేవే కాని ఆ బొమ్మలు అలా ప్రాణం పోసుకున్న నేపథ్యాన్ని వివరించినవి పెద్దగా లేవు.
      మనకు లలితంగా కనిపించే బాపూ గీత చాలా బలమైనది. ఎక్కడ సన్నని గీత గీయాలో, ఎక్కడ బలమైన మందపు గీత అవసరమో తెలియనిదే అంతటి సౌందర్యం అసాధ్యం.
      బాపూగారు ఏదో మంత్రమహిమ వల్లనో, మాయ వల్లనో, మహత్తు వల్లనో ఆకాశంనుంచి అదాట్న ఊడిపడిన చిత్రకారుడు కాదు. 1950 ప్రాంతంలో బాపూ వేసిన బొమ్మలు చూస్తే సాధారణ చిత్రకారుడు అభ్యాస దశలో వేస్తున్న బొమ్మల్లాగే ఉంటాయి. నిరంతర సాధనా సౌందర్యారాధనలే ఆయన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. బాపూ బొమ్మల్లో విపరీతమైన వేగం ఉంటుంది. దాన్ని ‘చేతన’ అంటారు. చేతన లేని బొమ్మలు శవసదృశ్యంగా కనిపిస్తాయి. బొమ్మల్లో ఉండే వేగమూ చైతన్యం వల్ల బాపూ బొమ్మలకు ప్రాణప్రతిష్ఠ జరిగింది. దీన్ని సాధించటానికి జీవితాంతం పరిశీలిస్తూ గీస్తూ వెశ్లారు. పరిశీలనలోంచి, స్కెచ్చింగ్‌లోంచీ బాపూ నేర్చుకున్నంతగా మరే చిత్రకారుడూ నేర్చుకోలేదు. పరిసరాలను చూసి అంతగా అభ్యసించిన వారు మరొకరు లేరు. 
పరిశీలనలూ... అభిమానాలూ
అంతేకాదు. అంతటితోనే సర్వస్వం వచ్చేస్తుందంటే అది అర్థసత్యమే అవుతుంది. ‘గోపులు’ అనే సమకాలీన తమిళ చిత్రకారుణ్ని బాపూ తన గురువుగా అంగీకరించారు. గోపులు బొమ్మలు చూస్తే ఆయన ప్రభావం బాపూపైన ఎంతుందో ఇట్టే అర్థమవుతుంది.
బాపూ సూక్ష్మగ్రాహి, హంసలా పాలూ, నీరూ వేరుచేసి పాలనే గ్రహించగలిగే నేర్పరి. ఏ దారి ఎటుపోతుందో, ఏ దారిన వెశ్లాలో బాగా వంటపట్టించుకున్న జ్ఞాని.
      బిల్‌ వాటర్‌సన్‌ సృష్టించిన ‘కాల్విన్‌ అండ్‌ హాబ్స్‌’ కామిక్‌ బొమ్మలకూ, ప్రత్యేకంగా దాన్లోని కాల్విన్‌ అనే పిల్లవాడి బొమ్మకూ బాపూ వీరాభిమాని. ఆ బొమ్మల్లోని వేగాన్ని సొంతం చేసుకోవటం కోసం (డెబ్భై ఏళ్లు నిండాక కూడా) వాటిని చూసి పదేపదే సాధన చేసేవారు. బాపూ ఆ మాత్రం గీయలేరూ? ఇప్పుడిక సాధన అవసరమా అంటే అది వేరే విషయం. అలాగే హాంక్‌ కెచమ్‌ గీసే ‘డెన్నీస్‌ ది మెనేస్‌’ చిత్రాలకు కూడా బాపూ మంచి అభిమాని. బాపూగారి బుడుగులో ‘డెన్నిస్‌’ తొంగి చూస్తుంటాడు. బాపూ వదిలిపెట్టిన దేశ విదేశ చిత్రకారులెవరూ లేరు. తూర్పున ఉన్న ‘హొకూసయి’ నుంచి పడమటి ఎవ్రార్‌ అహమద్, పీటర్‌ ఆర్నో, జాక్‌ డెవీస్‌ దాకా అందర్నీ ఓ పట్టుపట్టారు బాపు.
      బాపూ బొమ్మల్లోని అందాల సుందరాంగుల తెలుగుదనం పొడవాటి ఫ్రెంచ్‌ అమ్మాయిల వయ్యారం నుంచి వచ్చిందంటే నమ్మగలమా! అమెరికా, యూరప్, అరబ్, రష్యా, చైనా, జపాన్, భారత్‌ ఎక్కడా ఏ ఒక్క బొమ్మనూ, ఎవరి గీతనూ బాపూ వదల్లేదు. పరిశీలించాడు. లొంగదీసుకున్నాడు. భారతంలోనివీ, భాగవతంలోని బొమ్మలనూ, తోలుబొమ్మల రీతులనూ అజంతా కుడ్యచిత్రాల గతినీ సొంతం చేసుకోగలిగాడు కనుకే బాపూ చిత్రకళకు బాబు అయ్యాడు.
      బాపూలో ఇంకో కోణం కూడా ఉంది. ఆయనెప్పుడూ ఆధునిక రీతులవైపూ, గీతలవైపూ వెళ్లలా, నైరూప్య చిత్రాలనూ ఆధునిక భావాల గతులనూ పెద్దగా బాపూ అనుసరించలేదు. సాంప్రదాయక కళ పట్లే బాపూగారికి మక్కువ ఎక్కువ. బాపూ ఎదిగేకొద్దీ ఆయన బొమ్మల్లో భారతీయ, తెలుగు ప్రాచీనతే పెరిగి పెద్దదైంది. సనాతనం మరింత సంతరించుకుంది.
తాత్విక ‘గీత’
ఆయనకు భక్తి ఎక్కువ కనుక సమస్త దేవుళ్లూ ఆయన చేతుల్లో వివిధ రీతుల్లో, నానావిధ భంగిమల్లో పురుడు పోసుకున్నారు. శుభలేఖపై బొమ్మ దగ్గర్నుంచి పుస్తకాల ముఖచిత్రం దాకా బాపూ విస్తరించినట్టుగా మరో చిత్రకారుడు ప్రవహించలేదు. అది అనితరసాధ్యం, ముందైనా, ఇక ముందైనా అంతే.
      బాపూ బొమ్మలది అలౌకిక అందం, అలా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరైనా నిజంగా బాపూ బొమ్మలా ఉంటే ఎలా ఉండేదో ఊహించటమే కష్టం.
      బాపూగారి జీవితకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించాయి. రెండోప్రపంచ మహా సంగ్రామాన్ని చూసే ఉంటారు. వియత్నాం యుద్ధం, సాయుధ పోరాటాలూ, సోవియట్‌ ప్రాభవం, చైనా        ప్రారుద్భవం, ఆఫ్రికా ఆకలిమంటలూ, నెల్సన్‌ మండేలా జైలు జీవితం (27 సంవత్సరాలు), పాకిస్థాన్‌ యుద్ధం, బంగ్లాదేశ్‌ ఆవిర్భావం, చైనాయుద్ధం ఇలా ఎన్నో, ఎన్నెన్నో...
      బాపూ వీటి జోలికెళ్లలా. వాటినసలు పట్టించుకోలా. ‘మీరు మార్క్సిస్టులా?’ అని బాపూగారిని ఒక ముఖాముఖిలో అడిగినప్పుడు... ‘అవును, గ్రూచో మార్క్సిస్టును’ అన్నారట. గ్రూచో మార్క్స్‌ (మార్క్స్‌ బ్రదర్స్‌లోనివాడు) ఒక హాస్యనటుడు.
బాపూ తాత్విక చింతనే వేరు.


వెనక్కి ...

మీ అభిప్రాయం