మనవాళ్లూ... భాషా దానకర్ణులు!

  • 175 Views
  • 5Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

తెల్లవాణ్ని చూస్తే తెగ జాలేస్తుంది! తెలుగువాడే లేకపోతే వాడి గతి ఏముంది! శ్రుతి ఏముంది? ఫ్రెంచివాడు ఫ్రెంచి భాషలో దంచి కొడతాడు. చైనావాడు ఇంగ్లీషు ముక్క అవసరం లేకుండానే ప్రపంచాన్నయినా జయిస్తాడు. మన దేశంలోనూ తమిళుడు అరవం లేకుండా అరవడు. కన్నడిగుడు తన భాషనే, కన్నతల్లిగా భావించి కళ్లకద్దుకుంటాడు! కానీ తెలుగువాడో! ఆంగ్లాన్ని అందలం ఎక్కిస్తాడు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా బట్లర్‌ ఇంగ్లిష్‌లోనయినా ‘హిట్లర్‌’ అయిపోతాడు. ఇంగ్లిష్‌వాడు మనకేమన్నా చుట్టమా? అదీ లేదు. పక్కమా అదీ కాదు. శతాబ్దాలపాటు మన నెత్తికెక్కి పిండికొట్టిన చరిత్ర తెల్లవాడికి ఉన్నా, తెలుగువాడు పౌరుషానికి పోడు. ఆంగ్లాన్ని మరిచిపోడు!
      ‘కండువా లేనిదే గడప దాటనివాడు తెలుగు వాడు’ అనే పేరు తెలుగు వాడికి ఉంది. అయితే ఇది ఒకప్పటి సంగతి! ఇప్పుడో ఇంగ్లిషు ముక్క ఒక్కటీ రానిదే గడప దాటడు, మళ్లీ గడపలోకి రాలేడు. ఏమిటీ సంగతి సోదరా! అంటే అలా ఫిక్సయిపోయానంటాడు. అలా డిసైడయ్యానంటాడు. ప్రేమిస్తే లైనెయ్యడమట! మనవాడికి వర్క్‌ తప్ప పనిలేదు. పేపర్‌ తప్ప పత్రిక లేదు.
      ఆంగ్లం విషయంలో తెలుగు వాడి లెక్కలు తెలుగు వాడివి. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్‌బై అంటూ చిన్నప్పటి నుంచే మొదలు పెడతాడు. ఇప్పుడు ఇంకా లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు తనకు పాపాయి పుడితే అంతకు ముందెప్పుడూ రూపాయి మొహం చూడనట్టు మాకు లక్ష్మీదేవి పుట్టిందహో  అని సంబరపడేవాడు! చాటింపు వేసినంత పని చేసేవాడు. మరి ఇప్పుడో? అమ్మాయి పుడితే మైనస్‌ అంటున్నాడు.
తెలుగువాడు నిస్వార్థపరుడు. నిజం చెప్పాలంటే యావత్‌ ప్రపంచంలో సాటిలేని త్యాగధనుడు. శిబి చక్రవర్తి తన తొడకోసి ఇచ్చినందునే అతడికి ఎంతో పేరొచ్చింది. తెలుగువాడు అంతకన్నా ఘనుడు. తన భాషను రెండు ముక్కలుగా నరికేసి ఒక సగాన్ని సంస్కృతానికి, ఇంకో సగాన్ని ఇంగ్లిష్‌కు ఇచ్చేశాడు. వెన్నెముక ఇచ్చాడని దధీచికి ఎంతో కీర్తి ఉంది. భాషాపరంగా తెలుగు వాడికి వెన్నెముక లేదని లోకం కోడై కూస్తున్నా తెలుగువాడు పట్టించుకోడు. తన దాన గుణానికి తానే సంతోషిస్తాడు.
      భాషాపరంగా దేన్ని త్యాగం చేయడాని కైనా తెలుగువాడు వెనకాడడు. తన అక్షరమాలలో అన్ని అక్షరాలు ఎందుకు అనుకుంటాడు? తానే తగ్గించుకుంటాడు. రెండు ‘ర’లు ఎందుకు? ఒకటి చాలులే అనుకుంటాడు. ‘ఱ’కు బండి ఖర్చు ఎందుకనుకుంటాడు. ఈ దెబ్బకు ‘ఱ’ దాదాపు కనుమరుగైపోయింది.  (క్రావడి) పరిస్థితి కూడా అంతే! ఋ, ౠ,  ,   , లు కనిపించుట లేదని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా సరిగా కనబడవు. ఎవరైనా వీటిని ప్రదర్శిస్తే చాదస్తులుగా ముద్రవేసి నోరు మూసేస్తారు. చేయి కట్టేస్తారు. ‘అం, అః’లు అదే పనిగా తలచుకుంటే కలలో కనిపిస్తాయి. అర సున్నలు (c) అరకొరగా కూడా కనబడటం లేదు. రాత ఇలా ఉంటే - కూతలోనేమో భేదభావం మర్చిపోతున్నాడు. ‘శ, ష, స’లు మూడింటిని కలిపికొట్టి కావేటిరంగా అన్నట్టు ఒకే రకంగా ఉచ్చరించి కాదన్న మాదన్నలను కొరకొర చూస్తున్నాడు. 
      దేనినైనా రెండు ముక్కలు చేయడం... వాటిలో ఒకదాన్ని సొంతం చేసుకోవడం, రెండోదాన్ని అంతం చేయడం తెలుగు వాడికి రివాజు. భాష అనగానే ఇది గ్రాంథికం, అది వ్యావహారికం అని విడదీసి వ్యావహారికాన్ని అక్కున చేర్చుకొని గ్రాంథికాన్ని నీకు దిక్కున్న చోటికి పొమ్మంటాడు. ఇలా చేస్తే నన్నయ్య ఏమవుతాడు? చిన్నయ్య ఏమవుతాడు? అని ఆలోచించడు. సాహిత్యం సంగతీ చిక్కుల్లోనే ఉంది. పద్యమనీ, గేయమనీ విడదీసి పద్యం ‘పాత చింతకాయ పచ్చడి’ పాతేద్దాం అంటాడు. తిరుపతి వేంకట కవుల ‘అదిగో ద్వారక’, ‘బావా ఎప్పుడు’ పద్యాల సంగతీ అంతేనా అంటే ఉలకడు, పలకడు. నీతి శతకం రాసిన వేమననైనా బతకనివ్వరాదూ? అంటే ఊరుకోడు. ‘ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మల బంగారు ఆభరణాలుంటే ఇలాగే పారేస్తామా?’ అన్నా పట్టించుకోడు. ‘పద్యాల నడుముల్‌ విరగదంతాను’ అని పఠాభి కవిలాంటి వాళ్లు అన్నారు. అయితే ఆ అభిప్రాయం తనది కానేకాదని ఆయనే ఓసారి అన్నారు. అసలు తెలుగే వద్దంటుంటే మధ్యలో ఇదెందుకయ్యా మగడా అని ఎకసక్కెమాడే వాళ్లు ఇరుగుపొరుగున ఉన్నారు! ఏ మాటకామాటే చెప్పాలి. తెలుగు వాడికి తెలుగువాడే శత్రువు. 
      తెలుగువాడు తన పరమ శత్రువునైనా తన దారికి తెచ్చుకోవడమే కాదు, సాదరంగా తన ఊరికి కూడా తెచ్చుకుంటాడు. ఉదాహరణకు  మచిలీపట్నంలో ‘పరాసుపేట’ (ఫ్రెంచిపేట), డచ్చిపేట, ఒలందపాలెం, ఇంగ్లీష్‌పాలెం లాంటి పేటలున్నాయి. పోర్చుగీసు వాళ్లను బుడత కీచులజేసి అక్కున చేర్చుకున్నాం.
      ఇటువంటి విశాల హృదయం ఇంక ఎక్కడుంటుంది!? ఎవరికి ఉంటుంది!? ఇంతకన్నా భాషా దానకర్ణులు ఈ భూప్రపంచంలో ఇంకెక్కడ కనబడతారు!? వినబడతారు!?


వెనక్కి ...

మీ అభిప్రాయం