కొయ్య బొమ్మల కోట... చిత్ర వర్ణాల తోట

  • 1993 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా॥ టి.సంపత్‌కుమార్‌

  • కొత్త దిల్లీ,
  • 9810402895
 డా॥ టి.సంపత్‌కుమార్‌

నిర్మల్‌ ‘నకాషీ’ కళాకారుల చెమటచుక్కల్లోంచి ఉద్భవించే కొయ్యబొమ్మలకు వాటి సహజత్వమే కొండగుర్తు. ఏకవర్ణ నేపథ్యంలో సప్తవర్ణ తైలచిత్రాలను ఆవిష్కరించే అక్కడి చిత్రకారులూ అరుదైన ప్రతిభావంతులే. హస్తకళా ప్రపంచంలో తెలుగు ధ్వజాన్ని శతాబ్దాలుగా రెపరెపలాడిస్తోన్ననిర్మల్ కొయ్యబొమ్మలు- చిత్రాల వైభవదీప్తులను గుర్తుచేసుకుంటూనే, ఆ కళాకారులకు ఎదురవుతున్న సవాళ్లేంటో చూద్దాం!
 ‘‘భౌతికవాదం, పాశ్చాత్య పోకడల ప్రభావంతో మనవైన సంప్రదాయ కళానైపుణ్యాలు అంతర్థానమైపోతున్న ఈ రోజుల్లో, మనవైన సంప్రదాయ కళలను పరిరక్షించే ప్రయత్నం నిర్మల్‌లో జరుగుతోంది. కర్ర, మట్టిలతో పనిచేస్తున్న ఈ కళాకారులను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. గొప్పదైన మన వారసత్వాన్నీ, సంస్కృతినీ చిరకాలం నిలిపే వీళ్ల శ్రమ ప్రశంసనీయం’’... ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.నాయక్‌ మాటలివి. నిర్మల్‌ కొయ్యబొమ్మలు, చిత్రాలను చూసినవాళ్లు ఎవరైనా సరే, అటూఇటుగా ఇలాగే చెబుతారు. ఆ హస్తకళాకృతులు మన వారసత్వ సంపదలు. తరతరాల సంస్కృతీ సంప్రదాయాల్లోంచి పురుడుపోసుకున్న విశిష్ట కళానైపుణ్యాలకవి మెచ్చుతునకలు. తెలుగునాట నిర్మల్‌తో పాటు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు సుప్రసిద్ధం. నిర్మల్‌ కళాకారులు వనమూలికల ఆధారిత రంగులతోపాటు విపణిలో లభించే తైలవర్ణాలనూ వాడతారు. కొండపల్లి వారు నీటిరంగులను వినియోగిస్తారు. ఏటికొప్పాక కళాకారులేమో లక్కతో కలిసిపోయే రంగులని సొంతంగా సృజించుకున్నారు. వీళ్ల బొమ్మలకు ముడిసరుకైన కర్రలోనూ తేడాలున్నాయి. నిర్మల్‌లో ‘తెల్ల పొలికి’ కర్రను వినియోగిస్తే, కొండపల్లిలో ‘కుమ్మర పొలికి’తో బొమ్మల్ని తీర్చిదిద్దుతారు. ఏటికొప్పాకలో ‘పాల కొడిశ/ అంకుడు’తో వివిధ ఆకృతులకు ప్రాణంపోస్తారు. ఈ మూడు ప్రాంతాల బొమ్మలపైనా విస్తృత పరిశోధనలు, విశేషాల నమోదు జరగాలి. మన వారసత్వ వైభవాలను భావితరాలకు అందించడానికి ఇది అత్యవసరం.
చేతులే మంత్రదండాలు
కర్మాగారంలో మాదిరిగా సాంచల్లోంచి నిర్మల్‌ బొమ్మలు ఉత్పత్తి కావు. ప్రతి బొమ్మనూ చేతులతోనే విడివిడిగా చేయాలి. ఈ బొమ్మల తయారీలో ఎన్నో దశలున్నా, ఎక్కడా ‘యాంత్రికత’ కనిపించదు. ప్రతి బొమ్మకూ కళాకారుడే ‘బ్రహ్మ’! అందుకే నిర్మల్‌ బొమ్మల్లో (పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు... మరెన్నో) సహజత్వం ఉట్టిపడుతుంది. ఈ బొమ్మలకు ఆయువుపట్టు తెల్ల పొలికి కర్ర. మృదువైన కర్ర ఇది. అయితే, అడవుల్లో ఈ చెట్ల సాంద్రత చాలా తక్కువ. పునరుజ్జీవమూ తక్కువే. అరకొరగా దొరుకుతున్న కర్రతో కళాకారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతి ఘనపు మీటరు కర్రకూ ఏడున్నర వేల రూపాయల్ని వెచ్చిస్తున్నారు. సంబంధిత ఖర్చులని జోడిస్తే ఇంకా ఎక్కువైతుంది. ఇదే కర్ర 1967లో రూ.యాభైకి దొరికేదట!
      ‘‘కులమత జాతివైరములు కూడిన మానవ జాతిలోననే/ కలగవు శాంతిభద్రతలు కాని విరోధములెల్ల మాని బె/ బ్బులులు కిశోర ఘోర మృగముల్‌ గజముల్‌ మరి దుప్పులొక్కచో/ కలిసి వసించు చుండు వాహవా! మన నిర్మల్‌ చిత్రశాలలో!’’... బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విశ్రాంత అధికారి కేశవాచార్య ఆశువుగా చేసిన ప్రశంస ఇది. నిర్మల్‌ కొయ్యబొమ్మలు- చిత్ర కళాకారుల సహకార సంఘం ప్రదర్శనశాలను చూసినవాళ్లందరూ అదే అనుభూతికి లోనవుతారు. నిర్మల్‌ బస్టాండుకు అరకిలోమీటరు దూరంలోనే ఇది కనువిందు చేస్తుంది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన నిర్మల్‌ జిల్లాకు ప్రధాన గుర్తింపు ఇక్కడి కొయ్యబొమ్మలు, చిత్రాలే!
శతాబ్దాల చరిత్ర
చూపరులను కట్టిపడేసే నిర్మల్‌ కళాకృతులను తీర్చిదిద్దే కళాకారులు ‘నకాషీ’ వర్గీయులు. సోమక్షత్రియులుగానూ వ్యవహారంలో ఉన్నారు. వీరి పూర్వికులు రాజస్థాన్‌ ప్రాంతీయులట! పదిహేడో శతాబ్ద కాలంలో అప్పటి రాజులు, వారి వారి ఇష్టాల్ని బట్టి కళాపోషణ చేసేవారు. ఒక్కో రకం కళకి సంబంధించి నైపుణ్య బృందాలని పిలిపించుకుని, పోషించేవారు. అలా నిర్మల్‌కు వచ్చిన ఓ బృందం కర్ర మీద నగిషీ పని చేసేది. కాలక్రమంలో వాళ్లే కొయ్యబొమ్మల కళాకారులుగా మారారు. రాజుల కాలంలో వీరు వివిధ అలంకరణ వస్తువులను తయారుచేసేవారు. ‘గంజిఫా’ అనే ఆట ఆడుకోవడానికి కొయ్యతోనే కార్డులను రూపొందించేవారు. అమ్మాయిని అత్తవారింటికి సాగనంపుతూ పుట్టింటివారు (ముఖ్యంగా ముస్లింలు) పంపే సామగ్రిలో నిర్మల్‌ కళావస్తువులూ ఉండేవట. ఆనాడు నిర్మల్‌ కళాకారులు నిజాంకు బహుకరించిన కొయ్యబొమ్మలు, చిత్రాలు, పరదా స్టాండు తదితరాలను హైదరాబాదు సాలార్జంగ్‌ ప్రదర్శనశాలలో చూడవచ్చు. 19వ శతాబ్దంలో నిర్మల్‌ పంచపాత్రలు బాగా వాడుకలో ఉండేవి. ‘‘నిర్మల పంచపాత్రలు ఈ ప్రాంతములలో బహు ప్రసిద్ధిగానున్నవి’’ అంటూ ‘కాశీయాత్రా చరిత్ర’లో చెప్పారు ఏనుగుల వీరాస్వామయ్య.
      స్థానిక వనరులైన వనమూలికలు, ఇతర పదార్థాలతో రంగుల్ని సృజించడంలో నిర్మల్‌ కళాకారులు ప్రవీణులు. అయితే, ఇలా తయారుచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదీగాక, వనమూలికల కొరత! ఇక వాటి సేకరణ, ప్రయాసతో కూడిన పని. దాంతో ముప్పయి ఏళ్ల నుంచి ప్రకృతి ఆధారిత రంగుల వాడకం కాస్త తగ్గింది. అవసరాలు, గిరాకీలను బట్టి విపణిలో దొరుకుతున్న రంగుల్నీ వాడుతున్నారు. బంగారు, వెండి రంగులతో పాటు నలుపు, జాజు (మట్టి) వర్ణాలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలాగే, ఆనాటి కళాకృతులూ ఇప్పుడు మరుగునపడ్డాయి. నేటితరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యభరితమైన ఆకృతుల్లో బొమ్మలను రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ వారి ‘గోల్కొండ’ గవాక్షం ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. హస్తకళా ఉత్పత్తులను అమ్మే ఆన్‌లైన్‌ సంస్థల ద్వారానూ పొందవచ్చు.
అజంతా అందాల విందులు
కొయ్యబొమ్మల మాదిరిగానే, నిర్మల్‌ వర్ణచిత్రాలూ మొదటి చూపులోనే ఆకర్షిస్తాయి. కలకాలం మనసులో అలాగే నిలిచిపోతాయి. నలుపు నేపథ్యంలో (బేస్‌ కలర్‌) వేసిన ప్రతి రంగూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సొంతంగా తయారుచేసుకునే లప్పాన్ని హార్డ్‌బోర్డు మీద ముందు పొరలు పొరలుగా వేసుకుంటూ రావడం వల్ల వీటి అందం ద్విగుణీకృతమవుతుంది. కుంచెలను కూడా ఉడత బొచ్చుతో చిత్రకారులే తయారుచేసుకుంటారు. ఒక్క వెంట్రుకతో కూడా రంగులు వేయగల స్థాయిలో వాటిని రూపొందించుకుంటారు. దాంతో సూక్ష్మ వివరాలని కూడా చాలా అందంగా చూపగలుగుతారు. వీళ్ల సృజనల్లో ప్రేయసి- ప్రియుడు, కృష్ణుడు- రాధ, అన్ని మతాల దేవతలు, జానపద చిత్రాలు ముఖ్యమైనవి. అన్నీ కలిపి వంద రకాల చిత్రాలను ఈ కళాకారులు సృజిస్తారు. అజంతా గుహల్లోని చిత్రాలకు వీళ్లు చేసే పునశ్చిత్రణలు విరివిగా అమ్ముడుపోతుంటాయి. మన దేశాన్ని సందర్శించే విదేశీ ప్రముఖులకు విదేశాంగ శాఖ బహూకరించే జ్ఞాపికల్లో కొన్నేళ్ల కిందటి వరకూ నిర్మల్‌ చిత్రాలూ ఉండేవి. 
సంతోషమే కానీ...
నిర్మల్‌ కళ పూర్తిగా నకాషీ కుటుంబాలకే పరిమితమైన సృజన. కళాకారుల్లో మగవాళ్లు సంఘం కార్యశాలకు వచ్చి బొమ్మలను సృజిస్తూ ఉంటారు. మహిళలు మాత్రం ఇళ్లలోనే తీరిక సమయాల్లో పండ్లు, కూరగాయలు లాంటివి చేసి,       సంఘం ప్రదర్శనశాల ద్వారా అమ్ముతుంటారు. అసంఘటితంగా కొనసాగుతున్న వీళ్ల ప్రస్థానం 1955లో కీలకమైన మలుపు తిరిగింది. సహకార సంఘం (నిర్మల్‌ టాయ్స్‌ అండ్‌ ఆర్ట్స్‌- ఇండస్ట్రియల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌) ఏర్పాటైంది. మూడేళ్లకోమారు తొమ్మిదిమంది సభ్యులతో ఏర్పాటయ్యే యాజమాన్య సంఘం దీని బాధ్యతలను చూస్తుంది. 
      సంఘం వచ్చిన తర్వాత క్రమబద్ధమైన విక్రయ సౌకర్యాలూ అందుబాటులోకి వచ్చాయి. మొదటి ఏడాదిలో రూ.11 వేల మేరకు అమ్మకాలు నమోదయ్యాయి. ఈ అరవై ఏళ్లలో అవి 354 రెట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.39 లక్షలకు చేరుకున్నాయి. వీటిలో కొయ్యబొమ్మల వాటా 70 శాతానికి పైగా ఉంటుంది. మరోవైపు, చిన్న పరిశ్రమల వార్షిక విక్రయాలు రూ.40 లక్షలు దాటితే పన్నుల చట్టాల పరిధిలోకి వస్తాయి. నిర్మల్‌ సహకార సంఘానికీ త్వరలో అవి వర్తించబోతున్నాయన్నది సుస్పష్టం. అలా జరిగితే, బొమ్మల ధరలు పెంచక తప్పదు. ఫలితంగా కొనుగోళ్లు తగ్గిపోతే, అసలుకే మోసం! ‘‘ఇవి హస్తకళలు, యంత్రపు ఉత్పత్తులు కావు. ఇలాంటి కళల్ని కాపాడుకోవాలంటే పన్నులకి సంబంధించిన చట్టాలని స్నేహపూర్వకంగా మార్చి, మినహాయింపు ఇవ్వడమే ఏకైక మార్గం’’ అన్న సంఘం కార్యదర్శి శంకర్‌ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. 
అయ్యో..! వారసులేరి?
ఆరు దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వం చేయూతతో సంఘానికి ఓ భవనం సమకూరింది. తర్వాత ఆదిలాబాదు జిల్లా (ఇటీవలి వరకూ నిర్మల్‌ ఇందులో భాగం) యంత్రాంగం తోడ్పాటుతో సొంత ప్రదర్శనశాల వచ్చింది. అలాగే, ఈ    కళాకారులందరూ ఒకేచోట నివసించేలా ఎకరన్నర విస్తీర్ణంలో ‘కళానగర్‌’ ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ కొయ్యబొమ్మలు తయారుచేసేవారు సుమారు అరవైమంది ఉన్నారు. చిత్రకారులు పదిమంది వరకూ ఉంటారు. ఈమధ్య ఇద్దరు చిత్రకారులు హైదరాబాదుకు మకాం మార్చారు. ఉపాధి అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
      కళాకారుడిగా ఎదగడానికి, బొమ్మలు చేయడానికి కనీసం రెండేళ్ల శిక్షణ కావాలి. బాసింపట్టు వేసుకుని, రోజూ 8- 10 గంటల పాటు ఏకాగ్రతతో పనిచేయాలి. కావాల్సిన సామగ్రిని (ముఖ్యంగా రంగులు) తనకుతానే తయారు చేసుకోవాలి. ఇంతా చేస్తే, నెల సంపాదన రూ.పది వేలకు మించదు. పింఛను వసతులు లేకపోవడం వల్ల జీవిత చరమాంకంలో కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న ‘నకాషీ’ యువత ఈ కళ వైపు రావట్లేదు. ముఖ్యంగా చదువుకున్న వాళ్లు ఈ కళను జీవనోపాధిగా ఎంచుకోవట్లేదు. సంఘం కార్యదర్శిగా పనిచేసిన ఓ కళాకారుడు కొన్నేళ్ల కిందట చనిపోయారు. ప్రస్తుతం ఆయన భార్య మాత్రమే తీరిక సమయాల్లో కూరగాయల బొమ్మలను చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కుటుంబం నుంచి కొయ్యబొమ్మల ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి! ఎందుకంటే, ఈ దంపతుల ఇద్దరు అబ్బాయిలూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలాగైతే భవిష్యత్తులో నిర్మల్‌ కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే, ఇతర సామాజిక వర్గాల వారు ఈ కళను నేర్చుకుని, జీవనోపాధిగా మార్చుకున్న ఉదంతాలు ఇప్పటికైతే లేవు. నాలుగు దశాబ్దాల కిందట కొన్ని ప్రయత్నాలు జరిగినా అంతగా విజయవంతం కాలేదు. అలాగే, ఈ కళకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ సదుపాయాలంటూ ఏవీ లేవు. ఆసక్తి ఉన్నవారు సంఘం యజమాన్యంతో మాట్లాడి ‘గురు-శిష్య’ పద్ధతిలో నేర్చుకోవచ్చు.
పాలకులూ.. పారాహుషార్‌!
నిర్మల్‌ కళాకారుల్లో చెయ్యితిరిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లు ఇప్పటి వరకూ పదిహేను పైగా విశిష్ఠ పురస్కారాలను అందుకున్నారు. సీనియర్‌ కళాకారుడు రాచర్ల లింబయ్య పదేళ్ల కిందట ఉపరాష్ట్రపతి నుంచి ‘శిల్పిగురు’ బిరుదును స్వీకరించారు. మరో కళాకారుడు నర్సింగం రెండుసార్లు జాతీయ, రాష్ట్రస్థాయి సత్కారాలను అందుకున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం నిర్మల్‌ సంఘానికి పురస్కార ప్రదానం చేసింది. అలాగే, నిర్మల్‌ కళాకారులు సూరజ్‌ఖుండ్‌ (హరియాణా) హస్తకళా ప్రదర్శనలో ‘కళామణి’ గౌరవాన్నీ అందుకున్నారు.మనదేశం అసంఖ్యాక హస్తకళలకి పుట్టినిల్లు. ఆధునికీకరణ పంజా విసురులో ఎన్నో కళలు అంతరించిపోయాయి. మరికొన్ని మరణశయ్య మీద కునారిల్లుతున్నాయి. ఈ పరిస్థితులను తట్టుకుంటూ సమష్టిగా ముందడుగు వేస్తున్నారు నిర్మల్‌ కళాకారులు. వాళ్లకు ప్రభుత్వ సహకారం అందితే ఈ కళ నాలుగు తరాల పాటు నిలుస్తుంది. పొలికి కర్ర సరఫరాలో ఇక్కట్లు తొలగించడం, పన్ను చట్టాల నుంచి మినహాయింపు ఇవ్వడం, వృద్ధ కళకారులకు పింఛన్ల మంజూరు... ఈ మూడింటినీ పాలకులు నెరవేర్చుతారని కళాకారులు ఆశిస్తున్నారు. తమ కళా సృజనలతో తెలుగునేల ఖ్యాతిని నలుదిశలా చాటుతున్న వాళ్లకు ఆమాత్రం చేదోడువాదోడుగా నిలవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. హస్తకళలు ఏవైనా సరే, అపురూపమైనవి. నకలు అసాధ్యమైనవి. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించు కోలేనివి. ఈ విషయాలను అందరూ గుర్తుంచుకుంటే చాలు.


ప్రభుత్వం అండగా ఉండాలి
నిర్మల్‌ బొమ్మలను చూసి అందరూ ఆనందపడతారు. వాటి వెనక ఉండే కళాకారుల గురించి మరింత పట్టించుకోవాలి. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా... ప్రభుత్వం పరిశ్రమకు అన్నివిధాలా తోడ్పడాలి. అప్పుడే నాలుగు కాలాలపాటు ఈ కళ బతుకుతుంది.

- బ్రహ్మ రౌతు శంకర్‌, మేనేజర్‌


ఆరోగ్యానికేది రక్ష?
వృత్తిపరంగా ఎన్నో అనార్యోగాలు చుట్టుముడుతున్నాయి. పరిశ్రమని బతికించుకునే ప్రయాసలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ విషయం మీద దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలి.

- సముద్రాల పెంటయ్య, సంఘం యాజమాన్య కమిటీ అధ్యక్షులు


కాలానుగుణంగా శిక్షణ
ఈ ప్రాచీన కళ అంతరించకుండా బతికించుకోవాలి. ఈ విషయంలో పాలకుల సహాయ సహకారాలు తప్పనిసరి. కొత్త డిజైన్లలో శిక్షణ కావాలి. వినియోగదారుల అవసరాలకు అనుకూలంగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి.

- నాంపల్లి లింబయ్య వర్మ, కమిటీ సభ్యుడు


ఆ పథకం వర్తింపజేయాలి
గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో పదిహేడు మంది మాత్రమే ఇళ్లు కట్టుకున్నారు. వాళ్ల కుటుంబాలు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వపు రెండు గదుల ఇళ్ల పథకాన్ని నిర్మల్‌ కళాకారులకూ వర్తింపజేయాలి.

- గాజర్ల నారాయణ, కమిటీ సభ్యుడు


*  *  *

 

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు