జీవితమే ఒక దీపావళి

  • 498 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డి.కస్తూరి రంగనాథ్‌

  • షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా
  • 8008573907
డి.కస్తూరి రంగనాథ్‌

వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు... అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు... చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు... మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే రోజు... దీపావళి పేరెత్తగానే సహజకవి మల్లెమాల ఇలా కలమెత్తుకుంటారు! ఆయనొక్కరే కాదు, జీవితంలోని తిమిరాన్ని తరిమే జ్యోతికి జోహార్లర్పిస్తూ ‘అక్షరాలా’ వెలుగు పూలు పూయించిన తెలుగు చిత్ర గేయ రచయితలెందరో!
ఆశ్వయుజ
కార్తీక మాసాల సంధికాలం... లోక కంటకుడు నరకుణ్ని సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు సంహరించిన శుభ సమయం. కమ్ముకున్న చీకట్లను చీల్చుకుంటూ వెలుగురేకలు ఉదయించిన కాలం. అప్పటి వరకూ శోకంతో  తల్లడిల్లిన గుండెలన్నీ సంకెళ్లు తెంచుకుని సంతోషంతో సంబరాలు జరుపుకున్న తరుణం. ఆనాటి ఆ వేడుకలే దీపావళి వెలుగులయ్యాయి. తరతరాలుగా ఆకాశమైదానంలో హరిపుష్పాలై విచ్చుకుంటూనే ఉన్నాయి. 
      దీపావళి నాడు సూర్యోదయానికి పూర్వమే తలంటుకుని మంగళస్నానాలు చేయడం ఆనవాయితీ. కొత్తబట్టల్లో మెరిసిపోతూ ఇల్లంతా కలియదిరగడం ఓ మధురానుభూతి. ఇక సాయంత్రం వేళకు లక్ష్మీపూజలు, కేదారేశ్వర నోములు ఓ వైపు... నిప్పుపూలను అందంగా విరజిమ్మే చిచ్చుబుడ్లు, అంతెత్తుకు ఎగురుతూ వెలిగే తారాజువ్వల సందడి మరోవైపు. జోరుజోరుగా సాగే ఆ సంబరాల్లో పెద్దలందరూ పిల్లలైపోతారు. పట్నానికి పల్లెకూ మధ్య గీత చెరిగిపోతుంది. ఎక్కడ చూసినా సంతోషాల సిరివాన జల్లులే! ఏ ఇంటికెళ్లినా ఆనందాల సెలయేటి పరవళ్లే! ఈ అందాల దీపావళిని తమ పాటల్లో మరింత అందంగా చూపించారు తెలుగు సినీ గేయ రచయితలు. 
      నరకాసుర వధ నేపథ్యంలో యాభైనాలుగేళ్ల కిందట ఎస్‌.రజనీకాంత్‌ దర్శకత్వంలో ‘దీపావళి’ చిత్రం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడు. సావిత్రి సత్యభామ. గోవిందుడు సతీసమేతంగా వెళ్లి దానవుణ్ని హతమార్చిన తర్వాత  ‘వచ్చింది నేడు దీపావళి... పరమానంద మంగళ శోభావళి’ అంటూ పాట మొదలవుతుంది. ‘ఇరులోకాల నరకుడు బాధించగా... హరి కరుణించి వెలుగును చూపించెను... శాంతి సాధించెను’ అంటూ చెప్పుకొస్తారు గీత రచయిత సముద్రాల రాఘవాచార్య. హరి అనుమతితోనే నరకుడి స్మృతిగా దీపావళి జరుపుకుంటున్నామని ముక్తాయిస్తారు. పౌరాణిక గాథాచిత్రం కాబట్టి ఇక్కడ దీపావళి పుట్టుకను మాత్రమే వివరించిన సముద్రాల... ఆ వెలుగుల పండుగ రోజు తెలుగు లోగిళ్లలో నెలకొనే సందడిని అప్పటికి పదేళ్లకు మునుపే అక్షరబద్ధం చేశారు. 1950ల నాటి ‘షావుకారు’లో  ‘దీపావళి దీపావళి... ఇంటింట ఆనంద దీపావళి... మాయింట మాణిక్య కళికావళి’ అంటూ తారాగణంతో పాడించారు.  దీపావళి అంటే ఆనందాల కల్పవల్లి, ప్రమోద తరంగావళి అని నిర్వచనమిచ్చారు. ‘జిలుగు వలువల అల్లుళ్ళ తళుకు కూతుళ్ళ కులుకు’ అంటూ పండుగ నాడు అత్తగారింట్లో అల్లుడి వైభోగాన్ని కళ్లకు కడతారు. నిండు దీపాల వెలుగులో చిటపట రవ్వల ముత్యాలు కురుస్తాయి, రత్నాలు మెరుస్తాయంటూనే తొలకరి స్నేహాల వలపుల వాన జోరందుకుంటుందని ప్రణయ చిత్రం చూపిస్తారు. అయితే, ఇదే సినిమాలో మరో సందర్భం... కలిసి జీవిస్తున్న రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది.  అప్పటి వరకూ ఉన్న ఆనందం ఆవిరి అవుతుంది. దాంతో ఆనంద దీపావళి కాస్తా ‘శోకాంధ తిమిరావళి’ అయిపోతుంది. దీపావళి నాడు ప్రమిదల్లో నూనెపోసి, ఒత్తి వేసి దీపాలు వెలిగిస్తాం... మన జీవితాల్లోనూ ప్రతినిత్యమూ వెలుగులే ఉండాలన్న ఆశతో! కానీ, జీవితమంటే సుఖాలనే వెలుగులే కాదు... కష్టాలనే నీడలూ ఉంటాయి. కొంచెం ఎక్కువ తక్కువలతో అందర్నీ వెంటాడుతూనే ఉంటాయి. 
బావకు నే మరదలిని!
మనసు కవి ఆత్రేయ కలం బలం లోకవిదితం. ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అంటూ ‘విచిత్రబంధం’ చిత్రానికి ఆయన రాసిన గీతం ప్రఖ్యాతం. దీపం వెలుగుతుంటే వెలుగుతోపాటు, ఆ ప్రమిద నీడ కూడా కొంతదూరం పడుతుంది. జీవితమూ అంతే. ఎంత సాఫీగా సాగినా అక్కడక్కడ అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటి గురించి రేఖామాత్రంగా చెబుతూ దీపావళిని ‘చీకటి వెలుగుల రంగేళి’ అన్నా... మిగిలిన పాటంతా సరదా సరదాగా నడిపిస్తారు ఆత్రేయ. ‘అక్కయ్య కన్నుల్లో మతాబులు... ఏ చక్కని బావకో జవాబులు’ అంటూ అక్కల్ని ఆటపట్టించే తమ్ముళ్లు, ‘బావాబావా పన్నీరు, బావను పట్టుకుతన్నేరు’ అంటూ అల్లరిచేసే మరదళ్లతో పండుగ నాడు ఇల్లంతా కోలాహలంగా ఉంటుందని చెబుతారు. మరదళ్లతో గిలికజ్జాలు పెట్టుకునే బావల గొంతులను కూడా తన గీతంలో వినిపిస్తారు ఆత్రేయ. ‘అమ్మాయి పుట్టింది అమాసనాడు, అసలైన గజదొంగ అవుతుంది చూడు’ ఓ విసురు విసురుతారు. ఇలా ఛలోక్తులతో సాగే బావా మరదళ్ల పరాచకాలు దీపావళికి అదనపు వెలుగులు తెస్తాయి. 
      కార్తీక్‌ అనే గీత రచయిత పేరు విన్నారా? 1960లో వచ్చిన అక్కినేని ‘పెళ్ళికానుక’లో ‘ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీ తోడ... ఆనందం పొంగేనోయి దీపావళి’ అంటూ ఓ పాట రాశారాయన. దీపావళి నేపథ్యంలో బిడ్డలపై అమ్మానాన్నల ప్రేమని అక్షరీకరించారు. ‘చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా... అరుదైన చిరుముద్దు అరువీయరారా’ అనే తల్లిదండ్రులు పండుగ పటాసులన్నీ తన చిన్నారికి జయం పలుకుతున్నాయని మురిసిపోతారు. ‘నీ రూపమే ఇంటి దీపము బాబూ’ అంటూ ముద్దులకొడుకును హత్తుకుంటారు. ఇక వేదాంతం రాఘవయ్యది మరో వేదాంతం!  ‘వచ్చింది దీపాల పండుగ... ఉన్నోళ్ల డబ్బంతా దండుగ’ అంటూ వర్గ దృక్పథాన్ని చిత్రీకరించారాయన తన ‘ఋణానుబంధం’లో. అయితే మాత్రం, సంతోషానికి కాసులు కొలబద్దలవుతాయా చెప్పండి! ‘ఉంటే... 10000 వాలా. లేకపోతే... ఉల్లిపాయ బాంబు’ - అంతే తప్ప, పండుగ పూట పైసల గోలెందుకు!
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
పండుగకు అత్తగారింటికి వచ్చి దర్జా వెలగబెట్టే అల్లుళ్లకు కొదవలేదు. కానీ, అల్లుడు తమ ఇంటికి రావడమే నిజమైన దీపావళి అని ఓ మామగారు అనుకుంటే...? ఆ అల్లుడు బంగారమనే కదా. అలాంటి మామా అల్లుళ్ల కథతో ముత్యాల సుబ్బయ్య తీసిన చిత్రం ‘మామగారు’. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ అందమైన గీతం ఉంది  ఇందులో. ‘ఇయ్యాలె అచ్చమైన దీపావళి... వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి... ఏనాడూ వెళ్లిపోని దీపావళి... ఏరికోరి ఎంచుకుంది మా లోగిలి’ అంటూ సాగే ఆ పాటలో ‘ఏల ఏల చుక్కల్లో యెలుగలన్నీ యెదజల్లి మా ఇంట వెలిశాడు ఆ జాబిలి’ అంటూ అల్లుణ్ని నెత్తినెక్కించుకుంటారు మామగారు. ఆనందం వెల్లివిరియాలే కానీ, ప్రతి అమావాస్యా దీపావళి పండుగే అవుతుందని చెబుతూ ఈ గీతానికి సరైన ముగింపు ఇచ్చారు సిరివెన్నెల.  
      దీపావళి అంటేే ఆనందాల పండుగేనా? అది ఓ వ్యక్తిత్వ వికాస పాఠం కూడా. దీపాల వరుసలు మన జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించినట్లే, మనం కాల్చే టపాకాయలు జీవిత పాఠాల్ని నేర్పుతాయి. చిచ్చుబుడ్డి అంతెత్తుకు నిప్పులు చిమ్ముకుంటూ ఎగసి ఆరిపోవడం, ఆకాశంలోకి ఎగసిన తారాజువ్వ నేలరాలడం చూస్తే శ్రీశ్రీ చెప్పిన ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే’ కవిత గుర్తుకు రావాల్సిందే. జీవితంలో ఎత్తుకు ఎదగడమే కాదు... పల్లాలూ ఉంటాయన్న సందేశాన్ని అందిస్తాయవి. ఇక తాను కరిగిపోతూ వెలుగునిచ్చే కాకరపువ్వొత్తు... సాటివారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు త్యాగం చెయ్యాలన్న దానికి ప్రతీకగా నిలుస్తుంది. ‘ఇది వెన్నెలరోజు’ అంటూ ‘రామయ్యతండ్రి’ చిత్రానికి పాట రాసిన మల్లెమాల కూడా ఇదే మాట అంటారు. ‘జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది... గువ్వల్లే బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది’ అని బతుకు లోతులను తడుముతారు. 
      మూడు జంటల ముచ్చటైన కథతో రాజా వన్నెంరెడ్డి తీసిన హాస్య చిత్రం ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’. భార్యల మాట వినకుండా సంసారాలను రోడ్డు మీదకు లాగే భర్తల నిర్వాకాలను తప్పుబట్టే చిత్రమిది. ఇందులోనూ ఓ దీపావళి గీతముంది. పండుగ పూట పిల్లాపాపలతో కలిసి సంబరాలు చేసుకుంటూ ‘జోరుజోరుగా సంబరాలు చెయ్యరే’ అంటూ పాటందుకుంటాయి ఆ జంటలు. ‘దినం దినం దినదినగండం సంసారం’ అంటూ ముగ్గురు భర్తలూ తమదైన ధోరణిలో గానం చేస్తారు. మధ్యలో ఓ పెద్ద ముత్తెదువ రంగంలోకి వచ్చి ‘నీ ఇంటిని మించే స్వర్గముంటుందా... ఇల్లాలిని మించే దేవత ఉంటుందా’ అంటూ వాళ్లకి బుద్ధి చెబుతుంది. ‘ఇంతలా సర్దుకుపోయే... రాధలా రసికత చూపే భార్య మాట గౌరవిస్తే శుభమస్తు’ అంటూ సత్యం బోధిస్తుంది. అంతేకదా మరి, సత్యభామ తోడు లేకుండా కృష్ణపరమాత్మ కూడా నరకాసురుణ్ని పడగొట్టలేకపోయాడాయే!
మాలచ్చి బంగారం
దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పినట్లు ‘అడుగడుగున బంగారం.. ఆకుపచ్చని సింగారం.. తొడగవమ్మ ఈ నేెలకు సస్యశ్యామల వేషం.. పాతాళ గంగమ్మ రారారా.. ఉరికురికి ఉబికుబికి రారారా.. పగబట్టే పామల్లే పైకీపాకి పరుగెత్తే జింకల్లే దూకీదూకి...’ అంటూ తమ పంటల బాగుకోసం వర్షాలు కురవాలని కోరుకుంటూ దీపావళి నాడు లక్ష్మీపూజలు చేస్తారు రైతులు. మరోవైపు ‘రావమ్మ మహాలక్ష్మి.. రావమ్మా.. ఈ  కోవెల నీ ఇల్లు కొలువై ఉందువు గాని...’ అంటూ ఆహ్వానించే ఇల్లాళ్ల భక్తిశ్రద్ధల నడుమ కోటికాంతులు నింపుకునే దీపావళి ఏటేటా కొత్తదనాన్ని సంతరించుకుంటూనే ఉంది. అందుకే ‘ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి.. ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలి..’ అని  కోరుకుంటారు మధురానుభూతులను ఆస్వాదించే పిల్లలు, పెద్దలు. తెలతెలవారుతుండగానే నిద్రలేచే పల్లెజీవులు ‘ఇంటింటా దీపావళి వచ్చేనమ్మా.. ఇంతి బంతి చామంతి పాడేనమ్మ.. కాకరపువ్వు కంకాళమ్మ ఆడేనమ్మా .. తారాజువ్వ తాయారమ్మ నవ్వేనమ్మా..’ అంటూ ఒక‌రినొక‌రు అల్లరిపెట్టుకుంటూ నవ్వులు పంచుకుంటారు. వేటూరి కలం భాషలో చెప్పాలంటే, ‘సిరులు కురిపించే శ్రీలక్ష్మిగా... కరుణపంచే మహాలక్ష్మిగా... అన్ని జగాలకు మూలమైన ఆదిలక్ష్మిగా పాడిపంటలను ఇచ్చే ధాన్యలక్ష్మిగా... భీరులనైనా వీరుల చేసే ధైర్యలక్ష్మిగా... జగతికి జయములు పంచే గజలక్ష్మిగా... వంశాలను నిలిపే సంతాన లక్ష్మిగా... కార్యాలను సఫలం చేసే విజయలక్ష్మిగా.. విద్యాబుద్ధులు నేర్పే విద్యాలక్ష్మిగా... సౌభాగ్య సంపదలిచ్చే భాగ్యలక్ష్మిగా, మొత్తంగా చెప్పాలంటే సకల ఐశ్వర్యాలను అందజేయగలిగే అష్టలక్ష్మి’గా కొలువుదీరిన లక్ష్మిదేవిది ఈ పండుగ. అందుకే భక్తితో నిండిన ప్రతి హృదయం ఈ రోజున ఆమెను కొలిచి తరిస్తుంది నిండుగ. 
      ఇక దీపావళిని అల్లుళ్ల పండుగగా కూడా అభివర్ణించారు చాలా మంది కవులు. ఎందుకంటే పెళ్లైన తొలి దీపావళికి అల్లుళ్లను ఇంటికి పిలిచి కానుకలు ఇవ్వడం అనాదిగా వస్తున్నదే. ఈ ఆనవాయితీపై వచ్చిన వ్యంగ్యం అంతా ఇంతా కాదు. ‘ఏమేవ్‌.. అల్లుడు దీపావళికి వస్తున్నానని ఉత్తరం రాశాడు. మీ నాన్న నాకు దీపావళికి ఏమిస్తాడో అడుగు. అదే అల్లుడిగారికి ఇచ్చేద్దాం’ అంటాడు భార్యతో ఓ గడసరి భర్త. ‘ఈ సారికి హెల్మెట్‌తో సరిపెట్టుకో అల్లుడు. స్కూటర్‌ వచ్చే ఏడు చూద్దాం’ అంటాడో మాటకారి మామ. ఏది ఏమైనా వెలుగుల పండుగ వచ్చిందంటే... ‘చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి కళ్లముందు కదిలి చూపించే మంచి మజిలీ’ అంటూ పాడుకునే కుటుంబాలు తెలుగు నేల నలుమూలలా ఉన్నాయి.
      ‘దీపావళి వచ్చింది... దివిటీలెన్నో వెలిగించింది... చీకటినంతా పారద్రోలి చిరంజీవిగా నిల్చింది’ అని గానం చేసే పట్టణ జనం.... ‘దిబ్బు దిబ్బు దీపావళి - మళ్లీ వచ్చే నాగులచవితి’ అంటూ పాడుకునే జానపదం... వెరసి వెలుగుల పండుగ నాడు తెలుగునేల అంతా వర్ణరంజితమవుతుంది. హరిచాపాన్ని మించిన అందాలను అద్దుకుని నయన మనోహరంగా దర్శనమిస్తుంది. 
      ఆ మట్టి సౌందర్యాన్ని ఆరాధిస్తూ సినీ కవులు రాసిన గీతాలు... తేనెల తెలుగు సొనలు. చలనచిత్రాల వంటి ప్రభావవంతమైన మాధ్యమాల్లో పండుగల వైశిష్ట్యాన్ని వివరించే ఇలాంటి పాటలు మరింతగా వస్తుంటే, ఆ రకంగానైనా నవతరానికి మన సాంస్కృతిక ఔన్నత్యం తెలుస్తుంది. అందుకు అక్షరసాయం చేసే వారందరూ అక్షరాలా మహానుభావులే.


వెనక్కి ...

మీ అభిప్రాయం