కొకు చెప్పిన చ‌దువు

  • 443 Views
  • 18Likes
  • Like
  • Article Share

ఆధునిక తెలుగు సాహితీ సీమలో ప్రసిద్ధ రచయితల వరుసలో ముందుగా గుర్తుకు వచ్చే వాళ్లలో కొడవటిగంటి కుటుంబరావు ఒకరు. నవల, కథ, గల్పిక లాంటి ఆధునిక ప్రక్రియల్లో పన్నెండు వేలకు మించిన పుటల సారస్వతాన్ని మనకు మిగిల్చారాయన. తెలుగునేలపై స్వాతంత్య్రానికి ముందున్న విద్యా వ్యవస్థ తీరుతెన్నులను కళ్లకుకట్టే ‘చదువు’ ఆయన ప్రసిద్ధ నవల. దీని రచనా కాలం 1950- 51. ఈ నవలలో విద్యా వ్యవస్థతోపాటు... 1915-35ల మధ్యకాలపు సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల చిత్రణ కూడా ఉంది. 
      చదువుకునే ప్రయత్నంలో ప్రధాన పాత్ర అయిన సుందరానికి ఎదురైన అనుభవాలే ఈ నవల ఇతివృత్తం. సుందరం జీవితం తన జీవితమే అని పాఠకులు భ్రమించేటట్లుగా ఈ నవలను మలచారు కొకు. అందుకే, ఇందులోని సన్నివేశాలు ‘నేను స్వయంగా చూసి రాసినవే తప్ప, ఇందులో ఉన్నది నా జీవితం మాత్రం కాద’ంటారాయన.
      సుందరం తల్లి సీతమ్మకు తన కొడుకును బాగా చదివించాలన్నది కోరిక. ఆమెకు భాగవతంలోని ‘చదవని వాడజ్ఞుండగు...’ పద్యం ఆదర్శం. సుందరానికి అయిదో ఏట అక్షరాభ్యాసం చేయిస్తారు. రాఘవయ్య బళ్లో చేరిన సుందరం ఆయన చదువు చెప్పకపోగా, పిల్లల్ని అనవసరంగా కొడుతుండటంతో రెండో రోజునే బడి మానేస్తాడు. కారణం తెలుసుకున్న తల్లి ‘‘నేను చెబుతానులేరా’’ అంటుంది. సుందరానికి తల్లి మాటలపై నమ్మకం కుదురుతుంది. తల్లివొడిగా అక్షరాలు నాలుగైదు రోజుల్లోనే నేర్చుకుంటాడు. దాంతో సీతమ్మ భర్తతో సుందరానికి వర్ణమాలంతా వస్తుందని చెబుతుంది. తండ్రి శ్రీమన్నారాయణ పిల్లాణ్ని అక్షరాలు రాయమంటాడు. వాడు రాస్తుంటే ఇలాగేనా రాసేది అని మందలిస్తాడే కానీ, అంత త్వరగా అక్షరాలు ఎలా వచ్చాయన్నదాన్ని ఆలోచించడు. పిల్లలకు లాలనతో నేర్పితేనే చదువు ఒంటబడుతుందన్నది కొకు అభిప్రాయం.
      తర్వాత సుందరం తల్లితో ‘అక్షరాలు వ‌చ్చాయి కదా అమ్మా, నేనిప్పుడు మాటలన్నీ రాయగలనా’ అంటాడు. దానికి  ‘నీకింకా గుణింతాలు, ఒత్తులు రావాలి కదా’ అంటుంది తల్లి. ఆమె మెప్పును పొందాలనుకుని ‘అమ్మా, నీ పేరు రాయనా’ అంటాడు. ‘ఒత్తులు రాందే ఎలా’ అని అడుగుతుంది తల్లి. పలకపై ‘అమ’ అని రాస్తాడు. ‘ఇది అమ్మ కాదు’ అంటుంది సీతమ్మ. మళ్లీ కాసేపటికి ‘అమ్మా, నీ పేరు రాయలేనంటివే రాశా చూసుకో’ అంటూ వస్తాడు సుందరం. పలకపై ఉన్న అక్షరాలు చూసిన సీతమ్మ నిర్ఘాంతపోయి కొడుకును ముద్దు పెట్టుకుంటుంది. సుందరం రాసింది ‘అంమ’. ఇక్కడ పిల్లల పరిశీలనా శక్తిని గమనించి అక్షరీకరించాడు కొకు. ఏడాదిపాటు వీధిబడిలో చదువుకొని హైస్కూలులో చేరతాడు సుందరం. ఆ తర్వాత తనకు పిల్లనిచ్చిన మామగారింట్లో ఉండి కళాశాల చదువు పూర్తి చేస్తాడు. తర్వాత కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి ఎంఏ, ఎలెల్బీ చదివేందుకు వెళ్తాడు. స్వాతంత్య్రోద్యమం కారణంగా కళాశాల మూయడంతో తిరిగి వచ్చేస్తాడు. మళ్లీ కళాశాల తెరిచినా, ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో చదువు ఆపేస్తాడు. అయితే అంత చదువు చదివిన సుందరానికి ఉద్యోగం దొరకదు. తన రచనలు అచ్చువేసే పత్రికల పారితోషికంపై ఆధారపడి సంసారాన్ని నెట్టుకొస్తుంటాడు. సుందరం కొడుకు కూడా తల్లి నేర్పించిన అక్షరాలు దిద్దుతుంటాడు. అది గమనించిన సుందరం భార్యతో ‘‘వీడు అక్షరాలు దిద్దుతాట్టే’’ అనడంతో నవల ముగుస్తుంది.
నాటి విద్యావ్యవస్థ
సుందరం తొలుత చదివింది వీధిబడిలో. అప్పట్లో వీధిబళ్లలో ప్రాథమికంగా చదివించి తర్వాత హైస్కూల్లో చేర్చేవాళ్లు. అయితే వీధిబడి ఉపాధ్యాయులు క్రమశిక్షణ, భయభక్తుల పేరుతో పిల్లల్ని కొట్టడం, బండకొయ్య కట్టడం, కోదండం ఎక్కించడం లాంటి శిక్షలకు గురిచేసేవారు. శిక్షణ కంటే శిక్షలు ఎక్కువ కావడంతో చదువుకునేందుకు వచ్చిన పిల్లలు కాస్తా బడిమానేసేవాళ్లు. రాఘవయ్య బడిలో చేరిన రెండోనాడే సుందరం బడి మానడం దీనికి ఉదాహరణ. పిల్లల్ని కొట్టకుండా, లాలించి చదువుపట్ల ఆసక్తి కలిగించాలే కానీ, క్రమశిక్షణ పేరుతో భయానికి గురిచేయొద్దన్నది కుటుంబరావు ఉద్దేశం. 
      దేశంలో బ్రిటిష్‌ పాలన వేళ్లూనుకోవడంవల్ల ఇంగ్లిషు తప్పనిసరిగా నేర్చుకునేవాళ్లు. అందుకే సుందరం చదివే బడిలో మాస్టరు మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండే గెలవాలి అని తీర్మానిస్తాడు. జర్మనీ గెలిస్తే ‘‘ఏమవుతుంది. ఇంగ్లీషు మాని జర్మనీ నేర్చుకోవాలి’’ అంటాడు. మళ్లీ మొదటి నుంచి చదవాల్సి వస్తుందేమో... అదంతా అయిపోవాలంటే చాలా కాలంపడుతుంది, అందుకని ఇంగ్లిషువాళ్లే యుద్ధంలో గెలవాలనుకుంటాడు సుందరం. 
      అయిదో ఫారం చదువుతున్నప్పుడు తర్వాత ఏం చదవాలన్న సందేహం వస్తుంది సుందరానికి. టైపురైటింగ్, షార్ట్‌హ్యాండ్‌ నేర్చుకుంటే పెద్ద చదువులకు వెళ్లలేనివాళ్లకు ఏదో ఒక ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. సుందరమేమో పరిస్థితి బాగా లేకున్నా లెక్కలను ప్రధానంగా ఎంచుకొంటాడు. పైగా చదువుకీ డబ్బుకీ ముడిపెట్టడం ఎందుకు అనుకుంటాడు. బాగా చదువుకుంటే బాగా బతకొచ్చన్నది సుందరం ధోరణి. లెక్కలు తీసుకుంటే తెలివైనవాళ్లు, హిస్టరీ అంతగా తెలివితేటలు లేనివాళ్లు తీసుకుంటారన్న అభిప్రాయాలు అప్పటికే ఉన్నాయేమో. అయితే అప్పటి ప్రముఖ నాయకులకు ఆల్జీబ్రా, ఫిజిక్సు రాకున్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయాన్ని శ్రీనివాసరావు పాత్రతో చెప్పిస్తారు కొకు. 
      ఇక స్వరాజ్య సమరంలో తెరపైకి వచ్చిన జాతీయ విద్యాలయాల స్థాపన అంతగా ప్రాచుర్యం పొందలేదని సుందరం మేనమామ శేషగిరి అనుభవం నుంచి తెలుస్తుంది. అయితే జాతీయ విద్యాల యాలు వృత్తివిద్యకు ప్రాధాన్యతనిచ్చాయని పాఠకులకు అర్థమవుతుంది.
స్త్రీల పరిస్థితి
‘చదువు’లో సుందరంతో పాటు నడిచే మరో ప్రధాన పాత్ర సీతమ్మ. ఈమె సగటు భారతీయ గృహిణికి ప్రతీక. తనకు చదువుకోవాలని ఉన్నా చదువుకోలేక పోతుంది. అయితే ఇంట్లోవాళ్ల నుంచి కొంత అక్షరజ్ఞానం సంపాదించుకుంటుంది. అందుకే సుందరాన్ని బాగా చదివించాలనుకుంటుంది. మొత్తానికి ఆడపిల్లల చదువుపట్ల అంతగా శ్రద్ధ చూపకపోయేవారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. ఆదర్శవాది అయిన శేషగిరి కూడా తన కూతురు కృష్ణవేణికి బాల్య వివాహమే జరిపిస్తాడు. ఆదర్శానికి ఆచరణకు ఉన్న అగాధాన్ని ఈ సంఘటన ద్వారా ఎత్తి చూపుతారు కొకు. 
      బ్రహ్మసమాజం ఆలోచనలతో, వీరేశలింగం పంతులు స్ఫూర్తితో కోస్తా ప్రాంతంలో వితంతు పునర్వివాహాల అంశం తెరపైకి వచ్చింది. దీనిని కూడా ‘చదువు’లో స్పృశించారు కొకు. వితంతు వివాహాలు చాలా తక్కువగా జరిగేవనీ (అవీ రహస్యంగానే) తెలుస్తుంది. అప్పటికే వరకట్న దురాచారం సమాజంలో బాగా నాటుకుపోయింది. తన పెళ్లికి కట్నం తప్పనిసరిగా ఇవ్వాలని తల్లి పట్టుపట్టడం మానవత్వానికి జరుగుతున్న మహాపచారంగా భావిస్తాడు సుందరం.
సామాజిక ఆర్థిక పరిస్థితులు
ఈ నవల రాసిన పరిస్థితులు ప్రపంచయుద్ధాల నడిమి కాలానివి. యుద్ధంవల్ల ధరలు బాగా పెరిగాయి. దాంతో ఎవరిళ్లలో వాళ్లు కూరగాయలు పెంచుకుంటున్నట్లు చెప్పారు రచయిత. అయితే, కూరగాయలను అమ్ముకోవడాన్ని ఆనాటి వారు తప్పుగా భావించేవారన్నదీ ఈ నవలవల్ల బోధపడుతుంది. ఇంకా కొత్త కొత్త వస్తువులు మనదేశ మార్కెట్టును ఆక్రమించినట్లు తెలుస్తుంది. సందర్భానికి తగినట్లు లోకమాన్య తిలక్, మాలవ్యా, బ్రిటిష్‌ చట్టాలు, ఉద్యమాల ప్రస్తావన ఈ నవలలో కనిపిస్తుంది. గ్రామ్‌ఫోన్‌ రికార్డు, సినిమాలు, నాటకాలు లాంటి ఆధునిక ప్రక్రియల పక్కనే విప్రవినోదుల్లాంటి సంప్రదాయ ప్రదర్శనలూ దర్శనమిస్తాయి. 
      ఇక 1930లలో ప్రపంచాన్ని చుట్టిన ఆర్థిక సంక్షోభం ప్రభావం మనదేశంపైనా పడింది. ఆర్థిక కాటకపు రోజుల గురించి కొకు ‘గడ్డురోజులు’ నవల రాసినా, ఇందులోనూ ఆ ప్రస్తావన కనిపిస్తుంది. ఆర్థిక సంక్షోభంవల్ల సుందరం ఆస్తి అంతా కరిగిపోతుంది. అద్దె ఇంట్లో కాపురం ఉంటాడు. ఎమ్మే చదివిన సుందరానికి ఏ ఉద్యోగమూ దొరక్క ఇబ్బంది పడతాడు. కానీ టైపురైటింగు నేర్చుకున్న అతని స్నేహితుడు నాగేశ్వరరావు ఓ ఉద్యోగంలో స్థిరపడతాడు. అందుకే ‘‘విద్య అంటే జ్ఞానం సంపాదించడం. జ్ఞానం రెండు విధాలు. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ. ఈ రెండు రకాల జ్ఞానమూ విద్య ద్వారా లభ్యం కావాలి.’’ అంటారు  కుటుంబరావు. చదువు పరమార్థం కేవలం పుస్తకాలే కాకుండా... జీవితంలో ఏ క్షణంలోనైనా ఆపద్ధర్మంగా ఆదుకునేలా ఉండాలి. ఇదే ‘చదువు’ సారాంశం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు 1910ల నుంచి 1990ల నాటి ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ప్రభావం పడని తెలుగు సమాజం కళ్లముందు మెదులుతుంది. 
      అప్పటికీ ఇప్పటికీ ఆంగ్లం ప్రభావం మరింత ఎక్కువైంది. పిల్లలకు చిరుప్రాయం నుంచే మార్కులు బాగా తెచ్చుకోవాలన్న ఒత్తిడి పెరిగింది. టీవీలు, అంతర్జాలం విస్తరించడంతో ఆటపాటలు కనుమరుగ వుతున్నాయి. సుందరం తండ్రి శ్రీమన్నారాయణ ‘‘పిల్లలు మేస్టరు దగ్గిర, పుస్తకాల్లోనూ నేర్చుకునే దానికన్నా తోటి పిల్లల దగ్గిర ఎక్కువ నేర్చుకుంటారు... చదువుకున్నప్పుడు చదువుకోవాలి. ఆడుకున్నప్పుడు ఆడుకోవాలి’’ అని సీతమ్మతో చెప్పిన మాటలు ఇప్పటికీ బాగా వర్తిస్తాయి. అందుకే ‘చదువు’ ఒకతరం విద్యా వ్యవస్థకు ప్రతినిధి మాత్రమే కాదు... సమకాలీన సమాజాన్నీ ప్రతిబింబించే సార్వకాలిక అంశాల సమాహారం.


వెనక్కి ...

మీ అభిప్రాయం