చిత్రసీమలో రెక్కల కుంచె

  • 181 Views
  • 1Likes
  • Like
  • Article Share

    రావి కొండలరావు

  • హైదరాబాదు
  • 9848071175
రావి కొండలరావు

‘‘తెలుగింటి ఆడపడుచు అంటారు - ఎలా ఉంటుందండీ?’’
‘‘బాపుగారి బొమ్మ చూడండి’’
‘‘పదహారణాల తెలుగమ్మాయంటారు. అంటే?’’
‘‘బాపుగారి బొమ్మ చూడండి’’
మధ్య పాపిడి,
పొడవాటి వాలుజడ, వేలాడుతున్న జడగంటలు, నుదుటన ఎర్రని బొట్టు, విశాలమైన కళ్లకి నల్లని కాటుక, చేతుల నిండా గాజులు, లంగావోణి, పాదాల మీద అందమైన పట్టీలు, వేళ్లకి గోరింటాకు, ఎర్రని పెదవులతో నవ్వుతూ ఎవరైనా కనిపిస్తే ఆ అమ్మాయి కచ్చితంగా తెలుగింటి అమ్మాయే. అంతర్జాతీయ చిత్రకారుడు బాపు తన చిత్రాల్లో తెలుగుదనం అద్దాడు. కత్తిరించిన జుట్టుతో ముఖాన బొట్టు లేకుండా ఉన్న అమ్మాయిలు బాపు చిత్రాల్లో తక్కువ. ఉన్నా కథానుసరణగానే ఉంటారు. అందమైన అమ్మాయిని చూస్తే ‘బాపు బొమ్మలా ఉంది’ అనడం - పున్నమినాటి చందమామ వెన్నెల కురిపిస్తున్నాడన్నంత నిజం. ‘బాపు వేసిన అమ్మాయిలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను’ - అన్న కుర్రాళ్లు ఎంతమందో!
      బాపు చిత్రలేఖనం కార్టూన్లు గీయడంతో ఆరంభమైంది. 1947-48 నాటి ‘బాల’ పత్రికలో బాపు కార్టూన్లు, చిన్నచిన్న బొమ్మలూ కనిపించేవి. ఇంట్లోని పెద్దవాళ్లు ‘ఎందుకురా ఆ బొమ్మలు గీయడం? తిండి పెట్టేనా? గుడ్డ పెట్టేనా?’ అని నిరుత్సాహ పరిచినా, ఆ వేళ్ల కదలికలు ఆగలేదు. ఇండియన్‌ ఇంకు, క్రోక్విల్, సన్నని కుంచెలూ ఎదురుగా పెట్టుకుని, రకరకాల గీతలతో బొమ్మలు వేయడంలో కృషి ప్రారంభించారు. ఏ గురువు దగ్గరో కూచుని, ఆయన ఆ విద్య అభ్యసించలేదు. కానీ, ‘చిత్రకారులందరూ నా గురువులే’ అని చెప్పేవారు. బాపుగారికి ఉన్న ఊహాశక్తిని కొలవడానికి మాపకాలు లేవు. బొమ్మ వేయడం వేరు, తన ఊహతో దానికి ప్రాణం పోయడం వేరు. ఆయన ఏ కార్టూన్‌ వేసినా, అందులో మన తెలుగింటి బామ్మలు, అమ్మలు, లావాటి భార్యలు, సన్నటి భర్తనే కనిపిస్తారు. బుడుగు, సీగానపెసూనాంబ, పక్కింటి లావాటి పిన్నిగారూ అందరూ తెలుగుదనాన్నే గుమ్మరిస్తారు. కార్టూన్లలో అందరూ మన బాబాయిలే, మన పిన్నిగార్లే. ఎక్కడా అంతర్రాష్ట్ర వాసన రాదు. కార్టూనే సగం భాష్యం చెప్పేస్తుంది. తెలుగు నుడికారంతో, ఓ రెండు మాటలుంటాయి. ‘‘నెత్తిమీద ఒక్కటిచ్చుకుంటే?’’ ‘‘మా ఇంట్లో వున్నంతసేపూ సిగరెట్టు ముట్టిచ్చద్దయ్యా అని చెప్తే విన్నారా? బోడిగొప్ప’’, ‘‘కళ్లు గాఆఠిగా మూసుకుని వినండి’’, ‘‘కొట్టి చంపేస్తున్నట్టేవిటా గావుకేకలు?’’ ‘‘కొత్త ఫేషన్‌గామోసు’’, ‘‘నీకూ నాకూ సాపెత్తమేంటీ’’, ‘‘నువ్వుత్తి లచ్చాదికారివి’’ వంటివి కొన్ని ఉదాహరణలు. 
      బాపుగారి వేళ్లు ఎందరు ప్రబంధ కన్యలకి రూపురేఖలిచ్చాయో! ఒక వరూధిని, ఒక వసంతసేన, ఒక చిత్రాంగి, సత్యభామ, శూర్పణఖ, యశోద - ఇలా ఎందరో వాళ్ల ముఖాలు చూపించారు - మన బాపు ద్వారా. సీత, రాముడు, కృష్ణుడు, రాధ, రుక్మిణి ఎంత లక్షణంగా పవిత్రంగా ఉంటారో! విసుగు, విరామం లేకుండా నిరంతరం బొమ్మలు వేసేవారు ఆయన. ‘‘తీరిక సమయంలో ఏం చేస్తారు?’’ అని అడిగితే, ‘‘బొమ్మలు వేస్తాను’’ అన్నది ఆయన చమత్కృతి.
      ఆయనకి అవగాహన ఎంత ఎక్కువో, హాస్యం పాళ్లు కూడా అంత ఎక్కువే. ఎన్నెన్నో ఆంగ్ల పత్రికలు, జోక్స్‌ బుక్సు, పంచ్, శంకర్స్‌ వీక్లీ - అన్నీ చూసేవారాయన. మార్క్స్‌ బ్రదర్స్, లారెవ్‌ హార్డీ, చార్లీ చాప్లిన్, నార్మన్‌ విజ్‌డమ్, డానీకే వంటి వారి సినిమాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. స్ఫూర్తి, స్ఫూర్తిలోంచి అనుభవం, అనుభవంలోంచి ఆలోచనా, ఆలోచనలోంచి ‘స్వ’భావం - పుడతాయి బాపుకి. వేసిన ఏ కార్టూనూ నవ్వించకుండా లేదో, వేసిన ప్రతి చిత్రమూ ఆకట్టుకోకుండా ఉండదు. తను వేసిన బొమ్మ ముందుగా తనకి నచ్చాలి. నచ్చకపోతే చింపి పారేసి, ఇంకోటి వేసేవారు. పుస్తకం చదివిన తరువాత తనకి నచ్చకపోతే, ‘బొమ్మ వేయలేను’ అని పుస్తకం వెనక్కి ఇచ్చేసిన సందర్భాలూ ఉన్నాయి.  తన మీద తనే జోకులు వేసి నవ్వించడం కూడా బాపు స్వభావం.
      మంచి సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. హిందీ మాటకేంగాని, ఆంగ్ల చిత్రాలు బాగా చూసేవారు. తెలుగు, తమిళ చిత్రాలు దాదాపు అన్నీ చూసేవారు. అలా, సినిమా మీద ఏర్పడిన అవగాహన, ఆసక్తులే ఆయన్ని సినిమా రంగంలో దింపాయి. ఏ గురువూ లేకుండా చిత్రకారుడయినట్టే, సినిమాల్లోని ఏ శాఖలోనూ పని చేయకుండా సినిమా దర్శకత్వం చేపట్టారు బాపు.   బాపుగారికి కథల మీద అవగాహన ఎక్కువ. ఆయన కథకుడు. తక్కువగానే రాశారు కాని, ‘కథ’ పేరుతో, కథా సంకలనం వెలువరించారు సంపాదకుడిగా. సంగీతం మక్కువ. హార్మోనీయం వాయించేవాడు. హిందూస్థానీ సంగీతం, గజల్స్‌ ఇష్టం. దర్శకుడిగా రాణించడానికి ఇవి కూడా కారణాలు. మొదట తీసిన రెండు సినిమాలూ అనుకున్నస్థాయిలో విజయం సాధించకపోయినా నిరాశపడలేదు, నిరుత్సాహం చెందలేదు. ‘బుద్ధిమంతుడు’తో చలన చిత్రరంగంలో నిలబడిపోయారు. రమణ రచన, బాపు దర్శకత్వంతో పలు చిత్రాలు వచ్చాయి. తెలుగుదనంతో ఉన్న పాటలు, మాటలూ, పాత్రలూ కనిపించే చిత్రాలు తీశారు. తెలుగు వాతావరణంలో కనిపింపజేయాలని గోదావరిని ఎన్నుకున్నారు. ఏ సినిమాలోనూ అవాచ్యం, అశ్లీలం, అసభ్యం కనిపించవు. ‘‘సినిమాలు అందరి కోసం. అందరూ సినిమాలు చూడాలి. అంటే ‘చెత్త’ ఉండకూడదు. సినిమా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలి’’ అని చెప్పేవారు బాపు. చిత్రకారుడు గనక, అందమైన కోణాల్లో చిత్రించే వారు. ఎలాగైతే, బాపుగారి రేఖలను అనుకరిస్తూ ఎందరు చిత్రాలు వేశారో, అలాగే కొందరు దర్శకులు కూడా బాపుగారి చిత్రీకరణని అనుసరించారు. ఏ ‘బుల్లెట్‌’ లాంటి టైటిల్సో తప్పితే, తక్కినవన్నీ చక్కని తెలుగుపేర్లు. సీతమ్మపెళ్లి, పెళ్లి పుస్తకం, ముత్యాలముగ్గు,  మంత్రిగారి వియ్యంకుడు లాంటివి చాలు - చెప్పుకోవడానికి. భాగవత, రామాయణాల మీద ఉన్న శ్రద్ధతో, ‘సీతాకల్యాణం’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి పురాణ చిత్రాలు తీస్తే పురస్కారాలు వరించాయి. ధనాన్ని వడ్డించాయి. ‘గోగులు పూచే ఓలచ్చ గుమ్మడి’; ‘ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ’ లాంటి జానపద రీతి గీతాలు వినిపించారు బాపు. ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి ఆశీర్వచన పాటలతో శ్రోతలను పరవశింపజేశారు. ఆయన చిత్రాల్లోని మాటలూ ప్రసిద్ధి చెందాయి. 
      బాపుగారు తాను చలనచిత్రకారుడిగా ప్రసిద్ధి చెందినా, అభ్యసించిన చిత్రలేఖనాన్ని విస్మరించలేదు. బొమ్మలు తీస్తున్నా - బొమ్మలు వేస్తూనే ఉన్నారు. 
      బాపురమణ, ఆరుద్ర, మహదేవన్‌ కలయికతో వచ్చిన ఎన్నో మధురాతి మధుర గీతాలు వినిపిస్తూనే ఉన్నాయి. చక్కని హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చిన బాపు గారికి ఎంతో ఇష్టమైన సినిమా ‘మాయాబజార్‌’. తను తీసిన సినిమాలు? ‘‘కొన్నే నాకు ఇష్టం. కొన్ని కావు’’ అన్నారొకసారి. ‘‘అనుకున్నట్టు వేసిన బొమ్మ రాకపోతే, చింపి పారేయడం నా చేతిలో ఉంది. సినిమా అలా కాదు గదా’’ అనేవారు. 
      ఎంత గొప్పవారైనా వారిని విమర్శిస్తే ఒప్పుకోరు. బాపురమణలు విరుద్ధం. తమ మీద తామే జోకులు పేల్చుకున్నారు. ‘అందాల రాముడు’ కొన్ని కారణాల వల్ల మొదట్లో సరిగా నడవలేదు. ఆ సినిమా 10వ రోజున 100వ రోజు అని పెద్దక్షరాల్లో ప్రకటన వేసి, కింద ‘90 రోజులక్రితం విడుదలై ఉంటే’ అని చమత్కరించడం వాళ్లకే తగు. ‘బాపురమణీయం’, ‘కోతికొమ్మచ్చి’ పుస్తకాల ఆవిష్కరణలో ‘అందరూ ఊరికే పొగిడేస్తారు. మీరు మాత్రం తెలుగు మాస్టారి ధోరణిలో విజృంభించి తిట్టండి’ అన్నారు. ‘బావుండదేమో’ అంటే ఒప్పుకోలేదు. బలవంతపెట్టి, వందలాది ప్రేక్షకుల ముందు, విమర్శిస్తూ ఉంటే - ఆనందించిన వాళ్లలో ఆ జంటే ముందు నిలబడింది. ఆ నిరాడంబరుడికి బిడియం ఎక్కువ; వినయమూ అధికమే. తన చిత్రాల శతదినోత్సవాలకు వెళ్లినా వేదిక ఎక్కరు; పూలమాలలు వేయించుకోరు! ప్రపంచం మొత్తం మీద, ఇలా ఎక్కడా ఉండదు. ఎంతో గొప్పవాడైన బాపుకి గొప్పలు చెప్పుకోవడం తెలీదు, ఇష్టం ఉండదు. ఆ విషయం అనితరసాధ్యం. 
      ఏమీ తోచనప్పుడు, ఎక్కువ తోచేస్తున్నప్పుడూ, దిగులుగా ఉన్నప్పుడూ ఒక్కసారి బాపు కార్టూన్ల పుస్తకాలు తిరగేస్తే చాలు - మనసులో ఆనంద కెరటాలు ఉప్పొంగుతాయి. ఒక్కరూ కూచుని చూడకండి. మీలో మీరు నవ్వుకోవడం చూసి, ఎదుటివాళ్లు పిచ్చాసుపత్రి చిరునామా కనుక్కోవడానికి పరుగెత్తుతారేమో! నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, తెలుగు సినిమాలో తెలుగూ అంతే ఉందనిపించుకో కుండా ఉండాలంటే ‘బాపు సినిమాలున్నాయి’ అని చెప్పండి!


వెనక్కి ...

మీ అభిప్రాయం