కథాకావ్యాల కాణాచి

  • 400 Views
  • 13Likes
  • Like
  • Article Share

అనాదిగా కథలు ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉన్నాయి. ఆదికావ్యంగా చెప్పుకునే రామాయణం, విశ్వసాహితీ సీమలో అతి విస్తారమైన గ్రంథంగా ప్రాచుర్యం పొందిన మహాభారతం, భాగవతాల్లోనూ సందర్భానుసారం అక్కడక్కడ ఎన్నో కథలుంటాయి. కానీ, అవి ఏకసూత్రతతో నడవవు. ఇక ప్రబంధాలూ కథలతో నిండినవే. కానీ, వర్ణనలు వాటిని కప్పేస్తాయి. అయితే తెలుగులో కథలకు పెద్దపీట వేసిన ప్రత్యేక శాఖ ఒకటి ఉంది. 
      పండిత పామరులను ఆకట్టుకునే చిత్రవిచిత్ర మలుపులతో, అద్భుత, వీర, శృంగార రసాలతో కూడిన కథలకు కావ్యరూపమిచ్చారు కవులు. అవేే కథాకావ్యాలు. కథలు... వాటిల్లోంచి పుట్టుకొచ్చే ఉపకథలతో సాగే వీటికి సంస్కృత కావ్యాలు మూలం. వీటిపై పలు పోటీపరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. 
దశకుమార చరిత్రము: తెలుగులో తొలి కథాకావ్యం. రచయిత మూలఘటిక కేతన (1200- 1280). దీనికి మూలం సంస్కృతంలో అదే పేరుతో దండి రాసిన గ్రంథం. అందుకే కేతన ‘అభినవ దండి’ అయ్యాడు. కేతన తిక్కనకు ప్రియ శిష్యుడు. తన పాండితీ గరిమతో గురువును మెప్పించిన ఘనుడు. తిక్కన అంతటి పండితుడే తన కావ్యాన్ని మెచ్చుకున్నాడు. వేరేవాళ్లు ఇంక పొగడటం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు కేతన. దీనిని తిక్కనకే అంకితమిచ్చాడు. తెలుగు సాహిత్యంలో ఒక కవి కృతిపతి కావడం అరుదైన ఘటన. ఈ పన్నెండు ఆశ్వాసాల కావ్యంలో రాజహంసుడనే రాకుమారుడు ఓ వ్యక్తికి సాయం చేసేందుకు వెళ్తాడు. ఎంతకీ జాడ తెలియక... అతణ్ని వెతుకుతూ వెళ్లిన మరో తొమ్మిదిమంది రాకుమారుల సాహస, ప్రేమకథలే ఈ కావ్యం. ఆంధ్రభాషా భూషణం, విజ్ఞానేశ్వ రీయం కేతన ఇతర రచనలు.
కేయూరబాహు చరిత్రము: రచయిత మంచన. 13వ శతాబ్దపు కవి. 4 అశ్వాసాల ఈ కావ్యాన్ని వెలనాటిచోడ రాజు మంత్రి నండూరి గుండయకు అంకితమిచ్చాడు. ఇందులో మొత్తం 22 కథలు ఉన్నాయి. దీనికి మూలం రాజశేఖరుడి సంస్కృత ‘విద్ధ సాలభంజిక’ నాటకం. అయితే,  మంచన దీన్ని స్వతంత్ర కావ్యంగా మలచాడు. అక్కడక్కడా పంచతంత్ర, హితోపదేశాల్లోని నీతికథల్ని గ్రహించాడు. 
విక్రమార్క చరిత్రము: విక్రమార్కుడిపై వచ్చిన తొలి తెలుగు కథాకావ్యం. దీన్ని శ్రీనాథుడి సమకాలికుడైన జక్కన (1380- 1440) రచించాడు. ఇది 8 ఆశ్వాసాల కావ్యం. వెన్నెలకంటి సిద్ధయకు అంకితమిచ్చాడు. దీనికి సంస్కృతంలోని విక్రమార్క చరిత్ర, కథాసరిత్సాగరం లాంటివి మూలాలు. 
నవనాథచరిత్ర: ద్విపదలో సాగే దీని రచయిత గౌరన. 15వ శతాబ్దపు కవి. ఇందులో గోరక్షనాథుడు, మత్స్యేంద్రనాథుడు లాంటి యోగుల ప్రస్తావన ఉంది. గౌరనకు ‘సరస సాహిత్య లక్షణ చక్రవర్తి’ అని బిరుదు. హరిశ్చంద్రోపాఖ్యానం ఈయన రాసిన మరో ద్విపద. తెలుగులో నక్షత్రకుని పాత్రను ప్రవేశపెట్టింది గౌరనే.
భోజరాజీయము: తిర్యక్‌ జంతువులే ప్రధాన పాత్రలైన కావ్యమిది. అనంతామాత్యుడు (15వ శతాబ్దం) రాశాడు. అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఏడు ఆశ్వాసాల ఈ కావ్యంలో గోవ్యాఘ్ర సంవాదం ప్రసిద్ధం. ఈ కావ్యం ధర్మం ప్రతిపాదకంగా నడుస్తుంది. ‘చులుకన మరి తల్లిలేని సుతుడు’ లాంటి లోకోక్తులు కనిపిస్తాయి. అనంతుడు ‘రసార్ణవము’, ‘ఛందోదర్పణము’ అనే అలంకార, ఛందశ్శాస్త్ర గ్రంథాలు కూడా రచించాడు.
సింహాసన ద్వాత్రింశిక: అత్యుత్తమ కథాకావ్యంగా ప్రసిద్ధి చెందిన దీని రచయిత కొరవి గోపరాజు (15వ శతాబ్దం). 12 ఆశ్వాసాల ఈ కావ్యాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. ఇందులో భోజరాజుకు విక్రమార్కుని సింహాసనం దొరుకుతుంది. దాన్ని అధిరోహించే సమయంలో ఆ సింహాసనం మెట్లపై ఉన్న 32 సాలభంజికలు చెప్పే 32 కథలు ఇందులో ఉన్నాయి. వేరే భాషల్లోనూ సింహాసన ద్వాత్రింశికలు వచ్చాయి. దీనికి మూలం కథాసరిత్సాగరం. ఈ కావ్యాన్ని చదివితే ఆ కాలపు సామాజిక చరిత్ర తెలుస్తుందన్నది సురవరం ప్రతాపరెడ్డి అభిప్రాయం. 
శుకసప్తతి: శృంగార రస ప్రధానంగా సాగే దీని రచయిత 17వ శతాబ్దికి చెందిన పాలవేకరి కదిరీపతి. ఇతనిది మైసూరు ప్రాంతం. దీన్ని శ్రీరాముడికి అంకితం చేశాడు. ప్రభావతి అనే ఓ మహిళ భర్త వ్యాపార నిమిత్తం పరదేశానికి వెళ్లినప్పుడు, ఆ దేశపు రాజు ఆమెను మోహిస్తాడు. ఆ సమయంలో ప్రభావతికి తాను చేసేది సరైందో కాదో నిర్ణయించుకోమంటూ, 70 రాత్రులపాటు ఆమె పెంపుడు చిలుక చెప్పిన 70 కథలే ఈ కావ్యం.
పంచతంత్ర కథలు: సంస్కృతంలో విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథల్ని తెలుగులో తొలిసారి చెప్పింది 15వ శతాబ్దికి చెందిన దూబగుంట నారాయణకవి. తన గ్రంథాన్ని ఉదయగిరి రాజైన పూసపాటి బసవరాజుకు అంకితమిచ్చాడు. ఈయన తర్వాత పంచతంత్రాన్ని 16వ శతాబ్దికి చెందిన బైచరాజు వేంకటనాథుడు రాశాడు. ఈ గ్రంథం కఠిన శైలిలో సాగుతుంది. దీన్ని హరిహరనాథ దేవుడికి అంకితం చేశాడు. 
      ఇవేకాక, అయ్యలరాజు నారాయణకవి (18వ శతాబ్దం) ‘హంస వింశతి’, కూచిరాజు ఎర్రన ‘సకలనీతి కథా విధానం’, వెన్నెలకంటి అన్నయ ‘షోడశకుమార చరిత్రము’ మొదలైన కథాకావ్యాలొచ్చాయి. 
      ఈ కథాకావ్యాల్లో అద్భుతాలతో కూడిన కథలే కాదు ‘అందని మ్రానిపండ్లకు అర్రులు సాచిననేమి చేయుదున్,’ ‘గుడిమ్రింగిన వానికి నంది పిండి వడియము’ లాంటి లోకోక్తులు, శకునాలు, ఆభరణాలు, వస్త్ర విశేషాలు, వేట వర్ణనలు మొదలైనవి ఆనాటి కవుల సామాజిక పరిశీలనను తెలియ జేస్తాయి. విద్యార్థులు ఈ కోణంలోనూ వీటిని అధ్యయనం చేస్తే అవగాహన విస్తృతమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం