మకుటాయమానం మన శతకం

  • 149 Views
  • 3Likes
  • Like
  • Article Share

    అయ్యగారి శ్రీనివాసరావు

  • విజయనగరం
  • 9440108820
అయ్యగారి శ్రీనివాసరావు

నూరు పద్యాల రచన ‘శతకం’. పద్య రచనల్లో దీనిది ప్రత్యేకమైన బాణీ. రచన ఏ ప్రక్రియలోనైనా దానివల్ల సమాజానికి ఎంతోకొంత మేలు కలగాలి. ఈ విషయంలో శతకానిదే ప్రధాన పాత్ర. అసలు శతకం అంటే నీతి అన్నంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే, పోటీ పరీక్షల్లోనూ శతక సాహిత్యానికి ప్రాధాన్యమిస్తారు.
      ప్రబంధాలు, కావ్యాల్లో విషయం విస్తారంగా ఉంటుంది. కథా, గమనాన్ని అనుసరించి పద్యాలుంటాయి. కాబట్టి ఏదో ఒక పద్యం చదువుతామంటే పద్యం అర్థం కాదు. ఇక చాటువులు రసవంతంగానే ఉంటాయి. అయినప్పటికీ ఏ పద్యానికి ఆ పద్యంతోనే రసాస్వాదన పూర్తయిపోతుంది. అంతకుమించి మరే ఆనందమూ మిగలదు. శతకంలో పైన చెప్పిన ఇబ్బందులేవీ ఉండవు. విషయంలో కథాగమనం ప్రసక్తే ఉండదు. ఎక్కడ నుంచి మొదలుపెట్టి ఏ పద్యమైనా చదువుకోవచ్చు. రసాస్వాదన చేయవచ్చు. ముక్తక లక్షణమంటే ఇదే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘చదువ పద్యమరయ చాలదా ఒక్కటి’ అన్నాడేమో  వేమన!
      శతకాల్లో భక్తి, వేదాంత, శృంగార, హాస్య, వ్యంగ్య ప్రధానమైనవి ఎన్ని ఉన్నా, నీతిబోధనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. విషయం ఏదైనప్పటికీ సమాజంలో అందరికీ మేలుకొలుపు (స్పృహ) కలిగించడమే ప్రధాన ధ్యేయంగా కనబడుతుంది. సమాజంలో ఎన్నో లోపాలు, అలసత్వాలు, స్తబ్ధత, వక్రపుటాలోచనలు ఉన్నాయి. వీటిలో మనకు కొన్ని తెలిసినవి, కొన్ని తెలియకుండా ఉన్నవి. వీటిని ఎత్తిచూపితే కొంత చైతన్యం, తద్వారా సమాజానికి ఎంతోకొంత ఉపకారం.
      శతకాల్లో నీతి బోధించే విధానం విలక్షణంగా ఉంటుంది. విషయాన్ని సూటిగా చెబుతూ, దాన్ని తనకుతాను చెప్పుకుంటున్నట్లు (విశ్వదాభిరామ వినురవేమ) గాని, లేదా దేవుడికో, ఒక వర్గానికో (దాశరథీ కరుణా పయోనిధీ; సుమతీ!, కుమారా) చెప్పినట్లు ఉంటుంది. దాంట్లో ఎవరి గురించి వ్యక్తిగత ప్రస్తావన ఉండదు కాబట్టి ఎవరికీ కోపం రాదు. కానీ అందరూ భుజాలు తడుముకునే పరిస్థితి కలుగుతుంది. అదీకాక (దానికే ‘మకుట’మనీ పేరు) ఆ శతకాన్ని గుర్తించడానికి చిహ్నంగానూ ఉపయోగపడుతుంది. 
      ప్రాచీనం నుంచి ఆధునికం వరకూ ఎందరో కవులు ఎన్నో శతకాలు రచించారు. అన్నింటిలోనూ అంతో ఇంతో సామాజిక స్పృహ ఉంటుంది. కానీ అగ్రాసనం మాత్రం వేమన, సుమతి శతకాలదే. వేమన పద్యాలను శతకం అనడానికి వీలులేదేమో. ఆయనవిగా వేల పద్యాలు వ్యాప్తిలో ఉండటమే దీనికి కారణం. వేమన పద్యాలు సులభమైన శైలిలో ఆటవెలది, తేటగీతుల్లో చదవగానే అర్థమయ్యే స్థితిలో ఉంటాయి. ఒకటి రెండుసార్లు చదివితే కంఠస్థం అయిపోతాయి. వ్యక్తిగత లోపాలు, సమష్టి దోషాలు, మూఢాచారాలు, సామాజిక సమస్యలు వీటన్నిటినీ నిరసించాడు వేమన.
ఇంటి యాలివిడిచి ఇలజారకాంతల
వెంట తిరుగువాడు వెర్రివాడు
పంటచేను విడిచి పరిగలేరినట్లు...
    
అంటూ భార్యను విడిచి వెలయాళ్ల వెంట తిరిగే వాళ్లను చక్కని ఉపమానాలతో ఎత్తిచూపుతాడు వేమన.  ఉపమాలంకారాన్ని వేమన ఉపయోగించుకున్న తీరు అసామాన్యం.
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలోన నలుసు కాలి ముల్లు
ఇంటిలోన పోరు... ఇంతింత కాదయా
అంటూ ఆయా బాధల తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపాడు. వేమన గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. 
      ఇక సుమతీ శతకంలో బద్దెన అడిగిన జీతం బియ్యని... మడిదున్నుక బ్రతకవచ్చు పద్యంలో వెట్టిచాకిరి విశ్వరూపాన్ని అడిగిన జీతంబియ్యని అన్న రెండు పదాల్లో చూపించాడు. అంతటితో ఆగక, ‘వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతకవచ్చు’ అని పరిష్కారాన్నీ చూపాడు. అవసరానికి ఉపయోగపడని చుట్టం, వేడుకున్నా వరమివ్వని దేవుడు, అవసర సమయంలో పరుగు తీయని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి అంటూ కచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేశాడు.
      మనిషి తన స్థితి కోల్పోతే మిత్రులు, బంధువులే శత్రువులౌతారు. దీని గురించి హెచ్చరించే పద్యం...
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ!
 
      ‘నీళ్లలోన ముసలి... స్థానబలిమి గాని తమ బలిమి కాదయా’ అంటూ వేమన చేసిన హెచ్చరిక ఇలాంటిదే. సుమతీ శతకంలో ఒక దానిని మించిన నీతిబోధనా పద్యం మరొకటి. ‘స్థాలీపులాక న్యాయం’గా కొన్ని పద్యాలు తరచి చూద్దాం.
మంత్ర తంత్రాలను, దేవుళ్ల పేర్లను కూడా వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తారు కొందరు స్వార్థపరులు. ‘తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ చెప్పిన పద్యం ఎక్కడి మంత్రతంత్రముల వెక్కడి... పెక్కురు పొట్ట కూటికి దావేషమయా శరభాంక లింగమా అంటాడు శరభాంకలింగ శతకకర్త.
తమయుదకంబులన్నదులు ద్రావవు... పద్యంలో నదులు తమ నీటిని తాము తాగవు. చెట్లు తమ ఫలాలని అవి తినవు. ఇలా ఇతరులకు ఉపయోగపడేందుకే జన్మనెత్తుతాయి. మన శరీరం కూడా పరోపకారం కోసమే అంటాడు అల్లంరాజు రంగశాయి కవి రఘురామ శతకంలో. కాలజ్ఞానంతో ప్రసిద్ధిచెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయములైనవన్ని జీవమ్ములు/ కూడులేక జీవకోటి లేదు/ కూడు తినెడి కాడ కులభేదమేలొకో... అని కులభేదాలను నిరసిస్తాడు ‘కాళికాంబ’ శతకంలో. అలాగే స్త్రీ గొప్పతనాన్ని అలతి అలతి పదాలతో, తల్లిదండ్రి గురువు దైవమ్ములందున/ తల్లిపూజ ముఖ్యమెల్లరు కును... పద్యంలో సృష్టికంతటికీ స్త్రీ ప్రధానం కదా! అంటాడు.
      ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం భక్తి వైరాగ్య ప్రధానమైనదైనా సామాజిక స్పృహ కలిగించే పద్యాలూ అందులో చోటు చేసుకున్నాయి. ఏ వేదంబు పఠించెలూత... బోధావిర్భావ నిధానములే చదువులు... చదువు పరమార్థాన్ని తెలియజేస్తే, కొడుకులు వంశానికి ప్రతిష్ఠ తేవాలే కానీ, పీడగా పరిణమించకూడదని హెచ్చరిక చేస్తుంది... కొడుకుల్‌ పుట్టరటంచునేడ్తురవివేకుల్‌. 
      పేదవాడికి మేలు చేస్తే ప్రయోజనం- ధనవంతుడికి చేస్తే నిష్ఫలం, అంటూ వాడిన చేలని పేదవాడితోనూ, సముద్రుడిని ధనవంతుడితోనూ పోల్చి వాన ఎక్కడ కురిస్తే ప్రయోజనమో సోదాహరణంగా చెబుతాడు మారయ వెంకయ భాస్కర శతకంలో. ఇందులో పాఠకులను ఉన్నతంగా తీర్చిదిద్దే పద్యాలెన్నో ఉన్నాయి. ఈ శతకాలు నీతిని బోధిస్తే, శతకంతో పురాతన వారసత్వ సంపదను పరిరక్షణకు పాలకుణ్ని నడుంబిగించేలా చేశాడు కాసుల పురుషోత్తమ కవి. తెలుగువారి పురాతన దేవుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు. శ్రీకాకుళంలోని ఆయన ఆలయం శిథిలావస్థకు చేరింది. దీన్ని పట్టించుకొనే నాథులే లేరా? అని వ్యాజస్తుతిలో రాసిందే ‘ఆంధ్రనాయక శతకం’. దీనివల్ల జీర్ణావస్థలో ఉన్న ఆంధ్ర మహావిష్ణు దేవాలయాన్ని పునరుద్ధరించాడు చల్లపల్లి జమీందారు.
      తిరుమణి శ్రీచూర్ల గురురేఖ నిడినను/ విష్ణునొందక కాడు విష్ణువుండు...లో బ్రహ్మం తెలియకుండా జంధ్యం ధరించి, సంధ్య వార్చినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. ఎర్రని రేఖలు ధరించగానే వైష్ణవుడు కాదు. కోరికలు చావకుండా కాషాయ వస్త్రాలు ధరించగానే సన్యాసి కాడు. లోకంలో ఎవరెన్ని వేషాలు వేసినా వాటిలో నిజం లేకపోతే ముక్తి రాదు అంటాడు శేషప్ప కవి ‘నరసింహ’ శతకంలో.
      ఋతములు అతి యత్నమృగ్యము/ లతి గుప్తములౌట పండ్లనాకులలోనన్‌/ వెతుకుగతి వెదకదగునని/ సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్‌...  సత్యం గొప్పదనాన్ని చెబుతూ గురజాడ రాసిన ‘సత్యవ్రతి’ శతకంలోని మణిపూస ఇది. అలాగే కందుకూరి వీరేశలింగం లాంటివారు సంస్కరణ దృష్టితో శతకాలు రాశారు. శ్రీశ్రీ హాస్యవ్యంగ్యాల మేళవింపుతో ‘సిరిసిరిమువ్వా’ శతకాన్ని రచించి సమాజంలో కుళ్లును కడిగే ప్రయత్నం చేశారు. నార్ల వెంకటేశ్వరరావు ‘నార్లవారిమాట’, బృహత్తాండవం నాగశాస్త్రి ‘సుబ్బరాయ’, ఆనందదాసు ‘ఆనంద’, శ్రీపతి భాస్కర కవి ‘చిత్త’, కపిలవాయి లింగమూర్తి ‘ఆర్య’, తిరునగరి వెంకటేశ్వరరావు ‘హనుమద్గిరీంద్ర’ ఇలా ఎన్నో శతకాలు ప్రజలను జాగృతం చేశాయి.
      ఇవేకాక సమాజంలో కాలానుగుణంగా వచ్చిన ఉద్యమాలు, పరిస్థితుల ప్రభావాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలను చైతన్యపర్చడానికి శతకాలు రాసిన కవులెందరో ఉన్నారు. ప్రజలను జాతీయోద్యమం వైపు ఆకర్షితుల్ని చేయడానికీ శతకాలు ఉపయోగపడ్డాయి. 
      పాల్కురికి సోమన ‘వృషాధిప శతకం’ నుంచి ఇప్పటివరకు ఎందరో తెలుగు కవుల చేతిలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని, తెలుగువారి నోళ్లలో నానుతున్న శతకం... తరతరాలుగా వ్యక్తిత్వ వికాసానికి పర్యాయపదం.


వెనక్కి ...

మీ అభిప్రాయం