ప్రేమ మర్మం తేల్చవా గాలిబ్‌!

  • 2311 Views
  • 7Likes
  • Like
  • Article Share

‘‘గాలిబు గీతములందు మనోహరములగు భావములు, విచిత్రములగు కల్పనలు, అపూర్వములగు నుపమానములు కొల్లలుగా లభించును. ఆ మహాకవి ఉర్దూ గీతములు గొన్ని దెనిగించి యాంధ్ర పాఠకలోకమున కందించిన దాశరథిగారు మిగుల ప్రశంసనీయులు. అనువాదకులాధునికాంధ్ర సుప్రసిద్ధ కవులలో నుత్తమశ్రేణికి చెందిన... రససిద్ధులు’’ 

- డా॥ బూర్గుల రామకృష్ణారావు 

శోకం నుంచి శ్లోకం పుట్టిందని నానుడి. మరి విరహం నుంచి? గాలిబ్‌ గీతం పుట్టిందనాలి. ఇది శృంగార రసాత్మకమైన భావకవిత. రెండు చిన్న వరసల్లో ప్రేమ చుట్టుకొలతను కొలిచేసిన కవిత్వం. ఉర్దూ గజళ్లలో ఎక్కువగా కనిపించేది ‘మజాజి’, అంటే స్త్రీపురుషుల ప్రేమ. ముఖ్యంగా ఇది ప్రేమికుడి వివిధ దశల్లోని భావోద్వేగాలను ఆవిష్కరిస్తుంది. మురిపెం, కోపం, విరహం, శృంగారం, అసహనం, చిలిపితనం అన్నీనూ. గాలిబ్‌లోని ఇంతటి భావాలకు అంతటి మహాకవి దాశరథి కృష్ణమాచార్య తోడయ్యారు. మన అదృష్టం, గజల్‌ జలపాతంలా దాశరథిని ఆసరా చేసుకొని తీయటి తెలుగులో దూకింది. గజల్‌ అంటే ప్రియురాలితో సంభాషణ. ప్రేమ కవిత్వం రాయాలని తపస్సుచేసే కుర్ర కవులకు ఇది ఓ ప్రేమబాలశిక్ష.
మెరుపొకటి వచ్చి కనులలో మెరిసిపోయె
కొంత మాటాడగ దప్పిగొంటి నేను
!
      తాను మెరుపులా మెరిసి అంతలోనే మాయమైంది, ఆమెతో మాట్లాడాలనే కోరిక తీరలేదే అని ఆశనీ, బాధనీ ఒకేసారి వ్యక్తం చేస్తాడు ప్రియుడు. అవును మరి, గాలిబ్‌ నాయకుడు విరహంతో వేగిపోతుంటాడు. అది తానే కావచ్చు, కాకపోనూవచ్చు. ప్రేమ లోతెంతో తెలియదు కనుక అతని విరహం లోతూ తెలుసుకోలేం. ‘ప్రణయ బాధితులను గూర్చి పలుకవశమె?’ అని తన గురించి తానే చెప్పుకున్నాడు. ఎన్నాళ్లుగానో ప్రేయసికోసం ఎదురుచూసి వగచే సున్నిత హృదయుడతను. హాయిగా గుండె దోచుకొనిపోయింది కానీ, ముద్దివ్వడానికి మాత్రం వెనకా ముందాడుతుందని చిలిపిగా రాగాలు తీస్తాడు. ఈ చమత్కారం చూడండి..
ఏల కాళ్లు నొచ్చెనో బాలామణికి
రాత్రి ఎవని స్వప్నసీమకేగి వచ్చెనో!

మనలోని భావాలే, మన మనసే వాటిలో కనిపిస్తుంటే, అది చూసి చకితులమౌతాం. చెలిచెంత ఉన్నప్పుడు మూగబోయిన మాట, అక్షరాలై దర్శనమిస్తుంది ఈ ప్రేమగీతికల్లో. 
మొదటి పంక్తిలో ఒక సిద్ధాంతాన్ని ప్రవచించడం. రెండో పంక్తిలో దాన్ని గుండెకు హత్తుకునేలా సాక్ష్యాన్ని కూర్చడం గాలిబ్‌ ప్రత్యేకత. అయితే వీటిలో మానవనైజం, జీవిత తత్వం కనిపిస్తుంది.
ఈ జగత్తు స్వభావమ్ము హీనమౌర
మంచి చేసిన వానిని ముంచునౌర!

గాలిబ్‌ని కాళిదాసుతో పోల్చాడు దాశరథి. ఒకరు వాడినవికాక తానే కొత్త ఉపమానాలు సృష్టించుకుంటాడు. ‘గోరు వూడిపోతే హాయేకదా!’ అంటూ వినాశనంలోనే హాయి ఉందని చెప్పడం చిత్రమే. ఒకసారి తెల్లవారేదాకా కవి సమ్మేళనం సాగింది. ఇప్పుడు గాలిబ్‌ వంతు, ఇక ఎవరు వింటారులే అనుకునే సమయంలో గాలిబ్‌ గళమెత్తాడు. అతని విరహం ముషాయిరాలో (కవి సమ్మేళనం) శ్రోతలకు కన్నీరు తెప్పించింది. నీ వెలుగుకి సూర్యుడు బిచ్చగాడిలా మారిపోతాడంటూ ప్రకృతిని ఉదహరిస్తాడు గాలిబ్‌. భావ కవిత్వంలో ప్రకృతిని మించిన చక్కని ఉపమానం ఏముంటుంది! ప్రేమ కవితకు సొగసులద్దేది ఇదేకదా. ఈ ప్రత్యేకతలన్నీ పుట్టింది ఈ నేల మీదే. తెలుగు పదాలు కలిసిన ఉర్దూ గజల్‌ మనకు కొత్తేమీ కాదు. 15వ శతాబ్దానికి ముందే హైదరాబాదులో గజల్‌ ప్రస్థానం మొదలైంది. అది వృద్ధిచెంది, ముషాయిరాల సంస్కృతి దిల్లీ చేరి గాలిబ్‌వంటి కవులను వెలిగించిందనటం వాస్తవం. అందుకేనేమో ‘గజల్‌ మినార్లు గోల్కొండలో లేచాయి’ అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ రెండువరసల పద్యం ఉర్దూకి చమత్కారమైన ప్రత్యేకత. క్లుప్తత దీని వరం. ప్రేమ నిర్వచనం రెండు పాదాలకన్నా తక్కువేనంటే అది కవి గొప్పదనం కాదూ! అందుకేనేమో గాలిబ్‌ కవిత్వాన్ని మరో ఇద్దరుకవులు తెలుగులో అనువదించారు. రామచందర్‌ దీకొండ ‘గాలిబ్‌ కవితా కౌముది’ పేరుతో, డా॥ వెలిచాల కొండలరావు ‘జంటలు-1’ పేరుతో ఆ గీతాలకు తెలుగు అత్తరు అద్దారు.
ప్రేమ మోజూ కాదు, మోహమూ కాదు
తీరని దాహం, అలుపెరుగని త్యాగం గాలిబ్‌!

ఈ మాటలు ఎంత సరళమో, అంత అర్థవంతం. గాలిబ్‌ తాత్విక భాషను సరళంగా తెలుగులో అందించాలనే ప్రయత్నమే ఈ అనువాదం. మగువని పొగడటంలో ప్రియుణ్ని మించినవారెవరు! ‘ఆమె అందం చూసినవాళ్లని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది, అందం ఔషధం. ఆమె అందానికి అద్దమే సిగ్గుపడి అటువైపు తిరిగిందని’ కొంటెగా అంటాడు గాలిబ్‌. కొండలరావు ఈ గీతాల పేరుని సైతం ఆలుమగలన్న అర్థంలో పెట్టడం గాలిబ్‌ సారానువాదానికి నిదర్శనం. కొండలరావు పదాన్ని కాక సారాన్నే అనువదించారు కాబట్టి! ఇక కవితా కౌముదిలో గాలిబ్‌ వ్యక్తిత్వాన్ని చూపించే వాక్యాలు ఆకట్టుకుంటాయి.
ధమనుల్లో పరిగెత్తడం, ఏముంది అందు గొప్పదనం
కళ్లనుండి రాలనపుడు రక్తమెట్లవును సార్థకం!

ఎంత గంభీరమైన భావవ్యక్తీకరణ! కవి విరహాన్ని తారస్థాయిలో ప్రదర్శించాడు. ‘దీవానె-గాలిబ్‌’ నుంచి తీసుకున్న పద్యాలకు చక్కటి అనువాదమిది. నేను పలికేదీ క్లిష్టమే, రాసేదీ క్లిష్టమే అన్న గాలిబ్‌ని స్పష్టంగా పట్టుకొని తెలుగులోకి తేవడం రచయిత నైపుణ్యానికి నిదర్శనం. దాశరథి సైతం ఈ గీతాలను అనువదించడం అకస్మాత్తుగా జరగలేదు. తాను చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుడి ద్వారా పరిచయమై తన్మయ పరచిన గాలిబ్‌ కవిత్వం, అలా మనసులో తిష్ఠవేసుకొని ఉండిపోయిందట. ‘ఆయనలోని ఆ క్లుప్తత, ఆ ఆప్తత, ఆ గుప్తత నన్ను ముగ్ధుణ్ని చేయడంతోనే వీటిని అనువదించా’నని అన్నారు. అంతేనా, ఒక్కొక గీతాన్ని తెలుగులో అనువదించడానికి రోజులు పట్టేదట. ఒక్కోసారి కవిని అర్థంచేసుకోవడమే కష్టం. ఈ సమస్య గాలిబ్‌ సమకాలికులకూ ఉంది. ఆనాటి విమర్శకులు గాలిబ్‌ని అర్థం చేసుకోలేక తెగిడినా, వారికి సమాధానం ఆయన మాటల్లోనే ఉండేది.
కాముకుండు గూడ ప్రేమమ్ము నటియించె,
ప్రేమజీవి కింక విలువలేదు!

కృత్రిమమైనదే ఆకర్షిస్తుంది గానీ, నిజమైన ప్రేమకు విలువలేదని నిట్టూర్చక తప్పలేదు.
      అతి తక్కువ పదాల్లో నిగూఢార్థాన్ని పొందుపరచడం చాలా కష్టం. ఉన్న రెండు పాదాలూ వేర్వేరు అర్థాలను ప్రకటిస్తూ ఉంటాయి. దాశరథి ఆటవెలది, తేటగీతుల సాయంతో పరభాషలోని ఆ మెలుకువనీ, మెరుపునీ తెలుగులోనూ తీసుకొచ్చారు. హరిని ప్రార్థింపదలచినట్లుగానే అనీ, శివుడు దొరకకున్న కాశీకి పోతాననీ, ఇక్కడి వాతావరణాన్ని చూపే పదాలు వాడటం దాశరథి గొప్పదనం. అంతేకాదు, ఎక్కువగా అంత్యప్రాసలతో సాగే పద్యాల్లో ఆ చమక్కునూ చూపారు.
ఖైదులో నాకు నీ జడమీది చింత,
దానితోగూడ శృంఖలాగ్లాని కొంత!

ప్రియురాలి చెంత గడిపిన ప్రియుడు ఎడబాటు సమయాన పలికే పలుకులివి. తెలుగులోనూ పదాల అమరిక వూహకు తగిన తాపడమే. ఈ పంక్తుల వెలుగు చూడండి...రాత్రి గోష్ఠిలోన రాగిల్లిన జగంబు
తెల్లవారగానె నల్లవారె
      భగ్నప్రేమికుని బాధకు చమత్కారం తోడైతే ఇలా ఉంటుంది...
ఎంత తియ్యని పెదవులే ఇంతి! నీవి!
తిట్టుచున్నన్‌ తీపి కురుయు!

      పైకి నవ్వు తెప్పించినా వీటి లోపల ఎంతో వేదన ఉంది. గాలిబ్‌ ప్రణయ శృంగార విరహ గీతాల ప్రభావం మన కవులమీదా పడింది. వారంతా ప్రస్తుతం తెలుగులో గజల్‌ రచన సాగిస్తున్నారు. డా॥ సినారె సైతం అనుబంధాలు, సమాజ శ్రేయస్సును వస్తువుగా తీసుకొని గజళ్లను రాశారు. అయితే తొలి తెలుగు గజల్‌ దాశరథి రచనే. 
రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా
నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు నడిచిరానా...!

తనకి స్ఫూర్తిగా నిలిచిన గాలిబ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఆశావాది అయిన ప్రేమికుడి కొంటెదనాన్ని చూపించారు.
      గాలిబ్‌ గీతాలను చదివితే తెలిసేది ఒక్కటే! ప్రేమను అణువణువునా అనుభూతి చెందగలిగేవాడే ఇన్ని రకాలుగా వర్ణించగలడు. పాఠకుణ్ని తన కవితల పట్ల ప్రేమలో పడేయడమే కాదు. మగువ ప్రేమలోనూ పడేస్తాడు ఈ కవి. ఆపై విరహాన్నీ హత్తుకోవాలని అనిపిస్తే అది మన పొరపాటు కాదు. గాలిబ్‌ చలవే.

*  *  * 


వెనక్కి ...

మీ అభిప్రాయం