పద్యానికి పట్టం... పండరంగని శాసనం

  • 602 Views
  • 1Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

‘తొలి’ అంటే అదో గర్వకారణం. వెయ్యిమైళ్ల ప్రయాణానికీ తొలి అడుగే ప్రధానం. భాషా సాహిత్యాలకు సంబంధించి కూడా ఏది మొదటిది అనే చర్చ సహజంగా జరిగేదే. కాగితం కనిపెట్టని కాలంలో మానవుడు తన భావాలను, ప్రకటనల్ని శాశ్వతం చేయడానికి శిలలను ఉపయోగించాడు. వీటినే శిలా శాసనాలు అంటున్నాం. అందుకే శాశ్వతం అనే మాటను ‘శిలాక్షరం’ అంటాం. తెలుగు భాషకు సంబంధించిన తొలి ఆధారాలు కూడా శాసనాల్లోనే నిక్షిప్తమయ్యాయి. ఇలాంటివి ఎన్నో శాసనాలు బయల్పడ్డాయి. వాటిలో పద్య శాసనాలూ ఉన్నాయి. వీటిలోనూ ఏదో ఒకటి మొదటిది ఉంటుంది కదా! ఆ విశేషాలు చూద్దాం. 
తెలుగు
ద్రావిడ కుటుంబానికి చెందిన భాష. రెండువేల ఏళ్ల కిందటే  మూలద్రావిడ భాషనుంచి విడిపోయింది. శాతవాహనుల నాటికే ప్రజల భాషగా వాడుకలో ఉంది. దీనికి హాలుని గాథా సప్తశతిలో ఎన్నో పదాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. అమరావతి స్తూపం పలకపై ఉన్న ‘నాగబు’ పదాన్ని తొలి తెలుగు పదమని వేటూరి ప్రభాకరశాస్త్రి పేర్కొన్నారు. ‘నాగ’ సంస్కృత పదం. నాగ మీద తెలుగు ప్రత్యయం ‘బు’ చేరి నాగబు అయింది. ఇది నాగముకు సమానార్థకం. అయితే తొలిపదం నాగబు కాదు. శాసనంపై నాగబుది అని ఉంది. కనుక, అది నాగబుద్ధి అయి ఉంటుందని కొందరి వాదన. 
      శాతవాహనుల తరువాత తెలుగునేల ఇక్ష్వాకులు, ఆనందగోత్రీకులు, విష్ణుకుండినులు మొదలైన రాజవంశాల పాలనలో ఉన్నది. శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజభాష కాగా ఇక్ష్వాకుల కాలంనుంచి ఆ స్థానాన్ని సంస్కృతం ఆక్రమించింది. ఈ కాలపు శాసనాల్లో గోలశర్మ, కొట్టిశర్మ, భావజ్జ, నందజ్జ లాంటి వ్యక్తుల పేర్లు, వేపురకే, ఒంగోడు, తాడికొండ, ఏళూరులాంటి గ్రామనామాలు కనిపిస్తాయి. క్రీ.శ. 6వ శతాబ్దంలో రేనాటి చోళ రాజు ఎరికల్‌ ముత్తురాజు వేయించిన కలమళ్ల శాసనం తొలి తెలుగు శాసనం. ఈ కాలంనాటికి శాసనాల్లో పేర్లవరకే ఉన్న తెలుగు భాష వినియోగం వాక్యం స్థాయికి చేరుకుంది. 
      తూర్పు చాళుక్య వంశంలో తెలుగులో శాసనాన్ని వేయించిన తొలి రాజు జయసింహ వల్లభుడు. అయితే లభిస్తున్న తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం. ఇది క్రీ.శ.848 నాటిది. దీనిని తూర్పు చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగడు (పణ్డరంగడు) వేయించాడు. ఇది తరువోజ ఛందస్సులో ఉంది. పద్యంతోపాటు నాలుగు పంక్తుల వచనం అనుబంధంగా ఉంది. ఇది నన్నయ మొదలు తెలుగు కవులు ఉపయోగించిన చంపూ శైలికి మార్గదర్శకంగా కనిపిస్తుంది. దీనిలో పండరంగని విజయాల ప్రస్తావన ఉంది. పండరంగడు ఎన్నో యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించిన వీరుడు. ఆ పద్యం... 
పట్టంబు గట్టించి ప్రథమంబు నేణ్డు బలగర్వమొప్పంగ బైలేచి సేన 
పట్టంబు గట్టిన ప్రభు పండరంగు బంచిన సామంత పడువతో బోయ 
కొట్టముల్‌ పండ్రెండు గొని వేంగినాటి గొల్చి యా త్రిభువనాంకుశ బాణ నిల్పి 
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి కందుకూర్బెజవాడ గావించె మెచ్చి

      ఈ శాసనం మొదటి పాదాలు రాయి పగిలిపోవడం వల్ల కనిపించడంలేదు. దొరికిన దాంట్లో మొదటిపాదంలో ‘పుర’ అన్న రెండక్షరాలు, రెండోపాదంలో ‘భూపాలకుణ్డు’ అన్న పదం కనిపిస్తున్నాయి. వేంగి రాజ్య విస్తరణలో భాగంగా పండరంగడు నెల్లూరు పరిసర ప్రాంతాలైన బోయ కొట్టాలను ఆక్రమించాడు. అక్కడ త్రిభువనాంకుశుని జెండాను ఎగురవేసి, కట్టెపు కోటను నేలమట్టం చేసి కందుకూరును బెజవాడకు సాటి వచ్చేట్లు చేశాడు. ఇందులో సంస్కృత వృత్తం కాకుండా, దేశి పద్యాన్ని వాడటం విశేషం. ఈ శాసనం రాసింది ఎవరో తెలియదు. అయితే ఈ పద్యానికి అనుబంధంగా ఉన్న గద్యంలో ‘‘పండరంగు పరమ మహేశ్వరుండు ఆదిత్య భట్టారనికి ఇచ్చిన ఎనుబది పుట్ల అడ్డపట్టు నేల...’’ అని ఉండటంవల్ల దీనిని ఆదిత్య భట్టారకుడు రాసి ఉండవచ్చునన్నది ఊహ. ఇక ‘త్రిభువనాంకుశ’ వేంగీ చాళుక్య రాజుల బిరుదు. నన్నెచోడుడు ‘కుమారసంభవం’లో ‘మునుమార్గ కవిత లోకంబున వెలయగ’ పద్యంలో ‘దేశికవిత పుట్టించిరంధ్ర విషయంబున జన చాళుక్యరాజు మొదలుగ బలువుర్‌’ అన్న మాటల్ని ఈ శాసనం రుజువు చేస్తుంది. ఇందులోని అక్షరాలు వేంగీ చాళుక్యుల లిపిలో ఉన్నాయి. 
తరువోజ నాలుగు పాదాల పద్యం. ఇది దేశీ ఛందస్సుకు చెందింది. తెలుగునేల మీద వందల ఏళ్లుగా జానపదులు పాడుకునే రోకటి పాటలు తరువోజలోనే ఉన్నాయి. తలకొని తలంబ్రాలు దంపెడిచోట/ దరుణుల చేసొంపు దనరు దరువోజ అని దంపుళ్ల పాటలలో తరువోజ ఉందంటాడు విన్నకోట పెద్దన ‘కావ్యాలంకార చూడామణి’లో (అద్దంకి పద్యశాసనం మీద వచ్చిన పుస్తకంలో ఆరుద్ర ఉదహరించారు). రెండు ద్విపద పాదాలు కలిస్తే ఒక తరువోజ పాదం అవుతుంది. ద్విపద దేశి కవితా శాఖకు చెందింది. గానానికి అనువుగా ఉంటుంది. తరువోజ కూడా గాన ప్రధానంగా సాగేదే. తన పరాక్రమాన్ని జనం మరచిపోకుండా ఉండేందుకు పండరంగడు ఇలాంటి పద్యాన్ని ఎన్నుకొని ఉంటాడు.
      ఈ శాసనం గురించి ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ ‘‘... ఈ శాసనము పరమ మహేశ్వరుడైన పండరంగుని పరాక్రమ కార్యములను దెలుపుటకును, అతడు కావించిన ధర్మమును దెలుపుటకును పుట్టినట్లు తలంపవలసి యున్నది’’ అంటారు. పైగా ఆరోజుల్లో శాసనాలే ప్రజలకు వార్తాపత్రికలు లేని లోటు తీర్చేవి. అద్దంకి శాసనం కూడా చిన్న చిన్న పదాలతో, వాడుక భాషలో సాగిందే. 
      ఈ శాసనం అద్దంకి గ్రామాధికారి కాకాని కోటయ్యకు దొరికింది. దీనిని తొలిసారిగా 1905లో నెల్లూరు శాసనాల సంకలన గ్రంథంలో అలెన్‌ బటర్‌వర్త్, వేణుగోపాల చెట్టి ప్రచురించారు. ఇది తరువోజ ఛందస్సులో ఉందని చెప్పింది కొమర్రాజు లక్ష్మణరావు. శాసన కాలాన్ని నిర్ణయించింది జయంతి రామయ్యపంతులు. విశ్లేషించింది మల్లంపల్లి సోమశేఖర శర్మ.
      ఇదే కాలంనాటి కందుకూరు శాసనంలోనూ పండరంగని ప్రస్తావన కనిపిస్తుంది. గుణగ విజయాదిత్యుని తర్వాత చాళుక్యభీముడి ధర్మవరం శాసనంలో చాలా వరకు దేశి పదాలతో ఉన్న సీసపద్య శాసనం ప్రసిద్ధి చెందింది. 
      చాళుక్యుల కాలానికే చెందిన మరో ముఖ్యమైన శాసనం బెజవాడ శాసనం. ఇందులో అయిదు మధ్యాక్కరలు ఉన్నాయి. చివరన వచనం కూడా ఉంది. విశేషమేమంటే... ఈ శాసనంలోని పద్యాల్లో ప్రాసయతి పాటించారు. ఇది తెలుగు భాష లక్షణం. ఈ శాసనంలో పద్యభాగం తాత యుద్ధమల్లుడు, వచన భాగం మనుమడు యుద్ధమల్లుడు వేయించారు. ఇవి క్రీ.శ.885- 934 మధ్యకాలానికి చెందినవి. ఇందులోని మధ్యాక్కరలు నన్నయకు ఆదర్శంగా నిలిచాయని భావించవచ్చు. ఎందుకంటే... మరే ఇతర ప్రాచీన తెలుగు కవీ రాయనన్ని పద్యాలు నన్నయ మధ్యాక్కర ఛందస్సులో రాశాడు.
      రెండో యుద్ధమల్లుని కుమారుడు వేయించిన అరుంబాక శాసనంలో కందపద్యం కనిపిస్తుంది. గుణగ విజయాదిత్యుని కాలానికే చెందిన సాతులూరి శాసనంలో సంస్కృత పదభూయిష్ఠమైన చంపకమాల పద్యం ఉంది. అయితే ఇందులో ప్రాస ఉండటం సంస్కృత వృత్తాలు తెలుగు లక్షణాలను సంతరించుకుంటున్న క్రమానికి సాక్ష్యంగా నిలుస్తోంది. చాళుక్య భీముని కొరవి (మహబూబాబాదు- వరంగల్‌ జిల్లా) శాసనంలో కథాకథన శైలిలో గద్యం కనిపిస్తుంది. కరీంనగర్‌ జిల్లా కుర్క్యాలలో లభించిన శాసనంలో మూడు కందపద్యాలు ఉన్నాయి. నన్నయకు ముందు లభించిన మొదటి కంద పద్యాలు ఇవే. ఈ శాసన రచయిత కన్నడ ఆదికవిగా పేరొందిన పంపకవి తమ్ముడైన జినవల్లభుడు. ఇది క్రీ.శ. 945 నాటిది. విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు ఉత్పలమాలలు, రెండు చంపకమాలలు ఉన్నాయి. ఇవన్నీ నన్నయకు ముందున్న తెలుగు భాషా సాహిత్యాల పరిణామ వికాసాల్ని గురించి కొన్ని ఆనవాళ్లను ఇస్తాయి. అంతేకాదు చాళుక్యుల కాలానికి చెందిన చేతనభట్టు, అయ్యనభట్టు లాంటి శాసనకవుల వివరాలూ తెలుస్తున్నాయి. ఇవన్నీ నన్నయ మహాకావ్య రచన ప్రారంభించేందుకు ముందుగానే మన భాషలో కావ్యనిర్మాణానికి తగినన్ని మార్పులు జరిగాయన్నదానికి సాక్ష్యాలు. 
      శాతవాహనుల కాలంలో ఒక్క పదంగా దొరికిన ఆధారం నుంచి, అనంతర కాలంలో పదాలు, రేనాటి చోళుల కాలానికి వాక్యాలు, తూర్పు చాళుక్యుల కాలానికి పద్యాలతో ఒక సాహితీ సముద్రాన్ని సృష్టించేందుకు తెలుగు నది తన ప్రయాణాన్ని సాగించింది. అది ఇంకా సాగుతూనే ఉంది. అద్దంకి శాసనానికి ముందూ, సమకాలీనం గానూ ఇంకా తెలుగు పద్య శాసనాలు ఉండొచ్చు. అవి వెలుగులోకి వచ్చేవరకు ఇదే తొలి తెలుగు పద్య శాసనం. ప్రస్తుతం ఈ శాసనం మూలప్రతి చెన్నై మ్యూజియంలో ఉంది. 2005లో అద్దంకి ఊరి మధ్యలో ఈ శాసనానికి నకలు చేయించి ప్రతిష్ఠించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం