కుదుళ్ల తులసికి గోవిందరామ...

  • 158 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యం.సి. శివశంకరశాస్త్రి

  • హైదరాబాదు.
  • 9849783335
యం.సి. శివశంకరశాస్త్రి

తులసిని పవిత్రంగా భావించి పూజిస్తారు మనదేశంలో. ఆ మొక్కకున్న ఔషధ గుణాలవల్ల దానికి పవిత్రత ఆపాదించి ఉంటారు. ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ Äఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తులసి పూజ చేస్తారు. జానపదులు వివిధ సందర్భాలకు అనుగుణంగా పాటలు కట్టుకొని పాడుకున్నట్లే తులసమ్మపై కూడా పాటలు కట్టుకొని పాడుకొన్నారు.  తరతరాల తెలుగు జానపద సాహితీ సంపదలో భాగం ఈ తులసిపాటలు.
మొల్ల
తన ‘రామాయణం’లో ‘తేనె సోక నోరు తీయన యగురీతి...’ అన్న పద్యంలో శబ్దార్థాలతో ధిషణా కషణం చేసిన కవిత్వం కవిత్వమే కాదంది. తేనె నాలుకను తాకగానే నోరు తియ్యనైనట్లు... కవిత్వం కూడా తేలికగా అర్థమయ్యేలా ఉండాలట! అలా కాకుండా, నోరు తిరగని పదాలతో అర్థం కాకుండా ఉంటే అది పాషాణపాకమేనట! ఈ మాటలు ప్రతి ఒక్కరూ సమ్మతింపతగ్గవే. అర్థ స్ఫూర్తి లేని శబ్దం కోసం నిఘంటువులు తిరగేయడం నిరర్థకం. అలా చేయడం రసానంద జనకత్వానికి అవరోధం. ఇది సాహితీ లక్షణం కాదని లక్షణకర్తల నిర్ణయం. విన్నా, చూసినా భావం సుబోధకం, సులభగ్రాహ్యం కావాలి. అదే జానపద సాహితీ గతం. అందుకే జానపదులు తమ పాటల్లో అనుశ్రుత సాహిత్యానికి పెద్దపీట వేశారు. మకిలి లేని మనస్తత్వం, నకిలీది కాని నడవడి వారి సొత్తు. హృదయస్థిత బాధ, జీవనగాథ, ఆనందానుభూతి, ధారావాహిక గేయగానరీతి జానపదుల సాహితీ ఫణితి. జానపద సాహిత్యానికి సంగీతం సైతం చేదోడువాదోడుగా ఉంటుంది. 
      జానపద గేయాల్లోని ఆపాతమధురమైన సంగీతం ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొంటుంది. ఆలోచనామృతమైన సాహిత్యం అనుభూతిని కలిగిస్తుంది. ఆనందం అందిస్తుంది. అలాంటి జానపద సాహిత్యం తెలుగునాటనే కాదు ప్రపంచ సాహితీ రంగంలోనూ పలురకాలుగా పరిశోధకుల మెదడుకు పదును కల్పించిందనడం అతిశయోక్తి కాదు. ఒకరి నుంచి ఇంకొకరికి ఒకచోటి నుంచి మరోచోటికి పరివ్యాప్తం కావడానికి వాటిలోని నిసర్గ రమణీయకతనే కారణం. పండుగ పబ్బాలనో, పనిపాటలు, కష్టసుఖాలనో, సాంఘిక సంఘటనలనో కలగాపులగం చేసి ఎదుటివారి హృదయాలను ద్రవింపచేసేలా జానపదుల నోటినుంచి వెలువడ్డ ఆ గేయాలను గురించి ఎంత చెప్పినా తక్కువే. 
      జానపద సాహిత్యంలో ప్రత్యేకమైంది స్త్రీ సాహిత్యం. కొట్నాలు, దంపుళ్లు, అప్పగింతలు, తలుపు దగ్గరి పాటలు, వియ్యాల వారిపై విరుపులు, సీమంతం పాటలు, ఉయ్యాలలు, తిరగలి పాటలు, కలుపు పాటలు, కోతల తర్వాత కళ్లంలో ఉడుపు పాటలు, ఆరతులు, తులసి మాతకు జోతలు పెట్టే పాటలు మొదలైన సందర్భానుసారంగా పాడే పాటలన్నీ ఆడపడుచుల ఆదరాభిమానాన్ని అందుకున్నాయి.
తులసిమాతల్లికి కోటిదండాలు
పాలకడలిని చిలికేవేళ... కల్పవృక్షం, కామధేనువులతో పాటు తులసి కూడా ఆవిర్భవించిదన్నది సనాతన విశ్వాసం. 
అరుణోదయ వేళ తులసికోట దగ్గర స్త్రీలు దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో తులసిమాతను పూజించి గేయాలను లయబద్ధంగా ఆలపిస్తారు. అనంతరం తులసి ఆకుల మీద, వెన్నుల మీద నీళ్లు ధారగా పోస్తూ ఆ నీటినే కళ్లకద్దుకుంటారు. తీర్థంగా స్వీకరిస్తారు. తులసినే సర్వోత్కృష్టదైవంగా భావించి కొలుస్తారు.
కుదుల్ల(ళ్ల) తులసికి గోవిందరామ
ఉదకమొడ్డించితే గోవిందరామ
కూర్మాము తానాలు గోవిందరామ
చేసి వచ్చిన ఫలము గోవిందరామ
మొక్కల్ల(ల) తులసికి
ఉదకమొడ్డించితే గోవిందరామ
మొక(ముఖ)లింగ తానాలు గోవిందరామ
చేసి వచ్చిన ఫలము గోవిందరామ
ఆకుల్ల తులసికి గోవిందరామ
ఉదకమొడ్డించితే గోవిందరామ
అరసవిల్లి తానాలు గోవిందరామ
చేసివచ్చిన ఫలము గోవిందరామ
జంటల్ల తులసికి గోవిందరామ
ఉదకమొడ్డించితే గోవిందరామ
జగన్నాత(థ) తానాలు గోవిందరామ
చేసివచ్చిన ఫలము గోవిందరామ
పువ్వుల్ల తులసికి గోవింద రామ
ఉదకమొడ్డించితే గోవింద రామ
పున్నెగిరి తానాలు గోవింద రామ
చేసి వచ్చిన ఫలము గోవిందారామ
కాయల్ల తులసికి గోవింద రామ
ఉదకమొడ్డించితే గోవింద రామ
కాశీలో తానాలు గోవింద రామ
చేసి వచ్చిన ఫలము గోవింద రామ
పండిన తులసికి గోవింద రామ
ఉదకమొడ్డించితే గోవింద రామ
ఏడేడు లోకాలు గోవింద రామ
తిరిగి వచ్చిన ఫలము గోవింద రామ!!

      పై గేయంలో బహుక్షేత్ర ప్రదర్శనం ప్రకటితమవుతోంది. శ్రీకూర్మం, శ్రీముఖలింగం, జగన్నాథం, కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నంత ఫలం కేవలం తులసి తీర్థం తీసుకుంటే లభిస్తుందని తెలుస్తోంది. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. వ్యయ ప్రయాసలకు ఓర్చి భక్తి కోసం, ముక్తి కోసం, సద్బోధ కోసం గురువులను ఆశ్రయించి బాధపడనక్కరలేదు. ‘కోటలో తులసమ్మ కొలువున్న తీరు, కోరి కొలిచేవారి కొంగు బంగారం’ అన్నట్లు మనసు నిర్మలంగా ఉంచుకుంటే ముక్తికోసం ముప్పుతిప్పలు పడనక్కరలేదు. ఇది పురాణేతిహాసాలు ప్రవచించిన పరమసత్యం.
      ‘కలౌ స్మరణాన్ముక్తిః!’- కలియుగంలో భగవన్నామ స్మరణే ముక్తిదాయకం. గోవింద, రామనామాలను పలుకుతూ తులసిని అర్చించడమంటే కైవల్య సౌధానికి గట్టి పునాది వేయడమే. గోవిందునికి తులసి అంటే ప్రీతి. అందుకే జానపదులు తులసి పాటలో గోవిందునికి చోటు కల్పించారు. ‘ఏకః పరమాత్మా బహుదేహవర్తి’ అని నీతిశాస్త్రం. ఎన్నో రూపాలతో, మరెన్నో పేర్లతో భాసించే భగవంతుని ధ్యానించిన, జపించిన, భజించిన, పూజించిన జన్మమే జన్మం.
పది ప్రదక్షిణాలు- పది కోరికలు
కోరికలకు పుట్టినిల్లు పడతులు. తమ మనోగత భావాలను లుప్తం కాకుండా గుప్తం చేస్తారు. దైవ సన్నిధిలో తమ వాంఛలను మాటలు, పాటలద్వారా బహిర్గతం చేస్తూ సంచితమైన జన్మను ధన్యం చేయమని అర్థిస్తారనడానికి కింది జానపద గేయం ఉదాహరణ. 
గోప పరదచ్చినం (ప్రదక్షిణం) నీకిస్తనమ్మా! 
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా
ఒంటి పరదచ్చినం నీకిస్తినమ్మా
వైకుంటు సన్నిది నాకియ్యవమ్మా
రెండు పరదచ్చినం నీకిస్తినమ్మా
నిండారు సంపదలు నాకియ్యవమ్మా
మూడో పరదచ్చినం నీకిస్తినమ్మా
ముత్తు నైదవతనం నాకియ్యవమ్మా
నాల్గవ పరదచ్చినం నీకిస్తినమ్మా
నవధాన్యరాసులను నాకియ్యవమ్మా
అయిదవ పరదచ్చినం నీకిస్తినమ్మా
ఆయువైదోతనం నాకియ్యవమ్మా
ఆరవ పరదచ్చినం నీకిస్తినమ్మా
అత్తగల పుత్రున్ని నాకియ్యవమ్మా
ఏడవ పరదచ్చినం నీకిస్తినమ్మా
వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా
ఎనిమిదో పరదచ్చినం నీకిస్తినమ్మా
యమునిచే బాధలు తప్పించవమ్మా
తొమ్మిదో పరదచ్చినం నీకిస్తినమ్మా
తోడుతా కన్యలకు తోడియ్యవమ్మా
పదో పరదచ్చినం నికిస్తినమ్మా
పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా
విధవలు పాడితే ఏకాశిమరణం
పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం
రామతులసి - లక్ష్మి తులసి నిత్యం
మాయింట వెలుగై విలసిల్లవమ్మా!!!

      తులసిమాతకు పది ప్రదక్షిణాలు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో కోరిక కోరుకుంటారు. నిండారు సంపదలు, ముత్తయిదతనం, నవధాన్య రాశులు, ఆయువు, అత్తగల పుత్రుడు, విష్ణువు ఏకాంతసేవ, తోడుగా సోదరీమణులను కోరడం అన్నీ ఎన్నదగినవే. ఎన్ని సంపదలున్నా వాటన్నింటికీ మూలకారణమైన తులసి సేవ కోరుకోవడం అహంకార రాహిత్యానికి అద్దంపట్టి చూపెట్టినట్లుంది. ముఖ్యంగా అత్తగల పుత్రుణ్ని భర్తగా కోరుకోవడం గమనించదగింది. ఇది అత్తలేని కోడలుత్తమురాలు అన్న భావనకు వ్యతిరేకం. తనకు కాబోయే భర్తకు తల్లి ఉండాలని కోరుకుంటోంది ఓ కన్య. తాను వెళ్లే ఇంట్లో భర్త ఉద్యోగానికో, మరో పనికో వెళ్తే, తన యోగక్షేమాలు చూసుకోవాల్సింది అత్తే కదా! అందుకే అత్తగల పుత్రుణ్ని నాకియ్యవమ్మ అనడం. తన సంతతిని చూడాలన్నా, సంపదలు అనుభవించాలన్నా దీర్ఘాయువు తప్పనిసరి. అది కూడా అయిదోతనంతో... ఒక్క ప్రదక్షిణకే వైకుంఠుని సన్నిధి తమ పెన్నిధి కావాలనుకోవడం కాంతాజన సహజకామ్యం.
      సర్వసృష్టి చైతన్యం ఆశవల్లనే జీవనం సాగిస్తోంది. అందుకే మనిషి ఆశాజీవి. ఆశకు ఆలంబనం ఆడపడుచులు. అదే భావాన్ని పై గేయం ప్రబోధిస్తుంది. ఏదైనా సత్కథా కాలక్షేపం తర్వాతగానీ, వ్రతానంతరంగానీ, పూజానంతరంగానీ ఆయా ఘట్టాలను విన్నవారికి, చదివిన వారికి మేలు కలగాలనడం తెలుగువారి అభిమతం. అదే పై తులసి పాటలోనూ కనిపిస్తుంది. 
      జానపద సాహిత్యాన్ని వేర్వేరుగా పేరు పేరున విభజించుకుంటూపోతే సముద్రమథనంలో దొరికిన అమూల్య రత్నాలే. ఈ జానపద సంపదను భద్రంగా కాపాడుకోవడం మన ధర్మం. భావితరాలకు తెలియజేయడం మన కర్తవ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం