ఎంతవారికైనా ఎదుటిసొమ్ము తీపి

  • 196 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

‘‘పొరుగింటిపాలు 
ఇరుగింటి పెరుగు మరిగినాడు వెన్నదొంగ
ఆ పాలకడలి యజమానుడైనా
పరుల పాడి కోరనేలా!

      ఎంతవారికైనా ఎదుటిసొమ్ము తీపి!’’ అన్నాడు ఆరుద్ర ఒక సినిమా పాటలో. పాలసముద్రము, పాతాళము, హిమాలయ శృంగము, ఆకాశమార్గము ఇవన్నీ ఎవరి సొత్తు! దేవతల దగ్గరున్న ఆయుధాలన్నీ వాళ్ల పాటు కాదు. దానంగా వచ్చినవే. వజ్రాయుధం, శమంతకమణి, సుదర్శన చక్రం, పాంచజన్యం ఇవన్నీ ఎరులసొమ్ము. సొమ్ము ఒకడిదీ సోకడిదీ అన్నట్టు జనుల చెమటకు తడిసి, వారి చలువను బొక్కినవారి కథలన్నీ తవ్వితే బోలెడు. మాణిక్య గాణిక్య సంపద ఎంతున్నా ఇతరులు పిసుక్కునే మట్టిలో ఏదో మాహాత్మ్యం లేకపోదని భావించేవాళ్లు కొల్లలుగా ఉంటారు లోకంలో. దాచుకున్నవాటిని దోచుకోవాలంటే దురాక్రమణ చెయ్యడం పాత పద్ధతి. బీదాబిక్కీ కడుపులు కొట్టి వెనకేసుకున్నది ఎంతున్నా భూమిని కోరులో కలిపేసుకున్నట్టుగా ఇంకా ఏదో తమాషా చెయ్యాలి. ఏం చేసినా ధీమాగా చెయ్యాలి.  అనుకున్నదేదైనా స్వాహా చెయ్యాలనుకుంటే దానిని ప్రజల సొమ్ముగా నిరూపిస్తేచాలు. ప్రజాధనం అంటే నోరూరనిదెవరికీ!  అప్పనంగా వచ్చే సొమ్మును బుక్కడం పైనే అందరి కళ్లు. దానంగా దారబోయడానికి పారిజాతం ఇంద్రుడి సొత్తా! అదేమన్నా తను సంపాదించిందా! అని సత్య సేనతో బయలెళ్లి సొంతం చేసుకుంది. తీరా భటులు అడ్డగించేసరికి  ‘‘వినుడు సురేశ్వర వన పాలకులు! వార్ధి బొడమిన యీ దివ్య భూరూహమున కింద్రాణి యెవ్వతే! యింద్రుండు నెవ్వడు!’’ అని సవాల్‌ చేసింది. ఎవ్వరినీ అడగవలసిన పనిలేదు. ఈ భూమి అందరిదీ. ఈ వనరులపై ప్రతి ఒక్కరికీ అధికారముంది! ప్రకృతి సంపదపై గుత్తాధిపత్యం వహిస్తే సహించేది లేదని సామ్యవాదాన్ని ప్రకటించిన భీముడు కూడా సత్య మాటకి వత్తాసు పలికినట్టే కనిపిస్తాడు భారతంలో. గంధమాదన పర్వత సానువుల్లో విహరిస్తున్న ద్రౌపదికి సౌగంధికా పుష్పం కనిపించింది. దాన్ని కోసి తెమ్మంది. వనంలోకి ప్రవేశించిన భీముణ్ని అక్కడి వనపాలకులు అడ్డగించి ‘‘అయ్యా! ఇది మీకు తగినది కాదు. కుబేరుడు ఈ వనానికి అధిపతి. ఆతని ఆజ్ఞలేకుండా పుష్పాన్ని తీసుకువెళ్లేది లేదు’’ అనగానే
ఉత్తమ క్షత్రియుండేల యెఱుల నడిగి
వేడువాడగు దన భుజవిక్రమమున
నన్యధనములు పార్జించి యర్ధిజనుల

కిచ్చు గీర్తి దిక్కుల వెలయించుగాక!. ఇది ప్రకృతి సంపద. ఒకరిని అడిగేదేంటీ! అనుకున్నాడు వాయుపుత్రుడు. ఇతరుల సంపదను వారి అంగీకారం ఉన్నా లేకపోయినా భుజ బలంతో దోచుకుని బీదలకివ్వడం, తద్వారా సంపదల్ని సర్వజన సామాన్యం చెయ్యాలనే ఆలోచన భీముని మాటల్లో కనిపిస్తుంది. ‘‘పెద్దోణ్ని కొట్టు, బీదలకి పెట్టు’’ అన్నట్టుగా. ఉన్న సొమ్ము దానమివ్వడంలో గొప్పేముందీ! ఇతరుల ఆస్తులను తనవిగా చేసుకుని దారబోసేవాడే దాతలలోకెల్లా ఉత్తముడంటాడు వేమన. 
తనదు సొమ్ముజూడ దానమియ్యగవచ్చు
అవనిదొడ్డగాదదెవరికైన
అదురుబెదురులేక యన్యుల సొమ్ములు
దానమిచ్చువాడు దాతవేమ! 

      భూరి విరాళాలిచ్చి కీర్తిమంతులుగా లోకంలో చెలామణి అవుతున్నవారి దాతృత్వాన్ని గురించి చెబుతూ.. తన పాటు పరులకు దారబొయ్యడం అనేది ఎవరైనా చేస్తారు. ఈ భూమి ఒకరిసొత్తుకాదు. ఇతరుల సొమ్మును అప్పనంగా బొక్కుతూ, సన్నజీవులను నోళ్లు కొడుతూ కూడబెట్టినదాన్ని ఏ సంకోచమూ లేకుండా దానమిచ్చినవాడుంటాడే వాడే ఈ లోకంలో గొప్ప దాత! అని చమత్కరిస్తాడు వేమన. పాలకులు సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నట్లు దాతృత్వం ఒలకబోస్తూ... గణుతి కెక్కడంలో గొప్ప విశేషమేమీలేదు. అదంతా ప్రజాధనం. అన్యుల సొమ్మును బలదర్పంతో కొల్లగొట్టి మళ్లీ వాళ్లకే పెట్టి, వాళ్ల అభిమానాన్ని దోచుకునేవాడు లౌక్యం తెలిసిన గడసరి నాయకుడే మరి! అధికులు, అధిక సేన కలవారు, బలగర్వమున అతిశయించువారు పేదల కష్టంతో సమకూర్చుకున్న ఆస్తులు, ఆయుధాలు, బలదర్ప పరాక్రమాల వెనుక దేశ సంపద ఉంది. ప్రజలంతా ఉమ్మడిగా అనుభవించాల్సిన సంపద ఏలుబడి వర్గాల చేతుల్లో బందీ అయిపోతూనే ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం