చదువులతల్లి.. ‘అక్షరాలా’ కల్పవల్లి!

  • 784 Views
  • 0Likes
  • Like
  • Article Share

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్‌ సుశబ్దంబుల్‌ శోభిల్లన్‌ బల్కుము నాదు వాక్కునున్‌ సంప్రీతిన్‌ జగన్మోహినీ! పుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా! 
      మాఘమాసంలో వసంత పంచమి నాడు ఉత్తరభారతీయులు ‘సరస్వతీ పూజ’ చేస్తారు. దక్షిణ భారతంలో మాత్రం దసరా శరన్నవరాత్రుల్లో ఏడో రోజు ఆమెకు విశేష పూజలు చేస్తారు.  వాటి సంగతి అలా ఉంచితే, ‘భాషాదేవి’ అయిన ఈ నలువరాణిని ఆరాధించిన తెలుగు కవులు ఎందరెందరో!

‘అంబితమే నదీతమే దేవితమే సరస్వతి’ అంటుంది రుగ్వేదం! అంటే.. మాతృమూర్తుల్లో, నదుల్లో, దేవతల్లో ఉత్తమమైంది సరస్వతి అని. సరస్వతీ నదీతీరంలోనే వేదకాలపు నాగరికత వర్ధిల్లింది. ఆ నదీమతల్లితో ఆ కాలపు ప్రజలది విడదీయలేని అనుబంధం. అయితే.. ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులతో ఆ నది ఎండిపోయింది. ప్రజల మనసుల్లో ‘దేవత’గా కొలువుండిపోయింది. సరస్వతీ నది ఆరాధనే క్రమేణా దేవతారాధనగా మారిందన్నది చరిత్రకారుల మాట. ఆ నీటి సవ్వడికి ప్రతీకగా సంగీతానికి... ఆ నదీ పరీవాహక ప్రాంతంలో ప్రతిధ్వనించిన వేదమంత్రాలు, తద్వారా ప్రవహించిన జ్ఞానధారలను గుర్తుచేస్తూ ‘వాక్కు’కు ఆమె అధిదేవత అయ్యిందన్నది వాదన. 
      సరస్వతీదేవికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న చిత్రం శతాబ్దాల చరిత్ర ప్రయాణంలో రూపుదిద్దుకుంది. మధ్యప్రదేశ్‌లోని బౌద్ధక్షేత్రం భర్హూత్‌లోని ఓ స్తంభం మీద చెక్కిన స్త్రీ రూపమే ఇప్పటి వరకూ లభించిన భారతి రూపాల్లో మొదటిది. క్రీ.పూ.రెండో శతాబ్దికి చెందిన ఈ శిల్పంలో ఆమె పద్మపీఠం మీద నిలబడి ఉంటుంది. చేతుల్లో వీణ ఉంటుంది. దాదాపు ఇదే కాలానికి చెందిన  సరస్వతీదేవి శిల్పమొకటి మన ఘంటసాలలోనూ లభించింది. లాహోర్‌ పురావస్తు ప్రదర్శనశాలలోని గాంధార శిల్పాల్లో తల లేని ఓ స్త్రీమూర్తి ప్రతిమ ఉంది. అది సరస్వతిదే అన్నది పరిశోధకుల మాట. వీటి తర్వాత ఆ కాలపు సరస్వతీ రూపాన్నిమన కళ్లకు కట్టేవి క్రీ.శ.ఆరో శతాబ్దికి చెందిన వంగ రాజ్యాధిపతి సమాకారదేవుడి నాణేలు. వీటికి రెండు వైపులా శారదాదేవి చిత్రాలుంటాయి. ముందు వైపు చిత్రంలో సరస్వతి కుడిచేతిలో పద్మాన్ని పట్టుకుని ఉంటుంది. రెండో వైపు ఉన్న చిత్రంలో పద్మం మీద కూర్చుని వీణ వాయిస్తూ కనిపిస్తుంది. ఈ నాణేలను కోల్‌కతాలోని భారత పురావస్తు ప్రదర్శనశాలలో చూడవచ్చు. అయితే.. వీటికంటే ముందు కాలానికి చెందిన (నాలుగో శతాబ్దం) సముద్రగుప్తుడి నాణేల మీద కనిపించే స్త్రీమూర్తి సరస్వతేనన్నది ‘పద్మభూషణ్‌’ డా।। రాధాకుమద్‌ ముఖర్జీ లాంటి చరిత్రకారుల వాదన. కానీ, దీనిమీద భిన్నాభిప్రాయాలున్నాయి. దిల్లీలోని జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలో ‘పాల’ పరిపాలన కాలం (తొమ్మిదో శతాబ్దం) నాటి ఓ సరస్వతి శిల్పం ఉంది. ఇందులో ఆమె లలితాసనంలో ఒడిలో పెద్ద వీణతో ఉంటుంది. ఈ ప్రదర్శనశాలలోనే పన్నెండో శతాబ్దికి చెందిన నాలుగు చేతుల వాగ్దేవి శిల్పాన్నీ చూడవచ్చు. ఇది మధ్యప్రదేశ్‌లోని పరామరలో లభ్యమైంది. పద్మాసనంలో కూర్చున్న నాలుగు చేతుల సరస్వతీ ప్రతిమ ఒకటి కర్ణాటకకు చెందింది... కోలకతా ప్రదర్శనశాలలో కొలువుదీరింది. ఇదీ పన్నెండో శతాబ్దిదే. ఇక్కడ ఆమె చేతుల్లో జపమాలతో పాటు అంకుశమూ ఉండటం విశేషం! పదకొండో శతాబ్ది నాటి తమిళనాడు బృహదీశ్వరాలయంలో సరస్వతీమూర్తి (ముందు పుటలోని చిత్రం) కొలువుదీరింది. మథుర, భటిండా(పంజాబ్‌) తదితర ప్రాంతాల్లోనూ వాగ్దేవి ప్రాచీన విగ్రహాలు లభించాయి. వీటి చేతుల్లో తాళపత్రాలు కనిపిస్తాయి. 
నమస్తే శారదాదేవి..
సరస్వతీదేవి ఆలయాల విషయానికొస్తే కశ్మీర్‌లోని శారదామందిరం పురాతనమైంది. ‘నమస్తే శారదాదేవి కాశ్మీర మండలవాసిని’ అంటూ భారతీయులందరూ స్మరించుకునే ఈ దేవాలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. నేటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలోని శారదా గ్రామంలో ఉంటుంది. కానీ, శిథిల అవశేషాలు మాత్రమే నేడక్కడ కనిపిస్తాయి. బౌద్ధమతంలోనూ మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులుకూడా ‘హంసవాహిని’గా ఈమెను పూజించారు. మనదేశం నుంచి, చైనా ద్వారా సరస్వతీ పూజ జపాన్‌కు చేరింది. అక్కడామె ‘బెంజైటెన్‌’ రూపంలో పూజలందుకుంది. ఇండోనేసియా, కంబోడియా, థాయ్‌లాండ్‌, టిబెట్‌ ప్రాంతాల్లోనూ ఒకప్పుడు సరస్వతీదేవి ఆరాధనీయురాలే. 
      సరస్వతి తన నాలుగు చేతుల్లో, పుస్తకం, మాల, నీటికుండ, వీణలను ధరించి ఉంటుంది. పుస్తకం వేదాలకు, జ్ఞానానికీ, ఆధ్యాత్మిక పరిపక్వతకూ చిహ్నం. స్ఫటికమాల నిరంతర ధ్యానసంపదకు ఆలవాలం. నీటికుండ లోకంలోని మంచిచెడులను వింగడించే విచక్షణకూ, జ్ఞానామృతానికీ గుర్తు. వీణ ప్రపంచంలోని సమస్త సృజనాత్మక విజ్ఞానానికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ వీణపేరు ‘కచ్ఛపి’. సరస్వతీదేవిని పూజించిన వారికి ఆమె విద్యాసంపదను, ధనధాన్యాలను ప్రసాదిస్తుందంటారు. కాబట్టే ఈ తల్లిని ‘వాజేభిర్వాజినీవతీ, ధీనామ విత్య్రవతు’ అని ఋగ్వేదం స్తుతించింది. ‘అ’ కారాదిగా, ‘క్ష’ కార పర్యంతం అక్షరాల్లో నిక్షిప్తమైన ఆమె స్వరూపాన్ని ఆదిశంకరులు గద్య, పద్య, వచన రూపాల్లో కొలువైన దేవతగా కీర్తించారు. యాజ్ఞవల్క్యుడు వాణీ స్తోత్రం, వశిష్ఠుడు వశిష్ఠ స్తోత్రంతో ఆ దేవిని అర్చించారు. సరస్వతీదేవి ‘చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహా సరస్వతు’లనే ఏడురూపాల్లో ఉంటుందంటుంది మేరుతంత్రం. సరస్వతి కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుందని దేవీభాగవతం పేర్కొంది.
దసరా సంబరాల్లో సరస్వతి
శరన్నవరాత్రి పూజల్లో ప్రధానమైంది సప్తమి తిథి పూజ. ఆ రోజు ఆదిశక్తిని మహాసరస్వతీదేవిగా కొలుస్తారు. ఆవాహనాది షోడశోపచారాలతో పూజిస్తారు. కానీ, అందరు దేవతలకు మల్లే సరస్వతీదేవిని పూజాంతంలో ఉద్వాసన చెయ్యరు. అంటే, ఆ దేవి సర్వకాల సర్వావస్థల్లోనూ తమతోనే ఉండాలని కోరుకోవడమన్న మాట! ఈ శరన్నవరాత్రుల సమయంలో తెలుగు, తమిళనాడుల్లో కొన్నిచోట్ల, సంప్రదాయ పద్ధతిలో పాఠశాలల్లో సరస్వతీ పూజ చేస్తారు. ఆమె ప్రతిరూపాలైన పుస్తకాలను పూజించి, వాటిని దైవసన్నిధిలో ఉంచుతారు. తమిళనాడులో విజయదశమి రోజున ఆ పుస్తకాలను పూజాపీఠం నుంచి తీస్తారు. దీన్నే, ‘పూజిడుప్పు’ అంటారు. కేరళలో విజయదశమి నాడు పిల్లలకు ‘ఎజుతినిరుత్తు’(అక్షరాభ్యాసం) వేడుక నిర్వహిస్తారు. మన బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి పర్యంతం నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వ్యాసమహాముని నివసించిన ప్రాంతంగా దీన్ని వ్యాసపురి అని పిలిచేవారు. క్రమంగా ‘వ్యాసర’... మరాఠీ భాషా ప్రభావంతో ‘బాసర’గా మారింది. ఇక్కడి సరస్వతీ దేవి విగ్రహాన్ని వ్యాసుడు ప్రతిష్ఠించాడని చెబుతారు.  
కవిలోకానికి ఇలవేల్పు
మహాభారతంలో సరస్వతిని వేదమాతగా, అలౌకిక స్వర సమ్మేళనశక్తిగా అభివర్ణించాడు వ్యాసుడు. తెలుగు కవులందరూ తమ రచనలకు సరస్వతీ ప్రార్థనతోనే శ్రీకారం చుట్టారు. ఆదికవి నన్నయ ‘శ్రీవాణీ..’ అంటూ భారతాన్ని ప్రారంభించాడు. ఎర్రన తన నృసింహ పురాణంలో ‘‘కాంతిభాసురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట బ్రహ్మనాదమై పరగిన హంసము బిలిచి బాల మృణాళముఁ జూపు చందమై సిరి తిలకింపనొప్పు బుధసేవిత మూర్తిఁ దలంతు భారతిన్‌’’ అని వీణాపాణిని ధ్యానించాడు. ఇక నన్నెచోడుడు కుమారసంభవం ఇష్టదేవతా స్తుతిలో ‘‘వేదాగమ రూపమున మ/ హాదేవునపార గుణ మహాసంస్తుతి సం/ పాదిత యగు భారతినేఁడాదిగ/ మత్కృతికి వెలయునదిగాక దయన్‌’’ అంటూ చేతులు జోడించాడు. ‘పాములు భుజకీర్తులుగా కలిగిన శివుడికి తోబుట్టువు, శరత్కాల మేఘాన్ని, వెన్నెలను తలదన్నే తెల్లటి రూపసి, పద్మసంభవుడైన బ్రహ్మ ముఖాలనే తామరగుంపులో విహరించు హంసి, వర్ణాలనే ద్రాక్షాఫలాలకు చిలుక’’ అంటూ వాగ్దేవిని శ్లాఘించాడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యంలో. 
      శ్రీరంగ మహాత్మ్యం కావ్యంలో ‘‘బ్రహ్మరాణికిన్‌ వాణికి మత్త కీర పిక వాణికి మొక్కెద కార్యసిద్ధికిన్‌’’ అంటూ గీర్వాణికి మొక్కులందించాడు భైరవకవి.  పిల్లలమర్రి పినవీరభద్రుడైతే ఏవైనా హెచ్చుతగ్గులు పొడసూపితే సరిచేసే భారం శారద మీదనే వేశాడు. ‘‘భారతి మృదుల దయావలోకన్య సుధామయ వర్షదానంబుచేత’’ నా కావ్యం సరస, చాతుర్య మహితులతో వెలిగిందంటాడు సీమంతినీ కళ్యాణకర్త పెనుమళ్ల సోమకవి. ‘సిత పుండరీక సింహాసనం, పలుకుజిలుక చెలికత్తె, పసిడికిన్నెరవీణ పలుకుజోడు’గా కలిగిన నలువరాణిని తన స్వాంతంలో విహరించాల్సిందిగా స్వాగతిస్తాడు శృంగారనైషధ రచనాశిల్పి శ్రీనాథుడు. సరస్వతీ కటాక్షమే ఆరోజుల్లో లక్ష్మీ ప్రసన్నానికి దగ్గర దారి కదా. అందుకే ‘‘పుండరీకాసనమున కూర్చుండి వీణ వాయిస్తున్న ఆ నలువరాణి’’ తన మనసులో ఒప్పారగా కొలువుండాలని కోరుకున్నాడు స్వారోచిష మనుసంభవకర్త అల్లసాని పెద్దనామాత్యుడు. ‘‘భాషాదేవి మత్ప్రౌఢ జిహ్వాసనమూనుగాక’’ అని వేడుకున్నాడు కవికర్ణరసాయన రచయిత సంకుసాల నృసింహకవి. ‘‘రమణీయాక్షరసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి’’లో ఎల్లప్పుడూ నివసించే అక్షరమాలాలంకృతకు తన జోతలనర్పించాడు రామరాజభూషణుడు. ‘‘వచనాచమత్కృతులను వాగ్వనజదళాక్షి’’ తనకు ఒసగాలని వాంఛించాడు కంకంటి పాపరాజు. అయ్యలరాజు నారాయణాచార్యుడు ‘‘వాణినజురాణి ఘన నీలవేణి మధురవాణిఁ బల్లవ సంకాశపాణిఁ బృథుల సైకత శ్రోణి నాత్మలో సన్నుతింతు సుమధు మధుర సుధా వచః స్ఫూర్తి కొరకు’’ అంటూ హంసవింశతిలో విన్నవించాడు. ఆ వాగ్దేవి తమ నాలుకల మీద కొలువుండి, తమ కవిత్వానికి స్ఫూర్తికావాలని కవులంతా ఆమెకు మోకరిల్లారు.
పోతన ప్రార్థన
తెలుగు కవులందరిలోనూ సరస్వతీదేవితో కన్నీరు పెట్టించినవాడూ, ఆమెను కన్నబిడ్డలా ఓదార్చి బుజ్జగించినవాడు పోతన. ‘‘గోర్వెచ్చని పాలమీగడల రుచితో, అచ్చపు జుంటితేనియలను’ తలదన్నే మాధుర్యంతో నిండిన తన తెలుగు పదాలతో ఆ గీర్వాణిని ‘కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల’ అని సంబోధించాడు. ‘అమ్మా’ అని ఆర్తితో పిలిచాడు. ఆమెకు సాగిలపడ్డాడు. ప్రశాంతతకు చిహ్నమైన తెలుపు వర్ణం శారదాదేవికి ఇష్టమైన రంగు. భారతి స్వరూపాన్ని తెల్లని వస్తువులతో అభివర్ణించాడు పోతన.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!

      శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరం, చందనం, హంస, మల్లెలమాల, మంచు, సముద్రపునురుగు, హిమాలయం, రెల్లుగడ్డి, ఆదిశేషుడు, మొల్లలు, తెల్లమందారం, సుధాంబోధి, తెల్లతామరపువ్వు, ఆకాశగంగ... ఇలా తెల్లటి వాటినన్నింటినీ ఏకరువు పెడుతూ సరస్వతిని సర్వవర్ణాల సమష్టి రూపమైన శ్వేతవర్ణమూర్తిగా ప్రస్తుతించాడు మధురకవి పోతన. ఇక జానపదుల్లో సరస్వతి పేరును తమ తంబురాలకు పెట్టుకొన్న కళాకారులు శారదకాండ్రు. ‘‘ఓ భారతి కరుణామతి/ భళి శారద కరుణానిధి’’ అన్న ఊతతో వీళ్లు చెప్పే వీర, భక్తిగాథలన్నింటినీ శారద కథలుగానే పిలుస్తారు. ‘‘అమ్మ భారతి అమ్మమ్మ భారతి అమ్మో భారతాంబ’’ అంటూ గొల్లసుద్దులు చెప్పే కళాకారులూ ఈ మట్టిబిడ్డలే.  
      సమస్త సృజనాత్మకతకూ అక్షరమే ఆధారం. అక్షరమే లోకంలోని అజ్ఞాన తిమిరాన్ని హరించి జ్ఞానప్రభలను దీపింపజేస్తుంది. అలాంటి అక్షరారాధనే ఈ సరస్వతీ పూజ! 


వెనక్కి ...

మీ అభిప్రాయం