తినే బంగారం

  • 268 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

  • విజయవాడ
  • 9440172642
డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

మా వాడు ‘బంగారం’ అని ఓ అబ్బాయి గురించి కవిత్వం రాని తల్లిదండ్రులు చెప్పుకున్నా... ఓ యవ్వనవతిని ప్రాచీన కవి ‘పసిడి శలాక’ (బంగారు కడ్డీ) అని ప్రయోగించినా... బంగారం ఎప్పటికీ విలువైందే. కనకం, కాంచనం, సువర్ణం, హిరణ్యం, పసిడి... ఇలా మారుపేర్లు ఎన్ని ఉన్నా బంగారంపట్ల మగువలకు ఉండే ఆకర్షణ మాత్రం ఒక్కటే. ధరలో హెచ్చు తగ్గులతో నిమిత్తం లేకుండా, బంగారం కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. ఒకప్పుడు నగల వరకే పరిమితంగా ఉన్న బంగారం ఇప్పుడు పెట్టుబడిగానూ మారింది. అసలు తెలుగిళ్లలో బంగారం ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇంతటి ముఖ్యమైన అంశాన్ని మన కవులు, రచయితలు వదులుతారా? శక్తికొద్దీ, సృజనకొద్దీ విభిన్న సందర్భాల్లో బంగారాన్ని ఉపమానంగా ప్రయోగించారు.
      గుణవంతుల్ని ‘బంగారం’, ‘బంగారు తల్లి’, ‘బంగారుబాబు’, ‘బంగారు కొండ’ అంటారు. అందగత్తెని ‘బంగారు శలక’, ‘బంగారు కొండ’ అంటారు. ‘‘బళిరా తేరకు దేర దక్కె నిటు నీ ‘బంగారు కుండ’’ అని, పాండురంగ మాహాత్య్మంలో తెనాలి రామకృష్ణుడు అంటాడు. ‘‘శృంగార రస మొసంగన్, ‘బంగారపు బొమ్మ’ వంటి బాలిక’’ అని శుకసప్తతిలో చక్కని ప్రయోగం ఉంది. ‘‘బతుకనేర్చిన తనువొక్క పతికొసంగి, బంగరము వంటి మనసు గెంటంగ నేల?’’ అని మంచి మనసుని బంగారు మనసు అనటం కూడా ఈ శుకసప్తతిలో కనిపిస్తుంది. నవ యవ్వనాన్ని ‘‘యంగన భోగముల పంట యామని యగు నీ బంగారు వంటి పాయము బంగారుపాయం’’ (ప్రాయం) అనటం కనిపిస్తుంది. ప్రియమైన వాణ్ని ‘‘నా బంగరయ్యా నీవు చల్లగా నుండుమికన్‌’’ అనటం కూడా కనిపిస్తుంది. గొప్పదనం సమకూరటాన్ని ‘‘అమరుగాక హిరణ్య శృంగములు’’ అంటూ ‘బంగారు కొమ్ములు అమరా’యనే కవి ప్రయోగమూ ఉంది.
      విలువైనది ఏదైనా అది మనకు ‘పసిడి మూట’. ‘‘భార్యకు బతిదయ పసిడిమూట’’ అంటాడు రుక్మాంగద చరిత్రలో కవి! అందుబాటులో ఉన్న మంచిని ‘కొంగుబంగారం’ అంటాం. పంటలు బాగా పండితే బంగారం పండిందంటారు. విలువ పెరిగిందని చెప్పటానికి ‘బంగారానికి పరిమళం అబ్బిందం’టారు. దానంతట వచ్చే భాగ్యాన్ని ‘‘మూల ధనంబు నివేశనంబులో బంగరు వాన చేతికగపడ్డ తలంపుల మానికంబు’’ అంటూ ‘బంగారు వాన’అనే ఒక కొత్త ప్రయోగం కనిపిస్తుంది.
      అదృష్టవంతుణ్ని ‘బంగారు కాళ్లయ్య’ అంటారు. అలాంటి వాళ్లకు ‘పట్టిందల్లా బంగారం’ అవుతుందనీ, ‘పట్టినది బంగారం, ముట్టినది ముత్యం’ అనీ మెచ్చుకుంటారు. దానగుణశీలుణ్ని ‘చెయ్యి బంగరు కడ్డీ’, బంగారు చెయ్యి అంటారు. అత్యాశాపరుణ్ని ‘బంగారు గుడ్లకోసం బాతుని చంపుకున్నవా’డు అని పోలుస్తారు. లేనిది ఉన్నట్టు భ్రమింపచేసే దాన్ని ‘బంగారు లేడి’గా భావిస్తారు. ధనమదంతో మాట్లాడే మాటల్ని ‘పసిడివాపు’అంటారు.
      నిశ్చితార్థాన్ని ‘పైడిముడుచు’ కార్యక్రమం అని పిలుస్తారు. పైడి, పయిడి, భమిడి అనేవి బంగారాన్ని సూచించే తెలుగు పదాలు. ‘భమిడి పళ్లెం’ అంటే బంగారు పళ్లెం. దేశవాళీ పత్తి మొక్కని ‘పైడిపత్తి’ అంటారు. ఒకప్పుడు ఈ తెలుగింటి పైడిపత్తి మొక్క ప్రపంచానికి బట్టలందించింది. బంగారు తీగ అనే ఒక రకం చెరకు అతి తియ్యగా ఉంటుందట. ‘‘పసిడివ్రాత చెఱంగు మిసిమి గల్గిన దట్టి...’’ జరీ అంచు చీరని ‘పసిడి వ్రాత చెఱగు’ అనటం కనిపిస్తుంది.
      అడుగు పెట్టిన చోటెల్లా అభివృద్ధిని కలిగించువాణ్ని ‘బంగారు కాళ్లయ్య’ అంటారు. ఎక్కడికెళ్లినా నాశనం కలిగించే వాణ్ని ‘ఐరన్‌ లెగ్‌’ అన్నట్టే ‘‘యే వేళన్‌ మఱి యే ముహూర్తమున మాయిల్‌ సొచ్చినాడో మనో భావజ్ఞుండయి సర్వమున్‌ నడుపు నా బంగారుకాళ్లయ్య జే జే’’ అంటుంది ఓ కవిప్రయోగం.
ఆరోగ్యదాయకం
బంగారం అంటే ఉపమానమే కాదు ఆరోగ్యదాయకం కూడా! బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టాడని అదృష్టవంతుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. బంగారు చెంచా నోట్లో పెట్టుకుంటే ఏమౌతుంది...? ‘స్పర్శామాత్రం’గానే వైద్య ప్రయోజనాల నిచ్చే శక్తి బంగారానికి ఉంది. మెడలో నగలు అలంకారం కోసం మాత్రమే కాదు. బంగారం స్పర్శతో కలిగే ఆరోగ్యం కోసం కూడా! బంగారు కంచంలో భోజనం చేయటం, బంగారు గిన్నెలో పాయసం తాగటం ఆ స్వర్ణ స్పర్శాభాగ్యం పొందటానికే! మధ్య తరగతి మందభాగ్యత వల్ల బంగారు పళ్లేలు కొనలేక, బంగారు పువ్వునో, చుక్కనో పెట్టించిన వెండి కంచాల్లో తింటారు. కుడిచేతి వేళ్లకు రాళ్లు లేని బంగారు ఉంగరం పెట్టుకొని భోజనం చేసినా స్వర్ణ స్పర్శా భాగ్యం దక్కుతుంది.
వంటికి తగిలితే చాలు ఇంత మేలు చేసే బంగారాన్ని తింటే ఇంకెంత గొప్ప మేలు చేస్తుందో కదా! ‘తినేబంగారం’ గురించి మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ‘తినేబంగారం’ ఎలా తయారవుతుంది, దాన్ని ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నాళ్లు తినాలి... ఇవన్నీ బంగారం లాంటి ప్రశ్నలే!
      తినే బంగారం స్పర్శామాత్రంగా, దీర్ఘకాలం శరీరంపైన పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. బంగారపు రేకుని తీసుకున్న 24 గంటలలోపు జీర్ణకోశంలోంచి పూర్తిగా బయటకు విసర్జితమవుతుందని భారతీయ, పాశ్చాత్య వైద్యశాస్త్రాలూ రెండూ చెబుతున్నాయి. ఆధునిక వైద్యశాస్త్రం బంగారాన్ని శరీరానికి హాని చేయని లోహంగా (Biologically inert metal) పేర్కొంది. ఎంత తిన్నా చిన్నమెత్తు బంగారం కూడా వంట్లో ఇమడదు. కేవలం ఒక రోజుపాటు మన శరీరంలో ఉండి, స్పర్శ చేతనే జీవితానికి సరిపడా శక్తినిస్తుంది! ‘తినే బంగారం’ మహత్తు ఇది!.
తినే బంగారు రేకులు
తినేందుకు వీలైన బంగారం పలుచని రేకులా ఉంటుంది. ఈ రేకుల్ని 5,000 ఏళ్ల క్రితమే ఈజిప్షియన్లు తయారు చేయటం ప్రారంభించారని చరిత్ర చెప్తోంది. 2,000 ఏళ్ల క్రితం మనవాళ్లు బంగారు రేకుల్ని పుటంపెట్టి స్వర్ణభస్మం తయారు చేసి వైద్యంలో ఉపయోగించటం నేర్చారు. బంగారాన్ని తయారుచేసే (ఆల్కెమీ) క్రమంలో పాదరసం, వంగం, నాగం అభ్రకం లాంటి లోహాల వైద్యగుణాలు తెలుసుకున్నారు. అలా తెలుగునేల మీద ‘రసశాస్త్రం’ పుట్టింది. పాదరసం కలిగిన రసౌషధాలను తెలుగు మందులు అంటారందుకే! సిద్ధ నాగార్జునుడు ఈ శాస్త్రప్రవక్త. తెలుగువాళ్లు లోహాల మీద మొదటి నుంచీ విశేషమైన పరిశోధనలు చేశారు. వంటింట్లో ఆవిరిమీద కుడుములు వండినట్టు, నిప్పులమీద అప్పడాలు కాల్చినట్టు రకరకాలైన వంట పద్ధతుల్లో లోహాలను వండి ఔషధాలు తయారు చేశారు. అందుకని రసౌషధాలను వంటౌషధాలంటారు. ముఖ్యంగా తెలుగువారికి ‘తినే బంగారం’ మీద అనుభవం ఎక్కువ.
      వేడి చేసిన బంగారపు బిళ్లని మందపాటి తోలు అట్టల మధ్య ఉంచి, గట్టి చెక్క సుత్తితో కొట్టి ‘ఆకుపలుచని రేకు’లాగా సాగదీస్తారు. ప్రపంచం అంతా ఈ పద్ధతిలోనే స్వర్ణపత్రాలను తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో యంత్రాలు వచ్చినా బంగారపు రేకు తయారీ ఇంకా కుటీర పరిశ్రమగానే సాగుతోంది. చిన్న విషయాన్ని కొట్టీ కొట్టీ సాగదీస్తున్నాడనే మాట బంగారాన్ని సాగదీయడం నుంచే వచ్చింది.
ఇలా తినాలి!
బంగారం రేకు తయారు చేయడానికి స్వఛ్ఛమైన బంగారం కావాలి. సాగదీత కోసం 23.5 కేరెట్ల బంగారాన్ని ఎంచుకుంటారు. మిగిలిన 0.5 కేరెట్టు వెండి లేదా రాగిని దృఢత్వం కోసం కలుపుతారు. ఎక్కువ కలిపితే బంగారం వన్నె తగ్గిపోతుంది. నిప్పుల మీద కాల్చటమే బంగారానికి శుద్ధి. కాల్చిన బంగారాన్ని మేలిమి లేదా మేలిమి బంగారం అంటారు. ఇది చక్కని తెలుగు మాట. మేలిమి బంగారాన్ని సాగకొట్టి అంగుళం పొడవు సన్నని ముక్కలుగానో, అటుకులంత చిన్న ముక్కలుగానో కత్తిరించి లిట్మస్‌ పేపర్ల మధ్య ఉంచి భద్రపరుస్తారు. ముట్టుకుంటే పొడి అయిపోయేంత పలుచగా ఉంటాయీ రేకులు. పెద్దవాళ్లకి అంగుళం పొడవున్న సన్న ముక్క, చంటిపిల్లలకు అటుకంత చిన్నముక్క తినటానికి సరిపోతాయి.
      కంచంలో వేడి వేడి అన్నం కొద్దిగా వడ్డించి, దానిమీద ఈ బంగారం రేకుముక్కని ఉంచితే ఆ వేడికి బండారపు రేకు కరిగిపోతుంది. దాన్ని ఆవునెయ్యితో తింటారు. ‘బంగారు అన్నం’ తినే పద్ధతి ఇది. చంటిబిడ్డలకు మాత్రం తేనె, కొద్దిగా నెయ్యి కలిపి రంగరించి వేలికొచ్చినంత భాగాన్ని నాలుక మీద రాసి నాకించాలి. ఇదే స్వర్ణప్రాశనం లేదా స్వర్ణలేహ్యనం ప్రక్రియ. కానీ, అదేపనిగా పెడితే, అన్నప్రాశన రోజునే ఆవకాయ పెట్టినట్టవుతుంది. ‘ఆ మథ్యా మధు సర్పిభ్యం లేహ్యతే కనకం శిశుః సువర్ణప్రాశన హి ఏతత్‌ మేథాగ్ని బలవర్ధనం ఆయుష్యం మంగళం పుణ్యం వృష్యం గ్రహాపకం’ అని బంగారం రేకుని తింటే కలిగే ప్రయోజనాలు వివరిస్తుంది కాశ్యపసంహిత. దీనివల్ల పిల్లల్లో మేధోలబ్ధి (ఖిశీ), జ్ఞాపకశక్తి, ఏకసంథాగ్రాహ్యత పెరుగుతాయి. పోలియోలాంటి జబ్బులు రావు. శరీరం బలసంపన్నం అవుతుంది. ఆయుష్షు వృద్ధి, మంగళకరం, పుణ్యప్రదం. గ్రహదోషాల పీడ ఉండదు. పుష్యమీ నక్షత్రం రోజున బంగారంలో వైద్యగుణాలు వృద్ధిలో ఉంటాయి. కాబట్టి, విరేచనాలు, జ్వరం లేకుండా చూసి అ రోజు పొద్దున స్వర్ణప్రాశన చేయాలని ఈ ప్రాచీన ఆయుర్వేద గ్రంథం సూచించింది.
      బిడ్డకు చేసే జాతకర్మల్లో స్వర్ణప్రాశన కూడా ఒకటి. వాగ్భటుడు బిడ్డ పుట్టిన నాలుగో రోజే బంగారం రేకు తినిపించాలన్నాడు. మూడో నెలలోనో ఆరోనెలలోనో చేస్తే మంచిదని మరికొందరి అభిప్రాయం. పదహారో ఏడు వచ్చేవరకూ పిల్లలకు అప్పుడప్పుడు బంగారపు రేకు తినిపిస్తూ ఉండాలని కూడా చెప్తారు. బంగారపు రేకు బదులుగా స్వర్ణభస్మాన్ని తేనె నెయ్యిలతో తినిపించటాన్ని స్వర్ణబిందు ప్రాశన అంటారు. స్వర్ణభస్మాన్ని కూడా బంగారపు రేకుతోనే చేస్తారు. కాబట్టి, రేకుని తినిపించటానికి ప్రాధాన్యతనివ్వాలని మరికొందరు చెప్తారు.
ధనిక సంస్కృతి
బంగారు రేకుల్ని తినే అలవాటు ఈ రోజుల్లో ఒక ధనిక సంస్కృతిగా మారిపోయింది. స్వర్ణపత్రాల భక్షణలో ప్రపంచంలో అబూదాబీ అగ్రగామిట! ‘ఎమిరేట్స్‌ ప్యాలెస్‌ హోటల్‌’కి వచ్చిన అతిథులకు 2008 ఏడాది కాలంలో 5,00,000 బంగారు రేకులు వడ్డించినట్టు ఒక సర్వే చెప్తోంది. తినే బంగారం కథ ఇది. 
      విదేశాల్లో ప్రస్తుతం బంగారు రేకు అంటించిన స్వీట్లూ, చాక్‌లెట్లూ, క్యాండీలూ దొరుకుతున్నాయి. మనదేశంలో స్వీట్లూ, కిళ్లీలూ పలుచని తెల్లరేకులు చుట్టి అమ్ముతున్నారు. ఇది వెండి రేకు (Silver foil) అన్న భ్రమలో మనం వాటిని తింటున్నాం. కానీ, అది నికెల్‌- సీసంలాంటి లోహాల రేకు కావచ్చు. దానివల్ల శరీరంలో సీసం అవశేషాలు పేరుకొని (లెడ్‌ పాయిజనింగ్‌) చెడు ప్రభావం చూపుతుంది. కిడ్నీలు, కాలేయం, కళ్లు దెబ్బతింటాయి. అందువల్ల అతి సర్వత్ర వర్జయేత్‌! మితంగా వాడితే మీ ఆరోగ్యం బంగారమే!


వెనక్కి ...

మీ అభిప్రాయం