చలియో.. చెల్లకో!

  • 216 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

‘చలికీ చెలికీ దగ్గర సంబంధం’ అని ఒక్కగానొక్క రచయిత నొక్కివక్కాణించాడు. ‘పెళ్లి’కిలించాడు. ఈ సంబంధం అక్షర సంబంధమే కాదు.. అక్షయ సంబంధం కూడా. మావి ఏవో వానాకాలం చదువులు అని పెద్దలు అంటుంటారు. అవి ఎలా ఏడ్చినా ఫర్వాలేదు కానీ ‘చలికాలం చదువులు’ గనక లేకపోతే సంసారమే లేదు. సంగీతమే లేదు. ‘కాలమందు చలికాలం వేరయా’ అని మన వేమన చెప్పకపోయినా అది పరమసత్యం.
కాలం
అన్ని సమస్యలనూ పరిష్కరిస్తుందన్నది తెలుగువాడి నమ్మకం! దాని సంగతేమో కానీ సంసార సమస్యల్ని మాత్రం చలికాలం కచ్చితంగా పరిష్కరించేస్తుంది. పగటి కోపాలూ, తాపాలూ మర్నాడు తెల్లారేటప్పటికి చల్లారిపోతాయి. అప్పుడు కుటుంబ న్యాయస్థానాల అవసరం ఉండదు. మామూలుగా చెల్లియో చెల్లకో అనే పద్యం పాడేవాడు కూడా ‘చలియో చెల్లకో’ అని రాగం తీస్తాడు. అనురాగాన్ని అందులో అంగరంగ వైభోగంగా రంగరిస్తాడు. రాగమంటే గుర్తొస్తోంది... వెనకటికి చలికాలం తెల్లవారుజాముల్లో నదుల్లో సంగీత సాధన చేసేవారట. అమ్మబాబోయ్‌! చలిపులి దెబ్బ అంతా ఇంతా కాదు. మరి వాళ్లెలా చేసేవాళ్లో కానీ!
      అహములు సన్నములయ్యెను/ దహనము హితమయ్యె దీర్ఘదశలయ్యె నిశల్‌;/ బహు శీతోపేతంబై/ యుహుహూయని వడఁకె లోకముర్వీనాథా! అని శీతకాలాన్ని ఓ కవి మూడు ముక్కల్లో చెప్పేశాడు. ‘పోనీలే ‘పగలు’ తగ్గిపోతే తగ్గిపోనీలే’ అని ఇంకో కవి చమత్కరించాడు. శీతకాలంలో చలిమంటలే కదా ఉపశమనం!
      అయినా చలికాలం సామ్యవాదాన్ని ‘పంచి’పోషిస్తుంది. పండితులైనా, పామరులైనా దానికి నిమిత్తం లేదు. చలి బారి నుంచి ఆత్మరక్షణకి రకరకాల మార్గాలు. పండితుల విషయానికొస్తే సన్మానాలు పొందడమే! చలిబారి నుంచి కాపాడుకోవడానికి పండితులకు పట్టుశాలువాలు కప్పుతారు. అప్పుడిహ వాళ్లనెవరూ ‘వణికించలేరు’! ‘అహ నా శాలువా అంట.. కాశ్మీరు శాలువా అంట’ అని పండితులు పాడుకోవచ్చు. నిజానికి చొక్కాలు కూడా లేని కాలంలో శాలువాకు మించిన కవచం ఏముంటుంది? చలికాలం కోసమైనా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకోక తప్పదు. మన కవులు సామాన్యులా! రసగ్రహణ పారీణులు కదా! చలికాలాన్ని అడ్డం పెట్టుకుని సరస్వతీ ప్రసాదాన్ని ఉపయోగించుకుని ‘సరసవతీ ప్రసాదం’ గురించి పద్యబాణాలను లోకం మీదికి విసిరేశారు. ఇవి ‘పంచబాణాల’ కన్నా తక్కువేమీ కాదు.
      ‘‘అన్నుల చన్నుల దండ వి/ పన్నులు గా కెల్లవారు బ్రతికిరిగా కీ/ చన్నుల మీరిన వలి నా/ పన్నులు గాకుండఁ దరమె బ్రహ్మాదులకున్‌’’ అనే పద్యం ఇందుకు ఉదాహరణ. ‘పిల్ల’ తెమ్మెరల ప్రభావం గురించి ఇంత అద్భుతంగా వర్ణించిన కవి ఎవరో తెలుసా? బమ్మెరపోతన. పద్యం భాగవతంలోనిది. ఎంతైనా భోగినీ దండకం రాసిన రసవత్కవి కదా పోతన! ‘‘ఉత్తరపుగాలి విసరె వి/ యత్తలమునఁదుహినకిరణుం డహితుం డయ్యెం/ బొత్తు జరిగె మిథునములకు/ నెత్తమ్ములు దఱిగె హిమము నెలకొనియె నృపా!’’ లాంటి పద్యాలూ పోతనవే. రసవద్భాండాలే!
ఏంటయ్యా! కవులూ మీ దృష్టి ఎప్పుడూ ‘వాటి’ మీదనే ఉంటుందా అని ఎవరో అడిగితే మేము పసిపిల్లల్లాంటి వాళ్లం కదా! అందుకే మా దృష్టి అలా ఉంటుందని కవులు జవాబిచ్చారట! వాళ్లు నిరంకుశులు. ఏమైనా అనగలరు. రాయగలరు. 
      చలివల్ల కేవలం రక్తి మాత్రమే ఉందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. కొండంత భక్తి కూడా ఉంది. శంభుకంట నొకటి జలరాశి నొక్కటి/ మఱియు నొకటి మనుజమందిరముల/ నొదిగెఁగాక మెఱసియున్న మూడగ్నులు/ చలికి యులికి భక్తి సలుపకున్నె? అనే పద్యం దీనికి చక్కటి ఉదాహరణ. ఇదీ పోతనదే.
      పండితుల గొప్పతనం పండితులకే అర్థం అవుతుందన్నట్టు కవుల కష్టాలు కవులకే బాగా అర్థమవుతాయి. విన్నకోట పెద్దన అనే ఓ పెద్దకవి ‘కావ్యాలంకార చూడామణి’లో ‘తరుణీ యౌవన గర్వజృంభిత...’ అంటూ ఓ పద్యం చిలికించాడు. ప్రభువులను మెప్పించిన కవులకు ఇళ్లలో చలిబాధ ఉండదట. దానికి పెద్దన చెప్పిన కారణం... తరుణీమణుల కౌగిళ్లలోని ఉష్ణగంధం, మంచి కాశ్మీరపువ్వు, పరిమళద్రవ్యాలు, పట్టునూలు పంచెలు ఉండటమట! చలిపులి బారి నుంచి తప్పించుకోవడానికైనా రాజానుగ్రహం పొందక తప్పదన్నమాట. ఎంత చలికి అంత కవిత్వం! ఆహా! ఓహా!
      ‘ఎంతవారలైనా కాంతాదాసులే’ అని త్యాగయ్య అన్నా అది ఘోటక బ్రహ్మచారులకు వర్తించదు. కానీ ఎంతవారలైనా చలికి దాసులే అంటే ఇక దానికి తిరుగు ఉండదు. సూర్యచంద్రులకు కూడా ఇందులో మినహాయింపు ఉండదు. పొదుపు కొండ మీద పొడుచుట మొదలుగా/ బరువు లెట్టి యినుడు పశ్చిమాద్రి/ మరుగు జొచ్చెగాక మసలిన జలిచేతఁ/ జిక్కెఁజిక్కెననగ జిక్కకున్నె?... సూర్యుడు ఉరుకులు పరుగులు పెట్టి పడమటి కొండలో దాక్కున్నది చలి నుంచి తప్పించుకోవడానికేనట! ఈ పద్యమూ భాగవతంలోనిదే. ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక’ అన్నారు. సమస్తజీవులకే కాదు.. సూర్యుడికీ ఈ పరిస్థితి తప్పకపాయె. ఇలాంటి పద్యమే ఇంకొకటుంది. ‘‘చలికి బెగడొంది మేరువు చాటుఁజొచ్చి/ యెట్టకేలకుఁగాని రాడినుడు వెడలి/ వెడలి పరువెత్తి యపరాద్రి వెనుకకేగు/ నితర జనముల శీతార్తి యెన్ననేల?’’ అని ‘కవిరాజ మనోరంజనము’ చెబుతోంది.
      చలి గురించి చెబితే చాలా ఉంది. వింటే ఇంకా ఉంది. మొహమాటం లేకుండా చెప్పాలంటే, ‘మోహమాటం’ ఉండి చెప్పాలంటే చలే లేకపోతే వాత్సాయనుడు ఉండి ఏం ప్రయోజనం? మన్మథుడు ఉండీ ఏం ఉపయోగం? అంతా ‘మంచే’ అన్నది చలి సందేశం! మనిషి వణకాలంటే వయస్సన్నా మీద పడాలి.. చలికాలమన్నా ‘మంచు’కు రావాలి. హిమాలయాలకు అంత విశిష్టత ఎందుకు వచ్చిందంటారూ? మంచువల్లనే! 
      ‘‘నేల యంతంతయు నెఱిఁజంద్రకాంతపు / ఱాలఁగట్టించిన లీల మెఱసె/ నింగి యంతంతయుఁ బొంగి దుగ్ధాంభోధి/ నిట్టదొట్టిన మాడ్కి దట్టమయ్యె/ సకల జీవులమీఁదఁ బ్రకటమై హరికీర్తి/ కలయఁబర్విన మాడ్కిఁ దెలుపుఁజూపె/ నక్కజంబుగ నెల్ల దిక్కులు నొక్కటఁ/ దెరచీర లెత్తిన కరణిఁ దోఁచె/ నగములెల్లను నీహారనగము లయ్యెఁ/ దరువులెల్లను ఘనసారతరువు లయ్యెఁ/ బక్షులెల్లను రాయంచపదపు లయ్యె/ గురుతరంబగు పెనుమంచు గురియు కతన’’ అని ‘పద్మపురాణం’లో ఉంది. మంచు ప్రకృతి మొత్తాన్ని వరిస్తుంది. ఆవరిస్తుంది. హేమంత మహిమ ఏమంత, ఏమంత అనుకోనక్కరలేదు. ఎంత చెప్పినా తక్కువే. ‘‘హిమముచే నంబరంబెల్ల నిమురుగొనఁగ/ నుష్ణకరుఁడును గరములొయ్యొయ్య సాచి/ తాను ననలాంశ ధరియింపఁబూనె ననఁగ/ ఎంత యనవచ్చునింక హేమంత మహిమ’’ అంటూ ‘శ్రీరంగమహాత్మ్యము’ చెబుతోంది.
      ‘శనిదేవత రథచక్రపుటిరుసులలో పడి నలిగిన దీనులార! హీనులార!’ అని శ్రీశ్రీ శని బాధితులపట్ల అపారమైన సానుభూతి చూపించారు. మరి చలిదేవత బాధితుల సంగతేమిటి? ప్రక్కలు వంచివంచి మునిపండ్లును పండ్లును రాచిరాచి రొ/ మ్మక్కిల జేసిచేసి తల యల్లన కాళ్లకు నందియంది లో/ చక్కికి నొక్కినొక్కి యిరుచంబడ గుమ్మడిమూట గట్టి వీ/ పెక్కి దువాళి చేసి చలి యిక్కడ నక్కడ బెట్టు వేకువన్‌ అంటాడు ‘క్రీడాభిరామం’ కర్త. ‘‘చెప్ప నశక్యంబగు చలి/ యుప్పతిలన్‌ బాల వృద్ధ యువజనములకుం/ దప్పక శరణములయ్యెం/ గుప్పసములు ముర్మురములు, కుచకుంభములున్‌’’ అని సంకుసాల నృసింహకవి తన ‘కవి కర్ణ రసాయనము’లో వర్ణించాడు. చలిని తట్టుకోవడానికి పిల్లలు, పొడుగు చొక్కాలు తొడుక్కున్నారట, వృద్ధులు కుంపట్ల ముందు కూర్చొన్నారట. మరి యువకులు! యువతులను ఆశ్రయించారట!! ఈ యవ్వారం చూస్తుంటే భూతలం మీద శీతకాలమే లేకపోతే సృష్టి కూడా స్తంభించిపోతుందేమో!
చలికాలంలో పనీ పాట లేనిది వేటికయ్యా! అంటే తాటాకు విసనకర్రలకేనట! వేసవిలో అవి విపరీతంగా పనిచేసి అలసిపోయి చలికాలంలో ఓ మూలనపడి విశ్రాంతి తీసుకున్నట్టు ఉందని చమత్కారమంజరిలో ఓ పద్యం చెబుతూ ఉంది. ఆధునిక సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ కూడా చలి బాధను వర్ణించాడు. మహాప్రస్థానంలోని ‘జయభేరి’ కవితలో ‘‘శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ ఆకలేసీ కేకలేశానే!’’ అని చెప్పుకొచ్చారు. శ్రీశ్రీయే కాదు ఇతర ఆధునిక కవికుల‘తిలకు’లు చలి నుంచి తప్పించుకోలేకపోయారు. అమృతం కురిసిన రాత్రి అయినా అంతే. ‘‘లేత ఎరుపు ఆవేశాన్ని ఒంటినిండా కప్పుకుని/ కడుపులో వణికించే చలి కనబడకుండా ఆలోచనల మంటలంటించి/ గొణుక్కుంటూ పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను’’ అని దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ అంటారు. కవిత ‘నేను కాని నేను’! చలి ధాటికి ఎవరైనా ఇలా ‘మైమరచి’ పోవాల్సిందే కదా!
      ‘కాదేదీ కవితకనర్హం’ అనుకునే కవులు చలి కాలాన్ని మాత్రం వదులుతారా? ‘చలికాలం’ మీదనే దుప్పటి కప్పకుండా ఉంటారా? ఋతుచక్రమనీ, ఋతుఘోష అని ఏకంగా కావ్యాలే రాసిపారేశారు. మహాకవి డా।। సి.నారాయణరెడ్డి, ‘‘గడియారములో తొమ్మిది గంటలయ్యె/ కలవారల పడక గదులలో నింకను ప్రభాతమే ఆవరించె’’ అన్నారు. చలికి సూర్యచంద్రులు కూడా లెక్కలో విషయం కాదు. అందమైన చందమామకూడా దుమ్ము గప్పిన అద్దకపు బిళ్లలా కనబడుతుంటే ఇంకేం చెప్పగలం! అగ్నిధార కురిపించిన మహాకవి దాశరథి సైతం ‘‘చలి చలి చాలి చాలని రజాయిని కప్పక కన్నుమూసి, ని/ ద్రలు వడబోసి, స్వప్నములు త్రావి, ప్రియాధర మారగించి, ఆ/ కలి దిగబెట్టి వత్తును, జగత్తును మొత్తము మెత్తక్రిందనే/ నలిపి చెలీ! చెలీయనుచు నాలుక దప్పిగొనన్‌ జపించనా’’ అని చలి నామస్మరణ చేయక తప్పలేదు. చలి దగ్గర అంగారమైనా శృంగారమైనా ఒకటే. విలాసం లేని అభాగ్యులు మాత్రం కేవలం చలి మంటల మీద ఆధారపడి కాలాన్ని ఎలాగో నెట్టుకొస్తారు. ఇదంతా ఒక ఎత్తు. బసవరాజు అప్పారావు సంగతి ఒక ఎత్తు. ఆయన చూసిన ‘చలి పిడుగు’ తలుచుకుంటే ఎవరికైనా పిడుగు పడ్డ అనుభూతి కలుగుతుంది.
ప్రళయాంత భీల నభో/ దళన ఫెళపెళారవముల/ చలి పిడుగా! గర్జింపకు/ నిలిచి నాదు మనవి వినుము/ బంగారు బొమ్మ నాదు/ మంగళ ప్రదమ్మయొంటి/ రుద్ర భూమి గటిక నేల/ నిద్రించెడు నొడలు మరచి/ చూపబోకు మచట నీ/ ప్రతాపమెల్లి పిడుగా? నా/ కన్నతల్లి యడలి లేచి/ కక్కటిల్లి యేడ్వగలదు!/ కడుపు మంట గనలి పొక్కు/ కన్నతండ్రినైన నాదు/ పలువరింత మాటలకును/ నలుక బూనకయ్య/ ప్రళయాంత భీలనభో/ నిలిచి నాదు మనవి వినుము అంటారు అప్పారావు. ఇది చదివాక ఎవరికైనా ‘చల్లని’ రాజా ఓ బసవరాజా అనిపించకపోతే చలిమీద ఒట్టు!
      సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు చలితీవ్రతకు ఎలా తల్లడిల్లిపోతారో కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’లో చెప్పాడు. ‘‘దినముబ్రాత స్స్నాన మొనరించు ద్విజులకు/ నగు కర్మలోప భయంబుకంటె/ బ్రాచి పనుల్‌ సేయ లేచు కోడండ్ర కౌ/ నత్తలవలని భయంబుకంటె/ గడువులో దూర మేగగనున్న చరులకు/ నధిపుచే నొదవు భయంబుకంటెఁ/ గర్షణం బొనరింపఁ గడఁగు కాపుల కార/ యమిఁ బైరుచెడునన్‌ భయంబుకంటెఁ/ గడిదియయ్యె సీతు ఖగమృగ పశునర/ ప్రముఖ జంతువులకు భావములను/ జాలమించె మిథున సంపర్క సౌఖ్యంబు/ శిశిర మహిమ వినుతి సేయవశమె?’’ అంటూ చలిపులి పంజాదెబ్బను కళ్లకు కట్టేలా వర్ణించాడు. 
      ఏమి చలికాలమో ఏమో! ఎండాకాలంలో తీరని దాహం వేస్తే జనం చలివేంద్రాన్ని ఆశ్రయిస్తారు. వాటిలో చలి ఉండదు. మంచినీళ్లే ఉంటాయి. మరి చలిని తట్టుకోలేనివాళ్లు దేనిని ఆశ్రయించాలి? ‘చెలివేంద్రాన్ని’ అని ఏ కవిపుంగవుడైనా ఎక్కడో చోట ‘సొల్ల’కుండా ఉండడు. ఎటొచ్చీ పుట్టింటి కారణంగానో, లేక ఏ పుణ్యకార్య నిమిత్తమో ‘చెలి’ లేక మాత్రం ఎంత కొంకర్లు తిరిగినా ప్రయోజనం ఉండదు. 
      తెలుగు వారికి ఆమెతలైన సామెతల్లోనూ చలి ‘అశ్వ’రూపం ప్రదర్శించింది. ‘చలి రాత్రి విరహాలకు కౌగిళ్లే దుప్పట్లు’ అని తొలుత ఏ రసిక చక్రవర్తి అన్నాడోగానీ అది ఆ నోట, ఈ నోట నాని సామెతై కూర్చుంది. చలి నియంతృత్వం అంతాఇంతా కాదు. ‘చలికి జడిసి కుంపటి ఎత్తుకున్నట్టు’ అనే మాట కూడా ఉంది.
కాలాన్ని కూడా చలి తన చేతిలో పెట్టుకుని ఆడిస్తుంది. చలికీ ‘ముహూర్తాలు’ ఉంటాయి. ‘మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి’ అనీ, ‘మాఘమాసపు చలి మంటలో పడ్డా తీరద’నీ, ‘మాఘం మానులు వొణుకుతాయ’ని తెలుగు తాతలు ఎప్పుడో చెప్పారు. 
      ఇంతటి చలి నుంచి ముక్తి లేదా అంటే ‘అమ్మ’బాబోయ్, ‘అయ్య’బాబోయ్‌ ఎందుకు లేదు! నడుము మునిగే దాకానే చలి- నలుగురూ వినే దాకానే సిగ్గు అనే మాటా ఉంది. నిండా మునిగిన వానికి చలేంటి? అని తెలుగువాడు వణక్కుండా, తొణక్కుండా, బెణక్కుండా ఎప్పుడో చెప్పాడు.
      చలికాలం ప్రాప్తిరస్తు!


వెనక్కి ...

మీ అభిప్రాయం