పాటల పండగ

  • 105 Views
  • 0Likes
  • Like
  • Article Share

భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ... అన్నీ కలిస్తేనే పెద్దపండగ! కానీ, దాని గురించి ఎవరేం మాట్లాడుకున్నా భోగి, సంక్రాంతిలతో ఆగిపోతారు. అయితేగియితే ‘పశువుల పండగ’ అని మాత్రమే కనుమను వర్ణిస్తారు. ముక్కనుమ రోజు ‘ముక్కలు’ తినాలని ఒక్కముక్క చెప్పేసి ఊరుకుంటారు. 
ఈ రెండు రోజుల గురించి చెప్పుకోవడానికి ఇంకేమీ లేవా?
తల్లి దండనా/ తండ్రి దండనా/ అత్త దండనా/ మామ దండనా
పురుష దండనా/ పుత్ర దండనా/ యమ దండనొద్దు!
సావిత్రీ గౌరమ్మ తల్లీ/ నీ దండన మాకు/ ఎల్లప్పుడూ కావాలి
 
      ఇది ‘బొమ్మలనోము’ పాట. ఈ నోముకే మరోపేరు ‘సావిత్రీగౌరీ వ్రతం’. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు ముక్కనుమ నాడే ప్రత్యేకంగా నోచుకునే నోము ఇది. పితృస్వామ్య వ్యవస్థలో సవాలక్ష కట్టుబాట్ల మధ్య కాపురం చేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి నోమూలూ పాటలనే స్త్రీకి సాంత్వన చేకూర్చేవి. మనసులోని మాటను ఇలా పాటల ద్వారా వెల్లడించేవాళ్లు వారు. ‘కంటి కంటి/ ఏం కంటి?’ అని మరో బొమ్మలనోము పాట ఉంది. ‘స్వర్గానికెళ్లినా/ సవతి పోరొద్దు/ మేడమీదికెళ్లినా/ మారుతల్లొద్దు’ అన్న మాటలు దాంట్లో వినపడతాయి. ఇవీ స్త్రీ హృదయానికి అద్దంపట్టేవే. అంటే ముక్కనుమ మగువల పండగ అనే కదా! సావిత్రీగౌరిని మట్టిబొమ్మల రూపంలో పూజించడం ఈ నోము సంప్రదాయం. వ్రతమంతా పూర్తయ్యాక ఆ బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ‘‘...బొమ్మలన్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలొ/ బరువడి నారగించెదరు పచ్చడి బెల్లము పుల్గమిచ్చలన్‌’’ అంటూ తన ‘తెలుగునాడు’ కావ్యంలో ఈ బొమ్మల సంబరాలను వర్ణించారు దాసు శ్రీరాములు కవి. ఈయన కృష్ణాజిల్లా కూరాడ వాసి. పన్నెండో ఏటే నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసిన ఘనాపాఠీ. 
కనుమ నాడు మినుములు తినడమే కాదు, పశువులను పూజించడమూ ఆనవాయితీయే. పాడిపంటల్నిచ్చే జీవాలకు ఆ రకంగా కృతజ్ఞతను తెలపడం తెలుగు సంస్కృతిలోని ఔన్నత్యం. అయితే, ఈ కనుమతో పాటు ముక్కనుమ నాడూ ఆబోతును ఊరేగించే సంప్రదాయం ఉండేది. ఆ సమయంలో ‘ఆకపదాలు’ అనే అవతారగాథను పాడేవారు. ‘శ్రీరామ రామ; రామోరామ; రామయ్య!/ హరిరామ; రామ; రామయోధ్య రామా’’... ఇలా రామాయణ, భారత, భాగవత గాథలను ఆలపించేవారు. ఇక ఊరేగింపులో ఆబోతును నెమలికుంచెతో దీవించడం పద్ధతి. ఈ సమయంలోనే పాడే పాటలు కొన్ని ఉన్నాయి. అవే ‘దీవెనపదాలు’. ‘‘హరో హరి; వెండితుట్టలు కొన్ని/ రాగితుట్టలు కొన్ని; రావణుని మేడలకు/ రాళ్లు మోయించి!/ పసిబిడ్డ తల్లులు బాలెంతరాళ్లు/ అన్యకరి రావణుని వెట్టిచెయ్యలేక/ మూడేసిసోలలు మక్కజొన్నలు/ పైపత్యమీయంగ/ దిగేరు దేవతలు దిమీసీలాగ/ పడ్డారు దేవతలు పర్వతంలాగ/ హరో హరి/ దేశానికొకొక్క దేవుడుంటాడు/ అరిటాకు వందనము చెరుకాకు చేబొండ/ పాలకరి మఱ్ఱాకు పానుపేశారు/ జయమంగళం జయ శుభమంగళం’’... ఇదో దీవెనపదం. పల్లె భూస్వామ్యవ్యవస్థకు రావణుడు ప్రతీకగా, అతన్ని ఎదిరించిన వీరుడెవ్వడో ‘దేవుడై’నట్లు కనిపిస్తోంది కదా!  
      ‘ఆయుధపూజ’ అనగానే దసరా గుర్తొస్తుంది కానీ, కనుమ నాడూ దాన్ని ఆచరించే అలవాటు తెలుగువారిది. అన్ని వర్గాల వారూ తమ వృత్తి పనిముట్లను శుభ్రంచేసుకుని... పసుపు, కుంకుమ, పూలు, పత్రితో వాటిని అర్చించడమే కనుమ నాటి ‘ఆయుధపూజ’. ఆ పనిముట్లకు అలా పూజలు చేశాక, అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తారు. అంతేనా! ‘నైవేద్యాల పాటలు’ పాడతారు. వాటిల్లో ఒకటి... ‘‘అరటిపళ్లు, కొబ్బరికాయలు/ అమ్మవారికి/ హారతి పళ్లెం కానుకలు/ పూజారికి/ చెంగల్వ పూదండ సీతామహాలక్ష్మికి/ చేతిలో కాసులు సన్నాసికి/ భక్తితో మొక్కాలి మా అమ్మకూ/ చేతులు జోడిలు చిత్తంబు నిలిపి’’! 
      కనుమ, ముక్కనుమల చుట్టూ ఎన్ని సంప్రదాయాలు... వాటికి అనుగుణంగా ఎన్నెన్ని పాటలు! ఇక భోగినాడు పాడే భోగిపళ్ల పాటలు, గొబ్బిపాటలు, హరిదాసు కీర్తనలు... అన్నీ సంక్రాంతి ప్రత్యేకాలే. ఈ సాహితీ సంపదనంతా గుర్తుచేసుకుంటే పెద్దపండగ సంబరాలు మరింత శోభాయమానం అవుతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం