నవరస స్వర రవళి బాలమురళి

  • 42 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। పప్పు వేణుగోపాలరావు

  • కార్యదర్శి, మద్రాసు మ్యూజిక్‌ అకాడెమి,
  • చెన్నై. pappuvenu@gmail.com
డా।। పప్పు వేణుగోపాలరావు

బాలమురళి ఓ గొప్ప గాయకుడు, బహు భాషా కోవిదులు, విలక్షణ వాగ్గేయకారులు, కొత్త రాగాలు సృష్టించినవారు. శాస్త్రీయ, లలిత, భక్తి, నాట్య సంగీతాలు, తత్త్వాలు వంటి ప్రక్రియల్లో నిష్ణాతులు. అంతేకాక త్యాగరాజస్వామిలా తెలుగు, సంస్కృతాల్లో రాశారు. ముత్తుస్వామి దీక్షితులులా రాగముద్ర, వాగ్గేయకార ముద్రలను ఉపయోగించారు. శ్యామశాస్త్రిలా అమ్మవారి మీద కృతులు రాశారు. అన్నమాచార్యలా అనేక విషయాల మీద రాశారు. భద్రాచల రామదాసులా భక్తి తరంగాలు అంతరంగంగా కలిగిన కీర్తనలను రాశారు. జయదేవుడిలా శృంగారం రంగరించి రాశారు. పురందరదాసులా ఏ సంకోచం లేకుండా విషయాన్ని సూటిగా చెప్పే లక్షణం కలిగినవారు. అంటే, ఈ వాగ్గేయకారులందరిలోని ముఖ్య లక్షణాలను కలగలిపితే బాలమురళి! అంతేకాకుండా వాళ్లెవరూ చేయని ప్రయోగాలు కూడా చేశారు. కృతులు, వర్ణాలు, స్వరజతులు, పదాలు, జావళీలు, భక్తి గీతాలు, తిల్లానాలు.. ఇలా అన్ని ప్రక్రియలనూ రాశారు. వీటిలో వర్ణాలు, తిల్లానాలు ఇటు సంగీతానికి, అటు నాట్యానికీ ఉపయుక్తాలు. సంగీతపరంగా, సాహిత్యపరంగా ఎన్ని ప్రయోగాలు చేసినా అందరూ అలవోకగా పాడేలాగా చేశారు. బాలమురళి వాగ్గేయకారుడు, గాయకుడు మాత్రమే కాదు. వీణ, వయోలిన్, వయోల, మృదంగం, కంజీర వాయిద్యాల్లోనూ నిష్ణాతుడు. ఇలా బహుముఖాలుగా ఉంటూ అన్నింటిలోనూ అపార ప్రతిభ కలిగి ఉండేవారు కాబట్టే పలు సందర్భాలలో ఆయన అనేవారు, ‘‘నాకు సంగీతం తెలియదు. సంగీతానికి నేను తెలుసు’’ అని. 
ఇక కొత్త రాగాలను సృష్టించి వాటిని సరిపోషించడం అనేది మరొక అనన్య సామాన్యమైన, అనితరసాధ్యమైన విషయం. అప్పటివరకూ సప్తస్వరాలలో 5 స్వరాలకి తక్కువ ఏ రాగమూ లేదు. బాలమురళి మాత్రం 4 స్వరాలతో, 3 స్వరాలతో కూడా రాగాలను చేశారు. సుముఖం, సర్వశ్రీ, మహతి, లవంగి, చంద్రిక, రోహిణి, మోహనాంగి, గురుప్రియ తదితర రాగాలు ఆయన సృష్టించినవే.
సాహిత్య రచన
వాగ్గేయకారుడంటే సంగీతం, సాహిత్యం రెండూ చేసేవాడన్నది సామాన్య అర్థం. కానీ శారదేవుడు తన ‘సంగీత రత్నాకరం’లో ఉత్తమ వాగ్గేయకారుడి లక్షణాలను పేర్కొన్నాడు. భాష మీద అధికారం కలిగి, ఛందో వైవిధ్యం తెలిసి, అలంకారాలు ఎక్కడ వాడాలో అక్కడ వాడే నైపుణ్యం ఉండి, చెప్పే విధానంలో చమత్కారం చూపించి, రసం, భావం రంగరించి రాయగలిగినవాడే ఉత్తమ వాగ్గేయకారుడన్నది దాని సారాంశం. ఉదాహరణకు బాలమురళి రూపొందించిన ‘ఓంకారా కారిణి మదాహంకార వారిణి అవతుమాం’ అనే కృతిలో అనుప్రాస, శబ్దాలంకారాలు వినపడతాయి. స్వరక్షరాలున్నాయి. అంటే ‘మ’ అక్షరం వచ్చినప్పుడంతా అది ‘మ’ స్వరంలో ఉంటుంది. ఇంకా, మంత్రశాస్త్రం తెలిసినవారు కాబట్టి చాలాచోట్ల బీజాక్షరాలూ కనిపిస్తాయి. సర్వశ్రీ రాగంలోని ‘ఉమా సుతం నమామి మమ మానసనుతం’, ‘హనుమ అనుమా ఓ మనమా’ కూడా ఇదే కోవకి చెందుతాయి. ‘ప్రసాద గుణం’ అన్నది ఒక కవితా గుణం. తను చెప్పదలచుకున్నది కవిత్వం కోసం జటిలం చేయకుండా అలతి మాటలతో ‘ప్రసాద గుణం’గా చెబుతారు బాలమురళి. ఆయనది ఉన్నత కవితా లక్షణం. ఉత్కృష్ట రచనా శిల్పం ఆయన సొంతం.
      బాలమురళి భాషాసాహిత్యాల్లో అద్వితీయ చమత్కారం ఉంటుంది. సంస్కృతంలో రాస్తే ఉత్కృష్ట భాషను ఉపయోగించారు. తెలుగులో అయితే గ్రాంథికం, వాడుక భాషలు రెండింటిలోనూ రాశారు. ఆయన ఆదాయపు పన్ను మీద కూడా పాట రాశారు-  ‘భూభారం మోయుటకన్నా భూమిపై పన్నుల భారం మోయుట మిన్న’ అని. ఇంకా, ఆయన సృజనను, ప్రయోగాలను ఎద్దేవా చేసినవాళ్లను ఉద్దేశించి, ‘తామే సాంప్రదాయ సిద్ధులట, తమదే సంగీతమట’ అని రాశారు. 
      అదేమిటి అంటే.. శారదేవుడు వాగ్గేయకార లక్షణాలు చెబుతూ.. ‘లోకిస్థితిషు చాతురి’ అన్నాడు. సామాన్యుల భాషలో రాయాలి, సామాన్యులకు ఉపయోగపడే విషయాల మీద రాయాలి అని దానర్థం. త్యాగరాజస్వామి కూడా తనను విమర్శించినవాళ్ల మీద ‘నాదుపై బలికేరు నరులు’ అని రాసుకున్నాడు. రామదాసు జైల్లో ఉన్నప్పుడు ఓరోజు పొద్దున్నే ఆయన్ను తేలు కుట్టిందట. అందుకే ‘మేలైన చిటికెన వేలు ప్రాతఃకాలముననే కుట్టె తేలు’ అని పాడాడు. అంటే పూర్వ వాగ్గేయకారులు ఏ బాటలో నడిచారో అదే దారిలో బాలమురళి కూడా నడిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం బాలమురళిని ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించినప్పుడు ‘స్థాన బలిమి నీది, ఆస్థాన బలిమి నాది’ అని స్వామిని ఉద్దేశించి పాడిన గడుసుతనం ఆయనది.
సంగీత రచన
బాలమురళి సంగీత రచనలోని ముఖ్య లక్షణాలు ఆయనకే ప్రత్యేకించినవి. ఎప్పుడో వంద సంవత్సరాల కిందట మహావైద్యనాథయ్యర్, తంజావూరు కోటీశ్వరయ్యర్లు 72 మేళకర్త రాగాల్లో రచనలు చేశారు. బాలమురళి పదహారేళ్లకే వాటిలో రచనలు చేసి ‘జనకరాగ కృతి మంజరి’ అని పేరు పెట్టారు. పదహారేళ్లంటే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వయసు. ఆ వయసులో 72 జనక రాగాలను ఆకళింపు చేసుకుని, ఉత్తమ సాహిత్యాన్ని కలబోసి కృతులు కూర్చడం... ఎంత మేధ ఉంటే అంత పని చెయ్యగలరు!? ఈ 72 కాకుండా అన్ని రకాల సంగీత ప్రక్రియల్లో ఆయన రూపొందించిన 250 రచనలున్నాయి. వీటన్నింటినీ ‘సూర్యకాంతి’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. అది కూడా స్వదస్తూరితో.. తెలుగు, సంస్కృత, తమిళ, కన్నడ, మలయాళ, ఆంగ్ల భాషల్లో. వీటిలో చాలావరకూ తన చేత్తో రాసి, కొన్ని మాత్రం తనకన్నా అందమైన దస్తూరి కలిగిన, మా అందరిలోకి సీనియర్‌ శిష్యుడైన బి.ఎం.సుందరంతో రాయించారు. ‘సూర్యకాంతి’ని స్వదస్తూరిలో తేవడంలో ఓ ఉద్దేశం ఉంది. తర్వాతి తరాలకు బాలమురళి ఎలా ఉండేవారంటే ఫొటోలున్నాయి. మరి ఎలా పాడారంటే రికార్డులున్నాయి. ఎలా రాసేవారంటే తెలియడంకోసం తన చేతిరాతనే ఎక్కువగా ఉపయోగించారు. ‘సూర్యకాంతి’ ఒక పుస్తకం మాత్రమే కాదు, అదో కళాఖండం.
బాలమురళి తిల్లానాలు అనితర సాధ్య ప్రయోగాలు. కుంతలవరాళి రాగ తిల్లాన, గతిభేదప్రియ (5 రాగాలు, 5 గతులలో), ఠాయ రాగ మాలిక (సంగీతంలో 4 ప్రమాణాలుంటాయి. వాటిలో ఠాయ ఒకటి) వేరెవ్వరూ చేయలేరు. 
అందరికీ గళమిచ్చి...
వాగ్గేయకరుడుగా ఇంత చేసిన బాలమురళి తన పాటల ప్రచారం కోసం ఎంత చేశారనంటే చాలా తక్కువే. ఎందుకంటే ఆయనకి స్వార్థం అనేది తెలియదు. అనేకమంది వాగ్గేయకారుల రచనలను ప్రచారంలోకి తెచ్చిన ఘనత ఆయనది. జయదేవుడి అష్టపదులు, నారాయణతీర్థ తరంగాలు, సదాశివబ్రహ్మేంద్ర, అన్నమాచార్య, రామదాస కీర్తనలు, పురందరదాస దేవరనామాలు, తత్త్వాలు ఆయన కృషితోనే ప్రచారంలోకి వచ్చాయి.
      1933లో అన్నమాచార్య కీర్తనలు వెలుగులోకి వచ్చినప్పుడు వాటి రాగాల పేర్లున్నాయే కానీ ఎలా పాడాలో ఎవరికీ తెలియదు. అన్నమయ్య శిష్యపరంపరా లేదు. అందుకని 1942లో రాళ్లపల్లి ఆనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి ఆ కీర్తనల్లో కొన్నింటికి బాలమురళితో వరసలు కట్టించారు. అప్పుడు ఆయన చేసినవాటిలోవే ఇప్పటికీ ఆ వరసల్లోనే వినిపిస్తున్న ‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది’, ‘ఇందరికీ అభయంబులిచ్చు చేయి’ లాంటివి. బాలమురళి స్వరపరిచి పాడటం వల్లే ‘ఏ తీరుగనను దయ చూచెదవో’, ‘ఇదిగో భద్రాద్రి గౌతమి’ అంటూ రామదాస కీర్తనలు దేశంలో నిలబడ్డాయి. అలాగే కన్నడంలో పురందరదాస దేవరనామాలు. గురుశిష్య పరంపరగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న త్యాగరాజ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు కూడా కొన్నింటిని పరిష్కరించి రికార్డు చేశారు. ‘హెచ్చరికగా రారా’, ‘మేలుకో రఘురామా’, ‘సీతా కల్యాణ వైభోగమే’ లాంటివి ఈ కోవలోవే.
      1965 నుంచి 70ల వరకూ ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి ‘భక్తి రంజని’ ద్వారా భక్తి పట్ల ఒక తరాన్ని ప్రభావితం చేసినవారు బాలమురళి. పాత, కొత్త భక్తి గీతాలతో పాటు తత్త్వాలనూ స్వరపరిచి పాడారు. ‘ఏమీ సేతురా లింగా’, ‘వస్తా వట్టిదే పోతా వట్టిదే’ అంటూ నాస్తికులనూ ఆస్తికులను చేశారు.
      అసలు మనవద్ద ఉన్న 710 త్యాగరాజ కీర్తనలన్నీ పాడటం తెలిసినవారు బాలమురళి ఒక్కరే. అవన్నీ ముందుతరాల కోసం తను బతికుండగానే తన స్వరంలోనే రికార్డు చెయ్యాలన్న ఆయన కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయింది. 1950, 60ల మధ్య చింతా కృష్ణమూర్తి, బందా కనకలింగేశ్వరరావు ఆధ్వర్యంలో, కూచిపూడి శాస్త్రీయ నృత్యంగా గుర్తింపు పొందేందుకు కొన్ని శాస్త్రీయ అంశాలను రికార్డు చేసి కేంద్ర సంగీత నాటక అకాడెమికి పంపాల్సి వచ్చింది. అప్పుడు అప్పటివరకూ ఉన్న కలాపాలు, యక్షగానాలు వంటివాటిని పరిష్కరించి, సంస్కరించి రికార్డు చేసినవాళ్లలో బాలమురళి ముఖ్యులు. అప్పుడాయనకి డ్రామా ఆర్టిస్ట్‌గా టాప్‌గ్రేడ్‌ గుర్తింపొచ్చింది. అప్పటికే గాత్రంలో శాస్త్రీయ, లలిత, భక్తి సంగీతాల్లో టాప్‌ గ్రేడ్‌ ఉంది ఆయనకి.
అరుదైన గౌరవాలు
ఏ భాషలో పాడినా నిర్దుష్టము, నిర్దిష్టమూ అయిన ఉచ్చారణ ఆయన గాత్రంలోని ప్రధాన లక్షణం. పదాన్ని విరవడంలో, అక్షరాన్ని ఉచ్ఛరించడంలో చాలా జాగ్రత్త తీసుకొనేవారు. ‘అక్షరం నశ్వరం’.. అక్షరం నాశనం లేనిదని సంగీతంతో సమాన స్థాయిని సాహిత్యానికిచ్చారు.
      ఓ సమావేశంలో నా మిత్రుడు, రబీంద్రనాథ్‌ టాగోర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి అయిన పబిత్రో సర్కార్‌ను అడిగాను, ‘‘బెంగాలీలు కాకుండా మిగతావాళ్లలో రబీంద్ర సంగీతాన్ని ఎవరు బాగా పాడతారు?’’ అని. ‘‘బాలమురళిగారు’’ అని ఠక్కున సమాధానం చెప్పారాయన. బెంగాలీ నేర్చుకుని ప్రతి మాటా జాగ్రత్తగా పలుకుతారు కాబట్టి బెంగాలీల కన్నా బాగా పాడతారని కూడా అన్నారు. ‘‘మరి ఆయనకి గౌరవ డాక్టరేట్‌ ఇవ్వొచ్చు కదా’’ అన్నాను. వెంటనే ఆయన నాతోనే గురువుగారి వివరాలు తెప్పించి, వారంలో ప్రత్యేక సిండికేట్‌ సమావేశం పెట్టి, అందరి అభిప్రాయాలూ తీసుకున్నారు. కొన్ని రోజుల్లోనే ప్రత్యేక స్నాతకోత్సవం ఏర్పాటు చేసి మరీ ‘దేశికోత్తమ’ (డి.లిట్‌) ప్రదానం చేశారు. శాంతినికేతన్‌ నుంచీ బాలమురళి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.
      హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఛైర్‌ ప్రొఫెసర్‌’ పదవిని ఇప్పటివరకూ ఇద్దరికే కట్టబెట్టింది. ముందు బాలమురళికి, మూడేళ్ల తర్వాత నాకు. బడికి కూడా వెళ్లని ఒక వ్యక్తి మొత్తం 9 డాక్టరేట్లు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్‌గా పనిచేశారు. 48 ఏళ్లకే ప్రతిష్ఠాత్మక మద్రాసు మ్యూజిక్‌ అకాడెమి ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని స్వీకరించారు. ఆ గౌరవాన్ని పొందిన పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచిపోయారు. ఇవన్నీ ఆయన మేధస్సు, సృజన, కార్యనిర్వహణాదక్షతలకు గీటురాళ్లు. బాలమురళికి గురువు మీద ఎంత భక్తి ఉండేదో, శిష్యుల మీద అంత వాత్సల్యం ఉండేది. తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు పేరు మీద ‘కళా విపంచి’ బిరుదునిచ్చేవారు. ఓ ఏడాది సెమ్మంగూడి శ్రీనివాసయ్యర్‌తో కలిపి నాకూ ఆ గౌరవాన్నిచ్చారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా శిష్యులకి సంగీతం చెప్పారు. ఇంట్లో ఉంచుకుని భోజనం పెట్టి మరీ నేర్పిన శిష్యులెందరో ఉన్నారు. వాగ్గేయకారుడిగా, కళాకారుడిగా ఆయన ఎంత ఉన్నతమైనవారో, వ్యక్తిగా కూడా అంత ఉన్నతమైన వారు. పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయేవారు. పెద్దలతో హుందాగా వ్యవహరించేవారు. ఎప్పుడూ ఎవరి పాటా బాగాలేదని అనలేదు. అందరినీ మెచ్చుకుని ప్రోత్సహించడమే ఆయన నైజం. స్వార్థం, అసూయ తెలియని వ్యక్తిత్వం ఆయనది. 
      బాలమురళి ప్రతిభ, గ్రహింపు అద్భుతమైనవి. 27 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ఫ్రాన్స్‌లో ప్రదానం చేసిన ‘షెవాలియర్‌’ పురస్కారం అందుకున్నప్పుడు ఓ ఫ్రెంచ్‌ బృందం ఫ్రెంచ్‌ సంగీతం, సాహిత్యంతో ఓ పాట పాడమని అడిగారు. ఆయన ఫ్రెంచ్‌ బాణీలో, ఫ్రెంచ్‌ భాషలో అప్పటికప్పుడే ఓ పాట రాసి పాడారు. దక్షిణాదిలో జుగల్బందీ బాలమురళితోనే మొదలైంది. కర్ణాటకం తెలిసిన వాళ్లకి తెలియని సంగీతమంటూ ఉండదు కాబట్టి హిందుస్తానీ వాళ్లలా కర్ణాటకం వాళ్లు పాడగలరు, వాళ్లు మాత్రం వీళ్లలా పాడలేరు అని నిరూపించారు. 
      బహుముఖాల ప్రతిభ కలిగి, ఇన్ని విధాల సేవలందించిన ఆ మహానుభావుడు ‘భారతరత్న’కు అర్హులు.
బాలమురళి గాత్రంతో 600 రికార్డులు విడుదలయ్యాయి. ఇదో రికార్డు. ఇప్పటి వరకూ ఏ విద్వాంసుడూ చేయలేనిది. వాగ్గేయకారుడిగా బాలమురళి తనకుతాను తగినంత ప్రచారం చేసుకోకపోయినా, వంద సంవత్సరాల తర్వాత సంగీత త్రిమూర్తులైన శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల పక్కన తప్పక స్థానం పొందుతారు. కర్ణాటక సంగీతం ఉన్నంతవరకూ ఆచంద్రతారార్కంగా నిలిచిపోతారు. అంతటి స్రష్ట భారతీయుడు కావడం, అందునా తెలుగువాడు కావడం మన అదృష్టం.


బాలమురళి గాత్రంతో 600 రికార్డులు విడుదలయ్యాయి. ఇదో రికార్డు. ఇప్పటి వరకూ ఏ విద్వాంసుడూ చేయలేనిది. వాగ్గేయకారుడిగా బాలమురళి తనకుతాను తగినంత ప్రచారం చేసుకోకపోయినా, వంద సంవత్సరాల తర్వాత సంగీత త్రిమూర్తులైన శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల పక్కన తప్పక స్థానం పొందుతారు. కర్ణాటక సంగీతం ఉన్నంతవరకూ ఆచంద్రతారార్కంగా నిలిచిపోతారు. అంతటి స్రష్ట భారతీయుడు కావడం, అందునా తెలుగువాడు కావడం మన అదృష్టం.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం