మెతుకుసీమ మాట మధురం

  • 427 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

  • స‌హాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాల‌యం
  • డిచ్‌ప‌ల్లి, నిజామాబాదు
  • 9866917227
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

శాతవాహనులు ఏలిన గడ్డ... గుణాఢ్యుడు నడిచిన నేల! 
అటు చూస్తే మెతుకుదుర్గం... ఇటు చూస్తే ఏడుపాయల దుర్గ! 
పొట్లచెరువులో ఎగిరి దుమికిన అచ్చతెలుగు... వర్గల్‌ విద్యాధరి నుదిటి వెలుగు! పద్యానికి పట్టుగొమ్మ... వచనకవితకు వారాశి! 
అదే మెతుకుసీమ... అదే మెదక్‌! ఇక్కడి తెలుగు షడ్రసోపేతం. 

కథాకథనంలో ప్రపంచ ప్రఖ్యాతుడైన గుణాఢ్యుడి ‘బృహత్కథ’కు పరిచయమక్కర్లేదు. అంతటి కథక చక్రవర్తి కొంతకాలం మెదక్‌ జిల్లా కొండాపురంలో ఉన్నాడట! ఈ కొండాపురం శాతవాహనుల నగరం. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఆనవాళ్లూ లభ్యమయ్యాయి. ఇప్పటికీ అవి స్థానిక పురావస్తు ప్రదర్శనశాలలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు... కాళిదాసు కావ్యాలకు కమనీయ వ్యాఖ్య రచించిన మల్లినాథసూరి ఇక్కడి వాడే. ఆయన కొల్చారము నివాసి. అలాగే, తొలి అచ్చతెలుగు కావ్యమైన ‘యయాతి చరిత్ర’ రాసిన పొన్నగంటి తెలగన... ఆనాటి పొట్లచెరువు, ఈనాటి పటాన్‌చెరువు వాసి. సమకాలీనంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సాధించిన చిత్రకారులు కె.రాజయ్య మెతుకుసీమ ముద్దుబిడ్డే. వినూత్నమైన జానపదశైలితో చిత్రాలకు ప్రాణంపోసిన ఆయన మంచి కవి కూడా. 
      ఇంతకూ మెతుకుసీమకు ఆ పేరెలా వచ్చింది? పచ్చటిపైరులతో... ఎక్కడికక్కడ కనిపించే వరికుప్పలతో ఆనాడు చుట్టుపక్కల సీమలన్నింటికి అన్నం పెట్టిన ప్రాంతమిది. అలా ‘మెతుకు’ పంచిన మట్టి కాబట్టి మెతుకుసీమ అయింది. కాకతీయుల కాలం నాటికే ఈ ప్రాంతానికి ఆ పేరుంది. మెదక్‌ పట్టణంలో తాము నిర్మించిన సైనికదుర్గాన్ని  ‘మెతుకుదుర్గం’ అన్నారు కాకతీయులు. ఆ మెతుకే జనవ్యవహారంలో మెదక్‌గా మారింది. పాపన్నపేట ఏడుపాయల వనదుర్గాలయం (ఇక్కడ మంజీరా నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది), వర్గల్‌ సరస్వతి కోవెల, ఝరాసంగం సంగమేశ్వర దేవాలయాలతో పాటు ఆసియాలో అతిపెద్దదైన మెదక్‌ చర్చి, కొల్చారం జైనమందిరం తదితరాలు ఈ జిల్లా సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదలు. 
పదం పదంలో తెలుగుదనమే
మెతుకుసీమ పల్లెపట్టుల్లో షడ్రసోపేతమైన తెలుగు పలుకుబడుల రుచులు అప్రయత్నంగానే వినబడతాయి. కొన్ని సంస్కృత పదాలిక్కడ పరిపూర్ణమైన తెలుగు స్వభావాన్ని సంతరించుకోవడం విశేషం. అందులో ‘ఇమరస’ అనేమాట ఒక్కటి. యుక్తాయుక్త వివేచన అనే భావాన్ని వ్యక్తీకరించేందుకు ఇక్కడ ‘ఇమరస’ అనే పలుకును ఉపయోగిస్తారు. ఇది ‘విమర్శ’ అన్న సంస్కృత పదానికి తెలుగీకరణ. ‘నివద్దె’ అన్నది మరో మాట. ఇది ‘నిబద్ధ’ అన్న సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంతో ఎంతమాత్రం సంబంధంలేని నిసర్గమైన తెలుగు పలుకులకూ కొదవలేదు. విస్తరించిన లేదా ఆవరించిన అన్న అర్థంలో ‘తిరుగోలె’ అనే మాట వాడతారు. అన్ని చోట్లా విస్తృత వినియోగంలో ఉన్న ‘కూడా’ పదానికి బదులుగా ‘సుత’ అంటారు స్థానికులు. ప్రయాణాల్ని ‘పైనం’ అంటారు. తొల్లి-తొంటివంటి వ్యాకరణ ప్రయోగ పదాల్ని కూడా అత్యంత సహజ రీతిలో పలుకుతారు. ఉపాసం (ఉపవాసం), నిలారం (నిరాహారం), లగ్గం (వివాహం), మొగులు (ఆకాశం), తావు (స్థలం), బుగులు (భయం), శానితనం (అతితెలివి), ఇగురం (పని), గాసం (తిండికి అవసరమైన దినుసులు), బాసాన్లు (వంటసామాను), వొర్రె (లోయ), వయ్యి (పుస్తకం), మిద్దె (మేడ) వంటి ఎన్నో తీయని తెనుగు పదాలు జిల్లాలో వ్యవహారంలో ఉన్నాయి. ‘కొంచపోవు’ (తీసుకొనిపోవు) వంటి అలనాటి లిఖిత రూప పదాలు కూడా ఇప్పటి సంభాషణల్లో వినవస్తాయి. ప్రపంచీకరణ పెను ప్రభావంలో ప్రాంతీయ భాషలన్నీ ‘గ్లోబల్‌ కాలుష్యాన్ని’ అనుభవిస్తున్న ఈ కాలంలోనూ మెదక్‌ పల్లెల్లో అలనాటి మాటలు నేటికీ బలంగా నిలబడి ఉండటం - జీవద్భాషా మహత్తుకు నిలువెత్తు దర్పణం. అలాగే, ‘గుమ్మిల వడ్లు గుమ్మిల్నే ఉండాలె గానీ, పిల్లలేమో గుత్పోలె ఉండాలంటే ఎట్ల’ వంటి సామెతలు ఇక్కడ కోకొల్లలు. 
అక్కడక్కడ అవి కలుస్తాయి
సిద్ధిపేట ప్రాంతం కరీంనగర్, వరంగల్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. దాంతో ఇక్కడి పలుకు మీద ఆయా జిల్లాల ప్రభావం కాస్త కనిపిస్తుంది. గజ్వేల్‌ సరిహద్దుల నుంచి జంటనగరాల భాషా ప్రభావాలు ఆరంభమవుతాయి. జిల్లాలోని పెద్ద పట్టణాలు, పెద్ద పల్లెటూర్లలో ఉర్దూ పద వినిమయం గణనీయంగానే ఉంది. ఈ పదాలు దేశీయ పలుకులుగా మారాయి! ‘బాజాప్తా’, ‘గర్జు’, ‘ఫాయిదా’, ‘మునాఫ’, ‘బిఫాపా’, వంటి మాటలు తరచూ వినబడతాయి. మరోవైపు... నారాయణఖేడ్, జహీరాబాద్‌ పాత తాలుకాలు కర్ణాటకలోని బీదర్‌ జిల్లాకు బాగా సన్నిహితంగా ఉంటాయి. నారాయణఖేడ్‌ అయితే మహారాష్ట్రకు కూడా బాగా దగ్గర. దాంతో ఈ ప్రాంతాల్లో మరాఠీ కన్నడ పదాలు తెలుగులో కలగలిసి పోయాయి. అయితే... పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని సరిహద్దు ప్రాంత భాషాప్రభావాలతో పోల్చిచూస్తే మెదక్‌లో అన్యభాషా పదాల వినియోగం తక్కువే. సరిహద్దు ప్రాంతాలైనప్పటికీ నారాయణఖేడ్, జహీరాబాదుల్లో గతంలో అనేకమంది కవులు, పండితులు ఉద్భవించారు. వైవిధ్యమైన రచనలు చేశారు. సాహితీ సంస్థలను నిర్వహించారు. తెలుగు భాషాసాహిత్యాలను పరిరక్షించారు. 
బాసలోని యాసమీది ధ్యాస
మెతుకుసీమ తెలుగు సుగంధాల్ని తమ రచనల ద్వారా తెలుగు సీమకు విస్తారంగా పరిచయం చేసినవారు ఎందరెందరో ఉన్నారు. గతంలో హరిపురం వెంకట రామయ్య అనే రచయిత పానుగంటి వారి సాక్షి పద్ధతిలో చేసిన వచన రచనల్లో ఇక్కడి మాటలు ఉన్నాయట. ముదిగొండ ఈశ్వర చరణ్‌ వ్యాసాల్లో స్థానిక పద ప్రయోగం ఉంది. నందిని సిధారెడ్డి కవిత్వంలో, కథానికల్లో ప్రసంగాలలో స్థానీయ భాషా మాధుర్యం తొణికిసలాడుతుంది. ఐతా చంద్రయ్య కథల్లో ఇక్కడి నుడికారం శ్రుతిబద్ధంగా ప్రతిధ్వనిస్తుంది. వచన కవితల్లో మెతుకుసీమ భాషా ప్రయోగాల్ని చేర్చి సెబాసనిపించుకున్న కవి రామగిరి శివకుమార్‌. చొప్పదండి సుధాకర్‌ కథల్లో అచ్చమైన మెతుకు భాష చిరునామాలున్నాయి. దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్‌ పాటల్లో పరిపూర్ణమైన దేశీయ సౌరభాలున్నాయి. 
తెలంగాణలో వచనకవితా ప్రక్రియ కొంత ఆలస్యంగానే ప్రవేశించింది. అయితే, అది అడుగుపెట్టిన తర్వాత దానికి మెదక్‌ స్వాగతం పలికింది. కనపర్తి రామచంద్రాచారి, కందుకూరి శ్రీరాములు, కె.అంజయ్య, అనాజ్‌పూర్‌ కిషన్, పప్పుల రాజిరెడ్డి, హరినాథశర్మ... వీళ్లందరూ పదికాలాల పాటు నిలిచే వచనకవితలను అందించారు. దాంతోపాటే పల్లీయుల పలుకుబడులను కవిత్వంలోకి తెచ్చారు.  
ఎందరో మహానుభావులు
పాత గజ్వేల్‌ తాలూకాలో కనీస రవాణా సౌకర్యాలు లేని వడ్డేపల్లిలో నరసింహాచార్యులు అన్న పండితుడు ‘ముద్రాక్షరశాల’ (చాప్‌ఖానా) ఏర్పాటు చేశారు. 1926 నుంచి కొంత కాలంపాటు దేశబంధు అనే పత్రికను నిర్వహించారు. గోలకొండ కవుల సంకలనం రూపకల్పనలో సురవరం వారికి చేదోడు వాదోడుగా నిలిచారు. క్షీరసాగరం (చిలాసాగర్‌) గ్రామంలో రాళ్ళబండి రాఘవశాస్త్రి మరో ముద్రాక్షర శాలను నెలకొల్పి ఎన్నో పుస్తకాల్ని ప్రచురించారు. అలాగే, విధుమౌళి శాస్త్రి అనే పండితుడు రామాయణాన్ని ‘తందనాన పద్ధతి’లో గానం చేశారు. ఆయన రామాయణాన్ని వినేందుకు ప్రజలు వందల సంఖ్యలో వచ్చి చేరేవారు. మల్యాల దేవీప్రసాద్‌ 1951లో ‘పల్లెటూరు’ పేరుతో ఓ పత్రికను స్థాపించి ఎందరో రచయితల్ని ప్రోత్సహించారు. పరాశరం గోపాల కృష్ణమూర్తి, వేముగంటి నరసింహాచార్యులు సిద్ధిపేట పరిసర ప్రాంతంలో సుస్థిరమైన తెలుగు సాహిత్య వాతావరణాన్ని నిర్మించారు. గౌరీభట్ల రామకృష్ణకవి, గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ, అష్టకాల నరసింహ రామశర్మ తదితరులు తెలుగుసీమ అంతటా అవధాన ప్రదర్శనలు నిర్వహించిన ప్రసిద్ధులు.
      స్వాతంత్య్ర సమర యోధులు వెల్దుర్తి మాణిక్యరావు, మాజీ శాసన సభ్యులు కస్తూరి కృష్ణమాచార్యులు, కవి పండితుడు ముదిగొండ ఆంగీరస శర్మ, రంగ కృష్ణమాచార్యులు వంటివారు సాగించిన నిరంతర కృషి కారణంగా గత అయిదు దశాబ్దాల్లో జిల్లా వ్యాప్తంగా అనేక సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు జరిగాయి. ఒక తరం తరువాత మరో తరం ఎంతో సంతోషంతో సారస్వత వారసత్వాన్ని స్వీకరించేందుకు ఈ సతత హరిత వాతావరణం తోడ్పడింది. ఇప్పటికీ సిద్ధిపేట వంటి పట్టణాల్లో తరచూ ఏదో ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ సభలకు నవయువ తరమూ ఉత్సాహంతో హాజరవుతుంది. మెదక్‌ మాటలో మట్టిపరిమళమే కాదు, ఇక్కడి ప్రజల గుండెల్లో మాతృభాషాభిమానమూ శాశ్వతమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం