మండిన కన్నీళ్లే ఆళ్వారు అక్షరాలు

  • 41 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్

  • హైదరాబాదు.
  • 8008551841
చింతలపల్లి హర్షవర్ధన్

ఆయన... నిజాం నిరంకుశత్వంపై దూసిన అక్షరాల తల్వార్‌. పీడనకు వ్యతిరేకంగా పైకెత్తిన ఉక్కు పిడికిలి. ఆకారం చూస్తే సౌమ్యత కనిపించినా అది నినదించే ఉద్యమస్వరం. రచయితా కార్యకర్తా ఒకే దగ్గరచేరిన మూర్తి. చిత్తశుద్ధి, నిజాయతీలకు నిలువెత్తు రూపం. ఆయనది ధర్మాగ్రహం. ఇదీ తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి నిండైన విగ్రహం. ఆయన పుట్టేనాటికి తెలంగాణలో నిజాం ప్రభుత్వం, దొరల అరాచకాలు మితిమీరి కనిపిస్తాయి. భాషా సంస్కృతులపరంగా అధిక సంఖ్యాకులకు మన్నన దొరకని పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. మొత్తానికి ఒక ఉద్యమం వచ్చేందుకు అనుకూలంగా ఉంది వాతావరణం. ఉద్యమంతోపాటు ఎదిగి, ఉద్యమమే ఊపిరిగా బతికిన మనిషి ఆళ్వారుస్వామి.
రావి
నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారులు పుట్టిన నల్లగొండ జిల్లా నకిరేకల్లు దగ్గర్లోని చెరువు మాధారంలో 1915 నవంబరు 1న ఆళ్వారుస్వామి జన్మించారు. వట్టికోట సింహాద్రమ్మ, శ్రీరామచంద్రాచార్యులు ఆయన తల్లిదండ్రులు. వాళ్లది బీద కుటుంబం. నకిరేకల్లులో కాంచనపల్లి సీతారామారావు, కందిబండలో నారపరాజు సోదరుల ఇంట్లో వంటవాడిగా ఉన్నప్పుడు ఆయనకు చదువుకునే అవకాశం చిక్కింది. సూర్యాపేటలో ‘ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని’ గ్రంథాలయం ఆయనకు ఎన్నో పుస్తకాలను పరిచయం చేసింది. 1933లో హైదరాబాదు చేరుకున్న వట్టికోట తన మిత్రుడు కోదాటి నారాయణరావు సాయంతో ‘గోలకొండ పత్రిక’లో ప్రూఫ్‌రీడర్‌గా చేరారు.
      ఆయనకు జీతంగా వచ్చే 15 రూపాయల్లో ఎక్కువశాతం పుస్తకాలు కొనేందుకు ఖర్చుచేశారు. ఆ తర్వాత విజయవాడకు మకాం మార్చి హోటల్లో సర్వర్‌గా పనిచేశారు. అక్కడే తన 20వ ఏట ఇంగ్లిష్‌ నేర్చుకున్నారు. అక్కడినుంచి మళ్లీ హైదరాబాదుకు వచ్చి గోల్కొండ పత్రికలో పునఃప్రవేశించారు. పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి సౌజన్యం ఆయన పఠనాభిలాషకు ప్రోత్సాహకంగా నిలిచింది. 1937లో సికిందరాబాదుకు చెందిన 
యామునాచార్యుల మనుమరాలు యశోదమ్మతో ఆళ్వారుస్వామి వివాహం జరిగింది. వాళ్లది శ్రీవైష్ణవ కుటుంబం. తానేమో కమ్యూనిస్టు, హేతువాది. అయినా యామునాచార్యుల కుటుంబ సంప్రదాయాలను ఎంతో గౌరవించేవారు. స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన వట్టికోట తాను ఏ సమావేశానికి వెళ్లినా యశోదమ్మను వెంట తీసుకెళ్లేవారు. 
      1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ తరఫున నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నందుకు 1946లో రెండోసారి చెరసాల పాలయ్యారు ఆళ్వారుస్వామి. శిక్షలో భాగంగా వివిధ జైళ్లలో గడిపారు. నిజామాబాదు జైలులో దాశరథి కృష్ణమాచార్యులు పరిచయం అయ్యారు. దాశరథి నిరసన కవిత్వానికి జైలు గోడలు కాగితాలు కాగా, నేరాన్ని తనమీద వేసుకుని సిబ్బంది దండనకు గురైంది మాత్రం వట్టికోట. ఇలా ఎందుకు చేస్తున్నారన్న దాశరథి ప్రశ్నకు... ‘‘నేరం నీమీద పడి, శిక్షపడితే పద్యాలు, కవితలూ ఎవరు రాస్తారురా? అందుకే ఇదంతా’’ అని ఆళ్వారు సమాధానం. ఒక్క దాశరథే కాదు, అప్పటి తెలంగాణ పెద్దలందరికీ ఆయన ఆత్మీయుడు. అందుకే ‘వాడక్కరకు వచ్చే చుట్టం’ అన్నారు కాళోజీ నారాయణరావు.
ఉద్యమాలే ఊపిరి
గాంధీజీ ఆత్మకథలాంటి వాటితో ప్రభావితమై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేవి పుస్తకాలే అని నమ్మారు ఆళ్వారుస్వామి. సంస్థలు, సంఘాలు స్థాపించారు. వ్యాసాలు, కథలు, నాటకాలు, నవలలు రాశారు. పుస్తకాలు ముద్రించారు. కాశీనాథుని నాగేశ్వరరావు స్మారకంగా 1938లో ‘దేశోద్ధారక గ్రంథమాల’ను స్థాపించారు. 1938- 1941, 1953- 61 మధ్య 30 పుస్తకాలను ప్రచురించింది ఈ గ్రంథమాల. ప్రచురించిన వాటిలో మొదటిది సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘హైందవ ధర్మవీరులు’. ఇంకా పొట్లపల్లి రామారావు, పల్లా దుర్గయ్య రచనలు, ‘పరిసరాలు’ కథా సంకలనం, 32 వ్యాసాల ‘తెలంగాణం’ సంకలనం, కాళోజీ ‘నా గొడవ’, తాను రాసిన ‘జైలు లోపల’ కథలు, హీరాలాల్‌ మోరియా ‘బతుకుబాట’ (కథలు), కె.ఎల్‌.నరసింహారావు నాటికలు ప్రచురించారు. 
      గ్రంథమాలనే కాదు, గుమాస్తాల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు గుమాస్తాల సంఘాన్ని, ‘గుమాస్తా’ పత్రికను, రిక్షా కార్మికుల సంక్షేమం కోసం రిక్షా కార్మికుల సంఘాన్నీ స్థాపించారాయన. 1943లో తెనాలిలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం మొదటి సమావేశానికి హైదరాబాదు ప్రతినిధిగా హాజరయ్యారు. తెలంగాణలో అరసం కార్యక్రమాలకు కీలకంగా నిలిచారు. రాచమల్లు సరస్వతీదేవి సంపాదకత్వంలో వచ్చిన ‘తెలుగుతల్లి’ పత్రికకు అన్నీ తానై వ్యవహరించారు. మిత్రులతో కలిసి సర్వోదయ ప్రెస్‌ను నెలకొల్పినా అది ఎక్కువకాలం కొనసాగలేదు. ఆయన ఒక సూచీ గ్రంథాలయాన్ని స్థాపించాలనుకున్నారు. అయితే 1961 ఫిబ్రవరి 5న అకాల మరణం ఆయన చేయాల్సిన పనులన్నీ ఆగిపోయేలా చేసింది. ఆయన సేకరించిన అమూల్య గ్రంథరత్నాలను కోదాటి నారాయణరావు చిక్కడపల్లిలోని ‘నగర కేంద్ర గ్రంథాలయా’నికి విరాళంగా ఇచ్చారు. దాశరథి కృష్ణమాచార్యులు ‘అగ్నిధార’; దాశరథి రంగాచార్యులు ‘జనపదం’, ‘అంతెందుకు’; కేతవరపు రామకోటిశాస్త్రి తన సిద్ధాంతగ్రంథం ‘తిక్కన కవితాశిల్పం’ గ్రంథాలను వట్టికోటకు అంకితమిచ్చారు.
సమకాలీన సమాజ దర్పణాలు
1938కి పూర్వపు తెలంగాణ స్థితిగతుల్ని ‘ప్రజల మనిషి’, తర్వాత పరిస్థితుల్ని ‘గంగు’ నవలల్లో చిత్రించారు. భూస్వామ్య, నిజాంరాజ్య అధికార వ్యవస్థ పెడపోకడలతో తెలంగాణ పల్లె ఎలా తల్లడిల్లిందో తెలుసుకోవాలంటే ఈ నవలలు చదివితే సరి. హైదరాబాదు సంస్థాన ప్రత్యేకతను శాశ్వతంగా నిలబెట్టేందుకు, హిందువులను ముస్లింలుగా మార్చేందుకు అంజుమన్‌ సంస్థకు తోడ్పాటునందిస్తాడు నిజాం. దీనికి ప్రతిగా ఆర్యసమాజం కార్యకలాపాలు, దాంతో తలెత్తిన ఘర్షణ వాతావరణం, స్టేట్‌ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ, అట్టడుగు వర్గాల జీవితాలు, సమాజంలో పొడచూపుతున్న మార్పులను తన నవలల్లో చిత్రించారు ఆళ్వారుస్వామి. ‘ప్రజల మనిషి’ కథానాయకుడు కంఠీరవం అచ్చంగా వట్టికోటనే తలపిస్తాడు. 1938లో స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పడటంతో ఈ నవల ముగుస్తుంది. 1938- 47 మధ్యకాలపు పరిస్థితుల చిత్రణ రెండో నవల ‘గంగు’లో ఉంటుంది. ఇది ఆంధ్రమహాసభలో ఆళ్వారుస్వామి క్రియాశీలంగా ఉన్న నేపథ్యం నుంచి వచ్చింది. ఇందులోనే మద్దిమెట్ట వెంకట్రావుదొర అవకాశవాదంతో రంగులు మార్చే పాత్ర ఉంటుంది. ఇది స్వాతంత్య్రం వస్తే మళ్లీ భూస్వాముల పెత్తనం కొనసాగుతుందన్న దానికి నిదర్శనం. ‘గిర్దావర్‌’ అనే నవల రాసినట్లు తెలుస్తున్నా అది అలభ్యం.
      తెలంగాణ నుంచి వచ్చిన తొలి నవలగా ‘ప్రజల మనిషి’ని పేర్కొంటారు. ఈ నవల ద్వారా తెలంగాణ రచయితలకు మార్గదర్శకుడిగా నిలిచారాయన. అందుకే ‘మామయ్య తన ప్రణాళిక ప్రకారం నవలలు రాసి ఉంటే నేను నవలలు రాసేవాణ్నే కాదు’ అంటారు దాశరథి రంగాచార్య. ‘ప్రజల మనిషి’ కథా నేపథ్యం నిజామాబాదులో ప్రారంభమైనా, భాష మాత్రం ఆయన పుట్టి పెరిగిన నల్లగొండదే. ఆయన రచనల్లో ఆనాటి శిష్ట వ్యావహారికం, సరళ గ్రాంథికం, అచ్చమైన ప్రజలభాష, ఉర్దూ ప్రభావం కనిపిస్తాయి. 
ఆళ్వారు గొడవ- రామప్ప రభస
దేశంలో స్వాతంత్య్రానంతర పరిస్థితుల నేపథ్యంతో వ్యంగ్యం మేళవించి రాసింది రామప్ప రభస. సాక్షి వ్యాసాల్లో వచ్చే జంఘాలశాస్త్రి లాంటి పాత్రే ఈ రామప్ప. ఇది తెలుగు విద్యార్థి పత్రికకు రాసిన 16 వ్యాసాల సంకలనం. పరీక్షా ఫలితాలప్పుడు పత్రికలు అమ్మేవాళ్లు జనం అవసరాన్ని ఎలా సొమ్ము చేసుకునేవాళ్లో వివరిస్తుంది (ఇప్పుడైతే ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌లు వచ్చాయి. 1990ల వరకు పరీక్షా ఫలితాలకు పత్రికలే ఆధారం) మొదటి వ్యాసం. ఫలితాలు వెలువడటంతో పత్రికలను ఎక్కువ ధరకు అమ్ముతుంటాడో వ్యక్తి. ఏదైనా కానీ నేను ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వను అంటాడు రామప్ప. చివరికి అన్ని పత్రికలనూ... అమ్మేవాడు చెప్పిన వెలకే కొని, ఒక కూడలికి చేరుకొని అసలు ధరకే అమ్ముతాడు. చివరి పత్రికను మాత్రం అందరూ చూసేలా ఓ గోడకు అంటిస్తాడు. ఇది వట్టికోట వ్యక్తిత్వాన్ని పట్టిచూపుతుంది. 
      చదువుల గురించి- ‘‘విద్య కోసం విద్య నేర్చుకోవలసిన అవసరం లేదా? కేవలం యాంత్రిక, శ్రామిక, కార్మిక విద్యలేకాక విజ్ఞాన చైతన్యములనిచ్చే విద్యలు కూడా దేశానికవసరం లేదా? ఆలోచించి కర్తవ్యం నిర్ణయంచేసుకో’’ అన్న ప్రశ్న ఇప్పటికీ సమకాలీనమే. వృత్తివిద్య ప్రాధాన్యం తగ్గి, బట్టీ విధానం పెరగడం, విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడం, అవినీతి, భూదానోద్యమంలో పెడతోవలు, బాల్యవివాహాలు, వరకట్న సమస్యలాంటి అంశాలపై వేసిన చురకలు ఇందులో ప్రధానం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రవర్తనే భావితరాలకు భూమిక అన్నది ఆళ్వారుస్వామి వాదన. ఇందులో స్నేహించు, గ్రామీయులు, ఆనిక్కి (అప్పటినుంచి) లాంటి ప్రయోగాలు కనిపిస్తాయి. ఇంకా ఆ కాలంలో దేవుడు పన్ను- దేవుడి ఉత్సవాల పేరిట ఊరివాళ్ల నుంచి దొరలు వసూలు చేసే పన్ను ఉండేదని తెలుస్తోంది.
జైలు లోపల...
ఇది ఆరు కథల సంకలనం. దీనిని తన జైలు జీవితానుభవాలతో రాశారు. ‘ఖైదీలు నేటి ఒకే విష సమాజ వృక్షానికి కాసిన కుక్కమూతి పిందెలు’ అన్నది ఆళ్వారు అభిప్రాయం. ‘నిజానికి మనదేశంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేరప్రవృత్తి గలవారు కారు. పరిస్థితులే వారినా విధంగా చేశాయ’న్న నెహ్రూ వ్యాఖ్యను సమర్థిస్తూ రాసినవి ఇవి. కథల్లోని పాత్రలన్నీ విధిలేక జైలుముఖం చూసినవే. అందుకే ‘బీదతనము, నిరాదరణ, దుష్టసహవాసము’ ఒక వ్యక్తి దొంగగా మారడానికి కారణాలని ఓ ఖైదీతో ఏకరువు పెట్టిస్తారు ‘విధిలేక’ కథలో. పరిగె, మెదడుకు మేత (మతసామరస్యం గురించి), మాకంటె మీరేం తక్కువ, అవకాశమిస్తే, పతితుని హృదయం ఇందులోని ఇతర కథలు. ‘పతితుని హృదయం’లో ఉరిశిక్ష మానవత్వానికే మచ్చ అంటూ ఆళ్వారు స్వామి లేవనెత్తిన ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. ఈ కథలోనే ‘ఎవడు తీశాడో ఈ పద్ధతిగాని ఉరి తీసిందానికంటె 50 ఏండ్లో 60 ఏండ్లో జైల్లో ఉంచడం మంచిది’ అని పరిష్కారమూ సూచిస్తారు. గతిలేక, వేరే మార్గంలేక దొంగతనాలు చేస్తున్నామే కానీ, ఉపాధి చూపిస్తే ఈ పనులు చేయమని ‘మాకంటె మీరేం తక్కువ’లో దొంగతనం వృత్తిగా మలచుకున్న కారణాన్ని వివరిస్తారు. ఇక ‘అవకాశమిస్తే’లో అంత తీవ్రమైన నేరమేమీ చేయకున్నా జైలులో వేస్తారో పఠానును. తనవాళ్లకి దూరమై, జైలు జీవితం భారమై పిచ్చివాడై, చివరికి మరణిస్తాడా పఠాను. భార్యాభర్తల సంభాషణతో సాగిన ఈ కథలో స్త్రీ జీవితమూ జైలు జీవితానికేం తక్కువ కాదన్నది అంతర్లీనంగా ఉన్న అంశం. 
ఇవే కాకుండా ‘గాలిపటం’, ‘రాజకీయ బాధితులు’ మొదలైన కథలు, ‘కనువిప్పు’, ‘సావాసం’ లాంటి సంస్కరణ ప్రధాన నాటకాలూ ఆయన కలం నుంచి జాలువారాయి. ఈ సాహిత్యాన్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. ఆయన ప్రతీ రచనా కథానాయకుడు ఆయనేనేమో అన్నట్లు ఉంటుంది. అందుకే అవి ఆత్మకథాత్మక ఖండాలు. నిజాం రాచరికం ఇనుపకటకటాల్లో మూల్గులుపడిన తెలంగాణా గ్రామీణ జీవితానికి ఆయన రచనలు అద్దాల్లాంటివి. ఆ జాగీర్దారీ వ్యవస్థ రూపొందించిన జులుం, పదజాలం, అధికారుల, పెత్తందార్ల పైశాచికాట్టహాసం, పేదల నిస్సహాయ స్థితి ఇవన్నీ ఆళ్వారుస్వామి రచనల్లో యథార్థ చిత్రాలుగా పొడగడతాయన్న ఇరివెంటి కృష్ణమూర్తి మాటలు నూటికి నూటయాభైపాళ్లూ వాస్తవం.


వెనక్కి ...

మీ అభిప్రాయం