కరుణామయుడికి కావ్యార్చన

  • 279 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య ఫణీంద్ర

  • సీనియర్‌ శాస్త్రవేత్త, అణు ఇంధన సంస్థ,
  • హైదరాబాదు.
  • 9959882963
ఆచార్య ఫణీంద్ర

తెలుగులో భక్తి సాహిత్యం అనగానే అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు తదితర వాగ్గేయకారులు, వారు రచించిన రమణీయమైన కీర్తనలే జ్ఞప్తికివస్తాయి. 19వ శతాబ్దిలో ఒక వాగ్గేయకారుడు తన కమనీయ కీర్తనలతో క్రీస్తును ఆరాధించి, క్రైస్తవ మతానుయాయులను అలరించిన విషయం కొద్దిమందికే తెలుసు. ఆ తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు పురుషోత్తమ చౌధురి. ఇప్పటికీ తెలుగునేల నలుచెరగులా కొలువుదీరిన అనేక చర్చిల్లో ఆయన రచించిన కీర్తనలను ఆలపించి భక్తి పరవశులవుతారు.
పురుషోత్తమ చౌధురి గంజాం జిల్లాలో మదనాపుర గ్రామంలో 1803లో జన్మించారు. సుభద్ర, కూర్మనాథ చౌధురి దంపతులు ఆయన తల్లిదండ్రులు. వాళ్లది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. పురుషోత్తంకు 7వ ఏటనే ఉపనయనం జరిగింది. తన 20వ సంవత్సరం వరకు హిందూ సంప్రదాయాలను నిష్ఠగా ఆచరించారు. కొన్ని హిందూ మత రచనలూ చేశారు. ఆయనకు 1823లో రాధామణి దేవితో వివాహమైంది. వాళ్ల అన్న నడిపే విద్యాసంస్థలో పనిచేసేవారు. తన 22వ ఏట విలియంకేరీ రాసిన ఒక కరపత్రాన్ని చదివి క్రైస్తవంపట్ల ఆకర్షితులయ్యారు చౌధురి. ఆకాలపు క్రైస్తవ మతపెద్దలతో పరిచయం పెంచుకున్న పురుషోత్తం తెలుగులో వచ్చిన బైబిల్‌ చదివి క్రీస్తుపట్ల, క్రైస్తవమతంపట్ల విశ్వాసిగా మారారు.  ఆ క్రమంలో 1833లో బాప్టిజం స్వీకరించారు. అప్పటినుంచి 1890 ఆగస్టు 6న ఆయన మరణించే వరకు తెలుగులో క్రైస్తవ కావ్యాలను, కీర్తనలను రచించి ‘ఆంధ్రక్రైస్తవ కవి సార్వభౌముడు’గా చిరకీర్తిని పొందారు.
ప్రభువుకు పద్యాలమాల...
      పురుషోత్తమ చౌధురి కంటే ముందే తెలుగులో క్రైస్తవ సంబంధ రచనలు కనిపిస్తాయి. 17వ శతాబ్దికి చెందిన పింగళి ఎల్లనార్యుడు ‘తోభ్య చరిత్రము’, 18వ శతాబ్ది వాడైన మంగళగిరి ఆనందకవి ‘వేదాంత రసాయనము’ అనే గ్రంథాలు రచించారు. అయితే వీళ్లు క్రైస్తవమతం అవలంబించినట్లు ఆధారాలు లేవు. ఇక క్రైస్తవమత ప్రచారానికే జీవితాన్ని అంకితంచేసిన చౌధురి రచనల్లో- ‘కులాచార పరీక్ష’ (1833), ‘ముక్తిమార్గ ప్రదర్శనము’ (1845), ‘ఏసునాయక శతకము’, ‘ఏసుక్రీస్తు ప్రభు శతకము’ (రెండూ 1845లో), ‘రక్షణ చరిత్ర’ (1846), ‘నిస్తార రత్నాకరము’ (1846), ‘పంచచామర పన్నములు’ (1847), ‘పంచ రత్నములు’ (1847), ‘క్రైస్తవ నీతిప్రకాశము’ (1851), ‘బ్రహ్మజ్ఞానము’ (1856), ‘అంధకార నాశనము’ (1861), ‘మనసే మూలము’ (1863), ‘సత్యవేద సార సంగ్రహము’ (1871), ‘దేవుని విరాడ్రూప వర్ణనము’ (1884) మొదలైనవి ప్రసిద్ధిచెందాయి.
‘యేసునాయకా’ మకుటంతో ఆయన రాసిన శతకాన్ని తెలుగులో మొదటి క్రైస్తవపరమైన శతకంగా చెప్పొచ్చు. వృత్త పద్యాల్లో సాగిన ఈ శతకం కమనీయధారతో తేలికగా అర్థమయ్యే శైలిలో ఉంటుంది.
తప్పులులేని వారొకరు ధాత్రిని లేరని దేవ వాక్యముం
జెప్పుట నిక్కమట్టి నరజీవుల లోపల నాకు మించబల్‌
తప్పులు సేయువాడొకడు ధారుణి నారయలేడు- నేడు నా
తప్పులబాపి, నీ కరుణ దప్పక బ్రోవవె యేసునాయకా!

      తప్పులు లేనివాళ్లు భూమిమీద లేరని దైవవాక్యం. అది నిజం. అలాంటి మనుషుల్లో నన్ను మించి తప్పులు చేసినవాడు మరొకడు లేడు. నా దోషాలను తొలగించి నీ కరుణా కటాక్షాలతో నన్ను రక్షించు ప్రభూ అని ప్రార్థిస్తారు. ఈ పద్యంలో శతకాల ప్రధాన లక్షణమైన ఆత్మాశ్రయత్వం కనిపిస్తుంది. ఇందులో క్రీస్తు జీవితంలోని కరుణరసాత్మక ఘట్టాలను కవి వర్ణించిన తీరు హృద్యంగా ఉంటుంది. ఏసుప్రభువంటే భక్తిభావాల్ని కలుగజేస్తుంది. ప్రభువును శిలువ వేసే ఘట్టాన్ని...
పల్లవ తుల్యపాద, కర పంకజ మధ్యములందు రక్తమున్‌
చిల్లున జిమ్మ మేకులు దుసిల్లగ సిల్వను గొట్టి, పక్కలో
బల్లెము గుచ్చు వారియెడ వైరము లేక కృపారసంబు శో
భిల్లె గదా భవత్‌ హృదయ వీధిని వెల్లుగ యేసునాయకా!

      లేత చిగురుల్లాంటి పాదాలు, తామరల్లాంటి చేతుల మధ్య రక్తం చిమ్మేలా మేకులు దింపుతూ నిన్ను శిలువ వేశారు. పక్కలో బల్లెం కుచ్చే వాళ్లమీద కూడా శత్రుభావం లేకుండా నీ హృదయవీధి నిండా కృపారసమే శోభిల్ల జేశావు ప్రభూ ఎంత దయామయుడివి అంటారు. ఆయన రచించిన ‘ఏసుక్రీస్తు ప్రభు శతకము’లోనూ రమణీయమైన భావాలతో కూడిన పద్యాలున్నాయి. ఆయన రాసిన ‘పంచచామర పన్నములు’ పంచచామర వృత్తంలో మకుటంతో సాగిన అర్ధశతి. ఇక అయిదు సీస పద్యాల కృతి ‘పంచ రత్నములు’. ఇవి స్తుతి పద్యాలు.
వెల లేని పంచచామర
ములు మరియును పంచ రత్నములు ప్రభువు కృపన్‌
ఇల చౌధురి పురుషోత్తము
వలన రచితమయ్యె సాధు వర్గంబలరన్‌!

      తాను పంచచామరాలు, పంచ రత్నాలు రచించేందుకు కారణం ప్రభువు కృపే అని చెప్పుకొన్నారు. 1851లో వెలువడిన ‘క్రైస్తవ నీతి ప్రకాశము’ వందకుపైగా విలువైన నీతిపద్యాలతో రూపొందిన కావ్యం. జగతియందు కులాలుండు సారెమీద/ మంటినే కుండలొనరించు మాడ్కి, సర్వ/ నరులనొక రక్తమున పరాత్పరుడు చేసె/ గాన ఘననీచులిల లేరు క్రైస్తవునకు! అంటూ... క్రైస్తవునికి ఈలోకంలో ఉచ్ఛనీచ భేదాలు లేవని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రకటిస్తారు. ఇంకా ‘నీకు నువ్వే తగ్గి నడుచుకుంటే, ఘనత వహిస్తావు. గర్వంగా వ్యవహరిస్తూ నువ్వే ఎక్కువ అనుకుంటే మాత్రం అవగుణాలు వస్తాయి సుమా!’ అని హెచ్చరిస్తారు.
      త్యాగరాజస్వామి రాసిన ‘నౌకా చరితము’, ‘ప్రహ్లాద భక్తి విజయము’ లాంటి సంగీత రూపకాల పద్ధతిలో పురుషోత్తమ చౌధురి ‘రక్షణ చరిత్ర’, ‘నిస్తార రత్నాకరము’ అన్న గ్రంథాలు రచించారు. ఇవి తెలుగులో మొట్టమొదటి క్రైస్తవ సంగీత రూపకాలు. ఇందులో... ‘వినరే నరులారా మనముల వేడుకలను మీర/ మన రక్షకుడగు మరియా తనయుని మహిమలు చవులూర’, ‘చూడుడి బంధువులారా యేసుని యవతారంబు/ ఈడులేని సత్పుణ్యముల కిదియే యాకరంబు’ లాంటి కీర్తనలు అలరిస్తాయి.
      ఇవిగాక, చౌధురి 1874లో ‘సత్య భజన’ పేరిట ఒక భజన గీతాల సంపుటిని వెలువరించారు. ఇందులో తెలుగు వర్ణమాలలోని ‘అ’ నుంచి ‘క్ష’ వరకు ప్రతి అక్షరాన్ని ప్రారంభాక్షరంగా ఒక్కో కంద పద్యాన్ని రచించి, ఆ పద్యం కింద ఒక కీర్తనను పొందుపరచి కొత్తబాటను వేయడం విశేషం. దీనిని ‘అక్షర మాలికా కందాలంకార భజన గీతాల సంకలనం’ అని పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని ‘దైవంబు గొలుతున్‌- నాతండ్రి/ యొహొవాను దలతున్‌..’, ‘కరుణానిధియై క్రీస్తుడు వచ్చె ధరణికి నరుడై- నరజాతి దురవస్థ దర్శించి తత్పాప/ పరిహారము కొరకై యర్పణసేయ దేహము’, ‘వారె మంచి క్రైస్తవులు గదా- ఈ లోకమందు’ మొదలైన భక్తిగీతాలతో సుసంపన్నం చేశారు. వీటిని ఇప్పటికీ ఎన్నో చర్చిల్లో అనన్యమైన భక్తితో పాడుకుంటూ ఆ వాగ్గేయకారుణ్ని స్మరించుకుంటున్నారు. ‘పైనమైయున్నానయ్యా’ ఆయన చివరి కీర్తన.
      రాజా మంత్రిప్రెగడ భుజంగరావు ప్రశంసించినట్లే పురుషోత్తమ చౌధురిని ఉత్తమోత్తమ క్రైస్తవుడు. ఆయన రాసిన భక్తిగీతాలు మధురాతి మధురంగా అన్ని చర్చిల్లోనూ పాడటం ఆయన ప్రతిభకు తార్కాణం. పద్యాలు, కీర్తనలు రాసి తెలుగు క్రైస్తవ సమాజానికి, దానిద్వారా తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవ అజరామరం.


వెనక్కి ...

మీ అభిప్రాయం