చెరువు సాక్షిగా చెరగని కథ

  • 502 Views
  • 9Likes
  • Like
  • Article Share

కావ్యానికి సార్వకాలికత, ఉదాత్తత, ప్రయోజకత ఉండాలి. కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. 107 పద్య గద్యాలున్న ఈ కావ్యం సులువుగా అర్థమయ్యే శైలిలో సాగుతుంది. రచనా కాలం 1899. ప్రచురితమైంది 1900లో. ఈ కావ్యం మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలకు అనుబంధంగా ఉన్న శ్రీయాంధ్ర భాషాభిరంజనీ సమాజం నిర్వహించిన బహుమాన కావ్య పద్ధతి పోటీలో బహుమతి గెలుచుకుంది. అప్పుడు కట్టమంచి వయసు ఇరవై ఏళ్లే!
      గురజాడ, కందుకూరి, గిడుగులాంటివారి మార్గదర్శకత్వంలో తెలుగు సాహిత్యం ఆధునికతను ఆపాదించుకుంటున్న రోజులవి. అయితే ఈ కావ్యంలో ప్రబంధ ఛాయలు కనిపిస్తాయి. అయినా ఇందులో ఆధునికతనూ చొప్పించగలిగారు కట్టమంచి. విషాదాంతం చేయడంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం కనిపిస్తుంది. తన ఊరి బాగుకోసం ప్రాణాలర్పించిన ఓ త్యాగమయి జీవితం ప్రధానంగా సాగే ఈ కావ్యం ‘శ్రీమత్కటుమంచీ పురధామా...’ అంటూ శ్రీకారంతో ప్రారంభమవుతుంది. శివుణ్ని, పరాశక్తిని కొనియాడతారు. ‘ఇల్లు లేని వానికి ఎల్ల గృహమ్ములు సొంతమయ్యె’ అని శివుణ్ని చమత్కరిస్తారు. తరువాత సూర్యుణ్ని, రుషులను, కవికుల బ్రహ్మ తిక్కనను గణన చేసి, పింగళి సూరన సొంపు పొగిడి, వేమనకు మొక్కి తాను కవిత్వం రాసేందుకు పూనుకున్నానంటారు. తన తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, తరువాత పొందిన ప్రసిద్ధిని వెల్లడిస్తూ, తండ్రిని చూసి తనను చూడమని వినయాన్ని ప్రదర్శించారు. మిత్రుడు రఘునాథరెడ్డికి ఈ కావ్యాన్ని అంకితమిచ్చారు. 
      వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రధాన ఆధారం చెరువులు. పాకాల, రామప్ప, కంభం ఇలా ఎన్నో  ప్రసిద్ధిచెందిన చెరువులు తెలుగునేల మీద ఉన్నాయి. సుదూరంగా విస్తరించిన అపారమైన జలరాశితో ఉన్న వీటిని సముద్రాలు అనడమూ కద్దు. ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో వీటి దోహదం ఎంతో ఉంది. అందుకే వీటికి పవిత్రత కల్పించారు జనం. ఆ పవిత్రతను కాపాడేందుకు కథలూ అల్లుకున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న బుక్కరాయ సముద్రం చెరువుకట్టకు ముసలమ్మ కట్ట అని పేరు వచ్చేందుకూ ఉన్న కథా అలాంటిదే. 
      బుక్కరాయ సముద్రం పచ్చని పైర్లతో కళకళలాడే సంపన్నమైన గ్రామం. దీనికి కారణం బుక్కరాయ సముద్రం చెరువు. ఓరోజు ‘కడవలు ముంచి వంచినట్లుగా మిన్నూమన్నూ ఏకమయ్యే’లా జోరువాన కురిసింది. ఆ తీవ్రతకు చెరువుకట్ట తెగే ప్రమాదం పొంచి ఉంది. భయభ్రాంతులైన ఆ పల్లె జనం ముప్పు తప్పేందుకు భక్తితో పోలేరమ్మకు పొంగలి పెడదామనుకున్నారు. అందరూ కోళ్లను, పొట్టేళ్లను తీసుకొని చెరువుదరికి వచ్చారు. పొంగళ్లు కాగానే బలులిచ్చి పోలేరమ్మను ‘‘మా మొర ఆలకించి వేగంగా ఆదరించవమ్మ్లా’’ అని వేడుకున్నారు. అప్పుడు ఆకాశవాణి ‘‘ముసలమ్మ బలి అయితే మీ కష్టం తొలగిపోతుంది’’ అని పలుకుతుంది. ఈ మాటలకు వాళ్లు ‘‘ముసలమ్మ మెత్తని మనసు కలది, చిన్న వయసుది, ఎప్పుడూ తగవులాడి ఎరుగదు, భర్తను వదిలి వెళ్లేందుకు ఎలా ఓర్చుకుంటుంది’’ అని బాధపడతారు. అయినా మనం ఎన్ని చెప్పినా ఆమె త్యాగం చేయకుండా ఉంటుందా! ‘మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచాడు, బావిని తవ్వేందుకుపోతే దయ్యం లేచింది’ అని అనుకుంటారు.
కన్నీళ్లింకిన క్షణాలు
బసిరెడ్డి అనే రైతు చివరి కోడలే ముసలమ్మ. ఆమె ఆ గ్రామ ప్రజలకు తలలో నాలుక. మనసు అప్పుడే ఎత్తిన వెన్న. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. ఊరిని ముంపు నుంచి కాపాడాలంటే తన ప్రాణం త్యాగం చేయాలనే విషయం ఆమెకు తెలుస్తుంది. ఊరికోసం ప్రాణం ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని భర్తకు చెప్పాలనుకుంటుంది. ఈ సందర్భంలో ‘‘లేనగవును గన్నీళ్లును/ గా, నెద తటతటయనంగ గాంతుని యెదుటన్‌/ వానయు నెండయు గలసెడు/ చో నొప్పెడు నభమనంగ, సుందరి నిలిచెన్‌’’ అంటూ కవి ఆమెను ఆకాశంతో పోలుస్తారు. ఆకాశం స్థితప్రజ్ఞతకు ప్రతీక. ఆమె భర్త ఎందుకలా ఉన్నావు? ఏం జరిగిందని అడుగుతాడు. ఆమె ఆకాశవాణి మాటల్ని భర్తకు తెలిపింది. ఆ మాటలు వింటూనే భర్త స్థాణువయ్యాడు. అంతలోనే తేరుకొని ‘‘నిన్ను విడిచి నిముషమైనా ఉన్నానా? నన్ను కూడా నీవెంట తీసుకుపో. కాదంటే ఊరివారందరం వేరే ఎక్కడికైనా వెళదాం. లేదంటే నీకు బదులుగా నేను ప్రాణత్యాగం చేస్తాను’’ అంటాడు. 
      అప్పుడామె ‘‘అయ్యో! ఎలాంటి మాటలు వినాల్సివచ్చింది! నా పాపఫలాన్ని మీరెందుకు అనుభవించాలి. ముసలి తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్లడం, మీ అన్నలు నవ్వుకొనేట్లుగా భార్యతో వెళ్లడం మంచిదో కాదో కొంచెం ఆలోచించండి. తరతరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లు విడవడం ధర్మం కాదు. ఒకవేళ అలా చేసినా మేలు కలగదు. వేరే చోటికి వెళ్తే తిండి ఎలా? నీళ్లేవిధంగా వస్తాయి. ఇల్లిల్లూ తిరిగి భిక్షమెత్తుకోవాలా? మీకు ఇళ్లు ఎవరు ఇస్తారు. పసిబిడ్డలు ఈ కష్టాలకు తాళలేక ఆకలికీ, నీడలేక చచ్చిపోరా? వాళ్లకు కష్టాలు ఎందుకు? నన్ను పంపండి చాలు అంటుంది.
      ‘‘దేవుడిచ్చిన శక్తిని తోటివాళ్ల బాధలు తొలగించేందుకు ఉపయోగించకపోతే మనిషికి చావు పుట్టుకలు ఎందుకు? ప్రజలకు మేలుచేయని శరీరం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తనవాళ్లు భయపడుతుంటే తలెత్తుకొని తిరగడం మనిషికి ఎలా సాధ్యం. మీరు నన్ను బాగా చూసుకున్నారు. మీ ముందే కన్నుమూయటం గొప్పవిషయం కదా!’’ అంటుంది. దీనికి అతను నువ్వు చాలా గొప్పదానివి. మేమెవ్వరమూ నీకు సాటిరామనే విషయం నాకు ముందుగానే తెలుసంటాడు. భర్త ఇలా అనగానే ముసలమ్మ ‘‘అయ్యో! ఈ రోజు ఎలాంటి వియోగం జరుగుతోంది. చిన్నతనం నుంచి నేను మిమ్మల్ని సేవించడమే తప్ప మరేదీ కోరలేదు. ఇప్పుడు ఈ ఒక్క కోరిక తీర్చండి చాల’’ని అంటుంది. 
మామ బసిరెడ్డి దైవలీలను తలచుకొని బాధపడతాడు. కోడలితో ‘‘పండు ముసలివాళ్లమైన మమ్మల్ని విడనాడేందుకు మనసెలా వచ్చింది? మా గతి ఏంటో చెప్పు, కళ్లు లేని మాకు ఊతకర్ర నువ్వే. నువ్వు లేని ఇల్లు అసలు ఇల్లే కాదం’’టాడు. దానికి ఆమె, చిన్నప్పట్నుంచీ ‘‘ఈ దేహం పరోపకారానికే’’ అని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం అంటుంది. కొడుకును దగ్గరికి తీసుకొని ‘‘నాయనా ఈ రోజు నుంచి నీకు అన్నీ మీ నాయనే. నన్ను తలచుకొని బాధపడవద్దు. పోయివస్తానురా’’ అని, భర్తకు అప్పగిస్తుంది. అక్కడి జనాన్ని చూసి, నన్ను మీ బిడ్డలా చూసుకున్నారు. మీ రుణం ఇలా తీర్చుకుంటాను అంటుంది. తరువాత సాష్టాంగ పడి, ఓ పరమేశ్వరా! నీ కృపతో నా పాపాలన్నీ మటుమాయమయ్యాయి. ప్రజలను దయతో చూడమని ప్రార్థిస్తుంది. 
      ఆమె చెరువులోకి వెళ్లడాన్ని 
కన్నెఱ్ఱవారిన ఖరకరోదయకాల
         మల్లన మ్రింగు జాబిల్లియనగ
జ్వలదగ్ని శిఖలపై నెలనవ్వుతోఁ బోవు
         ధాత్రీ మహాదేవి తనయ యనఁగ 
కెందామరలబారు సుందరమగు లీల
         నల్లనల్లనఁ జొచ్చు నంచ యనగ
కాల మహాస్వర్ణ కారకుండగ్నిలోఁ 
         గరఁగించు బంగారు కణికయనఁగ
ప్రళయ కాలానల ప్రభాభాసురరోగ్ర
రంగ దుత్తుంగ భంగ సంవ్రాతములకుఁ
గలఁక నొందక, దరహాస మలర, మంద
మందగతిఁ బోయి, చొచ్చె నమ్మగువ నీట.

      పద్యంలో ఎంతో భావుకతతో- సూర్యోదయ కాలం మింగిన జాబిల్లి, భగభగ మండే అగ్ని శిఖలపై చిరునవ్వుతో ప్రవేశించే సీత, తామరల బారులోకి సుందరంగా వెళ్లే హంస, చివరికి కాలం అనే స్వర్ణకారుడు అగ్నిలో కరిగించే బంగారు కణికతో పోల్చి దృశ్యమానం చేస్తారు. ఇది ప్రబంధ కవుల వర్ణనలకు సాటి వచ్చేది. ఆ త్యాగానికి గుర్తుగానే బుక్కరాయ సముద్రం చెరువు కట్టకు ‘ముసలమ్మకట్ట’ అనే పేరు నిలిచి పోయింది. ఈ సందర్భంలో రామలింగారెడ్డి జనం నోళ్లలో నానుతున్న కథకు కొన్ని మార్పులు చేసి ఈ కావ్యాన్ని తీర్చిదిద్దారు. ఈ కథలో వాస్తవమెలా ఉన్నా, ‘ముసలమ్మ కట్ట’ అనే పేరునుంచి ఆ ముసలమ్మ ఊరి జనం బాగుకోసం కష్టపడి ఉంటుందని తెలుస్తుంది. ఈ కావ్యాన్ని స్త్రీలకోసం రాశానని పీఠికలో చెప్పుకున్నారు రచయిత. ఇందులో స్త్రీ సహజ లక్షణాలను ఉన్నత స్థాయిలో ఆవిష్కరించడమే కాదు, ఆనాటి సమాజంలో వేళ్లూనుకున్న నమ్మకాలు, వాటి వల్ల ఎదురయ్యే పర్యవసానాలనూ కళ్లకు కట్టినట్టు అక్షరీకరించారు కట్టమంచి.


వెనక్కి ...

మీ అభిప్రాయం