నైతిక విలువలు ఉంటేనే విలువ

  • 53 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। జోశ్యుల కృష్ణబాబు

  • విశ్రాంత తెలుగు రీడర్,
  • మహారాణీ కళాశాల, పెద్దాపురం, తూ.గో.
  • 9866454340
డా।। జోశ్యుల కృష్ణబాబు

బాల్యానికి సంకెళ్లు పడుతున్నాయి. కాదు... కాదు... బాల్యమే ఏరికోరి సంకెళ్లను బిగించుకుంటోంది. తల్లిదండ్రుల హృదయాలను, పాఠ్యపుస్తకాల దొంతర్లను కాలదన్ని జువనైల్‌ హోములవైపు కదిలిపోతోంది. దొంగతనం, అత్యాచారం, హత్య... విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతూ తనను తానే చిదిమేసుకుంటోంది. దీనికి కారణమేంటి? ఆధునిక చదువుల పేరిట నైతిక విలువలకు తిలోదకాలిస్తున్న విద్యవ్యవస్థకూ ఇందులో భాగస్వామ్యం ఉందా?
* వరంగల్‌ జిల్లాలో ముగ్గురు పిల్లలు... ఎనిమిదేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారు! ఎందుకంటే, ఆ కుటుంబానికీ వీళ్ల కుటుంబానికి ఏవో గొడవలున్నాయట! వాళ్ల అమ్మాయిని అవమానిస్తే పగ తీరుతుందట! పాటలు, పాఠాలతో దోస్తీ కట్టాల్సిన వయసులో పగ ప్రతీకారాల ఆలోచనలెలా వస్తున్నాయి? ఇంత వికృత చేష్టలకు ఎలా పాల్పడుతున్నారు?
* దేవాలయాలను దోచుకుంటున్న దొంగల ముఠాలను అరెస్టు చేశారు ఆ మధ్య విశాఖపట్నంలో. తీరా చూస్తే ఆ చోరశిఖామణుల్లో కొందరు చిన్నారులే!  విలాసాలకు అలవాటు పడి దొంగలుగా మారారు. పట్టుమని పదిహేనేళ్లు లేని వాళ్లకు విలాసాల ‘విలాసాలె’లా తెలిశాయి? 
* చెన్నైలోని సెయింట్‌ మేరీ ఆంగ్లో ఇండియన్‌ పాఠశాల ఉపాధ్యాయని ఉమామహేశ్వరి. అదే బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లాడొకడు ఆమెను హత్యచేశాడు.... కత్తి గొంతులో దింపి! అల్లరి మాని బాగా చదువుకోరా అన్నందుకు ఆవిడ చెల్లించిన మూల్యం... ప్రాణం!  
గరికపచ్చ మైదానాల్లో ఆడుకుంటూ తామరపువ్వుల కోనేరుల్లో సేదతీరాల్సిన ప్రాయంలో పాషాణహృదయులుగా మారిన చిన్నారుల చేతలివి. ఈ ఏడాది మొదట్లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... దేశంలోనే అత్యధిక బాలనేరస్థులున్న రాష్ట్రాల్లో అవిభాజ్య తెలుగు నేలది ఆరోస్థానం! రెండు దశాబ్దాల కిందట దేశంలో బాల నేరస్థుల సంఖ్య 9766 అయితే, ఇప్పుడు 21,088 మంది తయారయ్యారు! జాతీయ నేరగణాంకాల సంస్థ లెక్కల ప్రకారం కిందటేడాది తెలుగునాట 3133 కేసుల్లో 2888 మంది   ముద్దాయిలు పిల్లలే. తల్లిదండ్రుల్లేని పిల్లలు వ్యసనాలకు బానిసలై ఇలా తయారవు తున్నారని ఆక్షేపించే వారందరికీ వెన్నులో వణుకు పుట్టించే విషయం ఏంçంటే... నేరాలకు పాల్పడుతున్న చిన్నారుల్లో పది శాతం మందే అనాథలు! మిగిలిన తొంభై శాతం మందికీ చక్కగా కుటుంబాలున్నాయి. అయినా... కట్టు తప్పుతున్నారు! 
చదువే చుక్కాని
పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దేందుకు చదువే ముఖ్యసాధనం. అది కూడా నైతిక విలువలతో కూడిన విద్య అవసరం. కానీ, ర్యాంకుల రంధిలో పడిన విద్యావ్యవస్థకు ఆ విషయం తలకెక్కట్లేదు. నేడు కార్పొరేట్‌ బడులు, కళాశాలలు... ఇంజినీర్లను, వైద్యులను తయారు చేస్తున్నాయి. శిక్షణ సంస్థలైతే ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను తయారు చేస్తున్నాయి. కానీ ఇవేవీ మనుషుల్ని తయారు చేయలేకపోతున్నాయి. స్వార్థం, పెంకితనాల్లోంచి పుట్టినవాడే ‘నాయకుడ’ని చలనచిత్రాలు చిలుకపలుకలు పలుకుతుంటే... ముఖపుస్తకాల ముసుగులో అవధుల్లేని విశృంఖలత్వానికి అంతర్జాలం వేదికవుతుంటే... బడి చేష్టలు దక్కి చూస్తోంది! ఉమ్మడి కుటుంబాలతో పాటు నాయనమ్మ, తాతయ్యల నీతికథలకు దూరమైన బాల్యానికి నైతిక విలువలద్దుదామన్న స్పృహను మరచి, మార్కుల మత్తులో జోగుతోంది! నీతి చెప్పే తెలుగుకు విలువ లేదు. మిగిలిన గణితం, విజ్ఞానశాస్త్రాలకేమో విలువలతో పని లేదు. ఫలితం... దారం తెగిన గాలిపటమవుతోంది బాల్యం. దాన్ని కమ్మేస్తోంది నేరం!
కాస్తో కూస్తో మిగిలిన తెలుగులోనైనా పాఠ్యాంశాల్లో మేలిమి రత్నాలున్నాయా అంటే... ముప్ఫై, నలభై ఏళ్ల నుంచి మారకుండా పాచిపట్టిపోయాయవి! అలాగని సమూలంగా అన్నిటినీ ఇప్పటికిప్పుడు మార్చేయాల నడమూ భావ్యంకాదు. ప్రాచీన సాహిత్య గ్రంథాల్లో మానవతా విలువలతో కూడిన విలువైన అంశాలెన్నో ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలోనూ నేటి సమాజానికి అవసరమైన ఆలోచనా ధోరణితో కూడిన అంశాలుంటున్నాయి. ఆ రెండింటినీ పాఠ్యాంశాల్లోకి తీసుకురావాలి. కాకపోతే, వాటిని ఎంపిక చేసుకోవడంలోనే కొంత ఆలోచించాలి.
అంత తీరిక ఉందా?
అసలు పాఠ్యాంశాల ఎంపిక ఒక్క రోజులోనో, ఒకటిరెండు సమావేశాల్లోనో, ఏ ఇద్దరి ముగ్గురితోనో కలిసి కూర్చుని, పూర్తిచేసేది కాదు. విశ్వవిద్యాలయాలే ఇలాంటి సమావేశాలు నిర్వహించి, వీటిపై సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. ఒక సంవత్సరం ముందుగానే సిలబస్‌ని ఎంపికచేసి ఉంచుకోవాలి. ఆ పని చేయకుండా... అప్పటికప్పుడు హడావుడిగా సమావేశాలు ఏర్పాటుచేసి పాఠ్యాంశాలు నిర్ణయించమంటే, లోపాలే రాజ్యమేలుతాయి. 
      సిలబస్‌ని ఎంపిక చేశాక, దాన్ని అంతర్జాలంలో పెట్టాలి. ఒకటి లేదా రెండు నెలలు సమయాన్నిచ్చి, ఈ పాఠ్యాంశాల ఎంపికపై అభిప్రాయాలు కోరాలి. వచ్చిన సూచనలమేరకు లోటుపాట్లు సవరించుకుంటే... బాల్యానికి మనవంతు మేలు చేసినవాళ్లమవుతాం. 
      పద్య సౌందర్యం, మంచి వచన రచన,  భాషా సౌందర్యాల తదితర గీటురాళ్లతో పాఠ్యాంశాలను ఎంపిక చేస్తూనే, ప్రతీ దాంట్లోనూ నైతిక విలువలను బోధించే అంశాలుండేలా చూడాలి. ఉదాహరణకు మహాభారతంలోని ఘోషయాత్ర ఘట్టంలో తమకెన్నో అపకారాలు చేసిన దుర్యోధనుణ్ని గంధర్వుడు బంధించుకు పోతుంటే విడిపించమని తమ్ముళ్లను ఆదేశించిన ధర్మరాజు పాత్ర కనిపిస్తుంది. దీని ద్వారా ‘అపకారికి కూడా ఉపకారం చేసే గొప్ప లక్షణాన్ని’ కలిగి ఉండాలని చెప్పించవచ్చు. ‘రంతిదేవుని కథ’ ఆకలితో అలమటించే వారిని ఆదుకొని పట్టెడన్నం పెట్టాలి అనే ఆలోచనను రేకెత్తిస్తుంది. చదువుకోవాల్సిన వయసులో పెడతోవ పట్టే వారికి ‘గుణనిధి కథ’ ఒక గుణపాఠం అవుతుంది. ఇలాంటి పాఠ్యాంశాలను పిల్లల మనసుల్లో నాటుకునేలా చెప్తే ఇవాళ దేశవ్యాప్త నేరాల్లో బాలనేరస్థుల వాటా 66 శాతం ఉంటుందా?
ఆ కథలెందుకు చెప్పరు?
ఢిల్లీ నిర్భయ, ముంబయి అనూహ్య ఉదంతాల్లో కౌమారంలోని కుర్రాళ్లే నిందితులు. గతేడాది పదహారు వందలకు పైబడిన అత్యాచారం కేసుల్లో పిల్లల పాత్ర ఉంది. పుండరీకుని కథ, వేమన జీవితం, కీచకవధ ఘట్టం వంటి పాఠ్యాంశాలతో అత్యాచారాలు అనర్థ హేతువులని బోధిస్తే... చిన్నారులిలా తయారవుతారా? 
      తల్లిదండ్రుల్ని లెక్కచేయకుండా, ఎదిరిస్తూ నిర్లక్ష్యంగా తిరిగే పిల్లలకు ‘శ్రవణ కుమారుని కథ’ కనువిప్పు అవుతుంది. ఇక భోజరాజీయంలోని ‘గోవ్యాఘ్ర సంవాదం’లో ఆడినమాట తప్పని గోవు సత్యనిష్ఠ, తన వత్సానికి బోధించిన నీతులు విద్యార్థుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. ఇలాంటి పాఠాల బోధన సక్రమంగా ఉంటే ఈయేడు దేశంలో 7,969మంది బాలలు దొంగతనాలకు పాల్పడేవారా?
      అందుకే బోధనలో సుభాషితాలు, శతకాలు, మిత్రలాభం, మిత్రభేదం వంటి నీతికథల్ని ఉపాధ్యాయులు పదేపదే ఉదహరించాలి. పరోపకార పద్ధతి, సుజన పద్ధతి, విద్వత్పద్ధతి వంటివి పాఠ్యానుగుణంగా ఉపయోగించాలి. ఉపాధ్యాయులు వాటిని విద్యార్థుల మనసుకు హత్తుకునేలా చెబితే, వాటిమీద పిల్లలే కసరత్తు చేసేలా చూస్తే అవి తప్పకుండా విద్యార్థుల్లో మంచి ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
      అలాగే, పద్య పఠనాన్ని తప్పనిసరి చేయాలి. అంతిమపరీక్షల్లో పద్యాలకు సంబంధించి ప్రశ్నలివ్వాలి. పద్యపఠనం వల్ల భాషా నైపుణ్యాలే కాదు నీతిసూత్రాలూ పిల్లలకు చేరతాయి. 
      పాఠశాలస్థాయి నుంచి కళాశాలస్థాయి వరకు ఒకే సంపాదక మండలిని ఏర్పాటు చేయడం కూడా మంచిది. లేకపోతే ఒకరితో ఒకరికి పొంతన లేకపోవడంచేత అటు పాఠశాలస్థాయిలోనూ ఇటు కళాశాలస్థాయిలోనూ ఒకే పాఠ్యాంశాన్ని చర్వితచర్వణంగా చదవాల్సి వస్తోంది.
      తెలుగు పాఠ్యాంశాలను ఆసక్తిగా చదవాలనే కుతూహలం విద్యార్థుల్లో కలిగించాలంటే పాఠ్యాంశాల రూపకల్పనే కాదు, పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా బోధనలో ప్రత్యేకశ్రద్ధ వహించాలి. వారు నిత్యవిద్యార్థులుగా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను, తాము ఆకళింపు చేసుకుంటూ తమ విద్యార్థులతో ఆస్వాదింపజేయాలి. ఆ ఆస్వాదనలో ఆనందం వెతుక్కునే పిల్లాడికి అనవసర ఆలోచనలు రావు. ఫలితంగా అనర్థాలకూ అవకాశముండదు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం