శబ్దానికి అనుకరణ... మాటకు అలంకరణ

  • 640 Views
  • 1Likes
  • Like
  • Article Share

పిల్లోడి ఒళ్లు జ్వరంతో సలసలా కాగిపోతోంది. ఏమయ్యా... ఆ మందుబిళ్లలు పట్రా! దడదడలాడుతున్న గుండెతో కేకేసింది భార్య. బిడ్డ బాధ చూసి అప్పటికే ఆ అయ్య కళ్లమ్మెట బొటబొటా నీళ్లు రాలుతున్నాయి. ఇల్లాలి కేకతో లోకంలోకి వచ్చి చరచరా బయటకు పోయాడు. మందుల కొట్టుకు పరిగెత్తి జ్వరం మాత్రలు కొన్నాడు. దబదబా ఇంటికొచ్చి పిల్లాడితో మింగించాడు. కాసేపటికి కుర్రాడు కాస్త కుదుటపడ్డాడు.  
      ఈ చిన్న సన్నివేశాన్ని అర్థవంతంగా వివరించడానికి సాయపడ్డ ఆమ్రేడితాలను గమనించారా? భావవ్యక్తీకరణకు మెరుగులద్దడంలో వాటికి తిరుగులేదు. అలాంటి కొన్ని పదాలు...
కుటకుట
ఈర్ష్య, అజీర్ణంవల్ల కలిగే కడుపునొప్పికి సూచిక. ‘కుట్టు’ అంటే నొప్పి అని అర్థం ప్రచారంలో ఉంది. నీకేం నొప్పా కుట్టా అని కొందరంటుంటారు. ‘ఈమధ్య నన్ను చూసి వాడికి తెగ కుట కుటగా ఉంది’ లాంటి ప్రయోగాలున్నాయి. ఇక ‘కుతకుత’ అని మరో మాట ఉంది. ఏదైనా పదార్థం ఉడికేటప్పుడు వచ్చే శబ్దం అలా ధ్వనిస్తుంది. దాన్ని మానసిక స్థితికి అన్వయించి... ఆయన కోపంతో కుతకుతలాడుతున్నాడు లాంటి వ్యక్తీకరణలకు ఉపయోగించుకుంటాం. 
పలపల 
తెలంగాణలో వినిపించే పదం. బాగా ఎండిన స్థితిని వివరించటానికి వాడతారు. ఆ చెట్టు ఆకులన్నీ పలపల్లాడుతున్నాయి... బాగా ఎండిపోయాయని (ఆ స్థితిలో ఉన్న ఆకులు చేసే శబ్దం ఆధారంగా) అర్థం. 
గలగల 
ఆ అమ్మాయి కొత్తాపాతా లేకుండా గలగలా మాట్లాడేస్తోంది... అంటే, గుక్కతిప్పుకోకుండా 
మాట్లాడుతోందన్న మాట! చలాకీగా మాట్లాడేవారిని ఉద్దేశించి చేసే ప్రయోగమిది. 
పిసపిస
మానసిక స్థిమితం లేని పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ శబ్దంలో వినిపించే ధ్వని ఓ అస్థిరతను అభివ్యక్తీకరిస్తున్నట్టుంటుంది. ‘పొద్దుటి నుంచి మనసేంటో పిసిపిస లాడుతున్నట్టుంది’... ఓ ఉదాహరణ. 
మిటమిట
ఆత్రుతగా, ఆత్రంగా చూడటం. ఎక్కడైనా, ఎవరైనా తమకు కావలసిన దాని వైపు ఆశగా చూస్తుంటే ‘ఎందుకట్లా మిటమిట చూస్తావు’ అంటుంటారు.
సలసల
బాగా వేడెక్కడం. ద్రవ పదార్థాలు కాగుతున్నప్పుడు వచ్చే శబ్దమే దీనికి మూలం. సాధారణంగా ఎవరికైనా జ్వరం ఎక్కువ ఉంటే, ఒళ్లు సలసలా కాగిపోతోంది అనడం సర్వసాధారణం. 
పరపర
వస్త్రాన్ని, కాగితాన్ని చింపేసినప్పుడు వచ్చే శబ్దాన్ని అనుకరిస్తూ తెచ్చుకున్న మాట 
ఇది. ‘వాడికి కోపం వస్తే చేతిలో కాగితాల్ని పరపరా చింపేస్తాడు’.
కిరికిరి
తగాదా, లంపటం, గొడవ అనే అర్థంలో కూడా వాడుకలో ఉంది. ఏంటీ కిరికిరి, ఏదో కిరికిరి చేశాడు, ఇక్కడేదో కిరికిరి ఉంది జాగ్రత్త లాంటి ప్రయోగాలెన్నో ఉన్నాయి. 
దబ్బ దబ్బ
త్వరత్వరగా అని చెప్పడానికే ‘దబ్బ దబ్బ’ పదాన్ని వాడతారు తెలంగాణలో. దీన్నే ఇతర ప్రాంతాల్లో దబదబ, గబగబ అని ప్రయోగిస్తారు. ఇదే అర్థంలో, వేగంగా సాగే నడకను అనుకరిస్తూ వాడే మాట ‘జప్ప జప్ప’. వేగంగా నీళ్లుతాగుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి ‘గట్ట గట్ట, గడ గడ’ వంటి పదాలూ వినియోగంలోకి వచ్చాయి. ‘నే చెప్పంగానే జప్ప జప్ప ఆ పని చేసొచ్చిండు’, ‘బయట నుంచి వచ్చి గట్ట గట్ట/ గటగటా చెంబుడు నీళ్లు తాగేశాడు’... ఇలాంటి మాటలను మనం తరచూ వింటూనే ఉంటాం. 
బొటబొట
అయిదు శతాబ్దాల నుంచి వాడుకలో ఉన్న పదమిది. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో కనిపిస్తుంది. తిన్నడి భక్తిని వివరించే సందర్భంలో వచ్చే పద్యంలో ‘బొట బొట జినికెం గన్నీరు’ అని ప్రయోగించాడు కవి. అలా ఆనాటి నుంచి ఈనాటి దాకా బాగా కన్నీరు పెట్టడం, దుఃఖం పెల్లుబుకి కన్నీరు బొట్లుబొట్లుగా రాలడమనే అర్థాల్లో ఈ పదం వినిపిస్తూంటుంది.
గాయిగాయి
గాయి అనే పదానికి తెలంగాణ మాండలికంలో అల్లరి, లొల్లి, సందడి అర్థాలున్నాయి. గాయి గాయి అనంటే విపరీతంగా అల్లరి చేయటం. అది పిల్లలు తినుబండారాల కోసమో, ఆట వస్తువుల కోసమో అయినా కావచ్చు. లేదంటే మనకు సాంఘికంగా అశాంతిని కలిగించే కార్యకలాపాలైనా కావచ్చు. ‘వాడొచ్చిండంటే గాయిగాయి చేసిపోతడు’ లాంటి మాటలు అక్కడక్కడా వింటూనే ఉంటాం.
చరచర
వేగంగా వెళ్లే స్థితిని చెప్పడానికి సాయపడుతుంది. పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కల నుంచి వచ్చే ధ్వనికి ఇది అనుకరణ. అనుకున్న పని వేగంగా పూర్తయితే, పని చరాచరా అయిపోయింది అంటారు. చకచకా అన్నా ఇదే అర్థం.   
గుప్పుగుప్పు
ఘాటైన వాసన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాడే మాట ఇది. సువాసనలు ఘుమఘుమలాడటం, పరిమళాలు వ్యాపించటం దీనికి అర్థాలు. పక్కింటోళ్లు కోడికూర వండుకుంటున్నట్లున్నారు, వాసన గుప్పుగుప్పుమంటోంది... ఇలా వాడుకలో ఎన్నో ప్రయోగాలు!
రగరగ
మెరవటం అనే అర్థంలో తెలంగాణలో వినిపిస్తుంటుంది. ఇతర ప్రాంతాల్లో తళతళ, మిలమిల దీనికి సమానార్థకాలే. ‘కాసులపేరు రగరగలాడుతోంది,. చింతపండేసి తోమడంతో గిన్నెలన్నీ మిలమిల మెరుస్తున్నాయి’... ఇలా ఎన్నేనా చెప్పుకోవచ్చు.
జొబ్బుజొబ్బు
వ్యావహారికంలో కొన్ని కొన్ని సమూహాలను పేర్కొనటానికి కొన్ని ప్రత్యేక పదాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చాలామంది మనుషులు ఒక చోట కూడితే ‘మానవ సమూహం’ అంటారు. పశువుల విషయంలోనైతే, మందగా పిలుస్తారు. ‘జొబ్బుజొబ్బు’ అనేది ఈగల కూడిక. కుప్పలు కుప్పలుగా ఎక్కడైనా ఈగలు ముసిరి ఉంటే, ‘ఏంటిక్కడ జొబ్బుజొబ్బుగా ఈగలొచ్చినయ్‌’ అని అంటుంటారు. 
కసాపిసా
నమలటం, తొక్కటం లాంటి సందర్భాల్లో జరుగుతున్న పని వేగాన్ని సూచించటానికి వాడే పదమిది. ఎవరో తరుముకొస్తుంట్లు తొందర తొందరగా నమిలినా, ఓ వస్తువును రోట్లో వేసి/ అడుసుమట్టి లాంటి దాన్ని కాళ్లతో వేగంగా తొక్కుతున్నా.... కసాపిసా నమిలేశాడు, కసాపిసా చేసి పారేశాడు అంటుంటారు. 
బలబల
కూలటం, రాలటం, తెల్లవారటం తదితరాలను సూచించటానికి దీన్ని వాడుతుంటారు. చెట్లకాయలు బలబలా రాలాయి, పైకప్పు బలబలా కూలింది, బలబలా తెల్లారింది.... ఇలా అన్న మాట. కాయలు వేగంగా రాలటం, పైకప్పు వేగంగా కూలటం, తొందరగా తెల్లారడం అనేవి వీటిల్లో అంతరార్థాలు.
తిమతిమ
నాలుక తిమతిమలాడు తోందేంటి... అంటే, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావేంటని గద్దించడం! వాస్తవానికి నాలుక మీద వచ్చే దురదకు ఈ పదం సూచిక. ఇక చిమచిమలాడటం అంటే, కోపంతో కస్సుబుస్సులాడటం!
బుడబుడ
ఏదైనా రహస్యం మెల్లగా బహిర్గతం అయితే, ఆ విషయం బుడబుడ బయటకు వచ్చిందంటారు. చిల్లులు పడిన గొట్టాలు/ పాత్రల్లో నీళ్లుంటే బుడబుడమంటూ బుడగలు పైకొస్తూ ఉంటాయి. దీని ఆధారంగానే ఈ మాట వచ్చింది. ‘నిన్న జరిగిన విషయం ఆ ఇద్దరి మాటల వల్ల బుడబుడయింది’ అనే ప్రయోగాలున్నాయి.
గరగర
అహంకారం ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే మాటల్ని విని ఎదుటివారు అనుకునే స్థితి. ‘ఎందుకాయన మాటలు అంతగా గరగరగా ఉంటాయి’, ‘వాడికి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి వీడికి గరగర మంటున్నట్టుంది’ వంటి ప్రయోగాలున్నాయి. 
రుత్త రుత్త
దేనికీ పనికి రాకుండా పోవటమనే అర్థంలో తెలంగాణలో వాడుతుంటారు. ఎవరైనా సరే, ఏ పనికైనా కొరగాకుండా పోతున్నా/ ఏ పనీ చేయకుండా ఊరు మీద పడి తిరుగుతున్నా దీన్ని ఉపయోగిస్తారు.  


వెనక్కి ...

మీ అభిప్రాయం