అమ్మ పలుకు చల్లన

  • 619 Views
  • 11Likes
  • Like
  • Article Share

    ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం

ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం

భాష అక్షరంతో మొదలవుతుంది. అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం. ఒక శాశ్వతమైన వస్తువుతోటి భాషకు ఉపక్రమించటం రెండు మనస్సుల మధ్య వంతెన కట్టుకోవటానికి. ఇద్దరి మధ్య వారధి కట్టుకోవటానికి. భాషను ఎవరు మొదలుపెట్టారనే మీమాంశ ఇప్పుడు అవసరం లేదు. శాశ్వతమైన భాషను తల్లిగా తలచి సొంతం చేసుకున్నాం. తల్లికిస్తున్నంతటి గౌరవమర్యాదలు, మన్నన ప్రతిపత్తుల్ని భాషకు ఇవ్వాలి. చాలా భాషలకు ఆ గౌరవం దక్కుతోంది. వివిధ ప్రాంతాల వారు భాషకు పూజనీయ స్థానాన్ని కల్పించి అక్కున చేర్చుకున్నారు. భాష ఒడిలో పెరుగుతూ దేవతగా ఆరాధిస్తున్నారు. అర్చిస్తున్నారు. ప్రగతి పథంలోకి పయనిస్తున్నారు. నేను పలుభాషల్లో ముఖ్యంగా దక్షిణాది భాష‌ల్లో పాటల్ని ఆలపించాను కాబట్టి నా మనస్సులోని బాధను చాలా సార్లు వ్యక్తీకరించాను. ఇతర భాషల వారికి తమ మాతృభాషపై ఉన్న గౌరవమర్యాదలతో పోలిస్తే మన తెలుగు భాషపై మన వారికి ఉన్న గౌరవం చాలా చాలా తక్కువ. అది దినదినం క్షీణించిపోతోంది. ఎవరిని ప్రశ్నించినా కూడా ‘దీని కోసం తాపత్రయ పడాల్సిందేముంది? నేను చెప్పే మాట ఇతరులకు అర్థమవుతోంది. వారు చెప్పే మాట నాకు అర్థ‌మవుతోంది కదా’ అంటున్నారు. నిజమే.. ఉత్తరాలు రాయటం మానేశాం. ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారానే వెళ్లిపోతున్నాం. ఆఖరికి కలాన్ని చేబట్టటం కూడా చేతకాని పరిస్థితి దాపరిస్తుంది. పిల్లలకు ఓనమాలు నేర్పించటమూ ఎలక్ట్రానిక్‌ పలకల మీదే అయిపోతోంది. లేకపోతే ఐప్యాడ్ల మీద దిద్దిస్తున్నాం. పళ్లెంలో బియ్యాన్ని పోసి అక్షరాలు రాయించేవారు. బడి పంతుళ్లు గుంట ఓనమాల్ని దిద్దించేవారు. ఆ విధానాలకు కాలం చెల్లింది. సాంకేతిక విప్లవం చాలా సాధించామని గర్విస్తున్నాం. చిగుళ్లు తొడిగిన మొక్క వృక్షమవుతుంది. దాని కొమ్మల్ని పట్టుకుని ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పోతున్నామే తప్ప ఆ చెట్టు తల్లివేరు నీళ్లు లేక ఎండిపోతోంది. కొన్నాళ్లకు సమూలంగా కూలిపోతుందనే విచక్షణా జ్ఞానం లేని రీతిగా వ్యవహారం సాగిపోతోంది. ఒక విప్లవంతో మనమూ ప్రయాణం చేయటం ముఖ్యం. అయితే విప్లవ ఫలితాన్ని మోతాదు మించి స్వీకరిస్తే అది భస్మాసుర హస్తమవుతుంది. మనతనం లేనిది ఎంత గొప్పదైనా సరే అది పరాయిదవుతుంది. దాని వల్ల ఏ విధమైన ఉపయోగమూ ఉండదు. ఓ ఐదు వందల ఏళ్ల తర్వాత పురావస్తు తవ్వకాల్లో గుడి గోడలపైన ఒక లిపి కనిపిస్తుంది. ఓహో తెలుగు అనే భాష ఉండేది.. దీని అక్షరాలు ఇలా ఉండేవని తెలుసుకోవల్సిన అగత్యం వస్తుందేమోననే బాధ కలుగుతోంది. అలాంటి పరిస్థితి మన దౌర్భాగ్యమే. ఇప్పటికీ మించిపోయింది ఏమీలేదు. మనతనాన్ని పెంచి పోషించుకుందాం. అమ్మ భాష అభ్యున్నతికి బద్ధ కంకణులమవుదాం. ఇక నుంచి పరస్పర సంభాషణల్ని తెలుగులోనే సాగించేందుకు ప్రయత్నిద్దాం. మాండలికాలు, యాసల విబేధాలు కాదు ఇప్పుడు కావాల్సింది. ప్రతి మాండలికంలోనూ అందం ఉంది. తెలుగు భాష ఉన్నంత వరకూ మాండలికం ఉంటుంది. పర భాషల నుంచి పదాల్ని అరువు తీసుకోని ఏ భాషా సుసంపన్నం కాదు. ఆంగ్లం, స్పానిష్, గ్రీక్, లాటిన్, తమిళ, కన్నడ, మలయాళ ఇలా ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకోక పోతే భాష పరిపుష్టం కాబోదు. అది సహజమైంది. అలా ఇచ్చి పుచ్చుకోవటం బాగానే ఉంటుంది. ఇద్దరు తెలుగు వాళ్లు కలిసినప్పుడు తెలుగులో మాట్లాడుకోవటం అనాగరికమని చుట్టుపక్కల వాళ్లు భావిస్తారేమోనని ఆంగ్లంలో మాట్లాడుకోవటమే అనాగరికం. అమ్మ భాషలో మాట్లాడుకోవటం అనాగరికం కానేకాదు. మన భాష పట్ల మనకు గర్వం ఉండాలి. ఒక అహంకారం కావాలి. అంటే ఇతర భాషల్ని కించపరచే అహంకారం కాదు నేననేది. మన భాష పట్ల మనకున్న గౌరవం మనకు అహంకారాన్ని తీసుకురావాలి. ఆ భాష పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేయటం. పిల్లలకు ఏ మాధ్యమంలో విద్యా బోధన జరిగినప్పటికీ తెలుగును ఒక భాషగా బోధించటం చాలా ముఖ్యం. ప్రభుత్వం దీనికి దీక్ష పూనాలి. కొన్ని విషయాల్ని (సబ్జెక్ట్స్‌) ఉపాధ్యాయులు తెలుగులో బోధించటంలో తప్పు లేదు. తెలుగు మాధ్యమంలో చదువుకుని ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వారు ఉన్నారు కదా. వాళ్లు అప్పుడు ఇంగ్లిష్‌ను ఒక విషయంగా నేర్చుకున్నవారే. ఇప్పుడు ఆంగ్లం లేకపోతే ప్రపంచంలో బతకటం చాలా కష్టం. దాన్ని పరిపుష్టంగా నేర్చుకోవటంలో తప్పులేదు. అలాగని అమ్మభాషను తాత్సారం చేయటం తగదు. కన్నడ, తమిళ, మలయాళీలు ఆంగ్ల పదాల్ని తర్జుమా చేసి వాడుకలోకి తెచ్చేందుకు చాలా శ్రమిస్తారు. దాన్ని చూస్తే మనం నిజంగా సిగ్గు పడాలి. మనమూ తర్జుమా చేసి ప్రచారంలోకి తెస్తే మొదట అందరూ నవ్వుకుంటారు. నాకు అర్థం కాలేదు. ఇక ఇది ఎవ్వడికి అర్థమవుతుందంటారు. వాస్తవానికి తర్జుమా... అలా అన్నవారికి తప్ప ఇతరులకు చాలా బాగా అర్థమవుతుంది. అ అన్న అక్షరం పిల్లలకు వెంటనే అర్థమవుతుందా. కాదు.. దానిపై దిద్దించి అర్థమయ్యేట్లు చేస్తాం. ఇదే మాదిరి తర్జుమా పదాల్ని కూడా వాడుకలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయటం అనివార్యం.  


వెనక్కి ...

మీ అభిప్రాయం