కవి విపంచి

  • 45 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కర్లపాలెం హనుమంతరావు

  • హైదరాబాదు
  • 8142283676
కర్లపాలెం హనుమంతరావు

కొరకంచు వంటి లోకానుభవం, రసబంధురమైన హృదయ స్థానం, కన్ను కలిగి చరించే చిత్తం, గంభీరమైన భావ ప్రకటన కవిత్వానికి అవసరమైన దినుసులు అంటారు కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వ విమర్శక గ్రంథం ‘కవిత్వ తత్త్వ విచారము’లో.
      హృదయ తంత్రుల్ని మీటి భావ మాధుర్యాన్ని పంచే విపంచి - కవి. మీన మేషాలు లెక్కించుకుంటూ, గుణకార సూత్ర బద్ధంగా, చెమటోడ్చి చేసే రచన భౌతికశాస్త్రం అవుతుందేమో కానీ కవిత్వం మాత్రం కాదు. కాలేదు. కృత్రిమత్వానికీ మూర్తిమత్వం ప్రసాదించే అసాధారణ ప్రజ్ఞ (భావనా శక్తి- అంటుంటాం మనం మామూలు మాటల్లో) కవికి ఉండే ప్రత్యేక లక్షణం.
      మనస్తత్వ శాస్త్రం ప్రకారం మానవులను మిగతా జీవరాశి నుంచి విడదీసి ప్రత్యేక జాతిగా నిలబెట్టి భావోద్దీపన కలిగించే ప్రాకృతిక గుణాలు 1) ఆలోచనలు (Thinking) 2) భావాలు (Feeling) 3) సంకల్పాలు (Willing). భావాలను ఉత్తేజ పరిచే గుణం అధికంగాగల మనిషికే కవిత్వ లక్షణాలు అలవడేది. కవిత్వం ఏ నిర్వచనానికీ అందని ఒక బ్రహ్మపదార్థం అయితే... ఒకడు కేవలం ఎందుకు కవి మాత్రమే కాకుండా ఉండలేడో... ఇంకొకడు ఎంత ప్రయత్నించినా కవిగా మాత్రం ఎందుకు మారలేడో అంతుపట్టని వింత. కవికి మాత్రమే ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు ఏవో కవుల నైజంలో ఉండి ఉండాలి.
      ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అది భౌతికశాస్త్ర సిద్ధాంతం అవుతుంది. కన్నది కన్నట్లుగా వ్యక్తీకరిస్తే అది కార్యదర్శి సమర్పించే నివేదిక అవుతుంది. ఉన్నదానికీ కన్నదానికీ మధ్య ఒక సన్నని తెర ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది. ఆ తెరను తొలగించుకుని మరీ సత్యశోధనకు తాపత్రయపడే తత్వం శాస్త్రజ్ఞుడిదైతే... తెరకు ఈవలి వైపునే నిలబడి కంటికి కనిపించే దృశ్యాన్ని హృదయంతో కమనీయంగా వర్ణించే నైజం కవిది. సత్యాన్వేషిలాగా కవికి శుద్ధ సత్యంతో పని లేదు. నిజం నైజాన్ని గజం దూరంనుంచైనా సరే నిలబడి మనసనే సాధనంతో ఊహించే పనికి కవి ఇష్టపడతాడు. బుద్ధిజీవులకు కవుల భాష చాలా సందర్భాల్లో అసంబద్ధంగా చికాకు పుట్టిస్తుండేది అందుకే. అయినా కొన్ని సందర్భాల్లో ఆ కవిత్వమే ఆ తార్కికులకూ సాంత్వన అందించే మంచి ఔషధం అవుతుంటుంది. అదే కవిత్వంలోని విశేషత. కవి అనివార్యత.
      కవిత్వానికి ఉండే మరో ప్రత్యేకమైన సులక్షణం చంచలత్వం. దాని మూలకంగా సంతరించే నిత్యమైన తాజాదనం.
      ఒక వస్తువును కొన్ని నిర్దేశిత పరిశోధనలకు లోబడి పరిశీలించగలిగితే ఒకే వస్తువులాగా నిర్ధరించడం అసంభవం కాదు. కానీ ఒకే వస్తువు కవులందరికీ ఒకే విధంగా కనిపించదు. ఆ మాటకొస్తే అదే వస్తువు అదే కవికీ అన్ని వేళలా ఒకే రకంగా కూడా కనిపించదు. కాళిదాసునే మేఘదూతం మళ్లీ తిరగరాయమంటే సరిగ్గా అలాగే రాయగలడన్న భరోసా లేదు. చూసే సమయ సందర్భాలనుబట్టి, అప్పటికి ఉండే రస స్థాయి ఆధారంగా కవి వ్యక్తీకరణ ధోరణులు మారుతుంటాయి. ఆటంబాంబు నిర్మాణ సూత్రానికిమల్లే, ఆడవాళ్ల ప్రేమ భావానికి ఓ శుద్ధ నిత్యసత్య సూత్రం ఆవిష్కరించడం బ్రహ్మకైనా సాధ్యం అవుతుందా? అటువంటి అసాధ్యంలోనే కవిత్వపు అసలు తాజాదనపు సౌరభ రహస్యమూ దాగి ఉంది. గురజాడవారి మతం ప్రకారం ‘ఆకులందున అణగి మణగి’ కూయడమే కవిత్వపు భావనాశక్తి అసలు సిసలు సౌందర్యం.
      భావనాశక్తి అనేకమైన మాయలు పన్నగల లీలా వినోదిని అంటారు కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారంలో. నిజమే. కవి తన హృదయంలో అప్పటికి ఉప్పతిల్లిన భావాల ఆధారంగా చదువరితో   రూప సందర్శనం చేయిస్తాడు. కవి సమకూర్చిన దూరదర్శినితోనే చదువరికి వ్యోమలోక సందర్శనం చేయక తప్పని పరిస్థితి. ఆ సందర్శనకు సత్యసంధతతో నిమిత్తం లేదు. రసానుభూతే అంతిమ లక్ష్యం. ఆంగ్లకవి టెన్నిసన్‌లాంటి మహానుభావులైతే తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో నందిని పందిలాగా, పందిని నందిలాగా కూడా చూపించగల సమర్థులు. విద్యుత్తరంగాల వేగంతో పాఠకుడి మనో యవనికమీద ఒక అత్యద్భుతమైన చలనచిత్రాన్ని ప్రదర్శించగల గడుసరులు. మరుపురాని, అనిర్వచనీయమైన అనుభవాన్ని అందించడమే కవిత్వం అంతిమ లక్ష్యం అనుకుంటే, ఆ ఇంద్రజాలంలో కవిదే అందె వేసిన చేయి.
కాళిదాసులు, భవభూతులు, పోతనలు, జాషువాలు, నాజర్లు, గద్దర్లు... జనం నాలుకల మీద ఈనాటికీ అలా నాట్యం చేస్తూనే ఉన్నారంటే... ఆ చిరంజీవనానికి కవిత్వానికి ఎంత ఉపజ్ఞత కావాలి! ఆ ఉపజ్ఞతను సృజించే కవి ఎంత సుకృతం చేసుకుని ఉండాలి!
      వాల్మీకి లేనిదే రాముడు లేడు. వ్యాసుడి పూనిక లేకపోతే గీతాచార్యుడి ఆనవాలే మనకు దొరకదు. తిక్కన అంత అద్భుతంగా కవిత్వీకరించబట్టే పాంచాలి లోక పరీక్షలో మహా ఇల్లాలుగా తేలింది. పెద్దన బుద్ధికి ప్రవరాఖ్యుడు, సూరన సంగీత ప్రజ్ఞకి శుక్తిమతి, తెనాలి కవి చతురతకి నిగమశర్మ పెద్దక్క... ఇలా నాటి చేమకూర కవి విజయవిలాస కథానాయిక సుభద్ర నుంచి నేటి గురజాడ ‘కన్యాశుల్కం’ తాలూకు మధురవాణి వరకూ మన మనసుల్లో శాశ్వతంగా గూళ్లు కట్టుకుని ఉన్నారంటే... ఆ పుణ్యమంతా ఆయా కవుల ప్రజ్ఞాపాటవాలదే. భూమి గుండ్రంగా ఉందన్న విశ్వాసం మరో సిద్ధాంతం వచ్చి రద్దయిపోవచ్చునేమో కానీ భూమి పుత్రిక సీత మాత్రమే రాముని ఏకపత్ని అన్న నమ్మకం ఎన్ని యుగాలు గడిచినా జనం గుండెలనుంచి చెదరిపోదు.
      శాస్త్రవేత్తలకు ఉండే పరిమితులు కవులకు ఎందుకు ఉండవో... కవులు సత్యాన్వేషకులకన్నా ఓ మెట్టు ఎప్పుడూ పైనే ఎందుకు జనం గుండెల్లో కొలువై ఉంటారో ఈ ఒక్క ఉదాహరణ తరచి చూస్తేచాలు తేలిపోతుంది. కాటికి సాగనంపిన తరువాత... ఫొటోఫ్రేముల్లో బిగించడంతో కన్నవారి రుణం తీరిపోతున్నట్లు భావిస్తున్న పిదప కాలంలో కూడా ఏ రక్తసంబంధమూ లేకపోయినా గుండెల్లో గుళ్లు కట్టించుకుని మరీ రాముళ్లూ, కృష్ణుళ్లూ, సీతలూ, సావిత్రులూ జన నీరాజనాలు అందుకుంటున్నారంటే, ఆ వైభవాల వెనకాల ఉన్నదంతా ఆయా పాత్రల్ని సృష్టించిన కవుల కలాల చలవే. కవిగా జన్మించడం సుకృతంకాక మరేమిటి?
      కవిగా పుట్టడం ఒక వరం. కించపడాల్సిన పనిలేదు. వేలమందిలో ఏ ఒక్కరికోగాని ఈ శారద ప్రసాదం లభించదు. అయాచితంగా లభించిన ఈ ఉపజ్ఞతా విశేషాన్ని మానవత్వపు విలువలు మరింత ప్రవర్ధిల్లే రీతిలో ప్రయోగించే బాధ్యత మాత్రం మరి కవులదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం