మిసిమిలమిలలు!

  • 81 Views
  • 2Likes
  • Like
  • Article Share

    సీహెచ్‌.వేణు

  • హైదరాబాదు,
  • 9177004844
సీహెచ్‌.వేణు

అనూహ్యంగా అవతరించింది. ప్రత్యేక పథంలో పయనం సాగిస్తోంది. జిజ్ఞాస, కశాత్మకత, ఆధునికతల మేళవింపుగా నెలనెలా వన్నెలీనుతోంది. పఠితల, సాహితీపరుల సమక్షంలో ఇటీవలే వెండి పండుగ జరుపుకున్న ‘మిసిమి’ మిలమిలలను వీక్షిద్దామా!
ఒక పత్రిక
పాతికేళ్లుగా ప్రచురితమవుతూ ఉండటం అరుదైన సంగతి కాకపోవచ్చు. కానీ కాల్పనిక సాహిత్యం జోలికి పోకుండా; రాజకీయం, క్రికెట్, సినిమాలాంటివి లేకుండా ఒక తెలుగు పత్రిక క్రమం తప్పకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుంచీ నడుస్తోందంటే అది విశేషమే! అంతే కాదు కళ, విజ్ఞానశాస్త్రాల విశ్లేషణలను అభిరుచితో అందిస్తే మెచ్చి ఆదరించే పాఠకాభిమానులు (పరిమిత సంఖ్యలోనైనా) తప్పకుండా ఉంటారని రుజువు చేసిన అచ్చతెనుగు పత్రిక ‘మిసిమి’. విజ్ఞానవ్యాప్తే ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతూన్న ఈమధ్యనే రజతోత్సవం జరుపుకుంది!
తెనాలి నుంచి ప్రచురణలు
ఆలపాటి రవీంద్రనాథ్‌ స్వీయ సంపాదకత్వంలో 1990 ఫిబ్రవరిలో ‘మిసిమి’ని హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించారు. అప్పటికి ఆయన వయసు 68 సంవత్సరాలు. ప్రచురణరంగం ఆయనకు కొత్త కాదు. తెనాలి నుంచి పక్షపత్రికగా ‘జ్యోతి’నీ, మాసపత్రికలుగా ‘రేరాణి’, ‘సినీమా’లను 1946-57 మధ్య నడిపారాయన. వాటి ద్వారా హావలాక్‌ ఎల్లిస్, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ తదితరుల రచనలను సరళ తెలుగులో పాఠకులకు తొలిసారి అందించారు. పదేళ్ల తర్వాత ఆ పత్రికలను మూసివేసి హైదరాబాద్‌కు వచ్చేశారు.
అనుకోకుండా..
తమ కశాజ్యోతి ప్రాసెస్‌ ముద్రణ సంస్థకు జర్మనీ నుంచి అచ్చుయంత్రాలను తెప్పించుకునే ప్రయత్నాల్లో రవీంద్రనాథ్‌ అనూహ్యంగా ‘మిసిమి’కి అంకురారోపణ చేశారు. యంత్రాల దిగుమతి... ఏదైనా పత్రిక కోసమైతే పని త్వరగా జరుగుతుంది. అందుకని పత్రికను ప్రారంభించారు. కాపీలను ముఖ్యమైన మిత్రులు కొందరికి పంపించారు. పత్రిక కోసం కాబట్టి యంత్రాలు త్వరగా వచ్చేశాయి. ఇక పత్రికను మూసివేద్దామనుకుంటే తొలి సంచికలు చదివినవారు ‘నడపాల్సిందే’నని పట్టుపట్టారు. అలా పత్రిక కొనసాగింది. ఇది కాలక్షేప  పత్రిక కాదనీ, లోతైన విశ్లేషణలు అందించే విభిన్న పత్రిక అని గుర్తింపు పొందింది.
తొలి వెలుగులు
భాషావేత్త డా. బూదరాజు రాధాకృష్ణ రచన ‘ఆధునిక తెలుగు సాహిత్యం; అధిక్షేప కావ్యాలు’, ప్రముఖ హేతువాది డా. ఎన్‌.ఇన్నయ్య పరిశోధనాత్మక వ్యాసం ‘సుభాస్‌ చంద్రబోసు గెలిస్తే ఏమయ్యేది?’లతో మొదటి సంచిక వెలువడింది. పక్షపత్రికగా పది సంచికలు తెచ్చాక 1990లో మాసపత్రికగా మార్చారు.
      కళలు, ప్రాచీన ఆధునిక సాహిత్యం, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం తదితర అంశాల్లో ప్రామాణిక స్థాయి రచనలు అందించటానికి ఈ పత్రిక కృషి చేస్తోంది. సమాచారం, విశ్లేషణ, చర్చ మౌలిక లక్షణాలుగా వ్యాసాలు భాసించటం వల్ల మేధావుల, మేధావి పాఠకుల పత్రికగా మన్ననలందుకుంటోంది. 
మిసిమి మెరుపులు...
* మానవవాది ఏంబ్రోస్‌ రాసిన డెవిల్స్‌ డిక్షనరీ వరసగా ప్రచురణ.
* రూసో, టాల్‌స్టాయ్, మార్క్స్, రసెల్‌ లాంటివారిపై ‘మేధావుల మెతుకలు’ పేరిట వ్యాస పరంపర. (పాల్‌జాన్సన్‌ పుస్తకం ‘ఇంటలెక్చువల్స్‌’లోని ముఖ్య భాగాలకు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనువాదం)
* కీర్తిశేషులతో మధురవాణి ఇంటర్‌వ్యూలు (రచన: పురాణం సుబ్రహ్మణ్యశర్మ)
* 1999లో పోస్టుమాడర్నిజం గురించి ప్రత్యేక సంచిక
* 2001లో ప్రసిద్ధ మనోవైజ్ఞానికుడైన ఎరిక్‌ఫ్రామ్‌ మీద రెండు ప్రత్యేక సంచికలు.
ముఖపత్ర విశిష్టత
ముఖపత్రాల ఎంపికలో ఆది నుంచీ ‘మిసిమి’ది ప్రత్యేక ముద్ర! విఖ్యాత చిత్రకారుల కశాఖండాలెన్నో ముఖచిత్రాలుగా నాణ్యమైన ముద్రణతో వస్తున్నాయి. వెనక అట్ట, అట్టల వెనక పుటల్లోనూ ప్రత్యేక తరహా బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. పికాసో, రవివర్మ, దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, మా. గోఖలే, కొండపల్లి శేషగిరిరావు, సంజీవ్‌దేవ్‌ లాంటివారి చిత్రాలు పాఠకులను ఆకట్టుకున్నాయి.
ఏంటి అర్థం?
ఇంతకీ ‘మిసిమి’ అంటే? ‘పసిమి’, ‘పసుపువన్నె’ అనే మాటతో సారూప్యం వల్ల దీనికి బంగారం అనే అర్థం ఉండొచ్చని చాలామంది భావిస్తుంటారు. కానీ మిసిమి అంటే నూతన కాంతి, నవనీతం (వెన్న) అని రెండు అర్థాలు. గతంలో ఏ పత్రికకూ లేని పేరిది. కుడి ఎడమల ఎటువేపు నుంచి చదివినా తేడా రాదు. అర్థం, వ్యుత్పత్తి, కవి ప్రయోగాల వంటి వివరాలన్నీ సప్రమాణంగా ధ్రువీకరించుకున్నాకే ఆ పేరును ఖాయపరిచారు. పెద్దన ‘మనుచరిత్ర’లో ఈ పదం ‘నూతన కాంతి’ అనే అర్థంలో ఇలా కనిపిస్తుంది... 
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వే వెలుంగుల దొర జోడు రే వెలుంగు

తెనాలి రామకృష్ణుడి ‘పాండురంగ మాహాత్మ్యం’లో ఇదే మాట ‘నవనీత’మవుతుంది! 
మిణుకు టూర్పులవాని/ మిసిమి మేతల వాని / మెరుగు ఛామన చాయ మేనివాని..
      పత్రిక మకుటాన్ని ‘దమ్మపదం’ గ్రంథం నుంచి స్వీకరించారు. అది.. ‘మన మనుగడ సర్వస్వం మన ఆలోచనకు పర్యవసానం. అంటే మన ఆలోచనే మనం’.
సంపాదక సారథులు
మిసిమి ప్రస్థానం మూడు దశల్లో సాగుతూవచ్చింది. రవీంద్రనాథ్‌ ఆరేళ్లు సంపాదకత్వం వహించారు. ఆయన కన్నుమూశాక పదిహేన్నేళ్లు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆ బాధ్యతలు నిర్వహించారు. తొలి సంపాదకుడు రసాస్వాది, కశాసాహిత్యాభిమాని. మలి సంపాదకుని అభిమానాంశాలు... సిద్ధాంతాలు, దర్శనాలు, తర్కం. ఈ తేడా ‘మిసిమి’లోనూ ప్రతిఫలించింది. బౌద్ధచింతనకు ప్రాధాన్యం ఇవ్వడం అన్నపరెడ్డి నిర్దేశకత్వంలో జరిగిన మార్పు.
2010 నుంచి మిసిమి మూడో దశకంలో ప్రవేశించింది. చెన్నూరు ఆంజనేయరెడ్డి ప్రధాన సంపాదకునిగా, వల్లభనేని అశ్వినీకుమార్‌ సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించారు. కాలానుగుణంగా పత్రిక పరిధితో పాటు పరిమాణం విస్తృతమైంది. పుటల సంఖ్య రెట్టింపయింది (64). సంవత్సరం నుంచీ వంద పుటలు అందిస్తున్నారు. సాహిత్యం కొంత తగ్గించి, సారస్వతంలోని పార్శ్వాలైన నాట్యం, నాటకం, సంగీతం, చిత్రకళ, వ్యక్తి చరిత్ర, లేఖాసాహిత్యం, పరిశోధక కథనాలను పెంచారు. భాష ఎక్కువమందికి అర్థం కాదనే విమర్శ తొలినుంచీ ఉంది. దీన్ని గమనించి పత్రికలో భాషను సరళీకృతం చేశారు.
      ‘నా జీవితంలో గర్వించదగినదీ, గుర్తించుకోదగినదీ, చివరికి మిగిలేదీ మిసిమి మాత్రమే’ అని రవీంద్రనాథ్‌ ప్రకటించారు. అందుకే జీవితపు చివరిక్షణాల్లో ‘నేను పోతే మిసిమి ఏమవుతుంది?’ అని తపనపడ్డారు. ఆయన నిబద్ధతను గ్రహించిన ఆయన వారసులు లాభనష్టాలతో నిమిత్తం లేకుండా పత్రికను క్రమం తప్పకుండా వెలువరిస్తున్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం