ఇంగ్లిష్‌ పప్పులు లెక్కల్లో ఉడకవ్‌!

  • 148 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే విలువ, గుర్తింపు, ఉద్యోగం, జీవితం అనేది చాలామంది విశ్వాసం. మరైతే... ఇంగ్లిష్‌ మనకు అన్నింటినీ తేలికగా, సమర్థంగా నేర్పుతోందా? అతిముఖ్యమైన గణితాన్ని నేర్పించడంలో ఇంగ్లిష్‌ సత్తా ఏంటి?
అంకెలు, సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, సంఖ్యాపదాల విషయంలో ఆంగ్ల భాష చిన్నారుల మతిపోగొడుతోందని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఆంగ్లం ద్వారా లెక్కలు నేర్చుకున్న చిన్నారులతో పోలిస్తే ఇతర భాషల ద్వారా లెక్కలు చదివే పిల్లలు పదడుగులు ముందుంటున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆంగ్లంలోని  సంఖ్యాపదాల పేర్లు చిన్నారులను గందరగోశానికి గురిచేస్తున్నట్లు ఈ అధ్యయనాలు గుర్తించాయి.
ఎలెవన్‌తో మొదలు
చైనీస్, జపనీస్, కొరియన్, టర్కిష్‌ తదితర భాషలు గణిత భావనలను వివరించడంలో ఆంగ్లంకన్నా సరళమైన సంఖ్యాపదాల్ని ఉపయోగిస్తాయి. చిన్నారులు అంకెల్ని లెక్కించడం, అంకగణితం నేర్చుకోవడాన్ని సులభ సాధ్యం చేస్తాయి. చైనీస్‌లో కేవలం 9 సంఖ్యల పేర్లుండగా, ఆంగ్లంలో 24కుపైగా ఏకీకృత సంఖ్యాపదాలున్నాయి. అయితే.. సమస్య 11 వద్దే మొదలవుతోంది. ఆంగ్లంలో పదకొండును ప్రత్యేకంగా ‘ఎలెవన్‌’ అనే పలకాలి. ఇందులో అంకెలేవీ ధ్వనించవు, స్ఫురించవు. అదే చైనీస్, జపనీస్, కొరియన్‌ తదితర భాషల్లో ఈ సంఖ్యా పదాన్ని విడదీసి ‘టెన్‌-వన్‌’గా పలుకుతారు. తెలుగులోనూ 11ను సరళంగా పదకొండు అని పలుకుతాం. దీని వల్ల అంకె స్థాన విలువను అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఇలాంటి చైనీస్, ఆంగ్ల భాషల మధ్య భేదాలపై అమెరికా, చైనా బడుల్లో దశాబ్దాలుగా నార్త్‌వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు కారెన్‌ ఫ్యూసన్, టెక్సాస్‌ ఏఅండ్‌ఎం విశ్వవిద్యాలయం చైనీస్‌ గణిత విద్యానిపుణులు ప్రొఫెసర్‌ యెపింగ్‌ లీ పరిశీలన జరిపారు. వారి పరిశోధనల్లో తేలిందొక్కటే... లెక్కలతో కుస్తీ పట్టే పసిపిల్లలకు ఆంగ్లం ఇంకా ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతోంది!
టీన్లతో తికమక
ఆంగ్లంలో 10కి పైనుండే సంఖ్యల పేర్లు స్థాన విలువను స్పష్టంగా తెలుపవు. దీనికితోడు సంఖ్యల పేర్లను ‘టీన్ల’తో చెప్పడం మరో గందరగోళం. ఉదాహరణకు ‘సెవెన్‌టీన్‌’. ఇందులో 17 సంఖ్యలోని రెండో అంకెను ముందుకుతెస్తూ ‘సెవెన్‌’తో చెప్పడం మరో తికమక. చిన్నారులు ఎక్కువగా గందరగోళపడుతున్నదీ ఇక్కడే. పలికినప్పుడు చిన్నారులు 17ను 71గా పొరబడే అవకాశమూ అధికమే. బహుళ సంఖ్యల కూడికలు, తీసివేతల్లో ఆంగ్ల అంకెల పేర్లు, స్థానాల్ని అర్థం చేసుకోవడం కష్టం. మరోవైపు ఆంగ్లానికి ఉన్న ఈ సమస్య తెలుగులో లేదు. మనం పదుల స్థానాన్ని గుర్తిస్తూ 17ను ఏ గందరగోళమూ లేకుండా పదిహేడుగా పలుకుతాం. ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలుగానే అనిపించవచ్చుగానీ.. లెక్కలు చేసేటప్పుడు ఇదంతా చిన్నారులకు మానసికంగా అదనపు శ్రమ కలిగిస్తుంది. తప్పుల దిశగా నడిపించడమే కాకుండా, జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని నీరుగారుస్తోందన్నది ఫ్యూసన్‌ ఆచార్యుల మాట!
మాతృభాషే ముద్దు
మూడు నుంచి నాలుగున్నరేళ్ల విద్యార్థులపై చేపట్టిన మరో అధ్యయనంలో ఆంగ్ల భాష ప్రతికూల ప్రభావం మరింత స్పష్టంగా వెల్లడైంది. ఆంగ్లం మాట్లాడే 59 మంది కెనడా విద్యార్థుల్ని, ఇస్తాంబుల్‌లోని 88 మంది టర్కిష్‌ విద్యార్థుల్ని పరిశీలించినప్పుడు ఈ విషయం తేలింది. టర్కిష్‌ పిల్లలు తక్కువ సూచనలతోనే కెనడియన్లకన్నా మెరుగ్గా కూడికలు చేశారు. మాతృభాషలో గణితం చదువుకున్న టర్కిష్‌ చిన్నారులు.. ఆంగ్లంలో నేర్చుకున్న విద్యార్థులకన్నా పట్టు సాధించినట్లు కార్ల్‌టన్‌ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌ సంచాలకులు డాక్టర్‌ జోఆనే లెఫెవెరే స్పష్టంచేశారు.
      మాతృభాషా మాధ్యమంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసేవారే నైపుణ్యాలను మెరుగ్గా ఒడిసిపట్టుకుంటారన్నది పరిశోధకుల వాదన. పిల్లల మేధా సామర్థ్యాలు సమున్నతస్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటే, అమ్మభాషను అక్కునచేర్చుకోక తప్పదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం