భాషకు బాలాక్షరీ మంత్రం.. బాలోత్సవ్‌!

  • 60 Views
  • 45Likes
  • Like
  • Article Share

మూగవోయిన తుమ్మెదలొకచోట-
మొగ్గవీడని తామరలొకచోట..
ఏ రుజువని చూపెదనూ
ఏ రుతువని చెప్పెదనూ..
అచ్చెరువున అమ్మపాటలొకచోట-
ఉత్తరాల తాతమాటలొకచోట..
ఏ రుజువని చూపెదనూ
ఏ రుతువని చెప్పెదనూ..
బుడిబుడి పాపడు తడబడలేదంటే-
అనగనగా ఓ రాజని కథ చెబుతుంటే..
ఏ రుజువని చూపెదనూ
ఏ రుతువని చెప్పెదనూ..
మువ్వల చాటున నవ్వులు విసిరేస్తుంటే-
ఊహల రెక్కల గువ్వలు ఎగిరొస్తుంటే..
ఏ రుజువని చూపెదనూ
ఏ రుతువని చెప్పెదనూ..
అమ్మ చేతినొదిలేస్తూ
నాన్న నడక దాటేస్తూ
పిల్లలు.. పిల్లలు.. పిల్లలు...
ఎక్కడికీ.. ఎక్కడికీ.. ఎక్కడికీ...
బాలోత్సవ్‌.. బాలోత్సవ్‌.. బాలోత్సవ్‌...!!!


*  *  *


రేలా రషీద్‌ గొంతులో ఇంద్రధనుస్సు రాగం
బాలోత్సవ్‌ ప్రారంభవేడుకల్లో డిచ్‌పల్లి కుర్రాడు రేలా రషీద్‌ తన గానామృతంతో అమృత వర్షం కురిపించాడు. తొలుత కమ్మనైన అమ్మపాట ఆలపించి తరువాత తనదైన జానపద బాణీలో ‘మావోళ్లు మా ఇంటికాడ.. మంచి జేజబువ్వలొండుకున్నరంట..’ అంటూ బాలోత్సవ్‌ని ఉర్రూతలూగించాడు. 
      తాను చూడలేని రంగుల ప్రపంచాన్ని పాటలోనే చూసుకుంటూ తన గొంతులోంచి ఇంద్రధనుస్సు రాగాన్ని పలికించాడు.


కొత్తగూడెం కీర్తి పతాకం
ఇరవై మూడేళ్లుగా నిర్వహిస్తోన్న బాలల పండుగ బాలోత్సవ్‌. 2014 జాతీయ స్థాయిలో ముస్తాబై అంబరాన్ని దాటి సంబరాలను జరుపుకొంది.
మూడు రోజులపాటు సాగిన ఈ ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు దిల్లీ, కర్ణాటక, ఛŸత్తీస్‌గఢ్‌ల పిల్లలూ పాల్గొన్నారు.
      పిల్లల్లో మనో వికాసం భాషా వికాసంతో ముడిపడి ఉందన్న ప్రాథ]మిక అంశం బాలోత్సవ్‌ నిర్వహించిన వివిధ పోటీల్లో కనిపించింది. పోటీల్లో చిత్రలేఖనం, నాటికా విశ్లేషణ, తెలుగు మాట్లాడుదాం, లఘుచిత్ర సమీక్ష, గీతాలాపన, కవితా రచన, కథా విశ్లేషణ, నీతి పద్యాలు, దాశరథి కవితలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు నిర్వహించారు. 
      మూడు రోజులపాటూ సాగిన ఈ ఉత్సవంలో దాసరి అమరేంద్ర, అందెశ్రీ, వాసిరెడ్డి నవీన్, శాంతారావు, దేవి, చంద్రలత, వై.వి.లక్ష్మి, అజయ్‌ శ్రీనివాస్, పాటిబండ్ల ఆనందరావు, సరస్వతీ అప్పలరాజు, ఏలె లక్ష్మణ్, కార్టూనిస్ట్‌ శంకర్, గొల్లపిండి నాగరాజు వంటి సాహితీ సేవకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.


అక్షర చందనమూ.. నర్తన శిల్పమూ..
పాల్వంచ నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌కి చెందిన చందనా శిల్ప వరసగా మూడో ఏడాది కూడా బాలోత్సవ్‌లో బహుమతులు అందుకుంది. ఈ ఏడాది కథా రచనలో ప్రథమ బహుమతీ, భరత నాట్యంలో తృతీయ బహుమతీ అందుకుని పెద్దల మెప్పు పొందింది. కథా రచన సీనియర్స్‌ విభాగంలో టీవీల్లో వచ్చే ప్రకటనల నేపథ్యంతో రాసిన ‘త్వరగా మేలుకుందాం’ అనే కథ న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. షేక్స్‌పియర్, రావూరి భరద్వాజ తన అభిమాన రచయితలంటూ మానవతా విలువలున్న కథలు రాస్తాననీ, బాలోత్సవ్‌ వల్ల పిల్లల శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుస్తాయనీ చెబుతోంది చందన.


      రంగుల్లో లేత చిరునవ్వుల్ని పులుముతూ చిట్టి చిట్టి చేతులు కాగితాల మీద వేసిన బొమ్మలు బాలోత్సవంలో హంగామా చేశాయి. పల్లెల్లో ఉన్న రకరకాల ఆటపాటలను బొమ్మల్లో చక్కగా చూపించారు. ఇక జానపద నృత్యాలు జరిగే చోట కొన్ని వేల హరివిల్లులు ఒక వేదికగా ఒదిగాయేమో అనిపించింది. విచిత్ర వేషధారణలు సభికులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి.
నాటకాలు అదరహో... 
‘రెండు రాజ్యాలు.. రెండు దారులు’ అనే నాటిక పిల్లలకు చూపించి వాళ్లకు కలిగిన ఆలోచనలను రాయమన్నారు. అలాగే సామాజిక ఇతివృత్తాలతో నాటక ప్రదర్శనలను పోటీలో వేయించారు. ఇరవై నిమిషాలపాటు నాటకంలో సంభాషణలు చెప్పాలి చూడకుండా. ధారణ, వాచకం, ఉచ్చరణ, సంభాషణా సమయ సంయమనం ఇలాంటి భాషాంశాలు నేర్పడానికి ఇదే సరైన మాధ్యమం అంటే కాదనగలరా? 


తొలిసారిగా పేరిణి బాల తాండవం..
యోధుల నృత్యంగా చెప్పుకొనే పేరిణి నృత్యాన్ని ఈ ఏడాది కొత్తగా పోటీల్లో జతచేశారు. సుమారు ఏడువందల సంవత్సరాల కిందట కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్లేముందు యోధులు శివుని ఎదుట భక్తితో నర్తించేవారట. ఈ నృత్యంతో శివుణ్ని ఆవాహన చేసుకోవచ్చని నమ్మిక. కాకతీయుల తరవాత ఈ శివ నివేదనా నృత్య కళ కనుమరుగైపోయింది. ఈ బాలోత్సవ్‌ వేడుకల్లో అంతరించిపోతున్న ఈ కళను పునరుద్ధరించిన ఆంధ్ర నాట్య పితామహుడు ఆచార్య నటరాజ రామకృష్ణ కృషిని న్యాయ నిర్ణేతలు పిల్లలకు వివరించారు. ఈ పోటీల్లో సూర్యాపేట సిటీ టాలెంట్‌ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న డి.వినయ్‌ ప్రథమ బహుమతి సాధించాడు. ద్వితీయ, తృతీయ బహుమతులు ఖమ్మం లోటస్‌ పాఠశాల అయిదో తరగతి విద్యార్థి వి.మోక్షదత్త, త్రివేణి పాఠశాలకు చెందిన వరుణ్‌ పొందారు.


      ‘నారు వేసింది’ అన్న నాటకమైతే ఆద్యంతం తెలంగాణ మాండలికంలో నడిచి హోరెత్తించింది. ఇందులో నలుగురు పిల్లల తండ్రిగా తోటకూర వేణు అనే కుర్రాడి నటన విమర్శకుల మన్ననలందుకుంది. అలాగే ‘సన్మానం’ హాస్య నాటకంలో ఏ.శ్రీకాంత్‌ హావభావాలకు సభా ప్రాంగణంలో నవ్వులు విరబూశాయి. నూజివీడు, కుమార్‌ హైస్కూల్‌ పిల్లల ‘పిల్లీ వచ్చే ఎలుకా భద్రం’ నాటిక స్త్రీ విద్య మీదా, శిశు హత్యల మీద పదునైన సంభాషణలతో ఉత్తమ నాటిక అనిపించుకుంది. ఇదే కోవలో ఆడపిల్లగా పుట్టడం తప్పా, హుకుం నాటికలున్నాయి. ‘బచ్‌పన్‌ బచావ్‌’ అంటూ నినాదమిచ్చిన నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి జీవితాన్ని కోదాడ, తేజ టాలెంట్‌ స్కూల్‌ పిల్లలు ఆసక్తికరమైన నాటకంగా మలచి ప్రదర్శించారు. పాల్వంచ, నవభారత్‌ స్కూల్‌ విద్యార్థులు ‘బాలవసంతం’ నాటికలో పిల్లలు ప్రకృతి వేరువేరు కాదంటూ, మనిషిలోని కర్కశత్వం పోతేగానీ వసంతం రాదంటూ చక్కటి సంభాషణలతో ప్రదర్శన ఆహ్లాదకరంగా అందించారు. అలాగే కనువిప్పు, నిమజ్జనం నాటికలు పలువురి మన్ననలు పొందాయి. విశాఖపట్నం నుంచి జి.వి.ఎన్‌.ఎమ్‌.సి.హెచ్‌.స్కూల్‌ విద్యార్థుల నాటిక ‘సీరియల్‌ కుక్క’ ప్రథమ బహుమతి గెలుచుకుంది.


రచయితనవుతా...
ఒకటో తరగతిలో ఉన్న ప్పటి నుంచీ పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. మాగ్జిం గోర్కీ ‘అమ్మ’ నాకిష్టం.
ప్రకటనల పట్ల మోజు అన్న అంశం మీద నేను రాసిన కథకు కథా రచనలో మూడో బహుమతి లభించింది. వస్తువులపట్ల మోజు ఉండటం మానవ సహజమే కానీ అది హద్దులు దాటినప్పుడు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నేను కథలో వివరించాను. ప్రయత్నిస్తే కథ రాయడం మరీ అంత కష్టం కాదు. ఇద్దరి మధ్య జరిగే సంభాషణని కూడా చక్కటి కథగా మార్చవచ్చు. పుస్తకాలు చదవడం, కథలు రాయడం, ఆటలాడటం... ఇవన్నీ చదువుకు ఏమాత్రం ఆటంకం కలిగించవు. అందుకే నేను ఎప్పుడూ క్లాస్‌లో మొదటి శ్రేణిలో పాసవుతుంటాను.
మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు, అమ్మేమో కూలిపనులకు వెళ్తుంది. అందుకే బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకో వాలనుకుంటున్నాను. మంచి రచయితగానూ పేరు తెచ్చుకోవాలని ఉంది.

- ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వోన్నత పాఠశాల, పదో తరగతి, కొమ్ముగూడెం


కథలు రాసిన చిన్నారి కలాలు
ఒక విజయం అనేది నైతిక విలువలతో కూడినదైతేనే గొప్పది.. నైతికత లేని విజయం మీద మన స్పందన ఎలా ఉంటుంది?.. ఇలాంటి ప్రశ్నకు ప్రతీకగా క్విజ్‌ మాస్టర్‌ అనే కథను పిల్లలకు ఇచ్చి విశ్లేషించమన్నారు న్యాయ నిర్ణేతలు. మూడు వందలమంది పిల్లల్లో అధిక శాతం ఆ కథను చక్కగా విశ్లేషించారు. కథా విశ్లేషణ పిల్లల్లో ఆలోచనా దృక్పథాన్ని ప్రభావితం చేస్తుందనటంలో సందేహం లేదు.
      ఇక కథా రచనలో సీనియర్స్‌కి చేతి వృత్తుల వాళ్ల జీవితాలగురించీ లేదా వస్తువుల పట్ల మోజు గురించిగానీ కథ రాయమన్నారు. జూనియర్స్‌కి మనిషికీ చెట్లకీ ఉన్న సంబంధం గురించిగానీ, పిల్లలు చెయ్యాల్సిన పనుల గురించి గానీ కథ రాయమన్నారు. కథ రాయడానికి కావాల్సిన వాతావరణాన్ని పిల్లలకు చక్కగా అందించారు నిర్వాహకులు. అలాగే రాయాల్సిన కథాంశాలపై పిల్లల్లో సరైన అవగాహన వచ్చేందుకు వాళ్లతో కాసేపు ముచ్చటించడం కూడా ఒక మంచి ఆలోచన. ఖమ్మం, ఆర్‌.ఆర్‌.హెచ్‌ స్కూల్‌ విద్యార్థి సాయి శరత్‌ తన ‘అసలైన కానుక’ కథలో చేనేత కార్మికుల జీవితాలను ఆవిష్కరిస్తూ, తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చిత్రించాడు. ఇలాంటి కార్యక్రమాల వల్లే పిల్లల్లో భాషా సాహిత్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.


వెలుగు నేనే... 
తెలుగు నేనే

తెలంగాణ కవిత్వానికి కోటి రతనాల బాట పరచిన దాశరథి కవిత్వం కూడా ఈసారి బాలోత్సవ్‌లో భాగమైంది. దాశరథి భావ తీవ్రతను పలికించేందుకు సాహసించే చిన్నారులెవరుంటారా అని వేచి చూస్తే... దాదాపు వంద మంది చిన్నారులు తమ గొంతులు సవరించుకున్నారు. 
కొత్తగూడెంలోని త్రివేణి టాలెంట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న జి.రాఘవేంద్ర కౌశిక్‌ ఇందులో ద్వితీయ బహుమతిని అందుకున్నాడు. ఆ చల్లని సముద్ర గర్భం/ దాచిన బడబానలమెంతో? / ఆ నల్లని ఆకాశంలో/ కానరాని భానువులెందరో?... అంటూ దాశరథి అగ్నిధారలోని కవితను రాగయుక్తంగా పాడాడు కౌశిక్‌. తనకి అయిదేళ్ల నుంచే శ్లోకాలన్నా, పద్యాలన్నా ఇష్టమనీ చెబుతున్నాడు. ఒక పక్క శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తూనే, అమ్మానాన్నల దగ్గర మంచి మంచి కవితలనీ, శ్లోకాలనీ నేర్చుకుంటున్నాడు. తనకు దాశరథి అన్నా, ఆయన రాసిన అగ్నిధారన్నా ఎంతో ఇష్టమట. అందులోనూ తను ఎంచుకున్న కవిత రాగయుక్తంగా పాడేందుకు ఎంతో అనువుగా ఉంటుందన్నది కౌశిక్‌ మాట.


బ్రహ్మాండమైన అర్మాన్‌ కథనం
కొత్తగూడెం, ఇ.కె.విద్యాలయం బుడతడు ఎం.డి.అర్మాన్‌ అనగనగా కథ చెబుతా.. వింటారా? అంటూ బాలోత్సవ్‌ని హుషారెత్తించాడు. తన ముద్దు ముద్దు మాటలతో వినాయకుడు- మూషిక రాజు కథను ఏమాత్రం తడబాటు లేకుండా చక్కటి వ్యక్తీకరణలతో చెప్పి ఆకట్టుకున్నాడు. ‘ఒక రోజు వినాయకుడి మీద ఎలుక కోపంగా ఉంటుందట.. ఎందుకూ అని అడిగితే, నీ ఇద్దరి సోదరులదగ్గర ఉన్న నెమలినీ పులినీ జాతీయ పక్షిగానూ, జాతీయ జంతువుగానూ చేశావు. అందరికీ అవి గుర్తుంటాయి.. మరి నాకేంచేశావూ అంటుందట. అప్పుడు వినాయకుడు నవ్వి కలియుగంలో అందరూ నిన్నే స్మరించేలా చేస్తానని చెప్పి కంప్యూటర్‌కి ఉండే ‘మౌస్‌’గా మార్చేశాడంట..!’ అంటూ ఇంట్లో తాతయ్య చెప్పిన కథను వేదికనెక్కి తిరిగి పొల్లుపోకుండా భావయుక్తంగా చెప్పడంలో అర్మాన్‌ ఆత్మస్థైర్యానికి వీక్షకులు ముగ్ధులయ్యారు.


నా ఉచ్ఛ్వాసా నిశ్వాసా బాలోత్సవే..!
రెండు దశాబ్దాలుగా బాలోత్సవ్‌ నిర్వహిస్తున్నాం. ఇది మా ఊరి పండుగగా భావిస్తున్నాం. కొత్తగూడెంలో ప్రజల ప్రేమని భారత దేశమంతా పంచాలన్న తలంపుతో ఈసారి రాష్ట్ర స్థాయిని అధిగమించి ఉత్సవాలు నిర్వహించాం. అమోఘమైన స్పందన లభించింది. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా రమారమి ఇరవై వేలమంది పిల్లలు ఇక్కడికి వచ్చారంటే, అంతకన్నా నాకింకేంకావాలి. పుట్టిన గడ్డకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనన్న తపనలోంచి వచ్చిందే ఈ బాలోత్సవ్‌. ఈ కార్యక్రమ నిర్వహణలో ఎంతోమంది శ్రమించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. బాలోత్సవానికి వచ్చిన పిల్లలంతా వాళ్లిళ్లకు వెళ్లిపోతున్నపుడు మనసంతా ఓ రకమైన బాధ. మళ్లీ ఎప్పుడొస్తారు. ఇంతమందిని మళ్లీ ఎప్పుడు చూస్తానని. ఎందుకంటే నా ఉచ్ఛ్వాసా నిశ్వాసా బాలోత్సవే..!

- డా।। వాసిరెడ్డి రమేష్‌ బాబు, కొత్తగూడెం క్లబ్, బాలోత్సవ్‌ నిర్వాహకులు


పసి పలుకుల్లో తీయని తెలుగుదనం
తెలుగు మాట్లాడుదాం.. పోటీలో అయిదు వందలమందికి పైగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పద్యాల గురించీ, పరిశుభ్రత గురించీ, అమ్మ గురించీ మూడేసి నిమిషాలు కమ్మగా మాట్లాడారు.. పాటల పోటీల్లోనూ, వాద్య విన్యాసాల్లోనూ కృతులూ, కీర్తనలూ, జావళీలూ తేనెలూరించాయి. రఘువంశ సుధాంబుధి చంద్ర.. అంటూ కదనకుతూహల రాగాలు కాళ్లకు బంధాలేశాయి. జానపద గీతాలైతే ఈ చలి కాలానికి సరిపడా వేడి పుట్టించాయి. ఇంకా ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై/ యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌.. అంటూ ఏనుగు లక్ష్మణకవి నీతి పద్యాన్ని కె.సాయికిరణ్‌ శ్రావ్యంగా ఆలపించడం ఆకట్టుకుంది. ఖగేంద్ర అనే పిల్లాడు భోజన విరామంలో కూడా మైక్‌ దొరికిందే తడవుగా కాఫీ దండకం, ఉల్లిపాయ దండకం చెప్పి శభాష్‌ అనిపించుకున్నాడు.
2014లోనే కొత్తగా మట్టితో బొమ్మలు చెయ్యమంటూ పోటీ పెట్టారు. కొత్తగూడెంకి చెందిన మేఘశ్యామ్‌ కాకతీయుల తోరణాన్ని తయారుచేసి ఔరా! అనిపించుకున్నాడు. భూతా పాన్ని నిరసిస్తూ వికాస్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ విద్యార్థి నిఖిల్‌ సందేశాత్మక ప్రతిమను తయారు చేశాడు. బాలోత్సవ్‌లో కనుచూపు మేరలో పిల్లల అద్భుత విన్యాసాలు మరో ప్రపంచాన్ని నిర్మించాయి.


అబ్బురపరచిన పిల్లల కథా విశ్లేషణలు
బాలోత్సవ్‌లో నిర్వహించిన కథా విశ్లేషణ అంశంలో పిల్లలకు ‘క్విజ్‌ మాస్టర్‌’ కథను ఇచ్చాం. ఓ గంటలో దానిని క్షుణ్నంగా చదివి విశ్లేషణ రాయమన్నాం. గతంలో ఆ కథను ఓ నాలుగుసార్లు చదివాను. ఆ కథ మీద నా అభిప్రాయాలూ విశ్లేషణలూ నాలో ఉన్నాయి. అయితే కొందరు పిల్లలు రాసిన విశ్లేషణల్లో అంశాలు నా ఊహకి రానివి కూడా ఉన్నాయి. వాళ్ల నిశిత పరిశీలనకు అబ్బురపడ్డాను. అలాగే కథా రచన అంశంలో పాల్గొన్న పిల్లల్లో కనీసం ఒకరిద్దరైనా భవిష్యత్తులో మంచి రచయితలు అవుతారన్న నమ్మకం నాకుంది. వాళ్లు రాసే కథలో చక్కని శైలిని కూడా ప్రదర్శించారు. తెలుగు భాషతో ఎంతో ఇష్టంతో కుస్తీ పట్టారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. బాలోత్సవ్‌లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల పిల్లల్లో మానసిక చైతన్యం పెరుగుతుంది.

- దాసరి అమరేంద్ర, కథా రచయిత, పర్యావరణవాది


సానుకూల దృక్పథానికి దగ్గరిదారి
బాలోత్సవ్‌లో అంశాలన్నీ సృజనాత్మకతను వెలికితీసేవే. లఘుచిత్ర సమీక్షలో దాదాపు 300మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సినిమా మాధ్యమం సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో పిల్లలకు ముందు కాసేపు వివరించాం. తర్వాత రెండు లఘుచిత్రాలను ప్రదర్శించి సమీక్ష రాయమని అడిగాం. కథా విశ్లేషణ, నాటికా విశ్లేషణలకంటే ఫిల్మ్‌ ఎనాలసిస్‌ కొంచెం కష్టమే. ఇందులో విశ్లేషణ, విమర్శ, సృజన మూడూ కనబరచాలి. విజేతలెవరు? బహుమతులేంటీ అన్న విషయాలను పక్కనపెడితే, బాలోత్సవ్‌లో పాల్గొనడానికి పిల్లలు, గురువులు, తల్లిదండ్రులు కలిసి సృజనే పరమావధిగా చేసిన సమష్టి సాధ]నే బాలోత్సవ్‌ నిర్వహణ ఉద్దేశం. ఇరవై వేలమంది పిల్లలతో ఇదొక నిశ్శబ్ద సృజన విప్లవంలా అనిపించింది.

- చంద్రలత, రచయిత్రి


 


వెనక్కి ...

మీ అభిప్రాయం