గుడు గుడు గుంచం... గుండే రాగం!

  • 161 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రాయప్రోలు సుబ్బలక్ష్మి

  • సికింద్రాబాదు.
  • 4027758608
రాయప్రోలు సుబ్బలక్ష్మి

అమ్మలందరూ అష్టాచెమ్మా... అమ్మాయిలేమో తొక్కుడుబిళ్ల... ఇక అబ్బాయిలు కోతికొమ్మచ్చి... ఎవరికిష్టమైన ఆట వాళ్లాడుకునేవాళ్లు. ఆడుతూ పాడేవాళ్లు. పాడుతూ ఆడేవాళ్లు. కలుపుగోలుతనాన్ని పెంచే ఆ అచ్చతెలుగు ఆటలిప్పుడు అదృశ్యమవుతున్నాయి. వాటితో పాటే మనదైన సాంస్కృతిక సంపదా మాయమవుతోంది.
పెరిగిన ఆధునికత
మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. తెలుగు సంస్కృతిని చాటి చెప్పే కట్టూ, బొట్టూ, భాషల్లో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. ఆటల విషయంలో కూడా అంతే... మన చిన్నప్పుడు ఎన్ని ఆటలుండేవనీ... ఇప్పటికీ మైదానాల్లో ఆడేటటువంటివి బాగానే ఉన్నా మిగతావన్నీ నెమ్మది నెమ్మదిగా కనుమరుగు అవుతున్నాయి. మార్కుల పుణ్యమాని పిల్లలెంతసేపూ పుస్తకాలతో కుస్తీపట్టి అలసిపోతున్నారు. టీవీ, వీడియో గేముల్లాంటి వాటితో నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు. దాంతో శరీరానికి వ్యాయామం అందదు. సరికదా ఆరోగ్య సమస్యలూ వస్తున్నాయి. వీటినుంచి బయటపడాలంటే మన పిల్లలకీ మన ఆటల్ని అలవాటు చేద్దాం. వాటివల్ల కలిగే ప్రయోజనాల్ని అర్థమయ్యేలా చెప్పి పాతతరం తెలుగు ఆటల్ని మనమే నేర్పిద్దాం. అందుకోసం.... కాస్త వెనక్కి వెళ్దాం... రెండు మూడు దశాబ్దాల కిందటి తెలుగు సమాజాన్ని జ్ఞప్తికి తెచ్చుకుందాం. 
      తెల్లారగట్లే లేచిన ఆడవాళ్లు ఇంటెడు పనినీ పదయ్యేసరికల్లా కానిచ్చేసేవాళ్లు. కాలక్షేపం కోసం అరుగుల మీదకు చేరేవాళ్లు. అలా అనీ ఉత్తినే కూర్చోరు... వత్తుల కోసం పత్తి వలవడం, చింతపండు నుంచి గింజలు వేరుచేసే పనులు పెట్టుకుంటారు. ఎవరెక్కువ గింజలు తీస్తారా అని పందేలు వేసుకుని మరీ తీసేవాళ్లు. ఆ చింతపిక్కల్ని కడిగి, తుడిచి కాసేపు ఎండలో వేస్తే ఇక వాటితో ఎన్ని రకాలుగా ఆడేసుకోవచ్చో!
      ‘ఏం వదినా అన్నయ్యేమంటున్నారు?’ అని ఒకరంటే... ‘ఆఁ ఏమంటారు! చీర కొనమంటే వచ్చేనెల చూద్దాంలే అని దాటేస్తున్నారు’ లాంటి మాటలతో ఆట మొదలయ్యేది. కొన్ని పిక్కలు కుప్పగా పోసి ఒక పిక్క చేతితో మీదకెగిరేసి... కుప్పలో పిక్కలు కదలకుండా ఒక్కొక్క పిక్కా బయటకు లాగేసేవాళ్లు. అలా కుప్ప కదలకుండా ఎవరెన్ని పిక్కలు తీయగలిగితే వాళ్లు గెలిచినట్లు.
      సాయంత్రమైతే చాలు పిల్లల గోల మొదలయ్యేది. ఇక సెలవల్లో చెప్పక్కర్లేదు! అబ్బాయిలందరూ కర్రాబిళ్ల, కోతి కొమ్మచ్చి అంటూ చెట్ల దగ్గర చేరేవాళ్లు. అమ్మాయిలు ఓ అరుగునో, ఇంటి వసారానో ఎంచుకునేవాళ్లు. డబ్బాలో దాచిపెట్టుకున్న చింతపిక్కలు ఒకరు తెస్తే చాలు ఆటకు హద్దుండేది కాదు. ఒక పిక్క, రెండు పిక్కలు, మూడు పిక్కలు... ఇలా పది పిక్కల వరకూ కుప్పలుగా పెట్టేవాళ్లు. ఒక పిక్కని పైకెగిరేసి, అది తిరిగి చేతిలోకి వచ్చేలోపే కిందనున్న పిక్కల్ని పట్టుకోవాలన్నది పందెం. అలా ఎగిరేసి పట్టుకునే సమయంలో...
      ఒకటీ ఓ చెలియా/ రెండూ రోకళ్లూ/ మూడూ ముచ్చిలకా/ నాలుగు నందన్నా/ ఐదూ చిట్టిగొలుసూ/ ఆరూ జువ్వాజి/ ఏడూ ఎలమంద/ ఎనిమిది ఏతాము/ తొమ్మిది తోకుచ్చు/ పది పట్టెడ అంటూ వరుసగా పదిపిక్కల వరకూ ఒక్కోదాన్ని పైకెగిరేసేవాళ్లు. దాన్ని మళ్లీ పట్టుకునేలోపు... కింద ఉన్న పిక్కల కుప్పల్ని పట్టి పక్కనపెట్టేవాళ్లు. ఎగిరేసిన పిక్క కింద పడిందో ఓడిపోయినట్టే! 
      మరో ఆట... నాలుగు పిక్కల్ని పుంజి అంటారు. రెండు పుంజీలు ఓ కచ్చటం, ఐదు కచ్చటాలేమో గుర్రం, ఐదు గుర్రాలు కలిపితే ఓ ఏనుగు. ఎవరెక్కువ ఏనుగుల్ని చేస్తే వాళ్లు గెలిచినట్టు. దీనికి చింత పిక్కల్ని కుప్పగా పోయాలి. ఒక పిక్కని ఎగిరేసి పట్టుకునేలోగా నాలుగు పిక్కలు కుప్పలోంచి వేరుచెయ్యాలి. అప్పుడు ఓ పుంజి అవుతుంది. ఇలా పై పిక్కని పట్టుకోలేనంత వరకూ ఆట సాగుతుంది. 
వహ్వా... వామనగుంత!
ఇద్దరు మాత్రమే ఆడే ఈ ఆట చాలా సరదాగా ఉంటుంది. ఒక చెక్క పీటకి రెండు వైపులా... అంటే ఎదురెదురుగా 5 లేదా 6 గుంతలుంటాయి. ముందుగా ఆ గుంతల్లో నాలుగేసి పిక్కలు పెట్టాలి. పంటలు వేసుకుని ఆట ఎవరు ప్రారంభించాలో నిర్ణయించుకున్నాక... మొదటి గుంతలోని పిక్కల్ని తీసి మిగతా గుంతల్లో వేయాలి. తర్వాత అయిదో గుంతలోని పిక్కల్ని పక్క గుంతల్లో ఒక్కొక్కటి చొప్పున వెయ్యాలి. అలా అన్ని పిక్కలూ అయ్యాక ఒక గుంత ఖాళీ అవుతుంది. దాన్ని వేళ్లతో రాసి ఆ పక్క గుంతలో ఉన్న పిక్కల్ని తీసుకుని మళ్లీ ఆట మొదలెట్టాలి. అలా పిక్కలు వేసుకుంటూ వెళ్లేటప్పుడు ఖాళీ గుంత రాకపోతే వాళ్లు ఓడిపోయినట్లే.
తొక్కుడు బిళ్ల
ఆనాటి అమ్మాయిలకెంతో ఇష్టమైన ఆట ఇది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట కనిపిస్తుంటుంది. ఇద్దరు ఆడతారు. నాలుగు నిలువు, రెండు అడ్డం దీర్ఘ చతురస్రాకారంలో గడుల్ని గియ్యాలి. గడుల బయటే ఇద్దరూ నిల్చోవాలి. ముందుగా ఒకరు చేతిలో బిళ్లను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటికి తీసుకురావాలి. తరువాత రెండో గడి, మళ్లీ 3,4,5,6,7,8 గడుల్ని దాటిస్తూ... కాలు, బిళ్ల గడుల గీతల్ని తాకకుండా జాగ్రత్త పడాలి. గడులన్నీ దాటేశాక కాలి వేళ్లతో బిళ్లను పట్టుకుని కుంటి కాలితో ఆ గడులన్నీ గెంతుతూ బయటకు వచ్చేయాలి. అలాగే కాలి మడం మీద, తలమీద, అరచేతిలో, మోచేతిమీద, భుజాలపై కూడా పెట్టుకుని గెంతాలి. అన్నీ అయిపోయాక బిళ్లను గడుల బయలకు విసిరి కళ్లు మూసుకుని అన్ని గడుల్ని దాటాలి. మధ్యలో గడుల గీతని తొక్క కూడదు. అలా ఆడితేనే గెలుపొందినట్లు. ఒంటికెంత వ్యాయామమో!
గుడు గుడు గుంచం...
పిల్లలందరూ గుండ్రంగా బాసింపట్టు వేసుక్కూర్చుంటారు. అర చేతుల్ని పిడికిలి చుట్టి నేలమీద ఒకరి చేతిమీదొకరు పెడతారు. ఆ పిడికిలి మధ్యనున్న ఖాళీలో ఒకరు వేలు పెట్టి తిప్పుతూ... గుడు గుడు గుంచం, గుండే రాగం, పాముల పట్నం, పడగే రాగం, అత్తా చెవిలో ముత్యాలు పోస్తే వేణ్నీల్లా చన్నీళ్లా అని అడుగుతారు. వేణ్నీళ్లు అన్న వాళ్ల చేతిమీద గట్టిగా, చన్నీళ్లు అంటే మెల్లగా గిల్లాలి. ఈ పాటలోని ‘అత్త చెవిలో ముత్యాలు పొయ్యడ’మంటే పుట్టింటికొచ్చిన మేనత్తని ఆదరించాలనడం. 
      ఉత్తరాంధ్రలో ఇదే ఆట కాస్త భిన్నంగా సాగుతుంది. ఇక్కడ పాట అనంతరం ఆట వస్తుంది. పాట కూడా కాస్త మారుతుంది. గుడుగుడు గుంచం, గుండే రాగం, పాముల పట్నం, పటికా బెల్లం, తాతా తాతా నీ పెళ్లెప్పుడూ... రేపు గాక ఎల్లుండి. పెదనాన్న గుర్రం పెళ్లికి పోయె, చిన్నాన్న గుర్రం ఛుట్టికి పోయె, నా చేతులేమో పిల్లెత్తుకు పోయే అంటూ అందరూ చేతుల్ని వెనక్కి పెట్టేసుకుంటారు. తరువాత కొన్ని ప్రశ్నలుంటాయి. మొదటి పిల్లాడితో అవి మొదలవుతాయి. ఆ ప్రశ్నలు... వాటికి ఆ పిల్లలిచ్చే సమాధానాలు... 
నీ చేతులేవి - పిల్లెత్తుకుపోయింది
పిల్లినెక్కడి వరకూ తరిమావ్‌ - గోల్కొండ వరకూ
గోల్కొండేమిచ్చింది - గవ్విచ్చింది
గవ్వేంచేసావ్‌ - గోతిలో కప్పెట్టాను
గొయ్యేమిచ్చింది - గడ్డిచ్చింది
గడ్డేం చేశావ్‌ - ఆవుకి వేశాను
ఆవేమిచ్చింది - పాలిచ్చింది
పాలేంచేశావ్‌ - అమ్మకిచ్చాను
అమ్మేమిచ్చింది - జున్నిచ్చింది
జున్నేం చేశావ్‌ - నాన్న కిచ్చాను
నాన్నేమిచ్చారు - రూపాయిచ్చారు
రూపాయేం చేశావ్‌ - పంతులుగారికిచ్చా
పంతులేం చేశారు - చదువూ చెప్పే
చదివేం చేశావ్‌ - మామాకిచ్చే
మామేమిచ్చాడు - పిల్లానిచ్చే... పిల్లా పేరు మల్లే మొగ్గా, నాపేర్‌ జమిందార్‌ 

      చివరి సమాధానం పూర్తవడంతో ఆ కుర్రాడు పరిగెత్తుతాడు. అతణ్ని పట్టుకోవడానికి మిగిలిన వాళ్లు వెంటపడతారు. ఎవరైతే పట్టుకుంటారో వాళ్లే విజేత.
బయట ఆడుకోవడానికి ఎన్ని ఆటలో!
సాయంత్రమైతే బడి నుంచి పిల్లలంతా వచ్చేస్తారు. ఇచ్చింది తిని ఇంటి పట్టునుండవా! అని అమ్మకేకలేస్తున్నా వీధిలోకి ఒకటే పరుగు... ఆ తర్వాత ఎన్ని ఆటలో, ఎంత సందడో...! వాటిలో ఆడపిల్లలకు ప్రత్యేకమైన ఆట...
      ఒప్పుల కుప్పా, వయ్యారి భామ, సన్న బియ్యం, చాయపప్పు, గూట్లో రూపాయ్, నీ మొగుడు సిపాయ్‌ అంటూ స్నేహితురాలిని వేళాకోళమాడి - ఆమె దెబ్బకు అందకుండా పరుగందుకొంటారు కొందరు! దీన్నే దాగుడుమూతలాటగా కూడా ఆడతారు. ముందు పాట పాడి తర్వాత పరుగెత్తి దాక్కుంటారు. ఆ పాట... 
      ఒప్పులకుప్పా వయ్యారి భామ
      మినపా పప్పూ మెంతీ పిండి
      తాటీ బెల్లం తవ్వెడు నేయి
      గుప్పెడు తింటే కులుకూలాడి
      నడుమ గట్టె నామాట చిట్టీ
      దూదూ పుల్ల దురాయ్‌ పుల్ల
      చూడకుండా జాడా తీయ్‌
      ఊదకుండా పుల్లాతీయ్‌
      దాగుడుమూతా దండాకోర్‌
      పిల్లీ వచ్చే ఎలుకా భద్రం

ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ 
ఇలాంటిదే ఇంకో ఆటుంది. ముందుగా ఒకరు కాస్త ఎత్తులో కూర్చుంటే వాళ్లకి కాస్త దిగువ మరొకరు కూర్చుంటారు. ముందున్న వాళ్ల కళ్లని ఎత్తులో ఉన్నోళ్లు ఓ చేత్తో మూస్తారు. రెండో చేత్తో వాళ్ల చెయ్యి పట్టుకుని వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి అని ఎదురుగా నిల్చున్న పిల్లల చేతికి తాకిస్తారు. సరైన పేరు చెబితే ఆ పేరు వాళ్లు కళ్లు మూయించుకోవాలి. చెప్పలేక పోతే... ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌ సాంబారు బుడ్డి/ గప్‌ చుప్‌ గులాబ్‌ జామ్‌’ అంటూ వాళ్లను దాక్కోమంటారు. కళ్లమీది నుంచి చేతులు తియ్యగానే అందర్నీ వెతికి పట్టుకోవాలి. ముందుగా ఎవరైతే దొరుకుతారో వాళ్లే దొంగ.
కోతి కొమ్మచ్చి
ఈ ఆట కోసం వృత్తాకారంలో ఓ గీత గీస్తారు. దాన్నే గిరి అంటారు. ఒకరు ఓ కర్రను ఆ గిరిలో నిల్చొని బయటికి విసరాలి. దొంగగా ఉన్నవాళ్లు ఆ కర్రను తీసుకొచ్చి ఆ గిరిలో ఉంచాలి. తర్వాత పక్కనున్న వాళ్లని ముట్టుకోవాలి. వాళ్లేమో అతనికి దొరక్కుండా చెట్లెక్కేస్తారు. ఒకవేళ కిందున్నప్పుడే దొంగ వాళ్లని తాకగలిగితే వాళ్లు దొంగవుతారు. గిరిలోని కర్రను పొరపాటుగా తొక్కినా ‘దొంగ’ అవ్వాల్సిందే. 
ఎలా ఆడాలో తెలుసా?
‘హంశవింశతి’ కృతికర్త అయ్యలరాజు నారాయణకవి రెండు సీస పద్యాల్లో ఎన్నో అచ్చతెలుగు ఆటలను గుదిగుచ్చారు. అయితే... వాటిలో చాలా ఆటలు ఇప్పుడు కనిపించట్లేదు. ఓ ఆట కనుమరుగు అయిందంటే... దాంతో పాటే, దానికి సంబంధించిన పదజాలమూ మన అమ్మభాష నుంచి అదృశ్యమైపోతుంది. ఈ కోణంలో చూస్తే ఇన్నేళ్లలో మనం ఎన్ని అందమైన తెలుగు పదాలను పోగొట్టుకున్నామో! 
      అందుకే ఆ ఆటల గురించి మీకు తెలిస్తే... ఏ ఆటను ఎంత మంది ఆడవచ్చు, నిబంధనలు ఏంటి, ఆ ఆటకు సంబంధించిన ప్రత్యేక పదజాలం తదితర వివరాలతో చిరువ్యాసాలను ‘తెలుగువెలుగు’కు పంపవచ్చు. ఇంతకూ ఆ ఆటలేంటంటే... . 
      దూచి జాబిల్లి, బూచికన్నుల కచ్చి, కుందెన గురి, చీజటి మొట్టికాయ, చింతాకు చుణుచులు, చిట్లపొట్లకాయ, తూరనడుక్కాలు, తూనీగతానీగ, చిడుగుడు మొకమాట, చిల్లకట్టె, తనుబిల్ల యాలాకి, గుప్పిటి గురిగింజ, కొండకోతి, చిక్కణబిళ్ల, జెల్లము గొడుగు, బిళ్లబిద్య, లక్కిబిక్కి దండ, గడ్డెనబోడి, ఒక్కసికొక్కు, బరిగాయ పోటు, గీరనగింజ, పెంచుల బేరి, సరిబేసి, పుటచెండ్లు, చాకిమూట, గోటగొర్లుడు కాయ, నీగపోగిస, బంతిదూగిల, వేలుబొట్టగ, సిరిసింగన్న వత్తి, చిందు పరుపు, కిర్రుగానుగ త్రిప్పుళ్లు, గుర్రపెక్కుడు, మట్టిగూళ్లుసూళ్లు, కాలికంచం, కట్టెగుర్రం, వినాయకు తిరితూనె,  చెమటతాయెత్తు, రామన్నాట, పొడుగుళ్లు, బండ్లికలు, చొప్పబెండ్లు, గసికె కుండలు, ఈనెగాజులు, పోతుటిసె గుర్రాలు, నట్టకోతి, దంటుకిన్నెర, మట్టిగంటి పోట్లాటలు, సింగన్న దాటులు, జిరుకు రాతిదాబాటలు, మంచితాటాకు, చక్రచక్రాల త్రిప్పుడు, తొచిగాయ, పదుపుపాడు, పాతరమాళ్లు పాతరలు, చిర్రుబుర్రులు, ఆకుపీకెలు, చండ్రలాటలు, చుండ్రాళ్లు, చిటికెలు, గుమ్మడి, క్రోపికూతలు, ఊదుక్రోవులు, ఒడ్డుపిడుపు, నెట్టుడుగాయ, పిండ్లమ్ములు, కట్టెపుట్ట చెండ్లు, దాయాలు, సొగటాలు, దాట్రాయి, పోటురాళ్లు, మూతపొడుపు, చిమ్మురాయి, తుమ్మెదరేపుళ్లు, కుమ్మరి సారెలు, తిరుగుడు బిళ్లలు, తిప్పుళ్లు జరుగుళ్లు, చిటితాళమీళలు, ఎటికెతట్లు, తాటాకుల చిలకలు, తాళ్లపాము, అగచాట్లు, నిట్టుక్కి, పుణికిళ్లు, బుజబుజరేకులు, సీగలు, బుడిగీంచు జాబిల్లి, పుక్కటిల్లు, కోటకోలన్నలు, గీరనగింజలు, పారుపట్లు, పిప్పిళ్లు త్రొక్కిళ్లు, బేడిసె తిరుగుళ్లు, నచ్చనగండ్లు, దాయాలు పొళ్లులు.
అప్పడప్పడ తాండ్ర...
పేరు భలే ఉంది కదా. దీన్ని ఆడటానికి కొందరు పిల్లలు వలయాకారంగా కూర్చుంటారు. వాళ్లలో ఒకరు నేలమీద అరచేతిని ఆనించి పెడతారు. దాని మీద మరొకరు తమ అరచేతిని ఉంచుతారు. అలా అందరూ ఒకరి చేతిమీదొకరు పెట్టిన తర్వాత... మొదటి చెయ్యి పెట్టిన పిల్లాడు తన రెండో చేత్తో అన్నింటికంటే పైన ఉన్న చేతిపై అప్పడప్పడ తాండ్ర, ఆవకాయ తాండ్ర గంగాలమ్మ చెవి పట్టుకో అని చరుస్తాడు. ఆ చెయ్యి ఎవరిదైతే ఆ అబ్బాయి... చెయ్యి తీసేసి పక్కవాళ్ల చెవి పట్టుకుంటాడు. అలా అందరి చేతులయ్యాక ఒకరి చెవులొకరు పట్టుకుని గీరి గారి... గీరి గారి అంటూ ముందుకీ వెనక్కి ఊగుతారు.
నాలుగురాళ్ల ఆట...
చతురస్రాకారంలో ఓ పెట్టె గీయాలి. మళ్లీ దానికి మధ్యలో అడ్డంగా నిలువుగా నాలుగు సమభాగాలు అయ్యేటట్టు గీసుకోవాలి. మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి ఒకరు కాపలా ఉండాలి. నాలుగు భాగాల్లో నలుగురుండి ఆ రాళ్లను తీసేందుకు ప్రయత్నించాలి. మధ్యలో కాపలా ఉండేవాళ్లు అన్ని మధ్య గీతలపై నడుస్తూ నలుగురిలో ఒకర్ని తాకేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ తాకితే తగిలిన వాళ్లు దొంగ. అలా జరగకుండా... నలుగురూ ఆ రాళ్లను తీసేయగలిగితే మళ్లీ అతనే దొంగ.
స్తంభాలాట... అప్పట్లో ఇళ్లల్లో స్తంభాలుండేవి. లేదంటే దూలాలు తప్పనిసరి. వాటిని పట్టుకుని ఆడే ఆటిది. నాలుగు స్తంభాలుంటే నలుగురు పిల్లలు వాటిని ఎంచుకునే వాళ్లు. అయిదో కుర్రాడు ఆ నాలుగు స్తంభాలకూ మధ్య నిలబడాలి. నలుగురూ ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి పరుగులు పెడుతుంటారు. పరుగు మొదలు పెట్టిన వాళ్లు స్తంభాన్ని చేరేలోపు అయిదో పిల్లాడికి దొరికిపోతే... అలా దొరికినవాళ్లు తర్వాత ఆటకు మధ్యలో నిలబడాలి.  
నేలా బండ
ఎంత మందైనా... ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఆడుకోవచ్చు. కాకపోతే ఈ ఆటకు గట్టు(బండ), నేల ఉండాలి. మొదట ఒకరు దొంగగా ఉండాలి. తనను నేల కావాలో, బండ కావాలో ఎంచుకోమంటారు. నేల కోరితే దొంగ నేలమీద ఉంటాడు. బండ కోరితే బండ. తను బండ ఎక్కిన తర్వాత నేల మీద ఉన్నవాళ్లందరూ... బండ మీదికి వస్తూ పోతూ అతణ్ని ఆటపట్టిస్తారు. అలా వాళ్లు బండ ఎక్కినప్పుడు దొంగ చేతికి చిక్కితే... అలా చిక్కినవాళ్లు తర్వాత ఆటకు దొంగ అవుతారు. అయితే, ఆట పట్టించే వాళ్లను పట్టుకోవడానికి దొంగ మాత్రం బండ దిగకూడదు. అదే మొదట్లో తను నేలను కోరుకుంటే... బండ ఎక్కకుండా నేల మీదే ఉంటూ - తనను ఆటపట్టించడానికి బండ మీది నుంచి నేలకు వచ్చే వాళ్లలో ఎవరో ఒకరిని పట్టుకోవాలి. 
      ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆటలు! పులీమేకా, గుజ్జన గూళ్లు, వెన్నెటిగుడ్లు... ఎన్నో ఎన్నెన్నో! నలుగురితో మాట్లాడటం, కలిసి మెలిసి తిరగడం వంటి వ్యక్తిత్వ వికాస పాఠాలను బోధి స్తూనే ఆరోగ్యసూత్రాలను (ఉదా: ఒప్పులకుప్ప) నేర్పే ఆటలివి. పైగా ఎంతో శారీరక వ్యాయామం, ప్రకృతితో మమేకం అవ్వడం! 
      ఈ ఆటపాటలన్నీ తెలుగువారి వారసత్వ సంపదలు. తాతముత్తాతల నుంచి నేర్చుకున్న ఈ ఆటలను నిన్న మొన్నటి వరకూ మనం కూడా అన్నీ కాకపోయినా కొన్నైనా ఆడాం. పాడాం. మరి పిల్లలకూ వాటిని నేర్పితే...! మన ఆటలు పదికాలాల పాటు సాగుతాయి. వాటితో మన పాటలూ మార్మోగుతాయి. అవి పిల్లలకు  అమ్మభాషపై ప్రేమ పెంచుతాయి. పిల్లల మధ్య స్నేహసంబంధాలు, అనుబంధాలనూ పెంచుతాయి. గుడుగుడు గుంచం, వైకుంఠపాళి, దాడీ లాంటి ఆటలను పెద్దలూ పిల్లలతో కలసి ఆడవచ్చు. పిల్లలతో గడపడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది!?


వెనక్కి ...

మీ అభిప్రాయం