ఆడిద్దాం... నేర్పిద్దాం!

  • 39 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వేలమూరి నాగేశ్వరరావు

  • విజయనగరం
  • 8897701833
వేలమూరి నాగేశ్వరరావు

పిల్లల ప్రాథమిక దశలో బోధన ఆటపాటల కూడికగా సాగాలి. వాళ్లు తెలుగుభాషను తేలికగా నేర్చుకునేందుకు ఆసక్తి కలిగేలా కొన్ని ఆటలు మేళవించాలి. అప్పుడే వాళ్లకు అమ్మభాష అంటే అభిమానం ఏర్పడుతుంది. అలాంటిదే ఈ ‘బా’ ఆట. రెండు మూడు తరగతుల పిల్లలకు ఈ ప్రయోగం బాగుంటుంది. దీనిద్వారా పిల్లల్లో శ్రవణ, పఠన, లేఖన సామర్థ్యాలతోపాటు ఆలోచనా శక్తీ పెరుగుతుంది. ఇలాంటి వాటిద్వారా పదసంపదా పెరుగుతుంది.
ఇలా ఆడాలి
ఈ ఆట కోసం ఆరు 4×4 సెంటీమీటర్ల అట్ట ముక్కలు తీసుకోవాలి. వాటిమీద న, వ, పూ, ట, వి, బా అక్షరాలను పెద్దగా నల్లస్కెచ్‌ పెన్నుతో రాయాలి. అదేసైజు ఉన్న మరో అట్టముక్కమీద ఎర్రస్కెచ్‌తో ‘బా’ అని రాయాలి. వృత్తాకారంలో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టాలి. వాళ్లు పైన చెప్పిన అక్షరాలను తమ చొక్కా లేదా గౌనుమీద గుండుసూదితో అందరికీ కన్పించేలా పెట్టుకోవాలి. ఒక విద్యార్థి మాత్రం ‘బా’ అనే అక్షరం రాసిన ఎర్ర అట్టముక్కను చేతితో పట్టుకుని నిలబడాలి. ఆటను చూసేందుకు తరగతిలోని పిల్లల్ని కూర్చోబెట్టాలి. నల్లబల్ల, సుద్దముక్కను పిల్లలకు సమీపంలో ఉంచాలి. 
       ఉపాధ్యాయుడు కొన్ని పొడవైన 4×10 సెంటీమీటర్ల అట్టల మీద ‘అక్క భర్త ఎవరు? పెద్దకుండను ఏమంటారు? గాంధీతాత మరో పేరు, మా ఇంటి దగ్గర ఈ గుడి ఉంది, దీని నుంచి నీళ్లు తోడుకుంటాం, దీని వెంట నడుస్తాం’ అని రాసిపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు ఈల వేయగానే ‘బా’ అని రాసిన ఎర్ర అట్టముక్క పట్టుకున్న విద్యార్థి ‘బా’ అని అంటూ వృత్తాకారంలో కూర్చున్న పిల్లల చుట్టూ తిరగాలి. ఇలా మూడుమార్లు తిరిగిన తరువాత ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని ఆగమని చెప్పి ‘అక్క భర్త ఎవరు?’ అని ప్రశ్నించాలి. ఆ పిల్లవాడు ‘వ’ అక్షరం అట్టముక్క ఉన్నవాళ్ల ముందు నిలబడితే వాడికి అక్క భర్త బావ అనే జవాబు తెలిసినట్లు. అప్పుడు ఈ ఆట చూస్తున్న పిల్లలంతా చప్పట్లు కొట్టాలి. 
      ఇలా మళ్లీ ‘బా’ అన్న ఎర్ర అక్షరం పట్టుకున్న విద్యార్థి మూడుసార్లు పిల్లల చుట్టూ తిరిగాక ఉపాధ్యాయుడు ‘పెద్దకుండను ఏమంటారు?’ అని ప్రశ్నించాలి. ‘న’ అక్షరం ముందు నిలబడితే ‘బాన’. ఇలాగే మిగతా అక్షరాలు పూర్తయ్యేదాకా పిల్లల్ని ఆడించాలి. ఆట ముగియగానే ఉపాధ్యాయుడు నల్లబల్లమీద బావ, బాన, బాపూ, బాబా, బావి, బాట అనే పదాలు రాయాలి. వాటిని పిల్లలతో పలికించి, పలక మీద ఐదుమార్లు రాయించాలి.
ప్రయోజనకరమైన ఆట
ఈ ఆట వల్ల పిల్లలు ఆలోచించి జవాబివ్వడం తెలుసుకుంటారు. చివర్లో పదాలను రాయించి, పలికిస్తాం కనుక దోషాలు లేకుండా రాయడం, స్పష్టంగా ఉచ్చరించడం అలవడుతుంది. ఇది సరదాగా సాగుతుంది కనుక పిల్లలకు ఉత్సాహంగా చదవగలుగుతారు. చదువంటే భయం పోతుంది. ఇలాగే ఇతర అక్షరాలతో కూడా ఆటలు ఆడించవచ్చు. ఈ పదాలతోనే ‘మా బావ పేరు రామారావు, బాబా గుడికి వెళ్లాను...’ లాంటివి రాయిస్తే వాక్య నిర్మాణమూ తెలుస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం