తెలుగు భాష మీద అభిమానం, మక్కువతో ఉన్నతస్థాయిలో తెలుగు చదువుతున్న వారిని సమాజం చిన్నచూపు చూస్తోంది. ‘అరెరె... తెలుగు చదువుతున్నావా?’ అని జాలిపడుతోంది. దీనికి కారణం... వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్దగా లేకపోవడమే.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు పదిహేను ప్రాచ్య (ఓరియంటల్) కళాశాలలున్నాయి. వీటిలో ప్రీ డిగ్రీ, డిగ్రీ కలిపి (భాషా ప్రవీణ/ విద్యా ప్రవీణ) కోర్సు ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఇంటర్‌తో సమానమైన రెండేళ్ల ప్రీ డిగ్రీ చదివి మధ్యలో మానేస్తే ఆ ధ్రువపత్రాలు దేనికీ పనికిరావు. కాబట్టి అయిదేళ్లు కచ్చితంగా తెలుగు/ సంస్కృతం చదవాల్సిందే. ఏదో రకంగా ఆ కోర్సులు పూర్తి చేసినా ఉద్యోగావకాశాలూ తక్కువే.
కానీ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, బి.ఎ.ఎల్.ఎల్.బి. వంటి కోర్సులు మూడేళ్లు చదివి ఆపేసినా ఆ విద్యార్థులు మరో కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఓరియంటల్ కోర్సు చేసిన వారికి అదీ లేదు.
ఓరియంటల్ కోర్సుల్లో చదివిన డిగ్రీ, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న బీయ్యేతో సమానమే. అందరిలాగే ఆంగ్లం, చరిత్ర చదువుతారు. కానీ బి.ఎడ్.లో చేరేందుకు అవకాశం లేదు. వీళ్లకి ఉన్న ఒకే ఒక్క అవకాశం తెలుగు పండిత శిక్షణ (తె.పం.శి.) పొంది ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడం.
మేమూ చదివాం... కానీ?
తెలుగు పండిత శిక్షణకు, బి.ఎడ్. విద్యార్థులకు సిలబస్ ఇంచుమించు సమానం. వాళ్లలానే మనోవిజ్ఞానశాస్త్రం (సైకాలజీ), తత్వశాస్త్రం (ఫిలాసఫి), పాఠశాల విద్య (స్కూలు ఎడ్యుకేషన్), విద్యా సాంకేతిక శాస్త్రం (ఎడ్యుకేషన్ టెక్నాలజీ) వంటి అంశాలు ‘తె.పం.శి.’లోనూ చదువుతారు. కానీ ఇద్దరికీ సమాన ఉద్యోగావకాశాలు ఉండట్లేదు!
బి.ఎడ్. చేసినవారు వసతిగృహ సంక్షేమాధికారులు (వార్డెన్)గా కావడానికి అవకాశం ఉంది. ‘తె.పం.శి’ పొందిన వారు అందుకు పనికిరారు! ప్రభుత్వం భర్తీ చేస్తున్న సీఆర్టీ (క్లస్టర్ రిసోర్స్ టీచర్స్) ఉద్యోగాల్లోనూ బి.ఎడ్. వారికే అవకాశం! ‘తె.పం.శి’ అభ్యర్థుల నుంచి దరఖాస్తులే స్వీకరించట్లేదు.
టెట్ పరీక్షలోనూ తెలుగు పండితులకు అన్యాయమే జరుగుతోంది.
బి.ఎడ్... సోషల్, సైన్సు మెథడాలజీలు 60 మార్కులు, తెలుగుకు 30 మార్కులు కేటాయించారు. తెలుగు పండితులు 30 మార్కులతో పాటు అదనంగా 60 మార్కులకు సోషల్/గణితం/ సైన్స్ చదవాలి. దీంతో మార్కులు తగ్గి తెలుగు పండితులు డీఎస్సీకి అర్హత సాధించలేకపోతున్నారు.
బి.ఎడ్. చదివినవారు ఎమ్.ఎడ్. చేస్తే డైట్, బి.ఎడ్. కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలు లభిస్తున్నాయి. కానీ తెలుగు పండితుల ఉన్నతవిద్య పండిత శిక్షణతోనే ముగుస్తుంది. చివరికి ‘తె.పం.శి.’ కళాశాలల్లో కూడా ఎమ్.ఎడ్. చేసినవారే తెలుగు, తెలుగు బోధనా పద్ధతులను బోధిస్తున్నారు.
తెలుగు పండితులకు మాత్రం స్కూలు అసిస్టెంట్లు, గ్రేడు-2 పండితులని విభజిస్తున్నారు. ఉన్నతీకరిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించినా దస్త్రం బల్లపైనే ఆగిపోయింది.
తెలుగేతర ఉపాధ్యాయులు కేవలం విషయ జ్ఞానం అందిస్తారు. కానీ తెలుగు ఉపాధ్యాయులు సామాజిక, నైతిక విలువలూ బోధిస్తారు. మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందిస్తారు. వారిని కాపాడుకోవడం జాతి అస్తిత్వానికి అవసరం.
ఈ సమస్యలు తీరాలంటే
* తెలుగు పండిత ఉద్యోగాలు కేవలం తెలుగు పండిత శిక్షణ పొందిన వారికే ఇవ్వాలి. లేకపోతే ‘సగానికి పైగా రిజర్వేషన్లు’ కల్పించాలి.
* బి.ఎడ్. చేసిన వారికి ఎం.ఎడ్ ఉన్నట్లే తె.పం.శిక్షణ పొందినవారికి ఎం.టిపిటి కోర్సు ప్రవేశ పెట్టాలి/ ఎం.ఎడ్. చేసే అవకాశం కల్పించాలి.
* ఓరియంటల్ కళాశాలల్లో చదివిన వారికి ఇతర డిగ్రీలు చేసిన వారితో సమానంగా అన్ని అవకాశాలూ కల్పించాలి. ప్రీ డిగ్రీ కోర్సు చదివిన వారికి డైట్సెట్తో పాటు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అన్ని ప్రవేశ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
* గ్రేడు- 2 పండితులుగా పని చేస్తున్న వేలాది ఉపాధ్యాయుల హోదాలను వెంటనే ఉన్నతీకరించాలి.