ఆఖరి మనిషితో ఆరంభం!

  • 676 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆదిమభాషల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ పదుల కొద్దీ భాషలు అంతరించిపోతున్నాయి. మరో పది తరాల తరువాత ఆంగ్లం వంటి అతికొద్ది భాషలే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. కానీ తమ మాతృభాషను కాపాడుకునేందుకు అక్కడక్కడా జరుగుతున్న ప్రయత్నాల గురించి విన్నప్పుడల్లా అమ్మభాషల మీద ఆశ చిగురిస్తుంటుంది. అందుకు ఉదాహరణ ఇదిగో..
ఉచ్చుమ్ని భాష
అమెరికాలోని అనేక ఆదిమ తెగలలో ‘ఉచ్చుమ్ని’ తెగ ఒకటి. వీరు ఎక్కువగా కాలిఫోర్నియా చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించేవారు. వేల సంవత్సరాలుగా అక్కడి నేలని నమ్ముకుని హాయిగా జీవిస్తుండేవారు. కానీ అమెరికాలోకి ఎప్పుడైతే ఐరోపావాసుల వలస మొదలైందో.. అప్పటి నుంచీ వీరి పతనం ఆరంభమైంది. నీటి కోసం, నేల కోసం, అస్తిత్వం కోసం జరిగిన పోరులో నిదానంగా వలసవాసులదే పైచేయి అయ్యింది. ఒకప్పుడు 50 వేలకు పైగా ఉన్న ఉచ్చుమ్ని తెగ జనాభా 200కి పడిపోయింది. ఉచ్చుమ్ని జనాభాతో పాటుగా వాళ్ల భాష కూడా క్రమంగా అంతరించిపోవడం మొదలుపెట్టింది. ఆ భాషని తడుముకోకుండా మాట్లాడగలిగే మనిషి ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరే మిగిలారు. ఆమే మేరీ విల్‌కాక్సి. 1933లో జన్మించిన మేరీ వయసు మీరుతున్న కొద్దీ, ఆమె చుట్టూ ఉచ్చుమ్ని మాట్లాడేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడాన్ని గమనించారు. తరం గడిచేకొద్దీ ఉచ్చుమ్ని పిల్లలు ఆంగ్లానికి అలవాటుపడటంతో.. వాళ్లతో సంభాషించేందుకు మేరీ కూడా ఆంగ్లం వైపే మొగ్గుచూపక తప్పింది కాదు.
అనుకోని స్ఫూర్తి
కాలం అలాగే గడిచిపోతే మేరీ జీవితం కూడా సాదాసీదాగానే సాగిపోయేదేమో! కానీ కొంతమంది పిల్లలు ఉచ్చుమ్ని భాష పట్ల ఆసక్తి చూపడాన్ని గమనించిన మేరీలో ఓ ఆలోచన మొదలయ్యింది. పిల్లలకే వారి అమ్మభాష పట్ల అనురక్తి ఉంటే, ఇక ఆ భాష తెలిసిన తనకెంత తపన ఉండాలి అనుకున్నారు. కానీ ఇప్పుడేం చేయడం! తన భాషని కాపాడుకునేందుకు, దాన్ని భవిష్యత్‌ తరాలకు అందించేందుకు తానేం చేయగలదు.. అన్న ప్రశ్నలు ఆమెను నిలువనీయలేదు. దాంతో తాను ఒకప్పుడు మాట్లాడిన ఉచ్చుమ్ని భాషలోని ఒకో పదాన్ని గుర్తుకు తెచ్చుకుని అక్కడా ఇక్కడా రాయడం మొదలుపెట్టారు.
      కొన్నాళ్లపాటు ఉచ్చుమ్ని భాషలో తనకు తెలిసిన పదాలన్నింటినీ రాసుకొచ్చిన మేరీ మరో అడుగు ముందుకి వేశారు. ఆ పదాలన్నింటినీ కంప్యూటర్లోకి ఎక్కించడం మొదలుపెట్టారు. ఆమె కంప్యూటర్‌ పరిజ్ఞానం అంతంత మాత్రమే. అయినా ఒక్కో వేలితో ఒక్కో అక్షరాన్నీ ఒత్తుతూ తను రాసుకున్న పదాలన్నింటినీ నమోదు చేయసాగారు. పొద్దున్న కంప్యూటర్‌ ముందు కూర్చుంటే మళ్లీ అర్ధరాత్రి దాకా అదే ధ్యాస. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏడేళ్లపాటు ఆమె అక్షరయజ్ఞం సాగింది. అలా ఉచ్చుమ్ని భాష కోసం ఒక నిఘంటువు రూపొందింది.
ఇంకో అడుగు ముందుకి
మేరీ తపనని గమనించిన కుమార్తె, మనవడు ఆమె ప్రయత్నంలో భాగం పంచుకోవడం మొదలుపెట్టారు. తాము కూడా ఉచ్చుమ్ని భాషలో ఓనమాలను నేర్చుకుంటూ ఆమె చేస్తున్న పనిలో సాయపడసాగారు. దాంతో ఉచ్చుమ్ని భాషలో నిఘంటువుకి రూపకల్పన చేయడంతోనే మేరీ ఆగిపోలేదు. తన కుమార్తెతో కలిసి ఉచ్చుమ్ని బోధనా తరగతులను ప్రారంభించారు. ఇక మనవడి సాయంతో ఆ భాషలోని పదాలను స్వయంగా పలుకుతూ వాటిని రికార్డు చేసే పనిని కూడా మొదలుపెట్టారు.
      మేరీ ఏమంత సంపన్నురాలు కాదు. ఆమెది సత్తువ కలిగిన వయసూ కాదు. సాంకేతిక పరిజ్ఞానమూ అంతంత మాత్రమే. కానీ అమ్మ భాషను కాపాడుకోవాలన్న తపనే ఆమె ద్వారా ఒక భాషని బతికిస్తోంది. సజీవంగా ముందు తరాలకు అందిస్తోంది.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం