తెలుగు సాహిత్య చరిత్ర - 1

  • 884 Views
  • 36Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

ప్రతి గురువారం సారస్వత అవలోకనం

 

నాటి నుంచి నేటి వరకూ తెలుగు సాహిత్యం ఎలా విస్తరించి వికసించింది?  తెలుగు సారస్వతానికి కొత్త వన్నెలద్దిన కవులు, రచయితలు ఎవరు? ఏయే కవులు, ఏయే కాలాల్లో ఏయే రచనలు చేశారు? వాటిని ఎవరికి అంకితమిచ్చారు? వారి సాహిత్య విశిష్టత ఏంటి?... సివిల్స్, గ్రూప్స్, ఉపాధ్యాయ, విశ్వవిద్యాలయ పోటీ పరీక్షలు, పరిశోధక విద్యార్థుల కోసం ప్రతి గురువారం ‘తెలుగు సాహిత్య చరిత్ర’ని ప్రాంతాల వారీగా సంగ్రహంగా, సమగ్రంగా అందిస్తోంది ‘తెలుగువెలుగు’. ఇందులో భాగంగా తెలంగాణ సాహిత్య చరిత్రను చూద్దాం..
శాతవాహనుల కాలపు సాహిత్యం:
శాతవాహనుల కాలంలో అధికార భాష ప్రాకృతం. లిపి బ్రాహ్మీ. భాష, లిపి విషయంలో వీరు అంతకుముందు కాలపు మౌర్యులను అనుసరించారు. జైన, బౌద్ధ భిక్షువులు, అశోకుడి శాసనాల వల్ల ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి దక్షిణాదికి విస్తరించాయి. శాతవాహనులు వైదిక మతాన్ని ఆచరించి, సంస్కృతం పట్ల ఆసక్తి కనబరిచారు. అయితే సామాన్య జనం భాష ప్రాకృతం. తెలుగు నేలమీద ప్రాకృతంతో పాటు దేశి (తెలుగు) కూడా వాడుకలో ఉండేది. 
      శాతవాహనుల కాలంలో ప్రాకృత, సంస్కృత భాషల్లో మంచి సాహిత్యం వెలువడింది. తొలి శాతవాహనుల్లో ఒకడైన హాలుడు ‘గాథా సప్తశతి’ అనే ఏడు వందల కథలను సంకలనం చేశాడు. ప్రపంచ సాహిత్యంలో ఇదే మొదటి సంకలన గ్రంథం అంటారు. హాలుడు, సింహళ దేశపు రాకుమార్తెను పెళ్లాడే ఇతివృత్తంతో కుతూహలుడు ‘లీలావతి’ అనే కావ్యం రాశాడు. ఇవి రెండూ ప్రాకృతంలో ఉన్నాయి. కవి పండితులను పోషించిన హాలుడి బిరుదు ‘కవివత్సలుడు’. 
      గుణాఢ్యుడి బృహత్కథ కూడా శాతవాహనుల కాలం నాటిదే. ఇది పైశాచీ ప్రాకృతంలో ఉంది. అయితే అసలు ప్రతి ప్రస్తుతం దొరకడం లేదు. తర్వాతి కాలపు సంస్కృత రచనలైన బుధస్వామి ‘బృహత్కథా శ్లోక సంగ్రహం’, సోమదేవ సూరి ‘కథా సరిత్సాగరం’, క్షేమేంద్రుడి ‘బృహత్కథా మంజరి’ ఈ బృహత్కథకు అనువాదాలే. గుణాఢ్యుడి స్వస్థలం కొండాపురం.
      మరో శాతవాహన రాజు కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని తేలిగ్గా నేర్చుకునేందుకు శర్వవర్మ ‘కాతంత్ర వ్యాకరణం’ రచించాడు. ఇక మహాయాన బౌద్ధమతం మీద ఆచార్య నాగార్జునుడు ‘ప్రజ్ఞాపారమిత, సుహ్రుల్లేఖ’ తదితర గ్రంథాలు రచించాడు. ఆ కాలపు రాజులైన గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రదమనుడు, ఖారవేలుడు కేవలం వీరులే కాదు, పండితులు కూడా.
పంపకవి:
కన్నడ ఆదికవి అయిన పంప వేములవాడ చాళుక్య రాజు అరికేసరి- 2 (910- 930) ఆస్థాన కవి. పంప కన్నడంలో ‘ఆదిపురాణం (జైన మతానికి సంబంధించింది), విక్రమార్జున విజయం’ రచించాడు. విక్రమార్జున విజయానికి ‘పంప భారతం’ అనే పేరు కూడా ఉంది. పంప, పొన్న, రణ్ణలను కలిపి కన్నడ కవి రత్నత్రయంగా పిలుస్తారు. పంపకవి బిరుదు ‘కవితా గుణార్ణవ’. 
జినవల్లభుడి కుర్క్యాల శాసనం:
క్రీ.శ.946కు చెందిన ఈ శాసనం కరీంనగర్‌ జిల్లా కుర్క్యాలలోని బొమ్మలగుట్ట దగ్గర లభించింది. దీన్ని వేయించింది జినవల్లభుడు. ఈయన కన్నడ ఆదికవి పంపకవికి సోదరుడు. ఈ శాసనంలో సంస్కృత, కన్నడ, తెలుగు భాషల్లో పద్యాలున్నాయి. తెలుగులో మూడు కంద పద్యాలున్నాయి. తెలుగులో లభిస్తున్న తొలి కంద పద్యాలకు శాసనాధారంగా కుర్క్యాల బొమ్మలగుట్ట నిలుస్తుంది. ఈ పద్యాలు జైన మత ప్రశంస ప్రధానంగా సాగాయి.
      అయితే కుర్క్యాల శాసనానికి ఓ యాభై ఏళ్ల ముందటిదైన కొరవి శాసనంలో (క్రీ.శ.900 ప్రాంతం) చక్కటి గద్యం కనిపిస్తుంది. దీన్ని వేయించింది చాళుక్య భీముడు. ఇది మహబూబాబాదు సమీపంలోని కొరవిలో బయల్పడింది. జనగామ జిల్లా గూడూరులో లభించిన విరియాల కామసాని శాసనంలో మూడు చంపకమాల, రెండు ఉత్పలమాల పద్యాలున్నాయి. ఇందులో విరియాల ఎర్ర భూపతి, కాకతీయ సింహాసనం మీద బేతరాజును కూర్చోబెట్టిన విషయాన్ని పొందుపరిచారు. ఈ వివరాల్ని బట్టి శాసన కాలాన్ని 1005- 1045 మధ్య కాలంగా నిర్ణయించారు. గూడూరు శాసనం తెలుగులో తొలి వృత్త పద్య శాసనం. ఇందులోని పద్యాలు నన్నయ రచనా శైలిని పోలి ఉన్నాయి.
మల్లియ రేచన:
మల్లియ రేచన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. నన్నయ భారత రచనకు ముందే ఈయన తెలుగులో ‘కవిజనాశ్రయము’ అనే ఛందో గ్రంథాన్ని రచించాడు. దీని రచనలో వాచకాభరణుడు అనే మిత్రుడు సహకరించాడని మల్లియ రేచనే స్వయంగా చెప్పుకున్నాడు. కుర్క్యాల శాసనకర్త అయిన జినవల్లభుడే ఈ వాచకాభరణుడు. ఈ గ్రంథాన్ని వేములవాడ భీమకవి రాశాడని కొంతమంది పండితులు పేర్కొన్నారు. అయితే, కవిజనాశ్రయాన్ని పరిష్కరించి ప్రచురించిన నిడుదవోలు వెంకటరావు మాత్రం దీన్ని రాసింది మల్లియ రేచనే అని తేల్చారు. పంపకవి, జినవల్లభుడు, మల్లియ రేచన ముగ్గురూ వేములవాడ చాళుక్య రాజు రెండో అరికేసరి (910- 930) ఆస్థానంలో ఉన్నారు. మల్లియ రేచన బిరుదు ‘శ్రావకాభరణుడు’.
పాల్కురికి సోమనాథుడు:
కాలం 1190- 1270. జన్మస్థలం జనగామ సమీపంలోని పాలకుర్తి గ్రామం. తల్లిదండ్రులు శ్రియాదేవి, విష్ణురామదేవుడు. శివదీక్షా గురువు లింగార్యుడు. చదువు చెప్పింది కట్టకూరి పోతిదేవర. సాహితీ గురువు కరస్థలి విశ్వనాథయ్య. సోమన శివైక్యం చెందింది కర్ణాటకలోని కలికెములో అంటారు. వీరశైవ మత ప్రచారానికి సామాన్యుల భాష ‘తెలుగు’ను ఎంచుకున్న కవి పాల్కురికి. తన భాషాభిమానాన్ని ప్రకటిస్తూ ‘తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదియౌ జూడుడు...’’ అన్నాడు. సోమనాథుడి రచనలు తెలుగు, సంస్కృత, కన్నడ భాషల్లో 30 దాకా ఉన్నాయి.
ఇతని మొదటి రచన ‘అనుభవసారం’. సోమనాథుడి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చే కావ్యం బసవపురాణం. ఇది ద్విపద ఛందస్సులో సాగింది. సోమనకు కొంచెం ముందువాడు, వీరశైవ మత స్థాపకుడైన బసవన్న జీవిత చరిత్రను ఇందులో అక్షరీకరించాడు. 
      బసవపురాణం తొలి తెలుగు ద్విపద కావ్యం. ఇంకా తొలి తెలుగు దేశీ పురాణం. దీన్ని 1440- 1520 మధ్య కాలానికి చెందిన పిడుపర్తి సోమనాథుడు చంపూ కావ్యంగా (పద్యాలు- గద్యం కలిపి ఉంటాయి) రాశాడు. సోమన మరో ప్రసిద్ధ రచన ‘పండితారాధ్య చరిత్ర’. ఇది వీరశైవ కవి, బసవన్న సమకాలికుడైన మల్లికార్జున పండితారాధ్యుడి జీవిత చరిత్ర. ఇది కూడా ద్విపదలోనే సాగింది. ఇక ‘వృషాధిప శతకం’ పూర్తి లక్షణాలతో ఉన్న తొలి తెలుగు శతకం. ‘బసవా! బసవా!  బసవా! వృషాధిపా!’ ఈ శతకం మకుటం. ఇవే కాకుండా ‘బసవోదాహరణం, బసవ రగడ, గంగోత్పత్తి రగడ’ లాంటివి సోమన రచనలుగా తెలుస్తున్నాయి. పాల్కురికి సోమనాథుడిని తెలంగాణ ఆదికవిగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
గోన బుద్ధారెడ్డి:
తెలుగులో తొలి రామాయణాన్ని రాసింది గోన బుద్ధారెడ్డి. కాలం 13వ శతాబ్దం చివరిభాగం. ద్విపద ఛందస్సులో సాగిన ఈ రామాయణమే ‘రంగనాథ రామాయణం’గా ప్రసిద్ధి చెందింది. బుద్ధారెడ్డి తండ్రి గోన విఠలరెడ్డి. గోన వంశం వాళ్లు కాకతీయుల సామంతులుగా ఇప్పటి మహబూబ్‌నగర్‌ ప్రాంతాన్ని పాలించారు. తండ్రి విఠలరెడ్డి కోరిక మేరకు రాసిన రామాయణాన్ని తండ్రికే అంకితమిచ్చాడు బుద్ధారెడ్డి. అయితే రంగనాథ రామాయణం అన్న పేరు రావడం వెనుక వివిధ వాదాలున్నాయి. రంగనాథుడన్న వ్యక్తి ఈ కథను బాగా వ్యాప్తిలోకి తెచ్చాడన్నది వాటిలో ఒకటి. ఇంద్రుడు-అహల్య కథ, లక్ష్మణరేఖ, ఉడుత సేవ లాంటి ఘట్టాలు వాల్మీకి రామాయణంలో లేవు. ఇవి అప్పటికే పామర జనం నోళ్లలో నానుతున్న కథలు. ఇక బుద్ధారెడ్డి కొడుకులైన గోన కాచవిభుడు, విఠలుడు ‘ఉత్తర రామాయణము’ను రచించి తమ తండ్రికి అంకితమిచ్చారు. ఇది కూడా ద్విపదలో సాగిన కావ్యమే.
బద్దెన:
ప్రసిద్ధ తెలుగు శతకాల్లో ఒకటైన ‘సుమతీ శతకం’ కర్త బద్దెన. ఈయన మరో రచన ‘నీతిశాస్త్ర ముక్తావళి’. బద్దెన జీవితం, ఇతర వివరాల మీద ఏకాభిప్రాయం లేదు. వేములవాడ చాళుక్య రాజు బద్దెగుడే (910- 930) బద్దెన అనీ, 13వ శతాబ్దికి చెందిన బ్రహ్మేశ్వరాలయ శాసనంలో పేర్కొన్న చోడబద్ది రాజే బద్దెన అనీ అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా, ధారణకు అనుకూలమైన, ధారాళమైన నీతులతో ఉన్న సుమతీ శతకం ఇప్పటికీ తెలుగు వారికి చవులూరిస్తూనే ఉంది.
చందుపట్ల శాసనం:
రుద్రమదేవి మరణ వివరాలకు సంబంధించిన ప్రధాన ఆధారం ఈ శాసనం. దీన్ని వేయించింది రుద్రమదేవి సైన్యంలో ఒకడైన పువ్వుల ముమ్మడి. తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్న కాయస్థ అంబదేవుణ్ని అణచివేసేందుకు వెళ్లిన రుద్రమ త్రిపురాంతకం యుద్ధంలో శివైక్యం చెందింది. ఇందులో రుద్రమదేవితో పాటు ఆమె సేనాని మల్లికార్జున నాయకుడు కూడా మరణించాడు. ఈ ఇద్దరికీ శివ సాయుజ్యం కలగాలని కోరుకుంటూ పువ్వుల ముమ్మడి స్థానిక (చందుపట్ల) సోమనాథ దేవుడికి భూదానం చేసిన వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి. రుద్రమ 1289లో మరణించినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.
మాదిరి ప్రశ్నలు
1. ‘కాతంత్ర వ్యాకరణం’ రచయిత ఎవరు? 
2. కన్నడ కవి రత్నత్రయం ఎవరు?
3. కుర్క్యాల శాసనాన్ని ఎవరు వేయించారు? 
4. తెలుగులో తొలి వృత్త పద్య శాసనం ఏది?
5. మల్లియ రేచన బిరుదు ఏది? 
6. పాల్కురికి సోమనాథుడి మొదటి రచన ఏది? 
7. తెలంగాణ ఆదికవి ఎవరు?
8. తెలుగులో తొలి రామాయణ కర్త? 
9. ‘రంగనాథ రామాయణం’ను గోన బుద్ధారెడ్డి ఎవరికి అంకితమిచ్చాడు? 
10. ‘నీతిశాస్త్ర ముక్తావళి’ కర్త? 
11. రుద్రమదేవి మరణ వివరాలకు సంబంధించి ప్రధాన ఆధారం?
సమాధానాలు
1. శర్వవర్మ; 2. పంప, పొన్న, రణ్ణ; 3. జినవల్లభుడు; 4. జనగామ జిల్లా గూడూరు శాసనం; 5. శ్రావకాభరణుడు; 6. అనుభవసారం; 7. పాల్కురికి సోమనాథుడు; 8. గోన బుద్ధారెడ్డి; 9. తన తండ్రి గోన విఠలరెడ్డికి; 10. బద్దెన; 11. చందుపట్ల శాసనం 

 

ఇవీ చ‌ద‌వండి..

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2

 

తెలుగు సాహిత్య చరిత్ర - 3

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7


వెనక్కి ...

మీ అభిప్రాయం