కాశీ చేరుతున్న మజిలీ కథలు

  • 158 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। దేవవరపు నీలకంఠరావు

  • విశ్రాంత తెలుగు పండితులు, కడియం
  • తూర్పుగోదావరి జిల్లా
  • 9989966012
డా।। దేవవరపు నీలకంఠరావు

చదువుతున్నంత సేపూ ఏదో ఉత్కంఠ! కథలోని పాత్రలతోపాటు మనమూ ఎక్కడెక్కడికో  వెళ్లిపోతూ  ఉంటాం. మనకు తెలియకుండానే ఏ రాకుమారుడో లేదా రాకుమార్తో మనలో పరకాయ ప్రవేశం చేస్తారు. అక్కడి నుంచి మన విహారమంతా మధురమైన ఊహాజగత్తులోనే! అంతలోనే హఠాత్తుగా  ఏ బ్రహ్మరాక్షసుడో మన మీద పడొచ్చు. ఆ రాక్షసుడితో వీరోచితంగా పోరాడుతూ ఉండగా... ఏ మూల నుంచో మంద్రస్థాయిలో వీణానాదం లాంటి గానమేదో లీలగా వినిపించవచ్చు.  ఆ మధుర కంఠధ్వనిని అనుసరిస్తూ  వెళితే అపురూప లావణ్యవతి అయిన ఏ గంధర్వ  కన్యో కనిపించవచ్చు. ఆమె ఒక శృంగార భావాత్మకమైన చిరునవ్వు విసిరి మెల్లగా లేచి ఒక చెట్టు చాటుకు వెళ్లి నిలబడి మనవంక ఓరకంట చూస్తూ నిరీక్షించవచ్చు! ... ఇలా... ఇలా... ఇంతలో మన
భుజం మీద ఎవరైనా చేయి వేసి లేపితే తప్ప వాస్తవ ప్రపంచంలోకి రాలేం. అదే కాశీ మజిలీ కథలలోని మంత్రశక్తి!

ఏ భాషా సాహిత్యంలోనైనా కథలకో ప్రత్యేక స్థానం ఉంది. పండిత పామరులిద్దరినీ సమానంగా ఆకర్షించగల శక్తి వాటి సొంతం. కల్పన వాటికి ఆయువుపట్టు! కాల్పనిక ప్రపంచంలో ఓ మధురానుభూతి ఉంటుంది. నిజ జీవితంలో అనుభవించలేని సుఖాలు, చూడలేని వింతలు, విచిత్రాలు కాల్పనికతలో పుష్కలంగా లభిస్తాయి. అవి మనల్ని ఊహాజగత్తులో విహరింపజేస్తాయి. నిరంతర శ్రమైక జీవనంలో మునిగిపోయిన వాళ్లకు ఆ ఊహా జగత్తే కాసేపు ఊరటనిస్తుంది. అందుచేతనే ‘కథలు’ మన ‘వ్యథ’లను మరిపింప జేస్తాయంటారు అనుభవజ్ఞులు. ఈ మాటలు అక్షరాలా సరిపోతాయి ‘కాశీ మజిలీ కథల’కు.
అక్షర కల్పవృక్షం
సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ఆంగ్ల విద్య విజృంభించడం, సినిమాలు, టీవీలు విస్తరించడంతో కాశీ మజిలీ కథలు కాలక్రమేణ కనుమరుగవుతూ వచ్చాయి. నిన్నటితరం పాఠకుల వరకు అనిర్వచనీయ ఆనందాన్ని కలిగించిన ‘కాశీ మజిలీ కథలు’ నేటి తరానికి దూరమైపోయాయి. సుమారు 1970వ సంవత్సరం వరకు తెలుగు నేల మీద ప్రతిపల్లెనూ ఆవాసంగా చేసుకున్నాయి ఈ కథలు! చదువుకున్న ప్రతి వ్యక్తి చేతిలోనూ కాశీ మజిలీ కథల పుస్తకం ‘కనక కంకణ ప్రాయం’గా వెలుగొందేది. ఊరి మధ్య రామాలయంలోనో, రచ్చబండ మీదనో సాయంకాల సమయంలో ఈ కథాపఠనం నిత్యకృత్యం. గ్రామీణ రైతులు, కూలీలు, ఇతరత్రా వృత్తివ్యాపకాల్లో ఉండేవారు, గృహిణులు ఈ కథాశ్రవణం కోసం పనులు తొందరగా ముగించుకొనే వారంటే ఆశ్చర్యం కాదు. విశేషం ఏమిటంటే- ఆనాటి కథా శ్రోతల్లో పెద్దలతోపాటు పిల్లలు కూడా సమసంఖ్యలో ఉండేవారు. అందుకు కారణం కథలంటే వాళ్లు చెవి కోసుకోవడమే! ఉద్యోగార్థులకు అధికారులు నిర్వహించే మౌఖిక పరీక్షల్లో కాశీ మజిలీ కథలను రాసిన కవి ఎవరు? అని ప్రశ్నించే వారంటే ఆ కథల ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతటి జనరంజకమైన కథలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. ఇక్కడే మధిర సుబ్బన్న దీక్షితులు కలం నుంచి కాశీ మజిలీ కథలకు అక్షరాంకురారోపణ జరిగింది. ఆయన తల్లిదండ్రులు సోమిదేవి కొండయ్యలు. తాతగారి పేరు లక్ష్మీనారాయణ. సుబ్బన్న దీక్షితులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రికి సమవయస్కులు, సహాధ్యాయి కూడా! 
కొత్తమలుపుల కథా పేటిక
సుబ్బన్నకవి నిత్య శివపూజా దురంధరులు. తన కవిత్వం గురించి వివరిస్తూ గ్రంథాంత గద్యలో ‘శ్రీమద్విశ్వనాథ సదనుకంపా సంపాదిత కవిత’ అని స్వయంగా చెప్పుకున్నారు. అంతేకాదు పెద్దల పట్ల తన భక్తిగౌరవాలను చాలా చోట్ల ప్రకటించుకున్నారు. శంకరాచార్యుల కథను రాస్తూ...
... ఏరీతిన్‌ రచియింతు తత్కథల నంచెంతేని లజ్జింపక
బ్జారిం బట్ట కరంబు లెత్తుగతి నా యత్నంబు చిత్రంబగున్‌

      అని వినయ విధేయతలు ప్రదర్శించారు.
      కథలు రాసే వాళ్లను కథకులు అనో రచయిత అనో అనడం పరిపాటి! కానీ ఆనాటి పండితులు మాత్రం ఆయన్ని కవిగానే పరిగణించారు. అందుక్కారణం కాశీ మజిలీ కథల్లో ఉన్న రచనాశైలే! గ్రంథం కావ్యరచనా సంప్రదాయం ప్రకారం శ్రీకారం చుట్ట…న పద్యంతోనే ప్రారంభమైంది. అది కూడా వారణాశీ పురాధీశుడైన విశ్వేశ్వరుణ్ని సంబోధిస్తూ! ఆ తరువాతదంతా వచనమే! ‘‘... దేవా! యవధరింపుము. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన ‘కాశీ యాత్రా చరిత్రంబు’నకు కథాక్రమం బెట్టిదనిన, తొల్లి కొల్లాపురంబున ‘యజ్ఞశర్మ’ యను విప్రుండు గలడు. అతండు వేద వేదాంగంబుల సాంతముగా బరిశీలించి దదుక్త ధర్మంబుల సమనుష్ఠింపుచు...’’ అని ఇలా మణిసిద్ధుని కథతో ప్రారంభమై ముందుకు సాగుతుంది.


సంస్కృతంలో బాణుడు రచించిన ‘కాదంబరి’ కావ్యానికి ఒక గొప్ప స్థానం ఉంది. తెలుగులో అంతటి ప్రాచుర్యం పొందిన గ్రంథం ‘కాశీ మజిలీ కథలు’ ఒక్కటే! కథ చదవడం ప్రారంభించామంటే అది పూర్తయ్యే వరకు వదలం. చదువుతున్న కథ పూర్తి కాకుండానే అందులోకి మరో ఉపకథ వచ్చి చేరుతుంది. ఆ ఉపకథలో నుంచి మరో కొత్త కథ పుడుతుంది. అది మళ్లీ ఇంకో కథకు కారణమవుతుంది. ఇలా అదంతా ఒక పెద్ద గొలుసుకట్టు కథల సమాహారం! అందుచేత రాత్రిపూట కాశీ మజిలీ కథలు చదవడం ప్రారంభిస్తే మనకు తెలియకుండానే తెల్లారి పోవచ్చు!


      సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీమజిలీ కథలు గద్య పద్య మిశ్రమంగా చంపూ పద్ధతిలో కనపడినా వీటిలో వచనమే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అంతా వచనమే అని భావించాలి. కాకపోతే అక్కడక్కడ కథలో అవసరాన్ని బట్టి పద్యమో, శ్లోకమో పెట్టాల్సి వచ్చింది. అవి కూడా కథా గమనానికి అలంకారాలుగానే సాగాయి. కథలన్నీ సరళ గ్రాంథికమే! కాబట్టి ఏకొద్దిపాటి అక్షరజ్ఞానం ఉన్నవారైనా నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. కాశీ మజిలీ కథలు గ్రాంథిక- వ్యావహారిక భాషావాదాలు విపరీతంగా జరుగుతున్న కాలంలో పుట్టాయి. గ్రాంథిక, వ్యావహారిక భాషావాదులు ఎవరికి వారే తమ తమ వాదాన్ని నెగ్గించుకోవడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న సందర్భంలో వీరేశలింగం పంతులు మధ్యేమార్గంగా సులభ గ్రాంథికాన్ని సూచించారు. అది అధిక సంఖ్యాకులకు ఆమోద యోగ్యమైంది. సహజంగానే సంప్రదాయవాది అయిన సుబ్బన్న దీక్షితులు ఆ మార్గాన్నే ఎంచుకున్నారు.
      ఈ గ్రంథానికి కవిపెట్టిన పేరు ‘కాశీ యాత్రా చరిత్ర’ అని! అందుకు కారణం- అంతకుముందే ఏనుగుల వీరాస్వామయ్య రచించిన ‘కాశీ యాత్రా చరిత్ర’పై తనకు గల ఆరాధనాభావమే కావచ్చు. యాత్రా రచనకు వీరాస్వామయ్య ఆద్యులైనా సుబ్బన్న దీక్షితులు కాశీ మజిలీ కథలకే అధిక ప్రాచుర్యం లభించింది. అందుకు ప్రతి మజిలీలోనూ కథ కొత్త మలుపు తిరగడమో లేక కొత్త కథ ప్రారంభం కావడమో ఒక కారణమైతే, కథనంలో ఉత్సుకత రేకెత్తించే శైలి మరో కారణం!
ఆబాలగోపాలానికి మణిహారం
హైందవ వాఙ్మయంలో కాశీ పట్టణానికి గొప్ప విశిష్టత ఉంది. గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శిస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందనేది హిందువుల నమ్మకం. పూర్వకాలంలో వాహన సదుపాయాలు లేకపోవడం, మార్గమధ్యంలో నదులు, పర్వతాలు, అరణ్యాలు ఉండటంవల్ల కాశీయాత్ర అసాధ్యంగా ఉండేది. నడక తప్ప వేరే మార్గం లేదు. ఈ పరిస్థితుల్లో మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి కాశీ పట్టణానికి బయల్దేరాడు. తోడు లేనిదే వెళ్లడం కష్టం. కాబట్టి తనకు సాయంగా రమ్మని చాలామందిని అడిగాడు. కానీ వారు భయపడి రాలేదు. చివరికి శ్రీరంగపురంలో ఊరి చివర ఒక పశువుల కాపరి కనిపించాడు. అతడి పేరు కోటప్ప. తల్లిదండ్రులు లేరు. ఒక కాపు దగ్గర ఉంటూ అతని పశువుల్ని కాస్తున్నాడు. మణిసిద్ధుడు ఆ గోపాలుణ్ని తన వెంట కాశీ రమ్మన్నాడు. దారిలో వింత వింత కథలు చెబితే వస్తానని అతడు షరతు పెట్టాడు. అలాగే చెబుతానని ఒప్పించి అతణ్ని తనతో తీసుకువెళ్లాడు. కాశీయాత్ర ఒక రోజులో అయ్యేది కాదు కదా! మధ్యమధ్య అనేక ప్రదేశాల్లో మజిలీలు చేేసుకుంటూ వెళ్లాలి. ఆ కాలంలో ఇలాంటి యాత్రికుల కోసం అక్కడక్కడ ధర్మసత్రాలు, మజిలీశాలలు ఉండేవి. భోజన సమయానికి వాళ్లు అక్కడి సత్రాల దగ్గర ఆగి వంటలు చేసుకొని, భోంచేసి, విశ్రాంతి తీసుకొని, రాత్రులయితే అక్కడే నిద్రించి, మర్నాడు బయల్దేరి నడక ప్రారంభించేవారు. ప్రయాణ మార్గంలో కోటప్ప తాను చూసిన వింతలు, విచిత్రాల గురించి అడిగి వాటి వివరాలు చెప్పమనేవాడు. అందుకు మణిసిద్ధుడు వాటి వెనుక గల కథను తన దివ్యదృష్టితో చూసి అదంతా కోటప్పకు చెబుతుండేవాడు. ఇలా కాశీ మజిలీ కథలు సాగిపోయాయి.
      తెలుగు చలన చిత్ర సీమలో జానపద చిత్రాల కథలకు సుబ్బన్న దీక్షితుల కథలే దారి చూపాయి. ఈ కథలు కొన్ని చిత్రాల్లో యథాతథంగా చోటు చేసుకున్నాయి. ఊహాజనిత కల్పితాంశాలను సామాజిక పాత్రలతో కలిపి తీస్తున్న చలన చిత్రాలకు కూడా కాశీ మజిలీ కథలే ప్రేరణ! పేదరాశి పెద్దమ్మ కథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథలు ఇవన్నీ కాశీ మజిలీ కథలకు మానస పుత్రికలు.
      శృంగారం, వీరం, భయానకం, అద్భుతం వంటి రసాలతోపాటు హాస్యరసం కూడా వీటిలో అధికంగా పండింది.  ‘దేవతావస్త్రాలు’ కథలో... పగటి పనులు రాత్రిపూట, రాత్రి పనులు పగటిపూట చేయాలని ప్రజలను ఆజ్ఞాపించి, అలా చేయని వాళ్లను కఠినంగా శిక్షించే ఆ దేశపు రాజు అయిన ‘కానీనుడి’ విచిత్ర పోకడ చదువుతుంటే కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. కథ చివరలో ఆ దేవతా వస్త్రాలను తయారు చేసిన ‘వరప్రసాదులు’ రాజుకి ఒక లేఖ రాస్తారు... ‘వరప్రసాద’ అనేది నామ ప్రథమాక్షరాల సంపుటి. ‘వ’ అంటే వసంతుడు, ‘ర’ అంటే రాముడు, ‘ప్ర’ అంటే ప్రవరుడు, ‘సా’ అంటే సాంబుడు, ‘ద’ అంటే దంతుడు. వీళ్లు అయిదుగురు మిత్రులు. లోకానుభవం కోసం దేశాటనం చేస్తారు. ప్రస్తుతం అక్కడక్కడ మనకు కనిపిస్తున్న నామ ప్రథమాక్షరాల కూర్పుతో చమత్కారం సాధించడమనే అక్షరక్రీడను తెలుగు వారికి నేర్పింది మధిర సుబ్బన్న దీక్షితులే! ఆయన కథల్లో చాలాచోట్ల స్త్రీలు విద్వాంసురాళ్లుగా కనిపిస్తారు. 
పదిలపరచాల్సిన పాతబంగారం
ఆనాటి సమష్టి కుటుంబాల్లో ఉండే అనుబంధాలు, మానవీయ లక్షణాలు, మంత్రశాస్త్ర రహస్యాలు, ఆధ్యాత్మిక ప్రబోధాలు, తత్వార్థాలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాలు ఇంకా ఎన్నెన్నో విషయాలను తెలియజేస్తూ ఈ కథలు పాఠకులను విజ్ఞానవంతులుగా చేస్తాయి. జానపద పురాణ ఇతిహాస కథలతోపాటు చారిత్రక సన్నివేశాలు, చారిత్రక పురుషులు కూడా దీక్షితుల కథామాలికలో మణిపూసలై చక్కగా ఒదిగిపోయారు. బుద్ధుడు, భోజరాజు, కాళిదాసు, శంకరాచార్యులు, కృష్ణదేవరాయలు, తెనాలి రామలింగడు వంటి వారి చరిత్రలు ఆసక్తికరంగా మలచారు. పేరుకు కథలేగాని వ్యాకరణ, అలంకార, ఛందశ్శాస్త్ర నియమాలను క్షుణ్నంగా పాటించినందువల్ల ఆయా లక్షణ గ్రంథాలకు ఇది లక్ష్య గ్రంథంగా కూడా పండితులు పరిగణిస్తారు.
      పాత్రలకు గాని, కథలకు గాని నామకరణం చేసేటప్పుడు- ఆ పేరు చదవగానే పాత్ర స్వభావం, కథాంశం లీలగా స్ఫురించేటట్లు చేయడం అనేది రచనా సంవిధానంలో ఒక సాంకేతిక సూత్రం! కాశీ మజిలీ కథలన్నీ ఈ సూత్రీకరణను అనుసరించే నడిచాయి. అందువల్ల పెద్దగా చదువులేని పాఠకుడికి కూడా కథావగాహనలో రచయిత ముందుగానే కొంత సహకారం అందించినట్లయింది. ఇవి జనాకర్షకాలు కావడానికి ఇది కూడా ఒక కారణం!
      అంగ వంగ కళింగ కాశ్మీరాది వివిధ దేశాల కథలు ప్రస్తావన వశంగా వచ్చినా వాటన్నిటికీ తెలుగు దేశీయతను కట్టబెట్టిన అచ్చమైన తెలుగు ప్రాంతీయాభిమాని సుబ్బన్న దీక్షితులు.
      ఇంతటి విశిష్టత గల ఇతివృత్తాలతో పాటు ఆనాటి సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్న ఈ పుస్తకాన్ని ఇప్పటి పాఠకులు దూరం చేసుకోవడం దురదృష్టం! 
      బిడ్డలకు అమ్మభాషను నేర్పి అనుబంధాల పట్ల అవగాహన కల్పించాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ పుస్తకాలను వారికి బహుమతులుగా అందజేస్తే దానికి మించిన కానుక మరొకటి ఉండదు. కథలకు బాలకులే ‘మహారాజ పోషకులు’ కాబట్టి ఆ ప్రక్రియ వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది. దానివల్ల చిన్నారుల్లో నైతిక విలువలు పెరగడంతోపాటు మాతృభాష పట్ల మమకారం కలుగుతుంది. అంతేకాదు ఊహాశక్తీ, సృజనాత్మకతా పెరుగుతాయి.
       తెలుగును కాపాడాల్సింది రేపటి పౌరులైన విద్యార్థులే. కనుక పాఠ్య పుస్తకాల్లో సుబ్బన్న దీక్షితుల కాశీ మజిలీ కథలు అభ్యసనాంశంగా చేర్చడం అవసరం.
సంస్కృతంలో బాణుడు రచించిన ‘కాదంబరి’ కావ్యానికి ఒక గొప్ప స్థానం ఉంది. తెలుగులో అంతటి ప్రాచుర్యం పొందిన గ్రంథం ‘కాశీ మజిలీ కథలు’ ఒక్కటే! కథ చదవడం ప్రారంభించామంటే అది పూర్తయ్యే వరకు వదలం. చదువుతున్న కథ పూర్తి కాకుండానే అందులోకి మరో ఉపకథ వచ్చి చేరుతుంది. ఆ ఉపకథలో నుంచి మరో కొత్త కథ పుడుతుంది. అది మళ్లీ ఇంకో కథకు కారణమవుతుంది. ఇలా అదంతా ఒక పెద్ద గొలుసుకట్టు కథల సమాహారం! అందుచేత రాత్రిపూట కాశీ మజిలీ కథలు చదవడం ప్రారంభిస్తే మనకు తెలియకుండానే తెల్లారి పోవచ్చు!


వెనక్కి ...

మీ అభిప్రాయం