తెలుగు జాతికి ‘చేకూరి’న భాషా త్రివిక్రముడు

  • 23 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆర్వీ రామారావ్‌

  • అనుభవజ్ఞులైన పాత్రికేయులు
  • హైదరాబాదు
  • 9676282858
ఆర్వీ రామారావ్‌

దక్షిణాదిలో ప్రసిద్ధులైన భాషా శాస్త్రవేత్తల్లో ఎక్కువమంది తెలుగువాళ్లే కావడం యాదృచ్ఛికం కావచ్చు. భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, తూమాటి దొణప్ప, చేకూరి రామారావు, పి.ఎస్‌ సుబ్రహ్మణ్యం, కందప్ప చెట్టి, కుమారస్వామి రాజా, ఐరావతం మహదేవన్‌ దక్షిణ భారతంలో ప్రసిద్ధులైన భాషాశాస్త్రవేత్తలైతే ఇందులో మొదటి అయిదుగురూ తెలుగువాళ్లే. వీళ్ల కృషి ప్రధానంగా ఆధునిక భాషా శాస్త్ర సహాయంతో తెలుగు భాషను పరిశీలించడానికి తోడ్పడింది. భద్రిరాజు కృషి తెలుగు భాషను విశ్లేషించడానికి ఉపకరించేదే అయినా ఆయన తెలుగు గురించి ఎక్కువగా ఇంగ్లీషులోనే రాశారు.
      బూదరాజు, చేకూరి రామారావు తమ భాషా శాస్త్ర పరిశీలనలను తెలుగులో కూడా రాశారు. అయినా వీరి భాషాశాస్త్ర పరిశీలనా శక్తి వీళ్లు రాసిన సాహిత్య సంబంధ రచనలవల్లే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఇద్దరూ మౌలికంగా భాషా శాస్త్రవేత్తలు కావడంతో పాటు సాహిత్యకారులు కావడంవల్ల భాషా శాస్త్రం గురించి తమ ఆలోచనలను చెప్పడానికి సాహిత్య రంగాన్ని ఆలంబనగా చేసుకున్నారు. అదే జరగకపోతే బూదరాజు శాసన పరిశోధకుడిగా, వృత్తిపదకోశ నిపుణుడిగా... చేకూరి రామారావు తెలుగు వాక్య సిద్ధాంత కర్తగా మిగిలిపోయి వారి కృషి పండిత వర్గాలకే పరిమితమయ్యేది.
      ఆధునిక దృక్పథంతో భాషాశాస్త్ర అధ్యయనానికి తెలుగునాట గిడుగు రామమూర్తి పంతులు ఆద్యుడు. ఆయన బాటలోనే నడుస్తూ వాడుక భాషకు పట్టం కట్టడానికి, తెలుగు భాషను గ్రాంథిక భాష సర్ప పరిష్వంగం నుంచి విడిపించడానికి భద్రిరాజు, బూదరాజు, చేకూరి రామారావు తీసుకున్న శ్రమ అమోఘమైంది. ఈ ముగ్గురికి పండిత స్పర్థలు ఉండేవి. అయినా అవి తెలుగుభాషా శాస్త్ర ఆవరణను విస్తృతం చేయడానికే తోడ్పడ్డాయి.
      చేకూరి రామారావు (1934 అక్టోబర్‌ 1 - 2014 జులై 24) ‘చేరా’గా ప్రసిద్ధుడు. చదువుకునే రోజుల్లోనే ఆయనను గ్రామర్‌రావు అనేవాళ్లట. వ్యాకరణాంశాల మీద ఆయనకున్న అభినివేశం భాషానుశీలన దృష్టి పెంచుకోవడానికి, సాహితీ విమర్శ పరిధిని విస్తృతం చేయడానికి ఉపకరించింది.
      చేరా ప్రస్థానం వైవిధ్య భరితమైంది. సాహితీ సృజన, సాహిత్య విమర్శ, భాషా శాస్త్ర రంగంలో విశేషమైన పరిశోధన, భాషానువర్తనంలో పాఠ్యపుస్తక రచన ద్వారా విశ్వవిద్యాలయాలు వాడే భాషలో సమూలమైన మార్పుకు దోహదం చేయడం వంటి పాయలుగా ఆయన కృషి సాగింది.
      హైస్కూలు విద్య దశలో నాయని సుబ్బారావు ప్రభావంతో ప్రారంభమైన ఆయన కవితా రచన భాషా శాస్త్ర అధ్యయనం ఆరంభించిన దగ్గర నుంచి ఆగిపోయినట్టుంది. అయితే కవితాస్వాదన, విశ్లేషణ, విమర్శ చివరి దాకా కొనసాగించారు. కవిత్వ సృజనలోనూ ఆస్వాదనలోనూ మౌలికంగా చేరా భావుకుడే. పురోగమన భావాలు ఉన్నవారైనా ప్రాచీన కవిత్వంలో మంచి ముత్యాలను ఏరి చూపడమే కాక ఆ సాహిత్య రూప విశేషాలను వివరించడమే కాదు, దానిమీద సమకాలీనులకు అనురక్తి కలిగించాలన్న దీక్ష ఉన్నవారు. అందుకే ఆయన సగటు పురోగమన వాదుల్లాగా పద్యాన్ని ఈసడించుకోలేదు. పైగా విశ్లేషించారు. ఆస్వాదించే మార్గాలు చూపారు. మాత్రా ఛందస్సు... ప్రధానంగా ముత్యాలసరాల మీద లోతైన అధ్యయనం చేశారు. కవిత్వం మీద ఆయనకున్న అభిమానం ఆధునిక భాషా శాస్త్ర అంశాలను సాహిత్య రంగానికి అనువర్తింపచేయడానికి దారి తీసింది. కవిత్వాన్ని ఆస్వాదించడంలో, పరిశీలించడంలో, విమర్శించడంలో కొత్తదారులు తొక్కడానికి అవకాశమిచ్చింది. ఈ క్రమంలో చేరా వివాదాల్లోకి దిగారు. ఆయన ప్రతిపాదనలు, విమర్శనా పద్ధతులు, సూత్రాలు కొన్ని సార్లు చర్చనీయాంశాలు అయ్యాయి. నెలల తరబడి పత్రికల పేజీల నిండా ఈ వాదోపవాదాలు పరుచుకున్న సందర్భాలున్నాయి.
      సాహిత్య విమర్శ విషయానికొస్తే భాషా శాస్త్ర సూత్రాలను, విమర్శా పద్ధతులకు జోడించి కొత్తదారుల్లో నడిపించిన ఏకైక విమర్శకుడు చేరా. సమకాలీన కవిత్వాన్ని తక్షణం విశ్లేషించడానికీ చేరా వెనుకాడలేదు. కొన్ని సందర్భాల్లో ఓ కవిత అచ్చయిన మరుసటి వారమే దాని మీద చేరా విశ్లేషణ వెలువడ్డ సందర్భాలూ ఉన్నాయి. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే...’’ అన్న హెచ్చరికలను చేరా లెక్క చేయలేదు. తాను ఏం చెప్పినా అది సమకాలీన సమాజానికే అన్న స్పృహ ఆయనకు నిండుగా ఉంది. అందుకే వాద వివాదాలకు వెరవలేదు.
      ఆయన పరిశీలన ప్రధానంగా సమకాలీన కవిత్వాన్ని కవితా నిర్మాణం వ్యవస్థ మొదలైన కోణాల నుంచి పరిశీలించడానికే పరిమితమైంది. కవిత్వ విశ్లేషణలో రూప విశ్లేషణ మీద ఆయనకు ఉన్న ఆసక్తి వస్తు విశ్లేషణ మీద లేదు. కవితా వస్తువుకు సంబంధించి చేరా పురోగమన భావాలు ఉన్నవారే. అంటే మొదట అభ్యుదయ రచయితల ఉద్యమంతో ఆ తర్వాత విప్లవ రచయితల ఉద్యమంతో మమేకమైపోయినట్టు కనిపించేవారు. ఆయన ఈ ఉద్యమాలకు వత్తాసుదారే తప్ప ఉద్యమ కార్యకలాపాల్లో ఎన్నడూ భాగస్వామి కాదు.
      విమర్శా రంగంలో ఆయన మనకు బాగా పరిచితమైన సాహితీ విమర్శా పద్ధతుల్లో ఇమిడేవారు కాదు. సాహిత్యాన్ని ప్రధానంగా కవిత్వాన్ని వింగడించడానికి భాషా శాస్త్ర పనిముట్లను వాడింది ఆయన ఒక్కరే. కొంతమంది ఛందస్సు, శైలి వంటి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసినా అది ఆధునిక భాషా శాస్త్ర పనిముట్లను వాడి చేసిన పనికాదు. చేరాకు సాహిత్య విమర్శకుడిగా పేరున్నా ఆయనది సాంప్రదాయిక సాహిత్య విమర్శా పద్ధతికాదు. అందులోనూ రచనా శైలీ భేదాలు, వాక్య రచనా రీతులు మొదలైన రూప సంబంధ వ్యవహారాలను బేరీజు వేయడానికి చేసిన ప్రయత్నం వస్తు వివేచనలో లేదు. సాహిత్య పరామర్శకు, భాషా దృక్కోణంతో పరిశీలనకు చేరా చేసిన కృషే ఆయన తెలుగు భాషకు చేసిన సేవలో ప్రధానమైంది.
తెలుగు వాక్య వ్యాకర్త
తెలుగు వారు చేరాను భాషా శాస్త్ర పరిశీలకుడిగా పరిగణించింది ఆయన తెలుగువాక్య పరిశీలనతోటే. భాషా శాస్త్రం అభ్యసించడానికి అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో ఉన్నప్పుడే జెరాల్డ్‌ కెల్లీ ప్రభావంతో ఆలోచించడం వల్ల చేరాలో తెలుగు వాక్య పరిశీలనా దృష్టి పదును దేరింది. దాని ఫలితమే మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో వెలువడిన ‘తెలుగు వాక్యం’. చేరా భాషా శాస్త్ర పరిశోధనలో ఇది చాలా మౌలికమైంది. అయితే మామూలు పాఠకులకు కాశీఖండంలాగా అయఃపిండమే.
      ‘తెలుగు వాక్యం రెండో ముద్రణకు పీఠిక రాస్తూ, ‘‘ఇన్నేళ్ల తరవాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పుస్తకం రాయవలసిన పద్ధతి ఇది కాదేమో అనిపిస్తున్నది. ఇంతకన్నా సుబోధకంగా రాస్తే ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉండేది. ఇందులో వాడిన భాషా శాస్త్ర పరిభాష, సంకేతాలు ఆ శాస్త్రంతో పరిచయంలేని వారిని చిక్కుపెట్టటం గుర్తించాను.. అయినా కాస్త శ్రమ పడితే అర్థం కాని బ్రహ్మ పదార్థమేమీ కాదు ఇది’’ అని చేరానే చెప్పుకున్నారు. ఇలాంటి సంజాయిషీలు పండితులు, పరిశోధకుల దగ్గర నుంచి వినడం మామూలే. చేరా దానికి అతీతం కాదు. శాస్త్ర చర్చలో పరిభాష అనివార్యం అయిన మాట వాస్తవమే కానీ సుబోధకంగా చెప్పడం అసాధ్యం ఏమీ కాదు. పీహెచ్‌డీ పట్టాకోసం రూపొందించిన సిద్ధాంత గ్రంథాల పరిధి దాటితే ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేట్టు చెప్పడం సాధ్యమే.
      ‘‘నా మట్టుకు నేను నిన్న మొన్నటి దాకా- అర్థమయ్యే భాషను గురించి అర్థం కాని తెలుగులో రాస్తుండేవాణ్ని. ఇప్పుడిప్పుడే అపండిత శైలి అభ్యాసం చేస్తున్నాను’’ అని 1986లో ఎన్‌.గోపి ‘వ్యాస నవమి’ పీఠికలో చెప్పుకున్నారు చేరా. అర్థం అయ్యేట్టు రాయడానికి అపండితులు కానక్కరలేదన్నది వేరే విషయం. అర్థమయ్యేట్టు రాసే పండితుల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ పని ఆ తర్వాత చేరా చేశారు.
      గహనంగా కనిపించే ‘తెలుగు వాక్యం’ వదిలేస్తే భాషా పరిశోధనలో చేరా చాలా మెచ్చదగిన కృషే చేశారు. ఆయన ప్రచురిత గ్రంథాల్లో ఎక్కువ భాగం భాషా పరిశోధన గురించే. ‘భాషా పరివేషం’, ‘వచన రచన తత్త్వాన్వేషణా, ‘తెలుగులో వెలుగులు’, ‘భాషాంతరంగం’, ‘భాషానువర్తనం’ వంటి గ్రంథాలన్నీ అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి. సాధారణంగా పరిశోధకులు పీహెచ్‌డీ పట్టాల కోసం సిద్ధాంత గ్రంథాలు రూపొందించేటప్పుడు మాత్రమే నిర్దిష్ట సిద్ధాంత ప్రతిపాదనకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడదీ చాలావరకూ గత కీర్తే. ఆ తర్వాత సందర్భానుసారంగా తమ ప్రతిపాదనలకు అవకాశం ఇస్తుంటారు. భాషకు సంబంధించి చేరా ప్రతిపాదనలన్నీ ఇలా సందర్భానుసారంగా చేసిన ప్రతిపాదనలే.
      చేరా సుశిక్షితుడైన భాషా పరిశోధకుడు. నిశిత దృష్టిగల విమర్శకుడు. భాషను వివిధ ప్రయోజనాలకు వాడాల్సి వచ్చినప్పుడు నిబద్ధత ప్రదర్శించిన విద్యావేత్త. సిద్ధాంత గ్రంథాలలో, పరిశోధనాత్మక రచనల్లో, విమర్శా వ్యాసాల్లో కవిత్వ భాష ఛాయలు ఉండగూడదన్నది చేరా నియమం. ఆయన రాతలో దీన్ని పాటించారు. కాని వస్తుతఃభావుకుడు అయినందువల్ల తన తాత్త్విక ధోరణికి సరిపడని అంశాలను కూడా సహించేంతటి హృదయ వైశాల్యం ప్రదర్శించగలిగారు.  మర్యాదకరమైన భాష రాయడం కూడా చేరా చేసిన భాషా సేవలో భాగమే.
      ‘భాషానువర్తనం’ ముందు మాటలో ‘‘ఈ వ్యాసాల్లో అక్కడక్కడా కొన్ని పరుష వాక్యాలు దొర్లాయి. పౌరుష్యం నా పద్ధతి కాదు. ఎంత నిగ్రహంతో ప్రవర్తించాలన్నా మానవ సహజమయిన బలహీనతల వల్ల తెలియకుండానే మాట జారుతుంది’’ అని గుర్తించగలిగిన సంస్కారం చేరా ప్రత్యేకత. చేరాకు బలమైన భావాలు, అభిప్రాయాలు ఉండేవి. అయితే వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా వ్యక్తం చేయాలో జీర్ణించుకున్నవాడు. అయితే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేటప్పుడు తగు మాత్రం వ్యంగ్యం రాతలోనూ మాటలోనూ ఉండేది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా విభేదిస్తే ‘నువ్వు వ్యావహారిక చాదస్తుడివి’ అనేవారు. కాని పదప్రయోగంలో పండితులకు సహజంగా ఉండే చాపల్యాన్ని వదులుకోలేకపోయారు. ఆయన ప్రచురణల జాబితా చూస్తే కొన్ని పదాల మీద మోజు కనిపిస్తుంది. ‘‘స్మృతి కిణాంకం’’, ‘‘సాహిత్య వ్యాసాల రింఛోళి’’, ‘‘సాహిత్య కిర్మీరం’’ లాంటి గ్రంథ శీర్షికలు ఇలాంటివే. లేకపోతే అర్థమయ్యే భాష రాయాలన్న సంకల్పం సంపూర్ణంగా నెరవేరినట్టయ్యేది.
తల రాతలు మార్చిన చేరాతలు
‘‘చేరాతలకు వస్తు పరిమితి లేదు. అయినా ఇవి భాషాచ్ఛందస్సాహిత్యాలను ఆవరించినట్టు గ్రహించటం కష్టం కాదు’’ అని ఆయనే చెప్పుకున్నారు. 1980ల మధ్యలో చేరాతలు విశిష్ట పాత్ర పోషించాయి. సమకాలీన కవిత్వాన్ని విశ్లేషించడమే చేరా చేసిన సాహసం. చాలామంది కవుల కవిత్వంలో ఏముందో తెలుసుకునే దారి చూపించింది చేరాతలే. ఈ విశ్లేషణల్లో ఆయన వస్తు వివేచనకన్నా రూప పరిశీలన పేర బోలెడు భాషా చర్చ చేశారు. వచన కవిత్వాన్ని చిన్న చూపు చూసేవారికి అందులో ఉన్న సొగసు చూపించడంతో పాటు పద్యాన్ని పాతచింతకాయ పచ్చడిగానో, సాంప్రదాయిక ధోరణిగానో కొట్టిపారేసే వారికి పద్య రచనలోని అందాలు గ్రహించడానికి అనేక సాధనాలు అందించారు. నవ్యత, ఆధునికత రూపంలో ఉండదు, సారంలో ఉంటుందని భాషా పరామర్శ ద్వారా చూపించారు. క్రిటికల్‌ అప్రీసియేషన్‌ అన్న పాశ్చాత్య విమర్శా పరికరాన్ని చేరా వినియోగించినట్టుగా మరెవరూ వినియోగించలేదు. ఆయన సాహితీ అంశాలను చర్చిస్తూ వారం వారం రాసే రోజుల్లో ఆయన చేత తమ కవిత్వాన్ని సిఫార్సు చేయించుకోవాలని ఆరాటపడ్డవారు ఎంతమందో! ఆయన చూపిన పద్ధతిలో భాషా శాస్త్రంలో ఆసక్తి, సాహిత్యంపై ప్రేమ ఉన్నవారు ఎవరైనా ఆయన కృషిని కొనసాగించడంకన్నా భాషా సేవ ఏమీ ఉండదు.
      తెరచాటున ఉన్నట్టే ఉంటూ తెలుగు భాషకు, తెలుగు పాఠకులకు చేరా చేసిన మహత్తర ఉపకారం... హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌కు తొలి దశలో చాలా కాలం సంపాదకులుగా వ్యవహరించడం. హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ తెలుగు పాఠకుల మంచి పుస్తకాల దాహార్తిని తీర్చడంలో చేరా కృషి తక్కువేమీ కాదు.
మంకు పట్టు మామూలే
చేరా స్వతహాగా ప్రజాస్వామ్యవాదే. కానీ తాను సబబు అనుకున్న అంశంలో ఏ మాత్రం రాజీ పడేవారు కాదు. తెలుగులో కర్మణి వాక్యాలను (పాసివ్‌ వాయిస్‌) రాయగూడదనుకునే వారితో ఒకింత తీవ్రంగానే తలపడ్డారు. కర్మణి వాక్యాలు రాసేటప్పుడు ‘చెప్పబడింది’ లాంటివి తారస పడతాయి. తెలుగులో పాసివ్‌ వాయిస్‌ లేదు అనేవారు ‘బడు’ రాయగూడదని వాదిస్తుంటారు. కొందరు పండితులు ‘బడు’ రాసేవారు ‘బడుద్ధాయిలు’ అని ఎద్దేవా చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ధోరణిని వ్యతిరేకించదలుచుకున్నప్పుడు ‘‘బడు రాయటం చేతకాని వాళ్లే బడుద్ధాయిలు’’ అని చేరా తీవ్రంగా స్పందించారు. బడు రాయకూడదనడాన్ని ‘భాషా రౌడీయిజం’, ‘భాషా నాజీజం’ అన్న ముద్ర కూడా వేశారు. బడు రాయగూడదనే వారు అది శ్రవణ సుభగంగా ఉండదనీ, కృతకమనీ, సహజం కాదనీ వాదిస్తారనీ ఇవన్నీ ఆత్మాశ్రయ భావాలని చేరా అభిప్రాయం. బడు ఇంపుగా ఇమిడిపోయిన వాక్యాలను ఉదాహరించారు. వాక్యంలో కర్త తెలియనప్పుడూ, కర్త చెప్పటానికి ఇష్టపడనప్పుడూ, కర్తకు ప్రాధాన్యం లేనప్పుడూ, కర్మకు ప్రాధాన్యం చెప్పదలుచుకున్నప్పుడూ కర్మణి వాక్య ప్రయోగం అవసరమవుతుంది అని వాదిస్తారు చేరా. ఆయన సమర్థన సబబే కావచ్చు గానీ ఆ సమర్థనా ఆత్మాశ్రయ రీతిలోనే ఉంది. ‘‘బడు చేసుకున్న పాపమేమిటో అని నా ఎదురు ప్రశ్న’’ అన్నదీ ఆత్మాశ్రయ వాదనేగా!
      ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలు ఏర్పడినప్పుడు వాటి రూపు రేఖలు నిర్ణయించడంలో చేరా పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పాఠ్య పుస్తకాలను రొడ్డకొట్టుడు పద్ధతి నుంచి తప్పించి స్వయంగా చదువుకుని డిగ్రీలు సంపాదించే వారికి వీలుగా రూపొందించడంలో కేతు విశ్వనాథ రెడ్డికి అండగా నిలిచింది చేరానే. వీరిద్దరూ పాఠ్య పుస్తకాల రచనా శైలిని నేలమీద నిలబెట్టడానికి ప్రయత్నించారు.
      ఆయన వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, గోష్ఠుల్లో వందల సంఖ్యలో పత్రాలు సమర్పించారు. అందులో గణనీయమైన భాగం ఇంగ్లీషులో కూడా ఉన్నాయి. అవి తెలుగు సాహితీలోకానికి అందనే లేదు. అవి అందుబాటులోకి వచ్చి ఉంటే ఆయన భాషా సేవ మరింత స్పష్టంగా తెలిసేది.


వెనక్కి ...

మీ అభిప్రాయం