త‌ల్లిపాల తెలుగు

  • 215 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.సుమనశ్రీ

  • కూచిపూడి నృత్య శిక్షకురాలు
  • తిరుపతి.
  • 9490401968
కె.సుమనశ్రీ

నవమాసాలూ మోసిన తల్లి తన పాపాయికి వేసే జోలల ముత్యాలూ, లాలల వరహాలూ తెలుగు ముంగిళ్లలో తేనెలూరుతూనే ఉన్నాయి. ముద్దు ముచ్చట్లు పాటల పందిళ్లలో పాపాయి బుగ్గల్లో మెరుపుల పూలు పూయిస్తూనే ఉన్నాయి. తరతరాల నుంచీ తన మాటలు/ పాటలు ‘అమ్మపదాలు’గా తెలుగువారి గుండెల్లో ఊయలలూగుతూనే ఉన్నాయి. 
బిడ్డల
పెంపకంలో,  ఆలనాపాలనా చూడటంలో తెలుగు లోగిళ్లలో చూపే ప్రేమానురాగాల రంగరింపు, ఆత్మీయతా నుబంధాల మేళవింపు మహా ఇంపుగా ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ కాలాను గుణంగా మార్పులు వచ్చినప్పటికీ మన అమ్మమ్మలు, అమ్మల కాలానికి వెళ్లి పరిశీలిస్తే ఈ తరంవాళ్లు ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో తెలుస్తాయి.
      స్త్రీవిద్యకు అంతగా ప్రాధాన్యత లేని ఆ కాలంలో పిల్లల పెంపకంలో తల్లి చూపే శ్రద్ధలో శాస్త్రీయత ఎంతో కనిపిస్తుంది. శిశువును పెంచడంలో ఎంతో విజ్ఞానదాయినిలా ప్రవర్తిస్తుంది తల్లి. విజ్ఞానవంతమైన, విలాసవంతమైన ఇప్పటి కాలంలో పిల్లల్ని యంత్రాల్లా తయారు చేస్తున్నాం మనం. అప్పట్లో కుటుంబవ్యవస్థ పటిష్ఠంగా ఉండేది. ఉమ్మడితనమే మూలస్తంభంగా ఆత్మీయానురాగాల కలబోతగా ఉండేది. అలాంటి కుటుంబంలోకి కొత్తగా వచ్చిన శిశువును ఎంత అపురూపంగా పెంచేవాళ్లో చూస్తే ఎవరికైనా అసూయ పుడుతుంది. ఊయల కూడా విద్యుత్తు మీటతో ఊగటం నేటి పద్ధతి.
తేనెతో స్వాగతం...
శిశువు పుట్టగానే మొదట తేనెతో పెదవులు అద్దుతారు. కొత్త లోకానికి తీపి స్వాగతం అలా మొదలవుతుంది. తేనె ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలే పట్టేవారు. లేలేత శిశువుకు స్నానం చేయించడం ఓ ప్రత్యేక ప్రక్రియ. శరీరమంతా నువ్వుల నూనెతో మర్దించి, కాసేపు తల్లిచీర నేలపై పరచి లేత ఎండ సోకేలా పడుకోబెట్టేవారు. నువ్వుల నూనె శ్రేష్ఠమైంది. లేత సూర్యరశ్మి నుంచి మన శరీరం ‘డి’ విటమిన్‌ గ్రహిస్తుందన్నది తెలిసిందే. అప్పటివారికి ఈ విషయాలు తెలియకున్నా ఎముకలు, నరాలు పుష్టిగా ఉండాలని అలా చేసేవారు. పాపాయిని కాళ్లపై పడుకోబెట్టుకుని...
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
సంజీవి జీర్ణం సర్వకాయ జీర్ణం
ఏనుగుదిన్న వెలగలా పాపాయ్‌ తిన్న ఉగ్గంత
జీర్ణించి జీర్ణించి
పందల్లె పారాడి
కుందల్లె కూచుని నందల్లె నడిచి
చీమంత చురుకు, పామంత పరుగు 
పాపాయికి రావాలి 

      అని పాడుతూ సున్నితంగా చేతులు కాళ్లు సాగతీసి తీరైన ఆకృతి వచ్చేలా జాగ్రత్త పడేవారు. తల్లిగానీ అమ్మమ్మ గానీ పాట పాడుతూ ఇలా చేస్తుంటే పాపాయి ఆసక్తిగా ఆలకించేది. పాటలో విన్పించే వాతాపి, సంజీవి, ఏనుగు, పంది, కుందు, చీమ మొదలైనవాటి గురించి ఇంట్లో ఉన్న మిగతా పిల్లలు అడిగి తెలుసుకునే వాళ్లు. పిల్లలు విజ్ఞానవంతులు కావడమే పెద్దల లక్ష్యం కనుక విసుక్కోకుండా చెప్పేవారు. తనను చంపాలనుకున్న వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులను తన కడుపులో జీర్ణం అయిపోవాలని అగస్త్యుడు అనడం పురాణగాథ. మిగతా పాట జంతువుల్లో ప్రత్యేకతలు తెలుపుతూ సాగుతుంది. 
      మధ్యాహ్నం 3-4 గంటలప్పుడు బిడ్డను కాళ్లపై కూచోబెట్టుకుని మెడకింద ఒక చెయ్యి చాపి నెమ్మదిగా ముందుకూ వెనక్కి ఊపుతూ...
ఏనుగమ్మా ఏనుగూ- ఏ ఊరొచ్చిందేనుగూ
మా ఊరొచ్చిందేనుగూ- మంచినీళ్లు తాగిందేనుగూ
ఊరూర తిరిగిందేనుగు- ఉప్పునీళ్లు తాగిందేనుగూ
గుళ్లోకి వెళ్లిందేనుగు- టెంకాయ కొట్టిందేనుగూ 
రామునికి మొక్కిందేనుగూ- అంబారి కట్టిందేనుగూ
ఏనుగు మీదా రాముడూ- ఎంతో చక్కని దేవుడూ

చిట్టిచిట్టి పాపడూ- మా ఇంటి దేవుడూ’ అని పాడేవారు. విచిత్రమేమంటే పుట్టి రెండు నెలలే అయినప్పటికీ, ఆ శిశువు ఓ మూడు రోజులపాటు అలా చేస్తే నాలుగో రోజు ఆ పాట వినగానే తనంతట ముందుకు వెనక్కి ఊగుతాడు. శరీరం సమతుల్యత సాధించేందుకు మెడ నుంచి వెన్నెముక పొడవునా దృఢంగా మారేందుకు లయబద్ధంగా ఒక కదలికను అలవాటు చేసేందుకే ఇదంతా. గర్భస్థ శిశువులు కూడా విని అవగతం చేసుకోగలరని ప్రహ్లాద, అభిమన్యుల చరిత్రల నుంచి తెలుస్తుంది. రెండు నెలల పాప లోకం తెలియకున్నా మన మాటలకు అనుగుణంగా స్పందించడాన్ని బట్టి ఈ విషయం రుజువవుతుంది. స్నానం పోసిన తరువాత మిగిలిన నీళ్లను ‘శ్రీరామ రక్ష’ అంటూ పాపచుట్టూ తిప్పి తల్లి కాళ్లపై పోస్తారు. ఇక నాలుగో నెలలో బిడ్డ చెయ్యి పుచ్చుకుని అటుఇటూ ఊపుతూ...
చెయ్యూచమ్మా- చెయ్యూచు
చేనుకు పోదాం- చెయ్యూచు
కండెలు తెద్దాం- చెయ్యూచు
కాల్చుకు తిందాం- చెయ్యూచు
ఇరుగుకు పొరుగుకు- చెయ్యూచు
ఇచ్చేసి వద్దాం- చెయ్యూచు

      అని చేతులు ఊపుతూ పాట పాడతారు. ఒక్కసారి ఇలా చేస్తే, తల్లి ఆ పాట మొదలు పెట్టగానే బిడ్డ తనంత తానే చెయ్యూస్తుంది. మూడో నెలలో బిడ్డ తన పొత్తిళ్ల బట్టల్ని పిడికిలితో పట్టుకుని మూటలల్లే చుడుతుంది. దాన్ని చూసిన పెద్దలు తండ్రి ఇంటికి వెళ్లేందుకు మూటలు కడుతోందమ్మా అంటారు. కుడుములు చేసి ఇరుగు పొరుగులకు తాంబూలంలో ఉంచి పంచుతారు. పాటల్లోనే ఎంత విజ్ఞానమో! 
      ఆరో నెలలో అన్నప్రాశన చేస్తారు. అంతవరకు అమ్మపాలే ఆహారంగా పెరిగిన బిడ్డకు తొలిసారి ఆహారాన్ని అలవాటు చేస్తారు. వెండిగిన్నెలో పాలు, పంచదార కొద్దిగా బియ్యం వేసి మెత్తగా ఉడికించిన పరమాన్నం ఉంచి మేనమామ బంగారు ఉంగరంతో నోటికి నాకిస్తాడు. వెండి, బంగారు శ్రేష్ఠమైన లోహాలు. బిడ్డకు కొద్దిగా అయినా శరీరంలోకి ఇముడుతాయని అలా చేస్తారు. తర్వాత ఓ వస్త్రాన్ని పరిచి దానిపై కలం, పుస్తకం, ధనం, ధాన్యం, ఫలం, కత్తి ఉంచి బిడ్డను వదులుతారు. పాకుతూ వెళ్లిన శిశువు తనకు తోచిన వస్తువును చప్పున ముట్టుకుంటాడు. పుస్తకం అయితే పెద్ద చదువరి అనీ, ధనం తాకితే ఆస్తిపరుడనీ, కలం తాకితే కవి అనీ ఇలా ఏదో ఒక రంగంలో గొప్పగా రాణించే విధానాన్ని సూచిస్తుందన్నది నమ్మకం. అరచేయిని పువ్వులా అమర్చి ‘తారంగం తారంగం/ తాండవకృష్ణా తారంగం...’ అంటూ పాడతారు. పిల్లలు దాన్ని అనుకరించి చేతిని పువ్వులా అమర్చేందుకు ప్రయత్నిస్తూ అలా చేస్తుంటే ఎంతో ముద్దేస్తుంది. దూలానికి కట్టిన తల్లి చీరలో పాపాయిని ఉంచి నిద్ర పుచ్చుతూ, ‘చిచ్చొళ్లొళ్లోళ్లోలో... హాయీ/ హాయీ హాందా- ఆపదలుగాయీ/ చిన్ని పాపనుగాయి- శ్రీరంగసాయీ’ అని దేవుణ్ని తలుస్తూ ప్రారంభించి...
చిలకల్లు చెలరేగి జీడికొమ్మెక్కూ
పాపాయి చెలరేగి మామభుజమెక్కు
మామ భుజమెక్కితే - మామేమి ఇచ్చూ
పాల్దాగు గిన్నిచ్చు - పాడావునిచ్చూ...
అంటూ పాడతారు. 
      పాపాయికి అమ్మ అన్నో తమ్ముడో వెండిగిన్నో, గ్లాసో ఇస్తాడు. అంతేకాదు నిరంతరం తాగేందుకు లోటు లేకుండా పాడి ఆవునూ మామయ్యే ఇస్తాడట. ‘చిన్నారి మాపాప ఆడుకోబోతే/ ఆడించవచ్చింది హంసపిట్టొకటీ/ పాలివ్వవచ్చిందీ పాలపిట్టొకటీ/ నీళ్లివ్వ వచ్చింది నీలిపిట్టొకటీ...’ అంటూ పాడతారు. అసలు ఇన్ని పిట్టల్ని ఇప్పటి పిల్లలు ఎప్పుడైనా చూస్తారా? ప్రకృతిని కళ్లకు కట్టినట్లు బిడ్డకు వివరించే ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంది. ఆ పసిబిడ్డతోపాటు చుట్టూ ఉన్న ఊహ తెలిసిన పిల్లలు పాలపిట్ట ఇదేనా, నీలిపిట్ట ఏదమ్మా అంటూ అడగటం, అమ్మో, అమ్మమ్మో వాటిని చూపించడంలో ఉన్నది ‘దృశ్యశ్రవణ’ విద్యా విధానమే. 
      ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడేవారు. అందుకే...
అయినింట పుట్టింది- అమ్మ మాలచ్చీ 
అందరికి ఆనంద భాగ్యమిచ్చిందీ
చేత గాజులు బెట్టి కాళ్ల కడియాలెట్టి 
తాతయ్య ముచ్చటగ తన గౌరవించే 
నుదుట చాదూబెట్టి తలను పూలూ ముడిచి
 అమ్మమ్మ తనతోనె లోకమై గడిపే...
అంటూ బారసాలప్పుడు పాడే ఈ పాటలో ఆడపిల్ల పుడితే ఏం చేస్తారో చెబుతారు. ఆ పసిపాపను శ్రీమహాలక్ష్మిగా భావించి తాతయ్య (తల్లి తండ్రి) ఏమేం పెట్టి గౌరవించాడో చెప్తారు. తొలి కాన్పు పుట్టింట జరగటం తెలుగింటి సంప్రదాయం. కనుక ఆ శిశువు ముచ్చట్లన్నీ మొదట అనుభవించేది అమ్మమ్మ, తాతయ్యలే. అమ్మమ్మ ఓ వైపు తన బిడ్డ బాలింత కనుక, ఆమెకు ప్రత్యేక సపర్యలు చేస్తూనే కాస్త సమయం దొరికితే మనుమణ్నో, మనుమరాలినో ఎత్తుకుని ఆడించి మురిసిపోతుంది. నుదుట ‘చాదు’ పెట్టి... అప్పట్లో రంగుల తిలకాలు, రసాయనాలు ఉన్నవి వాడేవాళ్లు కాదు. బిడ్డ పుట్టగానే అమ్మమ్మ ఓ బాణలిలో సగ్గుబియ్యం నెయ్యీ వేసి అవి నలుపు తిరిగేంత వరకూ వేయించేది. అవి క్రమంగా ముద్దగా మారతాయి. దాన్ని రాచిప్పలో తీసి ఉంచుతుంది. చాదుతో బొట్టు దిద్దిన పాప ముఖం ఎంతో ముచ్చట గొలుపుతుంది. అంతేకాదు, చాదు పెట్టడంవల్ల పిల్లలకు దృష్టి దోషం ఉండదని నమ్మకం. భృకుటిలో ఉండే జ్ఞాననాడుల కూడలికి రక్షణ కవచంగా ఇది పని చేస్తుంది. చాదు గురించి ఇప్పుడు ఎంతమందికి తెలుసు?
ప్రతీది పండుగే...
పెద్దలకైతే పాపాయి వేసే ప్రతి అడుగూ, పెరిగే క్రమం అన్నీ సంబరమే. పాపాయి మూడు నెలల్లోపు ఊ.. ఉక్కూ అని పలుకుతుంది. అప్పుడు ఊకిళ్లకు ఉగ్గిన్నెలు అంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచి తాంబూలం ఉంచి పంచేవారు. అలాగే...
బోర్లపడితే బొబ్బట్లు పంచీ
జరిగితే పాపాయి బొరుగులుండల్లూ
దోగాడితే పాప దోసె వాయినమూ
గడపల్లు దాటితే కజ్జికాయల్లు
కూచుంటే పాపాయి కుడుముల్ల పండుగా
అడుగులూ వేసితే అరిసెల్లు బంచీ
పలుకులకు పంచదార చిలకల్లు పంచీ
నవ్వులు రువ్వితే నువ్వుండలిచ్చీ...

      ఇలా బిడ్డ మొదటిసారి ఏది చేసినా పండుగే. అది సూచిస్తూ ఏదో ఒక తీపి పదార్థాన్ని ఇరుగు పొరుగు వాళ్లకు పంచేవాళ్లు. పాపాయి కాస్త పెరిగి మాటలు అర్థం చేసుకునేటప్పుడు ‘చేత వెన్నముద్ద చెంగల్వపూదండ’ లాంటి చిన్న చిన్న దైవ సంబంధ పద్యాలు నేర్పేవారు. వచ్చీరాని ముద్దుపలుకులతో వాటిని పలుకుతుంటే పొందే ఆనందం అనుభవిస్తేగానీ తెలియదు. అందుకే ‘వచ్చీరాని మాటలు ముద్దు/ తోడీ తోడని పెరుగు తీపి/ ఊరీ ఊరని ఊరగాయే రుచి’ అంటారు. తాతయ్య ఒడి బడిగా ఇలాంటివి నేర్చుకుంటారు. ఇక అమ్మమ్మ ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’, చిన్న చెంబుతో నీళ్లు/ సీకాయ ఉదకంబు/ అల్లంబు బెల్లంబు- అరటిపండూ/ తేనెలో మాగిన తియ్య మామిడిపండు/ అచ్చన్న వరదాలు బుచ్చి కేశవులూ... వంటివి చెప్పేది. తండ్రి ప్రేమతో బిడ్డని వీపున కూచోబెట్టుకుని, ‘ఛల్‌ఛల్‌ గుర్రం చలాకీ గుర్రం...’ అంటూ మోకాళ్లతో నేలపై పాకుతూ ఆడిస్తే, తల్లేమో ‘ఉయ్యాల- జంపాల/ లాలిక్కి- లక్కచిట్టి/ దొడ్డోని- దొంగోడా/ వాకిట్లో- వంకాయా/ టక్కరిదొంగా- ఎవరంటే/ మా బుజ్జి బాబూ’ అంటూ ఊపుతూ ఎగరేసి పట్టుకుంటుంది. దాంతో బిడ్డ కిలకిలా నవ్వుతుంది. అది చూసిన తల్లి తన్మయత్వం చెందుతుంది. ఈ ఆటవల్ల తల్లి పొత్తికడుపు పెద్దదిగా పెరగకుండా నాజూగ్గా తయారవుతుందట. ఆటకు ఆట, వ్యాయామానికి వ్యాయామం.
అదిగో బూచోడు...
నాలుగైదు ఏళ్ల వరకు బిడ్డల్ని నిద్రపుచ్చడం ఓ పెద్ద ప్రక్రియ. ఆటల మీదే దృష్టి ఉన్న పిల్లలు అసలు నిద్రపోరు. అప్పుడు అమ్మ బిడ్డని పక్కన పడుకో బెట్టుకొని, ‘బూచి వాణ్నీ నే పిలిచేదా/ బుట్టా పట్టుకు రమ్మనేదా/ బుద్ధిగ నిద్దరపోక బుల్లోడా అల్లరేలా’ అని పాడుతుంది. దానికి ఆ బిడ్డ, ‘ఆ బూచెట్టుంటాడమ్మా/ ఆ బూచెట్టుంటాడమ్మా- ఆ బూచివాడు వస్తేను/ నీ చెంగు కప్పుకుంటాను- నువ్‌ చెప్పబోకె మాయమ్మ/ పట్టించబోకు మాయమ్మా’ అని ప్రాధేయపడతాడు. తల్లి బూచిని వర్ణిస్తూ... ‘నల్లాని బూచి వాడూ/ నామాలు పెట్టుకుంటాడూ/ పళ్లికిలించు కుంటాడు/ పెద్ద సంచి తీసుకొస్తాడు/ నువ్వల్లరి మానకపోతే/ నిను పట్టుకునీ పోతాడూ’ అని పాడుతుంది. ఇక ‘జో అచ్యుతానంద జోజో ముకుంద’ లాంటి పాటలు అనాదిగా పిల్లల్ని నిద్రపుచ్చేందుకు తెలుగు తల్లులు పాడుతున్నవే. ‘రామా లాలీ మేఘశ్యామా లాలీ/ తామరస నయనా దశరథ తనయా లాలీ/ అద్దాల ఊయల్లో ఏదో సందేహించేవూ/ ముద్దు తమ్ముడున్నాడంటే మురిసీ నవ్వేవూ/ ఎంతో ఎత్తు మరిగినావు ఏమిచేతురా/ పంతమాడక చిన్ని రామా నిద్దురపోరా’ అని పాడుతారు. 
      పిల్లల్ని ఎక్కువగా ఎత్తుకోకూడదు. ‘ఎత్తు మరిగిన బిడ్డ చంక దిగడు’ అని సామెత అందుకే పుట్టింది. స్వాభావికంగా బిడ్డలు ఏమేం చేయాలో అవే చేయాలి. మట్టి అంటుకుంటుందనో, మరోటనో మనం ఎత్తుకోకూడదు. వాళ్ల శరీర తత్వానికి అది మేలు చేయదు. వాళ్ల స్వయంబుద్ధి దెబ్బతింటుంది. పదిమంది కలిసి తింటుంటే  బిడ్డలు దోగాడుతూ వచ్చి ఏదో ఒక కంచం లోంచి మెతుకులు తీసి నోట్లో పెట్టుకుం టారు. వాళ్లనెవరూ వారించరు. ‘ఏరుకు తింటే ఏనుగంత శక్తి’ అంటారు. డబ్బాల్లో చెంచాల సాయంతో కింద పడకుండా తినటం చేతకాక బిక్కముఖం వేసే ఇప్పటి బడిపిల్లల్ని చూస్తే గుండె కరిగిపోతుంది.
విజ్ఞానమంతా పాటల్లోనే
‘నరాలవాణ్నీ, నామాలవాణ్నీ/ పుల్లనివాణ్నీ, చీమిడిముక్కువాణ్నీ/ సంచిలో తెచ్చేరు సంతకెళ్లి తాతయ్య’ అంటూ సంచిలోంచి కూరగాయలు తీసి చూపుతుంది అమ్మమ్మ. నరాలవాడు బీరకాయ, నామాలవాడు పొట్లకాయ, పుల్లవాడు చింతకాయ, చీమిడిముక్కుల వాడు బెండకాయ కిలకిలా నవ్వుతూ అలవోకగా వాటిని గుర్తు పెట్టుకుంటారు పిల్లలు. ఇది ఒకప్పటి తెలుగిళ్లలో అమ్మభాషలో కూరగాయల పరిచయ కార్యక్రమం. ఇప్పుడు కూరగాయలు అంటే అర్థం కాదు. వెజిటబుల్స్‌ అనాలి. ‘ఆదివారమునాడు అరటి మొలిచింది/ సోమవారము నాడు సుడివేసి పెరిగింది...’ అంటూ వారాలను పరిచయం చేసేవాళ్లు. కూడిక, తీసివేత లాంటి గణితశాస్త్ర అంశాలనూ పాటల రూపంలో చేసేవాళ్లు. 
పదీ చిలుకలూ పాడుతుండగా
పాడలేక ఒకటి పోతే మిగతా తొమ్మిదీ
.....................................
రెండు చిలకలు రొప్పుతుండగా
రొప్పలేక ఒకటిపోతే మిగలిందొకటి 
ఒక్క చిలుకా ఉండలేక
ఎగిరిపోగా మిగిలింది సున్నా

      ఇలా ఆరోహణ, అవరోహణ క్రమంలో అంకెలు పాటల ద్వారా నేర్పించేవారు. పిల్లలకిష్టమైన జంతువులను పక్షులను, పువ్వులను కలిపి పద్యాల్లా వరసలు కట్టి నేర్పటం వల్ల పిల్లలకు విద్య శిక్షలా అన్పించేది కాదు. బడిలో చేరక మునుపే పునాది ఏర్పడేది. ‘రాకుమారులూ- ఏడుచేపలూ’, ‘చీమా చిలుకా పాయసం’, ‘పొట్టిపిచ్చుక పొంగలి వండే కథ’ ఇలా పిల్లలకు ఆసక్తి రేకెత్తించేలా ఆప్యాయంగా కథల రూపంలోనే వారికి అవసరమైన విజ్ఞానాన్ని అందించేవారు. చివరికి నీతి కథలూ పాటల రూపంలోనే అందించేవాళ్లు.
ఈగమ్మ ఈగమ్మ ఇంటికి వస్తావా
మా ఇంటి సోద్యము ఎక్కడైనా చూశావా
పట్టెమంచము పరుపు పరచి ఉంచానే 
చుట్టూ దోమతెరలు కట్టి ఉంచానే నీ రాక
కోసమై వేచి యున్నానే అని పిలుస్తుంది.
ఈగకు ఆ పిలుపు సాలి గూడు ఎంతో నచ్చాయట
జుయ్‌మని ఎగిరి ఝామ్మని పోయె
సాలెగూటిలో చిక్కుకుపోయి
సాలిపురుగుకు విందైపోయె

      ఆడంబరాలు ఆశించొద్దు. ప్రలోభాలకు లొంగటం చేటు అనే నీతిని ఈ గేయం వివరిస్తుంది. మనిషి ఎలా మెలగాలన్న దాన్ని చిన్న వయసులోనే చెప్పి, నీతిమంత మైన జీవితం గడిపేలా బిడ్డలను తీర్చి దిద్దడం తెలుగువారి ప్రత్యేకత. ఇదీ మన పెద్దల కాలపు బిడ్డల పెంపకపు పద్ధతి.


వెనక్కి ...

మీ అభిప్రాయం