విధం... పథం మారాలి

  • 595 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। కప్పగంతు రామకృష్ణ

  • తెలుగు అధ్యాపకులు
  • విజయవాడ
  • 9032044115
డా।। కప్పగంతు రామకృష్ణ

భాష మనోవికాస సోపానం. అన్ని ఇతర శాస్త్రాలు మానవుడి భౌతికాంశాలపై చర్చిస్తే, భాష మాత్రం మనిషి మనసుతో చర్చిస్తుంది. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా మనిషి ఎదగడానికి అవసరమైన నైతిక, సామాజిక విలువలను అతనిలో పెంపొందిస్తుంది.  బాహ్యంగా చూస్తే ఏవో కొన్ని కథలు, వ్యాసాలు అన్నట్లుగానే భాష కనిపిస్తుంది. కానీ, అంతర్లీనంగా దృష్టిసారిస్తే భాష లక్ష్యం వేరే ఉంటుంది.
      ఈ విషయంలో మాతృభాష ఇతర అన్ని భాషల కన్నా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అమ్మభాషలో చెప్పిన (నేర్చిన) విషయం మనిషి మనసులో చెరగని ముద్ర వేస్తుంది.
      కాలక్రమంలో అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టుగానే విద్యావ్యవస్థలోనూ మార్పు వచ్చింది. బోధన పద్ధతులు, విధానాల్లో కొత్త పోకడలు వచ్చాయి. సమగ్ర నిరంతర మూల్యాంకనం పేరుతో నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో అన్ని విషయాల్లో (సబ్జెక్ట్‌) కొత్త విద్యాప్రణాళిక (కరికులం) అమల్లోకి వచ్చింది.
      ఈ విధానంలో భాషా బోధన దృక్పథం మారింది. ఆరు నుంచి పదో తరగతి వరకు వచ్చిన కొత్త పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సనాతన పద్ధతులు వదిలి భాషా బోధన, అభ్యాసాల్లో నూతన కోణాన్ని పాఠ్యపుస్తక నిర్ణేతలు, రచయితలు ఆవిష్కరించారు. నూతన పాఠ్యపుస్తకాల్లోని విషయసూచికలో ఈ విషయాన్ని రచయితలు స్పష్టంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ కోణాన్ని అందిపుచ్చుకుని తమ బోధనా విధానాన్ని ఆధునికీకరిస్తే భాషా బోధన లక్ష్యాలను నూరుశాతం సాధించవచ్చు.
      ఇప్పటిదాకా తెలుగు అనగానే...  ‘పద్యాలు,  గద్యాలు... అంతేకదా!.  పాస్‌మార్కు  వస్తే చాలు. ఆఁ! అంతకన్నా  ఎక్కువ మార్కులు వచ్చి మాత్రం ఏం ఉపయోగం?’ అన్న భావన విద్యార్థుల్లో బాగా నాటుకుపోయింది. అసలు తెలుగులో చెప్పడానికి ఏం ఉంటుంది? అనే వ్యాఖ్యానాలు ఇతర ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తాయి. లెక్కలు, భౌతికశాస్త్రం గట్టిగా చెప్పండి. తెలుగు మేం ఇంట్లో అయినా చదివించుకుంటాం... ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నివేదన ఇది. అవసరమైతే సమయసారిణిలో (టైం టేబుల్‌) తెలుగు తరగతులు నాలుగు తగ్గించి లెక్కలు, బÅౌతికశాస్త్రాల అభ్యాసానికి కేటాయించమని ప్రధానోపాధ్యాయుల ఆదేశం. ఇలా తెలుగుపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో తెలుగు బోధన, అభ్యాసాలపై నిరాసక్తత ఏర్పడింది. దీనిని విడనాడి తెలుగు భాష సాధించే ప్రయోజనాల్ని సమాజానికి చాటి చెప్పాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులపై ఉంది. మనం చెబుతున్నది ఎంత ప్రయోజనకర అంశమో అర్థమైతే పిల్లల్లో, తల్లిదండ్రుల్లో తెలుగుపట్ల ఆదరణ పెరుగుతుంది.
      తెలుగు పండిత శిక్షణలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ విషయంలో సత్ఫలితాలు వస్తాయి. మా కళాశాలలో చేసిన ఓ ప్రయోగం ఈ విషయాన్ని నిర్ధరిస్తోంది. ఈ ఏడాది నా తరగతిలో ఛాత్రోపాధ్యాయులకు (బీఈడీ విద్యార్థులు) కొత్త రీతిలో శిక్షణ ఇచ్చాను.
ఆ విధానం ఏంటంటే?
సహితస్య భావం సాహిత్యం- సమాజానికి మేలు చేకూర్చేదే సాహిత్యం. తెలుగు పాఠ్యాంశాల నుంచి సమాజ హితాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఆసక్తికరంగా ఉంటూనే కల్పనలు, వర్ణనలు విడిచి సూటిగా భాషా ప్రయోజనాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇందుకోసం ఎంచుకున్న మార్గం- భాషా బోధనలో సామాజిక ప్రయోజనాన్ని మిళితం చేసి, వర్ణనలు, ఇతర విశేషాలకు స్థానం తగ్గించి, భాష చదివితే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం. నన్నయ సాహిత్యం నుంచి ఆధునిక వ్యాసం వరకు ఆయా రచయితలు, కవులు ఆకాంక్షించిన ప్రయోజనం, వాటిలోని సామాజిక, వైజ్ఞానికాంశాలకు బోధనలో ప్రత్యేకస్థానమివ్వడం.
      భాషను భాషగా చెబుతూనే ఆ పద్యం/గద్యంలోని వైజ్ఞానిక కోణాన్ని విద్యార్థులకు చెప్పాలి. పాఠాన్ని మూసపద్ధతిలో కాకుండా, వైజ్ఞానిక కోణాలకు ప్రాధాన్యత ఇస్తూ వివరించాలి. అప్పుడే నేటి విద్యార్థి భాషాధ్యయనానికి మొగ్గుచూపుతాడు. అన్నం తిననంటూ మారాం చేసే బిడ్డకు అమ్మ ఇచ్చే తాయిలం లాంటిదే ఇదీ.
      ఆధునిక విద్యావ్యవస్థలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, యాజమాన్య నైపుణ్యాలు, ఒత్తిడి నివారణోపాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. వీటికోసం ప్రత్యేక శాస్త్రాలు అధ్యయనం చేయక్కర్లేదు. ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయి.
      ఉదాహరణకు ఎనిమిదో తరగతిలో ఆచార్య బిరుదురాజు రామరాజు రచించిన ‘మన సంస్కృతి’ పాఠం ఉంది. ప్రాచీనం నుంచి ఆధునికం వరకు వస్త్రధారణ, వివాహాది కార్యక్రమాలు, పండుగలు, ఆచారాల్లో వచ్చిన మార్పులను అందులో రచయిత పేర్కొన్నారు. ఈ పాఠం చెప్పేటప్పుడు పాఠం చదువుతూ వివరించడం కన్నా విద్యార్థులతోనే స్వయంగా విశ్లేషణ చేయించాలి. మన సామాజిక అంశాల్లో దాగిన సాంస్కృతిక విశేషాలేమిటో వాళ్లే గుర్తించేలా చేయాలి. నాటికి, నేటికీ వస్తున్న మార్పులేమిటో పిల్లలతోనే చెప్పించాలి. సంస్కృతిని కాపాడాల్సిన అవసరాన్ని వాళ్లంతట వాళ్లే గుర్తించేలా బోధనా విధానాన్ని అనుసరించాలి.
      ‘సముద్రలంఘనం’ పాఠంలో హనుమంతుడు లంకకు చేరడానికి సముద్రాన్ని లంఘించిన వృత్తాంతముంది. ఇక్కడ హనుమంతుడు దేవుడు, అతనికి అతీత శక్తులు ఉన్నాయని చెప్పే బదులు కార్యసాధకుడి లక్షణం, నాయకత్వ లక్షణాలు వివరించాలి. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు పరిసరాల్ని గమనించిన విధానం అందులో ఉంది. అంటే కార్యసాధకుడికి నిశిత పరిశీలన, జాగరూకత ఎంత అవసరమో విద్యార్థులకు చెప్పాలి.
      ‘అమ్మకోసం’ పాఠం (నన్నయ రచన) చెప్పేటప్పుడు వర్తమానంలో తల్లిదండ్రుల పట్ల జరుగుతున్న అమానుష చర్యల్ని చెబుతూ, అవి ఎందుకు కూడవో వివరించాలి. ‘ఇల్లు ఆనందాల హరివిల్లు’ పాఠాన్ని ఇప్పటి కుటుంబ పరిస్థితులకు చక్కగా అన్వయం చేయవచ్చు.
      గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన ‘దుందుభి’ ప్రకృతి పరిశీలనకు అనువైంది. అపార్ట్‌మెంట్ల సంస్కృతిలో మనం కోల్పోతున్న ప్రకృతి విలువలు ఏమిటో విద్యార్థికి చెబుతుంది. ఎనిమిదో తరగతిలోనే ఉన్న ‘చిన్నప్పుడే’, ‘జీవనభాష్యం’ పాఠాలు విద్యార్థిలో సామాజిక స్పృహను తట్టిలేపుతాయి.
      పదో తరగతిలోని ‘మాతృభావన’ నుంచి స్త్రీలను గౌరవించాల్సిన పద్ధతి నేర్పించవచ్చు. బోయి భీమన్న రాసిన ‘జానపదుని జాబు’ పాఠం నుంచి రైతు కష్టాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి. రైతు చిందించే స్వేదం దేశాన్ని ఎలా నడిపిస్తోందో, అలాంటి రైతుకు మనం ప్రతి  ఫలంగా ఏం చేస్తున్నామో విద్యార్థులతో ఆలోచింపజేయాలి.
      శ్రీనాథుడి రచన ‘భిక్ష’ పాఠం నుంచి మానవ స్వభావాన్ని విశ్లేషింపజేయాలి. అన్నపూర్ణాదేవి స్వయంగా వ్యాసుడికి భోజనం పెడతానంటే శిష్యులతో కలిసికానీ భోజనం చేయనని, అది తన నియమమని, వాళ్లకి కూడా పెడతానంటేనే తాను భోజనం చేస్తానని వ్యాసుడు అంటాడు. గురుశిష్య సంబంధాల ఔన్నత్యాన్ని ఈ పాఠం ద్వారా విద్యార్థుల్లో ఉద్దీపింపజేయవచ్చు. అలిశెట్టి ప్రభాకర్‌ రాసిన ‘నగరగీతం’ పాఠం ఆధునిక సమాజంలో అడుగంటుతున్న సామాజిక స్పృహను విద్యార్థుల్లో తట్టిలేపుతుంది.
      ఇలా ఆరు నుంచి పదోతరగతి వరకు ప్రతి పాఠం నుంచి ఎన్నో సామాజిక, నైతిక విలువలు నేర్పించవచ్చు. ఇందుకోసం చేయాల్సింది కొత్త పద్ధతిలో భాషాబోధన చెయ్యడమే. తెలుగును సకల సామాజిక, నైతిక, వైజ్ఞానికాంశాల సమ్మేళనంగా విద్యార్థులకు బోధించాలి. పాఠాల్లోని పాత్రలు, కథలను ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా వాటిలోని అంతరార్థాన్ని ఉపాధ్యాయులు విశ్లేషణ చేయాలి. అప్పుడే తెలుగు బోధనకు నిజమైన పరమార్థం సిద్ధిస్తుంది.                                                                        


వెనక్కి ...

మీ అభిప్రాయం