ఆంగ్లానికి బయట ఎంతో విజ్ఞానం

  • 484 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఒకప్పుడు ప్రపంచంలోని ప్రతి భాషలోనూ సాగిన వైజ్ఞానిక పరిశోధనలు ఇప్పుడు ఆంగ్లంలోనే మనుగడ సాగిస్తున్నాయి. ఆంగ్లేతర భాషల్లో సాగుతున్న కొద్దిపాటి పరిశోధనలేమో ప్రపంచానికి అందకుండా పోతున్నాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన టట్సుయా అమానో అనే శాస్త్రవేత్త సిద్ధాంత వ్యాసాలకు సంబంధించి కొన్ని గణాంకాలను సేకరించారు. ఇందుకోసం 2014లో జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మీద వెలువడిన 75 వేల పత్రాలను పరిశీలించారు. వీటిలో మూడో వంతు మాత్రమే ఆంగ్లేతర భాషల్లో ఉన్నాయి. వాటిలోనూ అధిక శాతం స్పానిష్‌, పోర్చుగీస్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌ భాషలకే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితి వల్ల రెండురకాల ఇబ్బందులు ఉన్నాయంటున్నారు అమానో. ఒకటి- ఆంగ్లేతర భాషల్లో వెలువడుతున్న ముఖ్యమైన పరిశోధనలు ఆంగ్ల ప్రపంచానికి చేరట్లేదు. ఉదాహరణకు..
అంతరించిపోతోందనుకున్న ‘పిటా నింఫా’ అనే పక్షి తైవాన్‌లో సంచరిస్తున్నట్లుగా చైనీస్‌ భాషలో ఓ పరిశోధన పత్రం వెలువడింది. కానీ ఆ విషయం అంతర్జాతీయ సమాజానికి తెలియనే లేదు. రెండు- ఆంగ్ల భాషలో జరుగుతున్న పరిశోధనలు ఇతర భాషలకు చేరట్లేదు. ముఖ్యంగా చైనా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌ వంటి దేశాల్లో ఆంగ్లం కంటే స్థానిక భాషలకే ప్రాధాన్యమిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆంగ్లంలో వెలువడుతున్న అనేక పరిశోధనల సారం ఆయా దేశవాసులకు అందట్లేదు.
      ఏతావాతా తేలిందేమిటంటే... ఆంగ్లం లోనే జీవించే వ్యక్తులేమో విజ్ఞానమంతా ఆ భాషలోనే ఉందని నమ్ముతున్నారు. ఇతర భాషల్లో విజ్ఞాన అంశాలు వెలువడుతున్నాయన్న విషయమే వాళ్ల దృష్టికి రావట్లేదు. ఆంగ్లేతర శాస్త్రవేత్తలేమో ఇటు తమది కాని భాషలో పరిశోధనలు చేయలేకా, మాతృభాషల్లో చేసినవి వెలుగులోకి రాక సతమతమవుతున్నారు. దానివల్ల పరిశోధకులకు కలిగే వ్యక్తిగత నష్టం ఒక ఎత్తయితే, విజ్ఞానరంగంలో ఏర్పడే శూన్యం మరో ఎత్తు.
పరిష్కారం లేకపోలేదు
వైజ్ఞానిక పరిశోధనల మీద ఆంగ్ల ఆధిపత్యం తొలగించడం అంత సులువుగా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఏ భాషలో పరిశోధనలైనా ప్రపంచమంతటికీ చేరేందుకు ఓ మధ్యేమార్గం ఉందంటున్నారు అమానో. వైజ్ఞానిక పత్రికలు, శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు వెలువరించే సమాచారాన్ని ఇతర భాషల్లో కూడా అనువదించేలా ప్రోత్సహించాలని చెబుతున్నారు. పూర్తి అనువాదం సాధ్యం కాకపోయినా, కనీసం సారాంశమన్నా కొన్ని ముఖ్య భాషల్లో అందించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం వైజ్ఞానిక పత్రికలు, విశ్వవిద్యాలయాలూ చొరవ చూపాలంటున్నారు. మరి ఈ పిలుపుని ఆలకించేదెవరో!


ఆనాటి బంధం ఏనాటికీ..!

మాతృభాషకు సంబంధించిన మౌలిక సూత్రాలు పసివయసులోనే మెదడులో నిక్షిప్తమైపోతాయట. ఆ తర్వాత వాళ్లు ఆ భాషకు దూరమైనా, ఆ జ్ఞాపకాలు మాత్రం అక్కడ పదిలంగానే ఉంటాయట. నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. శాస్త్రవేత్తలు ఓ పాతిక మంది కొరియన్‌ యువకులను ఎన్నుకొన్నారు. వీళ్లందరూ ఆర్నెల్ల నుంచి పదిహేడు నెలలలోపే డచ్చి కుటుంబాలకు దత్తత వచ్చేశారు. ముప్పయి ఏళ్లు గడిచాక, డచ్చి భాషకు అలవాటుపడ్డాక... ఇప్పుడు వీళ్లకు తమ మాతృభాష గుర్తుండే అవకాశం ఉంటుందా? కచ్చితంగా ఉంటుందనే పరిశోధన ఫలితాలు నిర్ధా´రించాయి. వీళ్లందరూ కొరియన్‌ శబ్దాలను వినగానే ఇట్టే నేర్చేసుకున్నారట. పిల్లల్లో భాషని నేర్చుకునే ప్రక్రియ చాలా త్వరగా మొదలైపోతుంది. ఆ సమయంలో వాళ్లు అలవర్చుకునే నైపుణ్యమే భాషకి పునాదిగా నిలిచిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. కాబట్టి, పసిపిల్లలతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు.


మాటల్లో తొందరొద్దు

కొంతమంది ఉంటారు... గబగబా రైలు పరుగులు తీసినట్లుగా మాట్లాడతారు. ఇలా త్వరగా మాట్లాడటం వల్ల అవతలివాళ్లకి చాలా విషయాలు తెలియజేయగలమన్నది వీళ్ల భావన. కానీ వేగంగా మాట్లాడేటప్పుడు కంటే నిదానంగా మాట్లాడేటప్పుడే ఎక్కువ విషయాన్ని తెలియచేయగలమంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని నిరూపించేందుకు అమెరికాలోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డా॥ కోహెన్‌ ప్రివియా చాలా సమాచారాన్నే సేకరించారు. ప్రివియా సేకరించి, విశ్లేషించిన సమాచారంలో 2,400 టెలిఫోన్‌ సంభాషణలు, 40 ముఖాముఖి కార్యక్రమాలూ ఉన్నాయి. వీటి ద్వారా 398 మంది వ్యక్తుల మాటతీరుని గమనించారు ప్రివియా!
ప్రతి సంభాషణనీ సునిశితంగా విశ్లేషించిన తర్వాత తేలిందేమిటంటే... నిదానంగా మాట్లాడేవారు అరుదైన, ప్రభావవంతమైన పదాలను ఉపయోగించే అవకాశం ఉంటుందట. గబగబా మాట్లాడేవారు మాత్రం తొందరలో ఏదేదో చెప్పేస్తుంటారట. పైగా అలా గబగబా చెప్పే మాటల్ని అవతలివారు విని అర్థం చేసుకోవడంలోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రివియా పరిశోధనలో మరో ఆసక్తికరమైన అంశమూ వెల్లడయ్యింది. నిదానంగా మాట్లాడే సందర్భాల్లో కూడా ఆడవారు చెప్పే విషయాలకంటే, మగవారు చెప్పే విషయాల్నే శ్రోతలు త్వరగా గ్రహించగలుగుతున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. మహిళలు తాము మాట్లాడే విషయం అవతలివారికి చేరుతోందా లేదా అని ఎప్పటికప్పుడు తరచి చూసుకుంటూ మాట్లాడతారట. మగవారు ఇలాంటి జంఝాటం ఏదీ లేకుండా స్వేచ్ఛగా భావప్రకటన చేస్తుంటారు. ఏతావాతా తేలిందేమంటే... మన భావాలను ప్రకటించేటప్పుడు వాటిని నిదానంగా వ్యక్తీకరించాలి. చెప్పాలనుకున్న విషయాన్ని స్వేచ్ఛగా చెప్పగలగాలి. అప్పుడే మన మాట అవతలివారి మనసుని సూటిగా తాకుతుంది.


ఏ పదం ఎంతకాలం?

మనిషికి మల్లే పదానికి కూడా ఆయుష్షు ఉంటుందనీ.. దాని జీవితంలో కూడా ఎగుడుదిగుడులు ఉంటాయని ఎవరన్నా చెబితే నమ్మడం కష్టం. కానీ నమ్మక తప్పదు. ఈమేరకు మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొంతమంది... అర్జెంటీనాలోని జాతీయ పరిశోధనా సంస్థతో కలిసి ఓ ప్రయోగాన్ని నిర్వహించారు.
అంతర్జాలంలో డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉండే పుస్తకాలన్నిం టినీ గూగుల్‌ సంస్థ స్కానింగ్‌ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ books.google.comలో పొందుపరుస్తుంది. క్రీ.శ.1500- 2008 మధ్యకాలానికి చెందిన దాదాపు 50 లక్షలకు పైగా పుస్తకాలను గూగుల్‌ స్కానింగ్‌ చేసింది. ఇలా చేసిన పొత్తాల అధ్యయనానికి, ‘ఎన్‌గ్రాం వ్యూయర్‌’ అనే ప్రొగ్రాంను రూపొందించింది. దీని ద్వారా ఒక పదాన్ని ఏ ఏడాది ఎంత విస్తృతంగా వాడారో నమోదు చేసింది.

సరిగ్గా అన్నేళ్లకే...!
ఎన్‌గ్రాంలోని గణాంకాల ఆధారంగా పరిశోధకులు ఓ 5,630 పదాల తీరుని గమనించారు. అవి ప్రతి 14 ఏళ్లకి ఓసారి ప్రాముఖ్యతని సంతరించుకోవడాన్నీ, మరో 14 ఏళ్ల పాటు నిస్తేజంగా ఉండిపోవడాన్నీ గమనించారు. కాలానికి అనుగుణంగా పుట్టుకువచ్చే కొన్ని పదాలైతే 14 ఏళ్ల తర్వాత పూర్తిగా కనుమరుగైపోతున్నాయనీ తేలింది. కేవలం ఆంగ్లంలోనే కాదు, ఎన్‌గ్రాంలో నమోదై ఉన్న ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌ లాంటి భాషల్లోనూ ఇదే తీరు కనిపించింది. ఎన్‌గ్రాం గణాంకాల పట్ల అనేక విమర్శలు ఉన్నప్పటికీ, ఈ 14 ఏళ్ల వలయం ఏమంత తీసిపారేయదగ్గది కాదంటున్నారు.
కారణం అస్పష్టం
సమాజం ఒక పదాన్ని 14 ఏళ్ల పాటు విస్తృతంగా వాడటానికీ, మరికొన్నాళ్లు దాన్ని పట్టించుకోకుండా సాగిపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు పరిశోధకులు కూడా తగిన జవాబు చెప్పలేకపోతున్నారు. ఏవో పిల్లల పేర్లంటే తరం మారేకొద్దీ వాటిపట్ల మోజు తగ్గుతుందని అనుకోవచ్చు. కానీ యాపిల్‌, రాజు, రాణి వంటి పేర్లు కూడా ఈ 14 ఏళ్ల వృత్తం చుట్టూ పరిభ్రమించడానికి కారణమేంటో తెలియట్లేదు! దీని మీద మరిన్ని పరిశోధనలు జరిగితే సమాజానికీ, భాషకీ మధ్య ఉన్న మరో కోణమేదో వెలికిరావచ్చు.


*  *  *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం